'ఆటాడుకుందాం రా' రివ్యూ

Friday,August 19,2016 - 05:30 by Z_CLU

 

నటీనటులు : సుశాంత్‌, సోనమ్‌ ప్రీత్‌ బజ్వా, మురళి శర్మ, బ్రహ్మానందం తదితరులు
సంగీతం : అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర
కథ-మాటలు : శ్రీధర్‌ సీపాన
నిర్మాతలు: చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి.
విడుదల తేదీ : 19-08-2016

 

కథ :-
విజయ రామ్(మురళి శర్మ), ఆనంద్ ప్రసాద్(ఆనంద్) మంచి స్నేహితులు. విజయ్ రామ్ కు వ్యాపారంలో సలహాలు ఇస్తూ ఉండే ఆనంద్ ప్రసాద్ పై అపోహలు సృష్టించి విజయ్ రామ్ వ్యాపారాన్ని దెబ్బతీసి దీనికి కారణం ఆనంద్ ప్రసాద్ అంటూ వారి మధ్య చిచ్చు పెట్టి తన వ్యాపారం డెవలప్ చేసుకొని ధనవంతుడి గా ఎదుగుతాడు శాంతారామ్. ఇక తన వ్యాపారం దెబ్బతినడానికి కారణం తన స్నేహితుడు ఆనంద్ ప్రసాద్ అని నమ్మిన విజయ రామ్ ఆనంద్ ప్రసాద్ కు దూరమవుతాడు. అలా వ్యాపారం లో నష్టపోయి కుంగిపోయిన విజయ్ రామ్ ను ఏదో విధంగా ఇబ్బంది పెడుతూనే ఉంటాడు శాంతారాం. అదే సమయంలో విజయ్ రామ్ తన మేనల్లుడు కార్తీక్(సుశాంత్)ను ఓ పని మీద విదేశాల నుండి ఇండియాకి రప్పిస్తాడు. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకొని విదేశాల్లో సెటిలైన తన చెల్లెలన్నా చెల్లెలి కుటుంబమన్నా నచ్చని విజయ్ రామ్… మేనల్లుడు కార్తీ ను ఎందుకు ఇండియా రప్పించాడు? అలా వచ్చిన కార్తీ తన మావయ్య కు అలాగే ఆయన కూతురు శృతి(సోనమ్ ప్రీత్ బజ్వా) కి ఎలా దగ్గరయ్యాడు? ఇంతకీ కార్తిక్ విజయ్ రామ్ కు మేనల్లుడేనా? లేక ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి వచ్చాడా? అనేదే ఈ చిత్ర కధాంశం.

 

నటీ నటుల పనితీరు :
కార్తిక్ పాత్రలో సుశాంత్ లుక్, నటనతో ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్ సోనమ్‌ ప్రీత్‌ బజ్వా పాటల్లో కాస్త గ్లామర్ తో అలరించింది కానీ నటనతో ఆకట్టుకోలేకపోయింది.
విజయ్ రామ్ పాత్రలో మురళి శర్మ నటన బాగుంది. అక్కినేని నాగేశ్వర్రావు చెల్లెలి గా ఝాన్సీ కాస్త అలరించింది. టైం మిషన్ సన్నివేశాలలో బ్రహ్మానందం కాస్త నవ్వించాడు. ఇక పృద్వి, వెన్నెల కిషోర్‌, రఘుబాబు,పోసాని కృష్ణమురళి, ఫిరోజ్‌ అబ్బాసి, సుధ, ఆనంద్‌, రమాప్రభ, రజిత, హరీష్‌ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
టెక్నీషియన్స్ పని తీరు :
ఈ సినిమాకు అనూప్ అందించిన పాటల్లో పల్లెకు పోదాం పాట మినహా మిగతా పాటలు అంతగా ఆకట్టుకోలేక పోయాయి. దాశరథి శివేంద్ర బాగుంది. గౌతంరాజు ఎడిటింగ్ పరవాలేదు.శ్రీధర్‌ సీపాన అందించిన మాటలు బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

 

జీ సినిమాలు సమీక్ష:

తాజాగా ‘ఈడో రకం ఆడో రకం’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న జి. నాగేశ్వర రెడ్డి రెడ్డి ఈ చిత్రం తో దర్శకుడిగా పరవాలేదని పించుకున్నాడు. మొదటి భాగం లో ఫ్యామిలీ సెంటిమెంట్ ఎమోషన్ తో కథను నడిపించిన దర్శకుడు రెండో భాగం లో కామెడీ తో అలరించే ప్రయత్నం చేసాడు. టైం మిషన్ సన్నివేశాలు అలరించాయి. ముఖ్యంగా జాన్సీ తో బ్రహ్మానందం ఫ్యూచర్ గురించి చెప్పే సన్నివేశాలతో పాటు రాజ మౌళి గురించి చెప్పే సన్నివేశం ప్రేక్షకులను బాగా అలరిస్తాయి. ఇక నాగ చైతన్య , అఖిల్ ఎంట్రీ లు అభిమానుల్లో కాస్త ఆనందాన్ని కలిగిస్తాయి. మొదటి భాగం లో పృద్వి – సుశాంత్ మధ్య కామెడీ, సెకండ్ హాఫ్ లో టైం మిషన్ కామెడీ ఈ సినిమాకు హైలైట్స్ అని చెప్పాలి. ఆటాడుకుందాం రా కామెడీ కోసం ఓ సారి చూడొచ్చు..