'30 రోజుల్లో ప్రేమించడం ఎలా' రివ్యూ

Friday,January 29,2021 - 02:14 by Z_CLU

నటీనటులు : ప్రదీప్, అమృతా అయ్యర్, పోసాని కృష్ణమురళి, అప్పాజీ, హేమ, శరణ్య తదితరులు
పాటలు: చంద్రబోస్
సంగీతం: అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర
ఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాస్
ఆర్ట్: నరేష్ తిమ్మిరి
బ్యానర్ : SVP పిక్చర్స్
నిర్మాత: ఎస్వీ బాబు
స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: మున్నా
రన్ టైమ్: 2 గంటల 23 నిమిషాలు
సెన్సార్: U/A
రిలీజ్ డేట్: జనవరి 29, 2021

స్మాల్ స్క్రీన్ స్టార్ ప్రదీప్ మాచిరాజు హీరో అయ్యాడు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో థియేటర్లలో అడుగుపెట్టాడు. ఇంతకీ బుల్లితెర ప్రదీప్, సిల్వర్ స్క్రీన్ హీరోగా ఎలా ఉన్నాడు? మూవీ రిజల్ట్ ఏంటి..? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ

30-Rojullo-Preminchadam-Ela-Movie-telugu-Review

కథ

స్వతంత్రానికి పూర్వం, బ్రిటిష్ రూలింగ్ లో ఓ మారుమూల గిరిజన ప్రాంతంలో ఓ అమ్మాయి, ఓ అబ్బాయి గాఢంగా ప్రేమించుకుంటారు. అబ్బాయిగారికి అమ్మాయిగారు అంటే ఎంతో ఇష్టం. అమ్మాయిగారికి కూడా అబ్బాయిగారంటే చెప్పలేనంత ప్రేమ. అయితే అబ్బాయిగారు సీక్రెట్ గా బాక్సింగ్ నేర్చుకుంటాడు. బ్రిటిషర్లతో పోటీపడుతుంటాడు. అలా కొన్ని అనుకోని పరిస్థితుల మధ్య హీరోహీరోయిన్లు విడిపోతారు.

అలా గత జన్మలో విడిపోయిన ఈ ఇద్దరు అర్జున్-అక్షరగా మళ్లీ పుడతారు. అయితే ఈసారి బద్ధశత్రువులుగా పుడతారు. ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. నిత్యం ఏదో ఓ గొడవ. అలాంటి ఈ ఇద్దరు ఎలా కలుసుకున్నారు? తమ గత జన్మ ప్రేమను ఎలా గుర్తించగలిగారు? చివరికి ఎలా తమ ప్రేమను గెలిపించుకున్నారనేది ఈ  ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ కథ.

 

నటీనటుల పనితీరు

హీరోగా మారిన ప్రదీప్ తన టాలెంట్ మొత్తం బయటపెట్టాడు. లుక్స్, యాక్టింగ్, యాక్షన్, ఫైట్స్, సెంటిమెంట్, కామెడీ.. ఇలా అన్ని విభాగాల్లో తను బెస్ట్ అని ప్రూవ్ చేసుకున్నాడు. ఇకపై మేకర్స్ ఎవరైనా టిపికల్ లవ్ స్టోరీలు రాసుకుంటే, తనను కూడా కన్సిడర్ చేయొచ్చనే భరోసా కల్పించాడు. హీరోయిన్ అమృతా అయ్యర్ లుక్స్ తో పాటు నటనతో మెప్పించింది. స్టోరీ ప్రకారం అర్జున్ క్యారెక్టర్ ను, అతడి హావభావాల్ని అమృత కూడా యాక్టింగ్ చేయాల్సి వచ్చింది. ఆ సన్నివేశాల్లో అమృత బాగా నటించింది. క్లైమాక్స్ లో కూడా ప్రదీప్-అమృత ఇద్దరూ పెర్ ఫెక్ట్ గా చేశారు.

ఇతర నటీనటుల విషయానికొస్తే.. వైవా హర్ష, భద్రం, హైపర్ ఆది చేసిన కామెడీ పైపైనే పండింది. స్వామీజీగా శుభలేఖ సుధాకర్, అతడి శిష్యుడిగా రంగస్థలం మహేష్ సెట్ అయ్యారు. పోసాని, అప్పాజీ, హేమ, శరణ్య తమ పాత్రల మేరకు మెప్పించారు.

 

టెక్నీషియన్స్ పనితీరు

ముందుగా చెప్పుకోవాల్సింది సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ గురించే. ఈ సినిమాకు రిలీజ్ కు ముందే ఓ క్రేజ్ తెచ్చిపెట్టాడు అనూప్. నీలినీలి ఆకాశంతో పాటు పాటలన్నీ బాగున్నాయి. దీనికితోడు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కూడా మెప్పించాడు. మ్యూజిక్ డైరక్టర్ తర్వాత చెప్పుకోవాల్సిన వ్యక్తి నిర్మాత ఎస్వీ బాబు. కొత్త దర్శకుడు, కొత్త హీరో అయినప్పటికీ కథపై నమ్మకంతో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించాడు బాబు. ప్రతి ఫ్రేమ్ లో నిర్మాత ఖర్చు కనిపించింది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ ఓకే అనిపించుకోగా.. శివేంద్ర సినిమాటోగ్రఫీ సినిమాకు బిగ్ ఎస్సెట్ గా నిలుస్తుంది.

ఇక దర్శకుడు మున్నా విషయానికొస్తే.. ఈ సినిమాను డైరక్ట్ చేయడంతో పాటు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ విభాగాల్ని కూడా మున్నానే చూసుకున్నాడు. కథ చెప్పిన విధానం పక్కనపెడితే.. అతడు ఎంచుకున్న పాయింట్ బాగుంది. హీరోహీరోయిన్ల తో పాటు.. టెక్నీషియన్స్ అందరి నుంచి మంచి ఔట్ పుట్ తీసుకున్నాడు.

30-Rojullo-Preminchadam-Ela-Movie-telugu-Review

జీ సినిమాలు రివ్యూ

మంచి కథ దొరకడం ఒక ఎత్తయితే, దాని చుట్టూ మంచి సన్నివేశాలు రాసుకోవడం మరో ఎత్తు. ఈ రెండో సెగ్మెంట్ లో వీక్ అనిపించుకుంది ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ మూవీ. కొన్ని చోట్ల ఎమోషన్ బాగా పండినప్పటికీ.. చాలా చోట్ల కామెడీతో పాటు ప్యాడింగ్ సీన్స్ తేలిపోవడం ఈ సినిమాకు పెద్ద మైనస్.

స్వామీజీ లీడ్ తో స్వతంత్రానికి పూర్వం జరిగిన ఓ ప్రేమకథతో ఈ సినిమాను స్టార్ట్ చేశాడు దర్శకుడు. అయితే ఎక్కువ టైమ్ తీసుకోకుండా, వెంటనే ప్రస్తుతానికి వచ్చేశాడు. ఈ గ్యాప్ లోనే సూపర్ హిట్ సాంగ్ ‘నీలినీలి ఆకాశం’ అయిపోతుంది. సూపర్ హిట్ సాంగ్ సినిమా స్టార్టింగ్ లోనే అయిపోయిందని కొందరు బాధపడితే, సూపర్ హిట్ సాంగ్ తో సినిమాను భలేగా స్టార్ట్ చేశారని మరికొందరు ఆనందపడ్డారు.

అయితే ఆ తర్వాత కాలేజీ ఎపిసోడ్స్ కాస్త విసుగు తెప్పిస్తాయి. ఇక్కడ డైరక్టర్ రాసుకున్న సీన్స్ పెద్దగా పండలేదు. ఇంటర్వెల్ ట్విస్ట్ కోసం దర్శకుడు పడిన పాట్లన్నీ మనకు ఇక్కడ కనిపిస్తాయి. దీనికితోడు హీరోహీరోయిన్ల మధ్య గిల్లికజ్జాల కోసం దర్శకుడు రాసుకున్న సీన్స్ అంతగా మెప్పించవు.

మొత్తానికి అదిరిపోయే ట్విస్ట్ తో ఇంటర్వెల్ కార్డు వేస్తాడు దర్శకుడు. 30 రోజుల్లో ప్రేమించుకోవడం ఎలా అనే లాక్ సెకెండాఫ్ పై అంచనాలు పెంచేస్తుంది. అయితే సెకెండాఫ్ లో ఆ ప్రేమ కంటే హీరోగా మారిన హీరోయిన్, హీరోయిన్ గా మారిన హీరో చేసే అల్లరి పనులపైనే ఎక్కువగా దృష్టిపెట్టాడు దర్శకుడు. ఇక్కడ కూడా టర్నింగ్ పాయింట్ కోసం దర్శకుడు కష్టపడుతున్నాడనే విషయం తెలుస్తూనే ఉంటుంది. దీనికితోడు కామెడీ పండకపోవడం మరో డ్రా బ్యాక్.

మొత్తమ్మీద ఫస్టాఫ్ లో 2 ట్విస్టులు, సెకెండాఫ్ లో 2 ట్విస్టులు పెట్టుకున్న దర్శకుడు.. దాని చుట్టూ 2 గంటలు సినిమాను అల్లడంలో ఫెయిల్ అయ్యాడు. అనూప్ రూబెన్స్ ఇచ్చిన సూపర్ హిట్ సాంగ్స్, ప్రదీప్-అమృత పడిన కష్టం.. సినిమాలో కొన్ని ఎపిసోడ్స్ వల్ల వృధా అయింది. అదే ఈ సినిమాకు ఇబ్బందికరంగా మారింది.

ప్లస్ పాయింట్స్
– ప్రదీప్ ఆల్ రౌండ్ పెర్ఫార్మెన్స్
– అమృతా అయ్యర్ నటన
– మ్యూజిక్
– దర్శకత్వం

మైనస్ పాయింట్స్
– ఫస్టాఫ్ & సెకండాఫ్ లో డ్రాగింగ్
– ఊహించగలిగే స్క్రీన్ ప్లే
– నెరేషన్
– కామెడీ

బాటమ్ లైన్ – కథ బాగుంది.. కథనం తప్పింది
రేటింగ్2.25/5