24 కిస్సెస్ మూవీ రివ్యూ

Friday,November 23,2018 - 01:43 by Z_CLU

నటీ నటులు : ఆదిత్ అరుణ్, హెబ్బాప‌టేల్, న‌రేష్, రావు ర‌మేష్, అదితి మైఖెల్, శ్రీ‌ని కాపా, మ‌ధు నెక్కంటి తదితరులు

ఛాయాగ్రహణం : ఉద‌య్ గుర్రాల‌

సంగీతం: జోయ్ బ‌రువా

నిర్మాత‌లు: స‌ంజ‌య్ రెడ్డి, అనిల్ ప‌ల్లాల‌, అయోధ్యకుమార్ కృష్ణంసెట్టి

రచన – ద‌ర్శ‌కుడు: అయోధ్య‌కుమార్ క్రిష్ణంసెట్టి

విడుదల తేది : 23 నవంబర్ 2018

40 మంది అంధులతో ‘మిణుగురులు’ సినిమా తీసి దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న అయోధ్య కుమార్ కాస్త గ్యాప్ తీసుకొని ’24 కిస్సెస్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అదిత్, హెబ్బా పటేల్ జంటగా తెరకెక్కిన ఈ సినిమా ఈరోజే థియేటర్స్ లోకొచ్చింది. మరి టీజర్, ట్రైలర్ తో ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిందా…? దర్శకుడు అయోధ్య కుమార్ ఈ సినిమాతో ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకున్నాడు… జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ

 

కథ :

కోదాడ పక్కన మార్కాపురం అనే పల్లెటూరికి చెందిన ఆనంద్(అదిత్) తన కుటుంబానికి దూరంగా ఉంటూ హైదరాబాద్ లో ఫిలిం మేకర్ గా స్థిరపడతాడు. కొన్ని సినిమాలతో చిల్డ్రన్స్ ఫిలిం మేకర్ గా పేరొందిన ఆనంద్ కి అనుకోకుండా ఓ కాలేజ్ వర్క్ షాప్ లో శ్రీ లక్ష్మి(హెబ్బా పటేల్) అనే అమ్మాయి పరిచయం అవుతుంది. ఆనంద్ మంచితనం, చిల్ల పిల్లల ఆరోగ్యం పట్ల అతని చూపించే ఆసక్తి చూసి ఆనంద్ ప్రేమలో పడుతుంది శ్రీ లక్ష్మి. తన లైఫ్ లో పెళ్లి , పిల్లలు అనే చాప్టర్స్ ఉండకూడదని డిసైడ్ అయిన ఆనంద్ ఓ సందర్భంలో శ్రీ లక్ష్మి ప్రేమలో పడతాడు. తన జీవితంలో కొందరు అమ్మాయిలతో శారీరక సంబంధం పెట్టుకున్న ఆనంద్ కి పెళ్ళాన్నా, పుట్టే పిల్లలన్నా ఇష్టం లేకపోవడానికి రీజన్ ఏంటి … అప్పుడప్పుడు సైకియార్టిస్ట్ మూర్తి ని సంప్రదిస్తూ తన ప్రేమకథలో జరుగుతున్న సంఘటనలు చెప్పుకునే ఆనంద్ కి సైకలాజికల్ ప్రాబ్లెం ఉందా..? తన కుటుంబానికి ఆనంద్ ఎందుకు దూరంగా ఉంటాడు… అసలు పెళ్ళంటే ఇష్టంలేని ఆనంద్ ని శ్రీ లక్ష్మి చివరికి మార్చగలిగిందా..? అనేదే 24 కిస్సెస్ కథ.

 

నటీ నటుల పనితీరు :

‘కథ’ సినిమాతో హీరోగా పరిచయమై ఆ తర్వాత హీరోగా రెండు మూడు సినిమాలు చేసిన అదిత్ తన పెర్ఫార్మెన్స్ తో పరవాలేదనిపించుకున్నాడు. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో అతని నటన ఆకట్టుకుంటుంది. ఇక హెబ్బా ఎప్పటిలాగే క్లాస్ టచ్ ఉన్న గ్లామర్ క్యారెక్టర్ లో మెప్పించి సినిమాకు హైలైట్ గా నిలిచింది. రొమాంటిక్ సన్నివేశాల్లో అదిత్, హెబ్బా మధ్య కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయింది. రావు రమేష్ మరోసారి డిఫరెంట్ క్యారెక్టర్ తో అలరించాడు. అదిత్ మైకల్ గ్లామర్ రోల్ లో ఆకట్టుకుంది. నరేష్ ,శ్రీ‌ని కాపా, మ‌ధు నెక్కంటి వారి పాత్రలకు న్యాయం చేసారు.

 

సాంకేతికవర్గం పనితీరు :

రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాకి మంచి మ్యూజిక్ పడాల్సిందే… పాటలు,ఆర్.ఆర్ ప్రేక్షకుడికి రొమాంటిక్ ఫీల్ కలిగించాలి. అప్పుడే ప్రేక్షకుడు సినిమాకి కనెక్ట్ అవుతాడు. ఈ సినిమాకు జోయ్ బ‌రువా అందించిన పాటలు మైనస్ అనిపిస్తాయి. 123 అంటూ 24 కౌంట్ పాట మినహా మిగతా పాటలేవి ఆకట్టుకోలేదు. ఆర్.ఆర్ కూడా జస్ట్ పరవాలేదనిపించింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ కుదరలేదు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ఎడిటింగ్ పై శ్రద్ధ  పెట్టాల్సింది. అయోధ్య కుమార్ కథ , కథనంతో పాటు డైరెక్షన్ కూడా వీక్ అనిపించాయి. ప్రొడక్షన్ వాల్యూస్ పరవాలేదు.

 

జీ సినిమాలు సమీక్ష :

తెలుగులో అడల్ట్ కంటెంట్ తో ఓ సినిమా వస్తుందంటే అందరి దృష్టి దానిమీదే పడుతుంది.  అలాంటి అడల్ట్ కంటెంట్ తో అందరినీ ఎట్రాక్ట్ చేసిన సినిమా 24 కిస్సెస్.. అయితే ఇది బూతు సినిమా కాదని , సినిమా అందరూ చూసే విధంగా ఉంటుందని స్టేట్ మెంట్ ఇచ్చాడు దర్శకుడు. నిజానికి దర్శకుడు ఈ సినిమాలో పేద పిల్లలకు సరైన పోషకాహారం అందడం లేదని, కొందరు ప్రభుత్వ అధికారులు అందనివ్వడం లేదనే పాయింట్ రైజ్ చేసాడు. కానీ ముద్దుల మధ్య హీరో కన్ఫ్యూజన్ క్యారెక్టర్ , ఆకట్టుకొని సన్నివేశాల వల్ల ఆ పాయింట్ ప్రేక్షకులకు పెద్దగా ఆనదు.

సినిమా ప్రారంభంలో తన జీవితంలో ఎదురైన సంఘటనలు, తన మిణుగురులు సినిమా తాలుకు సంగతులను హీరో క్యారెక్టర్ ద్వారా చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఆ సీన్స్ ఆకట్టుకోలేదు. ఏదో చెప్పాలని అందులో మరేదో ఆడ్ చేసి అటు ఇటు కాకుండా సినిమాను తెరకెక్కించాడు అయోధ్య కుమార్.. ఓ సందర్భంలో అసలు ఈ సినిమాతో దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడు… అనే ప్రశ్న ప్రేక్షకుడిలో మొదలవుతుంది. చాలా సన్నివేశాలు డాక్యుమెంటరీ సినిమాని తలపించేలా ఉన్నాయి. అసలే కథేంటో…అర్థం కానీ పరిస్థితుల్లో ప్రేక్షుడుంటే తన స్లో నేరేషన్ తో  విసుగు తెప్పించాడు దర్శకుడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే చాలా సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయి.

మిణుగురులు దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న అయోధ్య కుమార్ కాస్త గ్యాప్ తీసుకొని ఈ సినిమా చేసాడంటే అంతో.. ఇంతో విషయం ఉంటుందనుకున్న ప్రేక్షకులకు తన ఎక్స్ పిరియన్స్ తో కలగలిపిన ఓ విసుగు పుట్టించే ప్రేమకథతో ఎంటర్ టైన్ చేయాలని చూసాడు. ఇలా  కాకుండా ఏదైనా మంచి కథ తీసుకొని దానికి తన స్టైల్ స్క్రీన్ ప్లే రాసుకుంటే బాగుండేది. ముఖ్యంగా దర్శకుడు తను స్ట్రాంగ్ అనిపించుకున్న జోనర్ లో సినిమా చేస్తే బెటర్ రిజల్ట్ ఉండేది.   హీరో పెళ్లి ,పిల్లలకి ఎందుకు దూరంగా ఉంటాడో చెప్పే రీజన్స్ కూడా సిల్లీ గా అనిపిస్తాయి. ఫైనల్ గా 24 కిస్సెస్ అంటూ అయోధ్య కుమార్ రూపొందించిన ఈ సినిమాలో ఆ ముద్దులు తప్ప ఆసక్తి కలిగించే కథ కానీ అలరించే కథనం కానీ కనపడదు.

బాట్టం లైన్ : 24 ముద్దులు మాత్రమే

రేటింగ్ : 1.5/5