Movie Review - ఆడవాళ్ళు మీకు జోహార్లు

Friday,March 04,2022 - 02:05 by Z_CLU

నటీనటులు : శర్వానంద్, రష్మిక మందన్నా, వెన్నెల కిషోర్, రవి శంకర్, సత్య, ప్రదీప్ రావత్, గోప రాజు, బెనర్జీ, కళ్యాణీ నటరాజన్, రాజశ్రీ నాయర్, ఝాన్సీ, రజిత, సత్య కృష్ణ, ఆర్సీఎం రాజు తదితరులు

మ్యూజిక్ : దేవి శ్రీ ప్రసాద్

సినిమాటోగ్రఫీ : సుజిత్ సారంగ్

బ్యానర్ : శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్

రచన -దర్శకత్వం :  తిరుమల కిషోర్

నిడివి : 141 నిమిషాలు

విడుదల తేది : 04 మార్చ్ 2022

శర్వానంద్ , రష్మిక జంటగా ఎక్కువ మంది ఫీమేల్ ఆర్టిస్టులతో దర్శకుడు కిషోర్ తిరుమల తీసిన ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు‘ సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. శతమానంభవతి తర్వాత శర్వానంద్ చేసిన ఫ్యామిలీ సినిమా కావడంతో ఈ సినిమాపై ఫ్యామిలీ ఆడియన్స్ లో ఓ మోస్తరు అంచనాలు నెలకొన్నాయి. మరి సినిమా ఆ అంచనాలను అందుకొని సూపర్ హిట్ అందుకుందా ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

కథ : 

చిన్నతనం నుండి ఉమ్మడి కుటుంబంలో ఆడవాళ్ళ మధ్య పెరిగిన చిరంజీవి (శర్వానంద్) కి ఆడవాళ్లంటే ఎంతో గౌరవం. కానీ చిరుకి పెళ్లి చేయడంలో మాత్రం ఆ ఇంటి ఆడవాళ్ళు ఎన్నో అడ్డంకులు పెడుతూ వచ్చిన సంబంధాలన్నీ రిజెక్ట్ చేస్తుంటారు. ఇక లాభం లేదని భావించి ఏదోలా తన ఫ్యామిలీని అవాయిడ్ చేసి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు.

అలా పెళ్లి పీటలెక్కే రోజు కోసం చూస్తున్న చిరు అనుకోకుండా ఆద్య(రష్మిక మందన్న) ప్రేమలో పడతాడు. చిరు క్యారెక్టర్ కి ఇంప్రెస్ అయిన ఆద్య కూడా చిరుని ప్రేమిస్తుంది. కానీ తమ పెళ్ళికి అమ్మ వకుళ (ఖుష్బు) ఒప్పుకోదని ఆమెకి పెళ్ళంటే నచ్చదని చిరుతో అలాగే వారి కుటుంబంతో చెప్పుకుంటుంది ఆద్య. ఆ మాట విని వకుళ ని కన్విన్స్ చేసే పనిలో ఉంటాడు చిరు. ఫైనల్ గా చిరు, ఆద్య తల్లి వకుళ ని తమ పెళ్ళికి ఎలా ఒప్పించాడు ? అనేది మిగతా కథ.

నటీ నటుల పనితీరు : 

చిరు పాత్రలో శర్వానంద్ మెప్పించాడు. ఇదివరకూ చేసిన క్యారెక్టరే కావడంతో పెద్దగా కష్టపడకుండా ఈజీగా నటించాడు. ఆద్య పాత్రకు రష్మిక పర్ఫెక్ట్ అనిపించుకుంది. ఆమె కూడా ఈ తరహా పాత్ర ఇదివరకూ చేయడంతో ఈజ్ తో చేసేసింది.  కథలో కీలక పాత్ర దక్కడంతో వకుళ పాత్రకి ఖుష్బు పూర్తి న్యాయం చేసింది. సెంటిమెంట్ పండించే సన్నివేశాల్లో అలాగే ఇంటర్వెల్ కి ముందు వచ్చే కామెడీ సీన్ లోనో ఊర్వశి నటన బాగుంది.  రాధికకి నటించే స్కోప్ ఉన్న సన్నివేశాలు పెద్దగా పడలేదు. కేవలం 2-3 సాదాసీదా సన్నివేశాలతో ఆమె పాత్ర సరిపెట్టుకుంది. రవిశంకర్ కి విలనిజం చూపించుకోవడానికి కేవలం ఒకే ఒక్క సీన్ దక్కింది.

ఝాన్సీకి పవర్ ఫుల్ పాత్ర దక్కడంతో రెండు మూడు సన్నివేశాల్లో ఆమె నటన ఆకట్టుకుంది. వెన్నెల కిషోర్, సత్య డైలాగ్ కామెడీ కొన్ని సార్లు నవ్వించింది. ప్రదీప్ రావత్ ‘నేను శైలజ’ తరహా పాత్రలోనే అలరించే ప్రయత్నం చేశాడు. బెనర్జీ, గోపరాజు, రాజశ్రీ నాయర్, రజిత, మీనా, కళ్యాణీ నటరాజన్, రజిత, సత్య కృష్ణ, ఆర్సీఎం రాజు తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు : 

దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ పర్వాలేదనిపించింది. ఆద్య సాంగ్ కూడా మెస్మరైజ్ చేయలేకపోయింది. కానీ సాంగ్ పిక్చరైజేషన్ బాగుంది. అక్కడక్కడా వచ్చే నేపథ్య సంగీతం సన్నివేశాలకు బలం చేకూర్చింది. సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. శ్రీకర్ ప్రసాద్ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో సినిమాను ఎడిటింగ్ చేసిచ్చాడు తప్ప ఆయన కత్తెరకి పెద్దగా పనిపెట్టలేదనిపించింది. కొన్ని సన్నివేశాలు మరీ నత్తనడకన సాగాయి. కిషోర్ తిరుమల రాసిన డైలాగ్స్ కొన్ని థియేటర్స్ లో బాగా పేలాయి. “ఆడది మగాడిని నమ్మాలంటే క్యారెక్టర్ ఉండాలి” వంటి బలమైన మాటలు ఆకట్టుకున్నాయి.

ఇక ఈ సినిమా కోసం కిషోర్ తిరుమల ఎంచుకున్న కథ-కథనం రెండూ రొటీన్ గానే ఉన్నాయి తప్ప కొత్తదనం కనిపించలేదు. దర్శకుడిగా కొన్ని సన్నివేశాలను తన అనుభవంతో బాగా తెరకెక్కించాడు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

 adavallu-meeku-joharlu-2

జీ సినిమాలు సమీక్ష : 

‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ అనే టైటిల్ పెట్టుకొని టీజర్ , ట్రైలర్స్ బాగానే కట్ చేసి సినిమాపై బజ్ తీసుకొచ్చారు. శర్వానంద్ కూడా ‘శతమానం భవతి’ తర్వాత మళ్ళీ ఈ తరహా సినిమా చేయడంతో సినిమాపై ఓ మోస్తరు అంచనాలు నెలకొన్నాయి. అయితే దర్శకుడు కిషోర్ తిరుమల మాత్రం ఆ అంచనాలను అందుకోలేక పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయాడు. నిజానికి దర్శకుడు ఎంచుకున్న కథ రొటీన్ అయినప్పటికీ తన స్టైల్ లో ఏదో మేజిక్ చూపించి ట్రీట్ మెంట్ మార్చి ఉంటే బెటర్ అవుట్ పుట్ వచ్చేది. అలా కాకుండా సినిమాను మూస ధోరణిలో నడిపించాడు.

తొలి 10 నిమిషాలు క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేసేందుకు తీసుకున్న కిషోర్ తిరుమల ఆ తర్వాత కూడా కథలో వేగం పెంచకుండా సినిమాను నత్తనడకన నడిపించాడు. సినిమా ఆరంభంలోనే సుకుమార్ వాయిస్ ఓవర్ తో ఇందరి ఆడవాళ్ళ మధ్య ఒక్క మగాడు అంటూ చెప్పించి ఫన్నీగా సినిమాను స్టార్ట్ చేసిన దర్శకుడు ఆ తర్వాత మెలోడ్రామాతో అక్కడక్కడా బ్రేకులు వేస్తూ కథని ముందుకు నడిపించాడు. దాంతో చాలా చోట్ల సినిమా సీరియల్ లా అనిపిస్తుంది. మధ్యలో వెన్నెల కిషోర్ కామెడీ, సత్య డైలాగ్ కామెడీ కూడా ఎంటర్టైన్ చేసి రిలీఫ్ ఇచ్చింది.

ఇక ఇంటర్వెల్ లో వచ్చే సీన్ బాగుంది. అక్కడ ఊర్వశి డబ్బా కామెడీ బాగా వర్కౌట్ అయ్యింది. ఆ సన్నివేశం ఆడవాళ్ళ మనస్తత్వానికి అద్దం పట్టేలా ఉంది. అలాంటివి ఇంకా కొన్ని ప్లాన్ చేసుకుంటే F2 ని ఎంజాయ్ చేసినట్టు ఆడియన్స్ ఫుల్ గా ఎంజాయ్ చేసే వాళ్ళు. ఇక టైటిల్ కి జస్టిఫికేషన్ ఇవ్వడం కోసం అక్కడక్కడా హీరో చేత నమస్కారం పెట్టిస్తూ జోహార్లు అంటూ చెప్పించాడు దర్శకుడు.

ఇక మొదటి భాగంతో పరవాలేదనిపించిన దర్శకుడు, రెండో భాగాన్ని మాత్రం చాలా సినిమాల్లో చూసేసిన రొటీన్ పద్దతిలోనే రాసుకున్నాడు. హీరో-హీరోయిన్ ప్రేమించుకోవడం, హీరోయిన్  ఫ్యామిలీని  ఒప్పించ డానికి హీరో వాళ్ళ దగ్గరికి వెళ్లి డ్రామాలు ఆడుతూ ఏదోలా కన్విన్స్ చేయడానికి ట్రై చేయడం క్లైమాక్స్ లో హీరోయిన్ ఫ్యామిలీ నుండి గ్రీన్ సిగ్నల్ రావడం, కొన్నేళ్లుగా చూస్తున్న అదే ఫార్మేట్ మీద బేస్ అయి కిషోర్ తిరుమల లాంటి దర్శకుడు ఈ సినిమా చేయడం తప్పిదమే.

ఇక మధ్యలో ఒక లవ్ మ్యారేజ్ చేసి ఓ జంటకి హీరో అండగా నిలబడటం, కరుడుగట్టిన విలన్ ఒక్క సీన్ కి మారిపోవడం కూడా విసుగు తెప్పించాయి.  కిషోర్ తిరుమల మంచి రైటర్ కం డైరెక్టర్. సెన్సిబుల్ కథలను ఎంచుకొని అంతే సిన్సిబుల్ గా మంచి సినిమాలు తీయగల దర్శకుడు. అలాంటి దర్శకుడు తన రైటింగ్ స్కిల్స్ తో ఫ్రెష్ సినిమా తీసి చూపించాలి కానీ మూస పద్దతిలో వెళ్ళడం కరెక్ట్ కాదేమో. అలా అని ఆయన ఈ సినిమాలో మంచి సన్నివేశాలు రాయలేదని చెప్పలేం. తన స్టైల్ లో కొన్ని సన్నివేశాలు అలాగే ఖుష్బు క్యారెక్టరైజేషన్ బాగానే రాసుకున్నాడు. కాకపోతే పూర్తి స్థాయిలో మెప్పించలేక యావరేజ్ ఫ్యామిలీ డ్రామా డెలివరీ చేసి కొంత వరకూ నిరాశ పరిచాడు. హీరో హీరోయిన్ మధ్య వచ్చే లవ్ ట్రాక్ కూడా అంతగా ఆకట్టుకోలేదు.

శర్వానంద్ -రష్మిక , ఖుష్బు పెర్ఫార్మెన్స్ , వెన్నెల కిషోర్ , సత్య కామెడీ డైలాగ్ కామెడీ , కొన్ని ఫ్యామిలీ సెంటిమెంట్ సన్నివేశాలు సినిమాలో హైలైట్స్ అనిపించాయి.  ఓవరాల్ గా ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ ఫుల్ మీల్స్ లా కాకుండా ప్లేట్ మీల్స్ తో సరిపెడుతుంది.

రేటింగ్ : 2.5 / 5