Movie Review- ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి

Friday,September 16,2022 - 04:07 by Z_CLU

నటీ నటులు  : సుధీర్ బాబు, కృతి శెట్టి, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు.

కెమెరా మెన్ : పీజీ విందా

సంగీతం: వివేక్ సాగర్

సమర్పణ :  గాజులపల్లె సుధీర్ బాబు

నిర్మాణం : మైత్రీ మూవీ మేకర్స్, బెంచ్‌మార్క్ స్టూడియోస్

నిర్మాతలు: బి మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి

రచన- దర్శకత్వం : మోహనకృష్ణ ఇంద్రగంటి

నిడివి : 144 నిమిషాలు

విడుదల తేది : 16 సెప్టెంబర్ 2022

 

 సుదీర్ బాబు -ఇంద్రగంటి మోహన్ కృష్ణ కాంబినేషన్ లో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. ఈ కాంబోలో వచ్చిన ‘సమ్మోహనం’ సూపర్ హిట్ అనిపించుకుంది. ఇప్పుడు మూడో సినిమా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ తో ప్రేక్షకుల ముందు కొచ్చారు. మరి ఈ సినిమాతో ఇంద్రగంటి -సుదీర్ బాబు మరో హిట్ అందుకున్నారా ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

 

కథ : 

వరుసగా ఐదు హిట్లు కొట్టిన డైరెక్టర్ నవీన్ (సుధీర్ బాబు) తన ఆరో సినిమా కోసం సిద్దమవుతుంటాడు. ఈ క్రమంలో అతనికి ఓ అమ్మాయికి సంబంధించి ఓ సినిమా రీల్ కనిపిస్తుంది. ఆ రీల్ లో ఆమె నటన చూసి తన సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ అయిపోయి ఆమె గురించి తెలుసుకునే ప్రయత్నం మొదలు పెడతాడు. ఈ క్రమంలో  ఆమె పేరు అలేఖ్య(కృతి శెట్టి) అని తను కంటి డాక్టర్ అని తెలుసుకుంటాడు.

అలేఖ్య కి అలాగే తన కుటుంబానికి సినిమా అంటే ఇష్టం లేదని, సినిమా జనాలను అసహ్యించుకుంటారని తెలుసుకుంటాడు నవీన్. ఆమెను సినిమా చేసేందుకు ఒప్పించే క్రమంలో నవీన్ కి ఓ అసలు నిజం తెలుస్తుంది. ఆ విషయం తెలుసుకున్న నవీన్ ఆ తర్వాత దర్శకుడిగా ఏం చేశాడు ? చివరికి అలేఖ్య ను హీరోయిన్ గా మార్చి సినిమా తీశాడా లేదా అనేది మిగతా కథ.

 

నటీ నటుల పనితీరు :

యంగ్ డైరెక్టర్ గా సుదీర్ బాబు నటన బాగుంది కానీ అతనిలో మునుపటి ఎనర్జీ మిస్ అయినట్టు అనిపించింది. బహుశా కేరెక్టర్ వలనో లేదా మరో కారణం చేతో సుదీర్ తన యాక్టింగ్ తో మెస్మరైజ్ చేయలేకపోయాడు. కృతి శెట్టి కి మంచి ఇంపార్టెన్స్ ఉన్న కథ లభించింది.  కథ అంతా ఆమె పాత్ర  చుట్టూనే తిరుగుతుంది. అలేఖ్య , అఖిల గా ఫరవాలేదనిపించుకుంది. కానీ కొన్ని సన్నివేశాల్లో మరో హీరోయిన్ అయితే బాగుండు అనే ఫీల్ ఆడియన్ కి కలుగుతుంది. ఆ భావన ఎందుకు కలుగుతుందో సినిమా చూస్తే తెలుస్తుంది.

శ్రీకాంత్ అయ్యంగార్ తండ్రి పాత్రలో ఆకట్టుకున్నాడు. గతంలో చేసిన పాత్రే కావడంతో ఆయన అలవోకగా చేసేశాడు. ప్రత్యేక పాత్రలో అవసరాల శ్రీనివాస్ ఆకట్టుకున్నాడు. వెన్నెల కిషోర్ డైలాగ్ కామెడీ కొన్ని చోట్ల నవ్విస్తుంది. రాహుల్ రామకృష్ణ , గోపరాజు రమణ  తమ పాత్రలకు న్యాయం చేశారు కానీ వారికి కథలో అంతగా ప్రాముఖ్యత దక్కలేదు.

 

సాంకేతిక వర్గం పనితీరు : 

వివేక్ సాగర్ సంగీతం , పీజీ విందా కెమెరా పనితనం సినిమాకు కొంత వరకూ ప్లస్ అని చెప్పొచ్చు. వివేక్ సాగర్ కంపోజ్ చేసిన సాంగ్స్ లో కొత్త కొత్తగా ఉందే బాగుంది. మిగతా పాటలు పరవాలేదు అనిపించాయి తప్ప మళ్ళీ మళ్ళీ పాడుకునేలా లేవు. నేపథ్య సంగీతం కూడా అంతంత మాత్రంగానే ఉంది. పీజీ విందా సినిమాటోగ్రఫీ బాగుంది. కొన్ని సన్నివేశాల్లో అతని కెమెరా వర్క్ ఆకట్టుకుంది. మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటింగ్ ఫరవాలేదు. సాహి సురేష్ ఆర్ట్ వర్క్ సినిమాకు తగ్గట్టుగా ఉంది.

ఇంద్రగంటి మోహన్ కృష్ణ కథ -కథనం రొటీన్ గా ఉన్నాయి. దర్శకుడిగా కొన్ని సీన్స్ ను బాగా డీల్ చేశారు కానీ రైటర్ గా ఈసారి ఫెయిల్ అయ్యాడు. ప్రొడక్షన్ వేల్యూస్ కథకు తగ్గట్టుగా ఉన్నాయి.

 

 

జీ సినిమాలు సమీక్ష : 

ఇంద్రగంటి మోహన్ కృష్ణ మంచి సెన్సిబుల్ దర్శకుడు. ఆయన ఎంపిక చేసుకునే కథ , దానికి ఆయన సమకూర్చుకునే కథనం అందంగా ఉంటుంది. సినిమా నేపథ్యంలో ఇది వరకే  ‘సమ్మోహనం’ సినిమా తీసి మెప్పించారు. అయితే మరోసారి అదే హీరోని పెట్టి అలాంటి సినిమా నేపథ్యం ఉన్న కథే ఎంచుకొని ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అని తీశారు. నిజానికి సినిమా కథంతా టైటిల్ లోనే చెప్పేశాడు దర్శకుడు. సినిమా అంటే అమితమైన పిచ్చితో నటి అవ్వాలనుకునే ఓ అమ్మాయి, తన ఫ్యామిలీ కి  సినిమా అంటే నచ్చకపోవడంతో ఇంటి నుండి బయటికి వచ్చేయడం, ఒక దర్శకుడిని పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత ఆమె పరిస్థితి ఏమైంది ? అనే కథను తీసుకొని దాంట్లో ఓ ట్విస్ట్ పెట్టుకొని సాఫ్ట్ స్క్రీన్ ప్లే రాసుకున్నాడు దర్శకుడు ఇంద్రగంటి.

అయితే ట్రైలర్ చూసి ఇది ‘సమ్మోహనం’ తరహా కథే అనుకున్న ఆడియన్స్ కి సినిమా నేపథ్యంతో మరో కథ చూపించాడు దర్శకుడు. వరుస హిట్లు కొడుతూ నెక్స్ట్ సినిమా మొదలు పెట్టేందుకు రెడీ అయిన డైరెక్టర్ ఒకమ్మాయి వీడియో క్లిప్ చూసి ఆమెను ఎలాగైనా పట్టుకొని తన సినిమాతో హీరోయిన్ గా మార్చాలని చూసే కథను చూపించాడు. ఇంటర్వెల్ వరకూ ఇవే సీన్స్ తో నడిపించి ఇంటర్వెల్ లో మాత్రం ఓ ట్విస్ట్ పేల్చాడు. అయితే ఆ ట్విన్ ట్విస్ట్ అంతగా వర్కౌట్ అవ్వలేదు. పైగా స్క్రీన్ ప్లే కూడా ఆసక్తిగా లేకపోవడం, స్లో నరేషన్ , సీరియల్ ను తలపించే సీన్స్ తో సినిమా ఓ మోస్తారుగా అలరిస్తుంది తప్ప పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది.

నిజానికి ఇంద్రగంటి మోహన్ కృష్ణ చెప్పాలనుకున్న సినిమా నటి కథ కూడా అంతగా ఆకట్టుకోలేదు. స్టార్ అవ్వలేక ఫెయిల్ అయిన ఓ నటి ఆమె డ్రీం ను తీర్చేందుకు ఆమె చెల్లెలు యాక్టర్ గా మారడం , అలాగే ఓ దర్శకుడు చేయాలనుకున్నది ఇంకో డైరెక్టర్ చేయడం చూపించారు. ఇక హీరోయిన్ అవుతా అంటే చాలా మంది ఇంట్లో డిబేట్ ఉంటుంది. ఫైనల్ గా తల్లిదండ్రుల మాటకాదని బయటికి  వచ్చేసి హీరోయిన్ అవ్వాలనుకునే రొటీన్ అమ్మాయి కథనే ఈ సినిమా ద్వారా ఇంద్రగంటి సుదీర్ బాబు తో చెప్పించాడు. సినిమా మనుషులు , వారంటే పడని కొన్ని  కుటుంబాలు , స్టార్ అవ్వాలనే కోరిక , వరుస సక్సెస్ లతో పేరు – డబ్బు సంపాదించుకునే డైరెక్టర్  ఇవన్నీ సినిమాలో చూపించాడు ఇంద్రగంటి. కాకపోతే రైటర్ గా ఇంకా ఏదో కొత్తగా రాసుకుని చూపిస్తే బాగుండేది.

సినిమా నేపథ్యంతో కథ అంటే బలమైన సన్నివేశాలు రాసుకోవాలి. కొత్త కథను ఎంచుకొని దాన్ని ఆసక్తిగా చెప్పగలగాలి. గతంలో పూరి జగన్నాథ్ సినిమా ఇండస్ట్రీని అద్దం పట్టే కథతో ‘నేనింతే’ అనే సినిమా తీశాడు. ఆ సినిమా థియేటర్స్ లో ఆడలేదు కానీ  సినిమా జనాలు మాత్రం ఇప్పటికీ దాన్ని  బెస్ట్ మూవీ అని చెప్పుకుంటారు. సాధారణ ప్రేక్షకులు సినిమా కథతో వచ్చిన సినిమాలపై అంతగా ఆసక్తి చూపించరు దాన్ని సరైన స్క్రీన్ ప్లే తో కొత్తగా చెప్తేనే ఈ తరహా కథలు వర్కౌట్ అవుతాయి. అందుకే సినిమా నేపథ్యం కథల్ని దర్శకులు ఎంచుకోరు. పైగా నటి జీవితంతో ఓ సినిమా కథ చెప్పాలంటే చాలా కసరత్తు చేయాల్సి ఉంటుంది. సాదా సీదా కథతో స్లో నెరేషన్ తో ఇలాంటి కథల్ని మెప్పించడం కష్టమే. ఈ కోవలో ‘సితార’, ‘మహానటి’ వంటి కొన్ని సినిమాలే ప్రేక్షకులను పూర్తి స్థాయిలో మెప్పించాయి. ఇంద్రగంటి ‘సమ్మోహనం’ సినిమా నేపథ్యమే అయినప్పటికీ  అందులో ఒక హీరోయిన్ తో ప్రేమలో పడే ఓ అబ్బాయి  ప్రేమకథను చెప్తూ బాగా నెరేట్ చేశారు. అందుకే ఆ సినిమా ఆకట్టుకుంది. కానీ ఇందులో అలాంటి అందమైన  ప్రేమకథ వడ్డించలేదు ఇంద్రగంటి.  అఖిల పాత్రతో వచ్చే ఎమోషనల్ సీన్స్ వర్కౌట్ అవ్వలేదు. అది సినిమాకు పెద్ద మైనస్. అలాగే కామెడీ కూడా కొంత వరకే వర్కౌట్ అయింది. ఓవరాల్ గా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ జస్ట్ ఫరవాలేదనిపించే సినిమాల కేటగిరీలో చేరుతుంది తప్ప పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది.

రేటింగ్ : 2.5/5