90ml మూవీ రివ్యూ

Friday,December 06,2019 - 03:14 by Z_CLU

నటీనటులు: కార్తికేయ, నేహా సోలంకి, రవికిషన్, రావు రమేష్, రోల్ రైడ, అలీ, పోసాని తదితరులు
సంగీతం: అనూప్ రూబెన్స్
పాట‌లు: చ‌ంద్ర‌బోస్‌
కెమెరా: జె.యువ‌రాజ్‌
ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖ‌ర్‌
నృత్యాలు: ప్రేమ్ ర‌క్షిత్‌, జానీ
నిర్మాత‌: అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ‌
ర‌చ‌న – ద‌ర్శ‌క‌త్వం: శేఖ‌ర్ రెడ్డి ఎర్ర‌
సెన్సార్: A
రన్ టైమ్: 2 గంటల 39 నిమిషాలు
రిలీజ్ డేట్: డిసెంబర్ 6, 2019

ఆధరైజ్డ్ డ్రింకర్.. సౌండ్ వెరైటీగా ఉంది. 90ml.. టైటిల్ కూడా క్యాచీగా, మాస్సీగా ఉంది. దీనికి తోడు 2 పాటలు హిట్. అందుకే కార్తికేయ నటించిన ఈ సినిమాపై ఓ మోస్తరు అంచనాలు పెరిగాయి. మరి ఆ ఎక్స్ పెక్టేషన్స్ ను కార్తికేయ అందుకున్నాడా? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ

కథ

దేవదాస్ (కార్తికేయ) పుట్టుకతోనే ఓ డిజార్డర్ తో పుడతాడు. పూటకు 90ml పడకపోతే చనిపోతాడు. అలా ఆథరైజ్డ్ డ్రింకర్ అనుకున్న దేవదాస్ తన ఏరియాలో ఫేమస్ అవుతాడు. చివరికి డ్రంక్ అండ్ డ్రైవ్ లో కూడా పోలీసులు అతడ్ని స్పెషల్ కేసు కింద వదిలేస్తుంటారు. అలాంటి వ్యక్తి అసలు మందు వాసన అంటేనే పడని కుటుంబానికి చెందిన సువాసన (నేహా సోలంకి)ను ప్రేమిస్తాడు. తనకున్న డిజార్డర్ ను ఆమెకు చెప్పకుండా ప్రేమిస్తాడు.

ఓ క్షణంలో దేవదాస్ మందు కొడతాడనే విషయం సువాసనకు తెలిసిపోతుంది. అప్పట్నుంచి అతడికి దూరంగా ఉంటుంది. మరోవైపు సువాసన తండ్రి (రావు రమేష్) కూడా తన కూతురికి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటాడు. ఈ క్రమంలో తన డిజార్డర్ ను ప్రేయసితో చెప్పడానికి దేవదాస్ చాలా కష్టపడుతుంటాడు.

ఫైనల్ గా దేవదాస్ తన బలహీనతను ఎలా బయటపెట్టాడు, తన ప్రేమను ఎలా నిరూపించుకున్నాడనేది స్టోరీ.

 

నటీనటుల పనితీరు

దేవదాస్ గా కార్తికేయ యాక్టింగ్ బాగుంది. అతడిలో మాస్ హీరో లక్షణాలు పుష్కలంగా ఉన్నాయనే విషయం ఈ సినిమాతో మరోసారి ప్రూవ్ అయింది. తనకున్న ఫిజిక్ అడ్వాంటేజ్ తో ఫైట్స్, యాక్షన్ బాగా చేశాడు. ఫిజియో థెరపిస్ట్ సువాసనగా నేహా సోలంకి క్యూట్ గా కనిపించింది. సెకెండాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ లో బాగా చేసింది. జాన్ విక్ పాత్రలో రవికిషన్, డిఫరెంట్ గెటప్స్ తో బాగా ఆకట్టుకున్నాడు. పోసాలి, రావురమేష్ మరోసారి తమ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోగా.. ప్రగతి, సత్యప్రకాష్, కాలకేయ ప్రభాకర్, అదుర్స్ రఘు తమ పాత్రలకు న్యాయం చేశారు.

 

టెక్నీషియన్స్ పనితీరు

అనూప్ రూబెన్స్ 3 పాటలతో ఆకట్టుకున్నాడు. చాలు చాలు, టైటిల్ సాంగ్ తో పాటు మరో ఫోక్ సాంగ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగాలేదు. అదేంటో దాదాపు అన్ని ఎమోషన్స్ కు ఒకే ట్యూన్ తో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. ఎడిటింగ్ మరో పెద్ద డిసప్పాయింట్ మెంట్. అసలు ఈ సినిమాకు అంత రన్ టైమ్ అక్కర్లేదు. దాదాపు ఓ 20 నిమిషాలు తగ్గించొచ్చు. సినిమాటోగ్రాఫర్ యువరాజ్ పాటల్లో, ఫైట్స్ లో తన టాలెంట్ చూపించాడు. విదేశాల్లో తీసిన సాంగ్స్ అన్నీ విజువల్ పరంగా చాలా బాగున్నాయి.

ఇక దర్శకుడి విషయానికొస్తే తన తొలి సినిమాకు ఓ కొత్త పాయింట్ ను ఎంచుకున్నాడు డైరక్టర్ శేఖర్ రెడ్డి. కానీ ఆ ఎక్సయిటింగ్ పాయింట్ ను 2 గంటల 39 నిమిషాల పాటు ఎంగేజింగ్ గా చెప్పలేకపోయాడు. మరీ ముఖ్యంగా అతడి నెరేషన్ సినిమాకు పెద్ద మైనస్ అయింది. కథకు అవసరం లేని ఎన్నో సీన్లు సినిమాలో ఉన్నాయి.

జీ సినిమాలు సమీక్ష

ఒక లైన్ లో చెబితే సరిపోయేదాన్ని రెండున్నర గంటల్లో సాగదీస్తే ఎలా చెప్పాలో తెలియాలంటే 90ml చూడాలి. అవును.. ఒకే ఒక్క లైన్ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. కనీసం ఆ స్టోరీలైన్ ను అయినా రివీల్ చేయకుండా కాస్త సస్పెన్స్ మెయింటైన్ చేస్తే 90ml కిక్ ఇచ్చి ఉండేదేమో. సినిమా ఓపెనింగ్ లోనే కాదు, ప్రమోషన్ లో కూడా అదే మేటర్ చెప్పేయడంతో ప్రేక్షకుడు నిజంగానే కిక్ మిస్సయ్యాడు.

హీరో ఓ ఆథరైజ్డ్ డ్రింకర్. అంటే డాక్టర్ సలహా మేరకు పూటకు 90ml తీసుకోవాలి. లేకపోతే అది అతడి ప్రాణాలకే ప్రమాదం అని వార్నింగ్ ఇస్తాడు డాక్టర్. దానికి ఏదో సిండ్రోమ్ పేరు కూడా పెట్టారు. ఆగస్ట్ 15, గాంధీ జయంతితో సంబంధం లేకుండా ఎప్పుడైనా మన హీరో తాగేయొచ్చు. దానికి సంబంధించి పాకెట్ లో క్రెడిట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ టైపులో తాగడానికి తనకు పర్మిషన్ ఇచ్చిన కార్డ్ కూడా పెట్టుకొని తిరుగుతాడు.

కనిపించిన ప్రతి ఒక్కరికి, అడిగినా అడగకపోయినా తను ఆథరైజ్డ్ డ్రింకర్ అని చెబుతాడు హీరో. చివరికి మందు కొట్టినప్పుడు కూడా ముక్కుమొహం తెలియని వ్యక్తులకు, విలన్ కు తన ఐడీ కార్డ్ చూపించి మరీ సవివరంగా చెబుతుంటాడు. ఇన్ని చెప్పిన హీరో, హీరోయిన్ కు మాత్రం ఆ విషయం చెప్పడు. కనీసం చెప్పకపోయినా బ్యాక్ పాకెట్ నుంచి ఆ కార్డ్ తీసి చేతిలో పెడితే హీరోయిన్ చదువుకుంటుంది కదా. ఇలాంటి లాజిక్స్ మాత్రం అడక్కూడదు. 2 గంటల 40 నిమిషాల పాటు సినిమా చూడాల్సిందే.

ప్రేక్షకుడికి ఫస్ట్ సీన్ లోనే అసలు “మేటర్” చెప్పేస్తాడు దర్శకుడు. ఇక అక్కడ్నుంచి హీరోయిన్ కు ఆ మందు మేటర్ ను ఎలా చెప్పాలనే టాస్క్ పై రెండున్నర గంటలు వర్క్ చేస్తాడు. ఇక్కడ డైరక్టర్ చేసిన మిస్టేక్ ఇదే. ప్రేక్షకుడికి కూడా అసలు థ్రెడ్ చెప్పకుండా కథనం నడిపిస్తే బాగుండేదేమో. అలా చేయకుండా కేవలం హీరోయిన్ కు నిజం తెలియడం కోసం ప్రేక్షకుడ్ని రెండున్నర గంటల పాటు కూర్చోబెట్టడం చాలా కష్టమనే విషయాన్ని దర్శకుడు మరిచిపోయాడు. సింగిల్ లైన్ పాయింట్ ను ఎంగేజింగ్ గా చెప్పలేకపోయాడు. ఎంచుకున్న కథ, పెట్టిన సన్నివేశాల కారణంగా దాదాపు సినిమా మొత్తం “మద్యపానం ఆరోగ్యానికి హానికరం” అనే వాక్యం తెరపై కనిపిస్తూనే ఉంటుంది.

ఈ సినిమాపై కార్తికేయ చాలా హోప్స్ పెట్టుకున్నట్టున్నాడు. అందుకేనేమో చాలా కష్టపడ్డాడు. దేవదాస్ పాత్రలో కార్తికేయ యాక్టింగ్, మేనరిజమ్స్ మెప్పిస్తాయి. హీరోయిన్ నేహా సోలంకి ఉన్నంతలో బాగా చేసింది. ఆమె పర్సనాలిటీ మరీ పల్చగా ఉంది. విలన్ పాత్ర పోషించిన రవికిషన్ బాగా చేశాడు. ఇలా ప్యాడింగ్ అంతా బాగానే ఉంది కానీ కథనంలో చేసిన తప్పుల వల్ల ఆర్టిస్టులు ఏం చేయలేకపోయారు. అనూప్ రూబెన్స్ 3 పాటలతో ఆకట్టుకున్నాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగాలేదు.

ఇవన్నీ ఒకెత్తయితే క్లైమాక్స్ మరో ఎత్తు. ఏం జరగబోతోందనేది ప్రేక్షకుడు ముందే ఊహించేలా ఉన్నప్పుడు వీలైనంత తొందరగా పని ముగించాలి. ఆ పని మాత్రం జరగలేదు. ఇంకాస్త మందు మిగిలిందనే టైపులో ప్రీ-క్లైమాక్స్ లో ఫాథటిక్ సాంగ్ పడుతుంది. అక్కడితో ఆగకుండా క్లైమాక్స్ లో హీరోయిన్ తో దర్శకుడు చేయించిన పనికి అతడికి దండం పెట్టాలి. ప్రేక్షకుడికి కిక్ ఇస్తుందని ఆ సీన్ పెట్టాడా లేక దర్శకుడే ఓ 90ml వేసి ఆ సీన్ తీశాడా లేక కచ్చితంగా ఓ ముద్దు సీన్ ఉండాలనే కసితో పెట్టారో అర్థంకాలేదు కానీ యూనిట్ ధైర్యాన్ని మాత్రం మెచ్చుకోవాలి.

ఓవరాల్ గా 90ml సినిమా ఓ మోస్తరు కిక్ మాత్రమే ఇస్తుంది. కార్తికేయ స్క్రీన్ ప్రజెన్స్, అనూప్ రూబెన్స్ పాటలు (3 మాత్రమే), ఓ 3 కామెడీ ఎపిసోడ్స్ కోసం ఈ సినిమా చూడొచ్చు.

రేటింగ్: 2/5