47 Days మూవీ రివ్యూ

Tuesday,June 30,2020 - 01:17 by Z_CLU

నటీనటులు: సత్యదేవ్, పూజాజవేరి, రోహిణి ప్రకాష్, సత్య ప్రకాష్, రవివర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, హరితేజ, ఇర్ఫాన్, ముక్తార్ ఖాన్, కిరీటి దామరాజు, అశోక్ కుమార్ తదితరులు.

సినిమాటోగ్రఫీ: జి.కే

సంగీతం: రఘు కుంచే

ఎడిటర్: ఎస్ఆర్. శేఖర్

డిజైన్స్: అనిల్ భాను

సినిమాటోగ్రఫీ: జీకే

బ్యానర్: టైటిల్ కార్డ్ ఎంటర్ టైన్ మెంట్

నిర్మాతలు: శశిభూషణ్, రఘుకుంచె, శ్రీధర్ మక్కువ, విజయ్ శంకర్

రచన-దర్శకత్వం: ప్రదీప్ మద్దాలి

రన్ టైమ్ : గంట 44 నిమిషాలు

రిలీజ్ డేట్: జూన్ 30, 2020

ఫ్లాట్ ఫామ్: Zee5

తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్ తెచ్చుకున్నాడు నటుడు సత్యదేవ్. మంచి పెర్ఫార్మర్ గా పేరు తెచ్చుకున్న సత్యదేవ్ హీరోగా “47 డేస్” మూవీ తెరకెక్కింది. Zee5లో ఎక్స్ క్లూజివ్ గా ఈరోజు రిలీజైన ఈ సినిమా కథేంటి? సత్యదేవ్ మరోసారి ఆకట్టుకున్నాడా? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ

కథ

సత్య (సత్యదేవ్) ఓ అనాథ. కష్టపడి చదివి ఐపీఎస్ అవుతాడు. తనతో చిన్నప్పట్నుంచి పెరిగి చదువుకున్న పద్దూ (రోషిని ప్రకాష్)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఇద్దరూ కలిసి ఓ పాపను కూడా దత్తత తీసుకుంటారు. అంతా సాఫీగా సాగిపోతుందనుకున్న టైమ్ లో ఒక రోజు సడెన్ గా పద్దూ సూసైడ్ చేసుకుంటుంది. తన కళ్లముందే భార్య ఆత్మహత్య చేసుకోవడంతో సత్య తట్టుకోలేకపోతాడు. అసలు ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందో కూడా తెలుసుకోలేక డిప్రెషన్ లోకి వెళ్లిపోతాడు. ఒక దశలో తన తన జాబ్ కూడా పోగొట్టుకుంటాడు.

అయితే పద్దూ చనిపోయిన కొన్ని గంటల ముందే శ్రీనివాస్ (ఇర్ఫాన్) అనే ఓ బిజినెస్ మేన్ కూడా ఆత్మహత్య చేసుకోవడం సత్యను ఎట్రాక్ట్ చేస్తుంది. ఈ రెండు సూసైడ్స్ కు లింక్ ఉంటుందనేది సత్య స్ట్రాంగ్ ఫీలింగ్. ఈ మేరకు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన సత్య, ఆ క్రమంలో జూలియట్ (పూజా ఝవేరి)ని కలుసుకుంటాడు.

ఇంతకీ సత్య అనుమానం నిజమైందా? ఈ ఆత్మహత్యల వెనక ఉన్నది ఎవరు? వీటికి జూలియట్ కు సంబంధం ఏంటి? అనేది బ్యాలెన్స్ కథ

 

నటీనటుల పనితీరు

సత్యదేవ్ మరోసారి తనో మంచి పెర్ఫార్మర్ అనే విషయాన్ని ప్రూవ్ చేసుకున్నాడు. పోలీసాఫీసర్ గా, ఓ ప్రియుడిగా, ఓ బిడ్డకు తండ్రిగా మంచి వేరియేషన్స్ చూపించాడు. కేసును ఇన్వెస్టిగేట్ చేసే ప్రాసెస్ లో సత్యదేవ్ ఎక్స్ ప్రెషన్స్, యాక్టింగ్ అందర్నీ ఆకట్టుకుంటాయి. సినిమా మొత్తం సత్యదేవ్ వన్ మేన్ షో నడిచింది.

హీరోయిన్ రోషిని ప్రకాష్ పాత్ర చిన్నదే అయినా తన ఇంపాక్ట్ చూపించింది. మరో హీరోయిన్ పూజా ఝవేరి మంచి లుక్స్ తో ఆకట్టుకుంది. సినిమాలో కీలకమైన పాత్ర అయినప్పటికీ ఆమెకు యాక్టింగ్ కు పెద్దగా స్కోప్ దొరకలేదు. రవివర్మ, శ్రీకాంత్ అయ్యంగార్లకు మంచి పాత్రలు దక్కాయి. హరితేజ, కిరీటీ ఫర్వాలేదనిపించుకున్నారు.

 

టెక్నీషియన్స్ పనితీరు

సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్లస్ అయింది. సినిమా టెంపో ఎక్కడా తగ్గకుండా రఘు కుంచె మంచి నేపథ్యసంగీతం అందించాడు. దీనికి జీకే సినిమాటోగ్రఫీ కూడా యాడ్ అవ్వడం “47 డేస్” కు ప్లస్ అయింది. కీలక సన్నివేశాల్లో కెమెరా వర్క్ బాగుంది. నిర్మాతల ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా కావడంతో ఎలాంటి డీవియేషన్స్ లేకుండా చేసిన ఎడిటింగ్ బాగుంది.

మొదటి సినిమా అయినప్పటికీ ప్రదీప్ మద్దాలి ఈ సినిమాను బాగా హ్యాండిల్ చేశాడు. అతడి రైటింగ్, టేకింగ్ బాగుంది.

జీ సినిమాలు సమీక్ష

“జీవితం ఎవ్వరికీ అర్థంకాని పెద్ద మిస్టరీ” అంటూ తన గురువు పూరి జగన్నాధ్ వాయిస్ ఓవర్ తో సినిమాను స్టార్ట్ చేసిన ప్రదీప్ ఎక్కడా టెంపోను తగ్గనివ్వలేదు. హీరో ఇంట్రడక్షన్ నుంచి మధ్యమధ్యలో టైటిల్ కు తగ్గట్టు డే-39, డే-42 అంటూ అతడు చూపించిన స్క్రీన్ ప్లే బాగుంది.

ఓటీటీ ప్రేక్షకుల్ని ఈ సినిమా ఆకట్టుకుందంటే దానికి మెయిన్ రీజన్ స్క్రీన్ ప్లే ఒకటైతే.. విలన్ ఎవరనే విషయాన్ని ఆఖరి నిమిషం వరకు కనీసం క్లూ కూడా ఇవ్వకుండా మెయింటైన్ చేయడం మరో బిగ్ రీజన్. ఈ రెండు విషయాల్లో ప్రదీప్ మద్దాలికి ఫస్ట్ క్లాస్ మార్కులివ్వాలి. మూవీ క్లైమాక్స్ చూసిన తర్వాత ప్రతి ప్రేక్షకుడు చిన్నపాటి షాక్ కు గురవుతాడనడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.

ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ కథలకు స్క్రీన్ ప్లే చాలా ఇంపార్టెంట్. ఇప్పటివరకు చాలా మర్టర్ మిస్టరీలు వచ్చాయి. 47-డేస్ కూడా దాదాపు మర్డర్ మిస్టరీనే. కానీ ఆ మిస్టరీని ఛేదించే క్రమంలో దర్శకుడు చూపించిన స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది. 47 రోజుల్లో ఓ పోలీస్, తన భార్య మరణానికి కారణాన్ని కనుక్కోవడమేది మెయిన్ థీమ్ అయినప్పటికీ అంతర్లీనంగా చాలా చాలా లేయర్లు చొప్పించి దర్శకుడు సినిమాపై మరింత ఇంట్రెస్ట్ కలిగేలా చేశాడు. దీనికితోడు క్రిస్ప్ రన్ టైమ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ 47-డేస్ కు మరో ప్లస్ పాయింట్స్.

అయితే దర్శకుడు రాసుకున్న కథ, కథనం అన్నీ బాగున్నప్పటికీ తన గురువు పూరి జనగ్నాధ్ మార్క్ మాత్రం చూపించలేకపోయాడు. పూరి జగన్నాధ్ స్టయిల్ లో హీరో ఎలివేషన్, పంచ్ డైలాగ్ లు 47-డేస్ లో కనిపించవు. కథకు ఏది అవసరమో అదే కనిపించింది. మరోవైపు చూపించాల్సిన ఎమోషన్స్ ను కూడా డెప్త్ గా చూపించి ఉంటే బాగుండేది. మరీ ముఖ్యంగా సెకెండ్ హీరోయిన్ పూజా ఝవేరి పాత్రను ఇంకాస్త ఎఫెక్టివ్ గా రాసుకుంటే బాగుండేది. ఈ విషయంలో దర్శకుడు ఫోకస్ తగ్గించాడు.

ఇలాంటి మైనస్ పాయింట్స్ ను పక్కనపెడితే.. తొలి సినిమాకే ప్రదీప్ మద్దాలి మంచి ఎటెంప్ట్ చేశాడు. పక్కాగా కథ రాసుకోవడంతో పాటు.. నటీనటుల నుంచి తనకు కావాల్సిన పెర్ఫార్మెన్సులు రాబట్టుకోగలిగాడు. ఇంకాస్త ఫోకస్ పెడితే ఇతడి నుంచి మరిన్ని మంచి థ్రిల్లర్లు వచ్చే ఛాన్స్ ఉంది.

బాటమ్ లైన్ – థ్రిల్లింగ్ డేస్
రేటింగ్2.75/5