ఆటగదరా శివ మూవీ రివ్యూ

Friday,July 20,2018 - 03:52 by Z_CLU

నటీనటులు: ఉదయ శంకర్, దొడ్డన్న, హైపర్ ఆది, దీప్తి, చలాకీ చంటి, భద్రం, చమ్మక్ చంద్ర, సందేశ్, జ్వాలా కోటి, సాహితీ, రమాదేవి తదితరులు.
కెమెరా : లవిత్
సంగీతం : వాసుకి వైభవ్
కథ : డి సత్యప్రకాశ్
నిర్మాత : రాక్ లైన్ వెంకటేష్
స్క్రీన్ ప్లే , దర్శకత్వం : చంద్ర సిద్దార్థ్
విడుదల తేది : 20 జులై 2018

కన్నడలో సూపర్ హిట్ గా నిలిచిన ‘రామ రామారే’ సినిమా తెలుగులో ‘ఆటగదరా శివ’ టైటిల్ తో రీమేక్ అయింది. చంద్ర సిద్దార్థ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిందా ?… చంద్ర సిద్దార్థ్ మరోసారి ఎమోషనల్ సీన్స్ తో ఆకట్టుకోగలిగాడా…? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

కథ :
ఒక హత్య కేసులో బాబ్జీ (ఉదయ్ శంకర్)కి ఉరిశిక్ష పడుతుంది. సరిగ్గా ఉరి తీసే టైమ్ కు జైలు నుండి తప్పించుకొని పరారవుతాడు. అలా పరారైన బాబ్జీ అనుకోకుండా తనను ఎవరైతే ఉరి తీయాలో ఆ తలారి జంగయ్యనే కలుస్తాడు. అలా పరిచయమైన వీరిద్దరూ ఒకరి గురించి ఒకరికి తెలియకుండానే కలిసి ప్రయాణం చేస్తారు. ఈ క్రమంలో ఆది(హైపర్ ఆది) కూడా తన ప్రేయసి (దీప్తి)తో కలిసి వీరిద్దరితో ప్రయాణం చేస్తాడు. అలా ఓ హై వే పై వీరి ప్రయాణం సాగుతుండగా ఓ సందర్భంలో పేపర్ లో ప్రకటన చూసి బాబ్జీ జైలు నుండి తప్పించుకున్న ఖైదీ అని తెలుసుకుంటారు జంగయ్య. ఇక అప్పట్నుంచి వీళ్లిద్దరి ప్రయాణం ఎలా సాగింది.. మనుషులతో దేవుడు ఆడే ఆటలో చివరికి ఏం జరిగింది.. అనేది సినిమా కథ.

నటీనటుల పనితీరు:

సినిమాలో దొడ్దన్న నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కన్నడలో దాదాపు 500 లకు పైగా సినిమాల్లో నటించిన అనుభవంతో జంగయ్య పాత్రలో ఒదిగిపోయాడు దొడ్దన్న. మొదటి సినిమా అయినప్పటికీ ఖైదీ పాత్రతో మెప్పించాడు ఉదయ్ శంకర్. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో ఉదయ్ నటన ఆకట్టుకుంటుంది. ఇక ఆది తన మార్క్ కామెడితో అలరించాడు. ఆదికి జోడిగా నటించిన దీప్తి తన సహజమైన నటనతో పరవాలేదనిపించుకుంది. చలాకీ చంటి, భద్రం కామెడి పండలేదు. సందేశ్, జ్వాలా కోటి, సాహితీ, రమాదేవి తదితరులు పాత్రలకు తగ్గట్టుగా నటించారు.

 

సాంకేతికవర్గం పనితీరు:
ఎమోషనల్ డ్రామా సినిమాలకు నేపథ్య సంగీతం చాలా ముఖ్యం… నొబిన్ పాల్ అందించిన నేపథ్య సంగీతం బాగుంది.. వాసుకి వైభవ్ పాటలు కూడా కథకు తగ్గట్టుగా ఉన్నాయి. ముఖ్యంగా ‘ఎట్టాగయ్యా శివ శివ నీవన్నీ వింత ఆటలే’ అనే పాట సినిమాకు హైలైట్. లవిత్ తన కెమెరా పనితనం చూపించాడు. ఫ్రేమ్స్ అన్నీ బాగున్నాయి. సౌండ్ డిజైనింగ్ బాగుంది. నవీన్ నూలి ఎడిటింగ్ పరవాలేదు. మొదటి భాగంలో ఇంకొన్ని సన్నివేశాలు తొలగించొచ్చు. ముని సురేష్ పిళ్లే, భీం శ్రీనివాస్ అందించిన ఎమోషనల్ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. చంద్ర సిద్దార్థ్ స్క్రీన్ ప్లే, డైరెక్షన్ బాగుంది. రాక్ లైన్ వెంకటేష్ ప్రొడక్షన్ వాల్యూస్ పరవాలేదు.


జీ సినిమాలు సమీక్ష:
కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు మనలో ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. అలాంటి సినిమానే ‘ఆటగదరా శివ’… కన్నడలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ కాన్సెప్ట్ బేస్డ్ సినిమాను తెలుగులో రీమేక్ చేయడం నిజంగా సాహసమనే చెపాలి. ఆ సాహసం చేసిన నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ ను ముందుగా అభినందించాలి. ఇక సినిమా విషయానికొస్తే… దర్శకుడు చంద్ర సిద్దార్థ్ రీమేక్ సినిమాను బాగానే డీల్ చేశాడు.

నిజానికి ఇలాంటి ఎమోషనల్ సినిమాలకు దర్శకత్వం వహించడమనేది కత్తి మీద సాము లాంటిది. అయితే గతంలో కొన్ని ఎమోషనల్ సినిమాలను డైరెక్ట్ చేసి మెప్పించిన అనుభవంతో ఈ సినిమాను బాగానే డీల్ చేశాడు దర్శకుడు చంద్ర సిద్దార్థ్.

ఇలాంటి ప్రయోగాత్మక సినిమాలకు కాస్తో కూస్తో తెలిసిన నటులైతే బెటర్… వారిని చూసైనా సినిమా కొంతమేరకు రీచ్ అవుతుంది. అయితే సినిమాలో ఆది, చమ్మక్ చంద్ర, చంటి, భద్రం మినహా మెయిన్ క్యారెక్టర్స్ చేసిన వారెవరూ తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని వ్యక్తులే. బాబ్జీ అనే ఖైదీ పాత్రను ఎవరైనా తెలిసిన హీరోతో చేయిస్తే బాగుండేది. కానీ జంగయ్య పాత్రలో మాత్రం మరో నటుడ్ని ఊహించుకోలేం.. అంతలా ఆ పాత్రలో ఒదిగిపోయాడు కన్నడ నటుడు దొడ్దన్న. ఇక ఆది కామెడి కొన్ని సందర్భాల్లో బాగానే అనిపించినా కొన్నిచోట్ల కథకు అడ్డుతగిలింది.

మొదటి భాగం అక్కడక్కడా పరవాలేదనిపించినా రెండో భాగం మాత్రం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా జవాను కుటుంబానికి మేలు చేసే సన్నివేశం, క్లైమాక్స్ ఎపిసోడ్ సినిమాను నిలబెట్టాయి. చావు పుట్టుకుల మ‌ధ్య‌ జ‌రిగే జీవిత ప్ర‌యాణంలో.. క‌లిసే ప్ర‌తీ మ‌నిషితో..క‌న‌బ‌డని దారంలా అల్లుకుపోయే బంధమే మ‌నిషి జీవితం అని చూపిన సినిమా ఇది.. ఈ కథకు ‘ఆట‌గ‌ద‌రా శివ‌’పర్ఫెక్ట్ టైటిల్. తెలుగులో ఇప్పటికే చాలా రోడ్ జర్నీ సినిమాలొచ్చినప్పటికీ చంపేవాడితో కలిసి చచ్చే వాడు చేసే ప్రయాణం అనేది కొత్తగా అనిపిస్తుంది. కానీ నెరేషన్ లో ఆ కొత్తదనం, భావోద్వేగం కనిపించదు.

కథ , స్క్రీన్ ప్లే, నటీనటుల పెర్ఫార్మెన్స్, బ్యాగ్రౌండ్ స్కోర్, క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ సినిమాకు ప్లస్ పాయింట్స్ కాగా, మొదటి భాగంలో బోర్ కొట్టించే సీన్స్, మరీ సాగదీతలా అనిపించే సీన్స్, కామెడి మైనస్ అని చెప్పొచ్చు.

రేటింగ్2.5/5