2.O మూవీ రివ్యూ

Thursday,November 29,2018 - 03:08 by Z_CLU

నటీ నటులు : రజిని కాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ తదితరులు

సంగీతం : ఏ.ఆర్.రెహమాన్

సినిమాటోగ్రఫీ : నిరవ్ షా

ఎడిటింగ్ : ఆంటోనీ

నిర్మాణం : లైకా ప్రొడక్షన్స్

నిర్మాత : సుభాస్కరన్

రచన-స్క్రీన్ ప్లే- దర్శకత్వం : ఎస్.శంకర్

విడుదల : 29 నవంబర్ 2018

నిడివి : 149 నిమిషాలు

 

600 వందల కోట్ల బడ్జెట్ … 3Dలో టెక్నాలజీ , రోబో కి సీక్వెల్ , సూపర్ స్టార్ రజినీ కాంత్-శంకర్ కాంబో.. ఇవన్నీ కలిసి 2.O పై భారీ అంచనాలు నెలకొల్పాయి. స్ట్రాంగ్ మెస్సేజ్ తో శంకర్ తెరకెక్కించిన ఎపిక్ మూవీ 2. O ఈరోజే థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది .. మరి శంకర్ తెరకిక్కించిన ఈ మ్యాగ్నం ఓపస్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసిందా…? ఈ సినిమాతో శంకర్ -రజినీ హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ అందుకున్నారా..? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ

కథ :

నగరంలో హఠాత్తుగా సెల్‌ఫోన్లు మాయమవుతుంటాయి. మనుషులు మాట్లాడుతుంటే వారి చేతుల్లోంచి ఫోన్లు ఎగిరిపోతుంటాయి. అయితే ఇంతకీ ఫోన్స్ ఎలా మాయమవుతున్నాయి… ప్రభుత్వ అధికారులకు కూడా ఏం జరుగుతుందనేది అర్థం కాని పరిస్థితి.. ఈ పరిణామాలకు కారణమేంటో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోతారు. సరిగ్గా అప్పుడే డా.వసీకరణ్‌ (రజనీకాంత్‌) రంగంలోకి దిగి ఈ సమస్య ను ఎదుర్కోవాలంటే మనకి చిట్టి రోబో(రజినీ కాంత్) ఒక్కటే మార్గమని మళ్లీ చిట్టి కి ప్రాణం పోస్తాడు. సెల్‌ఫోన్లు మాయంచేస్తూ నగరంలో విధ్వంసం సృష్టిస్తున్నది పక్షిరాజా (అక్షయ్‌ కుమార్‌) అని తెలుసుకున్న ఆ శక్తి ని ఎలా ఎదురించింది ? అసలు పక్షి రాజా ఎవరు.. అతని కథేంటి.. సెల్ ఫోన్స్ వాడుతున్న వారిపై ఎందుకు ఎటాక్ చేస్తుంటాడు.. అనేది ‘2.ఓ’సిల్వర్ స్క్రీన్ పై చూడాల్సిందే….

నటీ నటుల పనితీరు :

రోబో సినిమాలో చిట్టి , వసీకర్ గా తన నటనతో మెస్మరైజ్ చేసిన సూపర్ స్టార్ రజినీ కాంత్ మరో సారి తన పెర్ఫార్మెన్స్ తో అదరగోట్టేసాడు. ముఖ్యంగా క్లైమాక్స్, ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశాల్లో రజినీ నటన బాగా ఆకట్టుకుంటుంది. పక్షి రాజ్ గా అక్షయ్ కుమార్ తన స్పెల్ బౌండ్ పెర్ఫార్మెన్స్ తో ఎట్రాక్ట్ చేసాడు. సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో తనలోని మరో కోణాన్ని బయటపెట్టి సినిమాకు హైలైట్ గా నిలిచాడు. రోబో గా ఎమీ జాక్సన్ నటన బాగుంది. తన క్యారెక్టర్ తో సినిమాకు ప్లస్ అయ్యింది. దినేంద్ర బోరా గా సుధన్షుపాండే మిగతా నటీ నటులు క్యారెక్టర్స్ కి పర్ఫెక్ట్ అనిపించారు.

సాంకేతిక వర్గం పనితీరు :

విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు టెక్నికల్ గా అందరూ తమ బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చారు. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచాయి. చాలా సందర్భాల్లో విజువల్ ఎఫెక్ట్స్ టీం ఎఫర్ట్ కనిపిస్తుంది. శంకర్ కథను తన విజువల్స్ తో అద్భుతంగా చూపించాడు నిరవ్ షా. ముఖ్యంగా కొన్ని షాట్స్ చూస్తే అతని పనితనం తెలుస్తుంది. నిజానికి ఇలాంటి కథను విజువల్ గా చూపించడం చాలా కష్టతరమైన పని. సినిమాటోగ్రాఫర్ గా నిరవ్ షా వంద శాతం సక్సెస్ అయ్యాడు. రెహ్మాన్ అందించిన బుల్లిగువ్వ , రండాలి, యంతర లోకపు పాటలు అలరించాయి. ముఖ్యంగా బుల్లిగువ్వ పాట సినిమాకు హైలైట్ గా నిలిచింది. భాస్కరభట్ల, అనంత్ శ్రీరాం లిరిక్స్ బాగున్నాయి. ముతురాజ్ ఆర్ట్ వర్క్ చాలా బాగుంది. రజినీ రీ సెర్చ్ సెంటర్ సెట్ తో పాటు, అక్షయ్ కుమార్ ఇంటి సెట్ , అలాగే చెన్నైలో భారీ బడ్జెట్ తో వేసిన సెట్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. ప్రతీ రోజు దాదాపు రెండు గంటల పాటు అక్షయ్ కి వేసిన మేకప్ ఆ క్యారెక్టర్ ని ఎలివేట్ చేసింది. ఆంటోని ఎడిటింగ్ వర్క్ బాగుంది. ఫస్ట్ హాఫ్ లో కొంచెం ట్రిమ్ చేస్తే ఇంకా బెటర్ గా ఉండేది. సెకండ్ హాఫ్ మాత్రం పర్ఫెక్ట్ గా కట్ చేసారు. శంకర్ కథ , కథనం సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాయి. తను చెప్పాలనుకున్న పాయింట్ ని పర్ఫెక్ట్ గా చెప్పాడు శంకర్. లైకా ప్రొడక్షన్ వేల్యూస్ సినిమాకు గ్రాండియర్ లుక్ తీసుకొచ్చాయి. ఓవర్ ఆల్ గా ఇది టెక్నీషియన్స్ మూవీ.

 

జీ సినిమాలు సమీక్ష :

సౌత్ లో హాలీవుడ్ రేంజ్ సినిమాలు రావా? మన టెక్నీషియన్స్ ఆ రేంజ్ లో సినిమాలు చేయలేరా..? పాటలు, కామెడీ లేకపోతే సౌత్ లో సినిమాలు ఆడవా? ఇలాంటి అనుమానాల్ని పటాపంచలు చేస్తూ వచ్చింది 2.0. శంకర్ మనసులో పుట్టిన ఓ చిన్న ఆలోచన, పెరిగి పెద్దదై, 600 కోట్ల రూపాయల ఖర్చుతో 2.0గా ఊపిరిపోసుకుంది. ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ అద్భుత ఆవిష్కరణ చూసి ప్రేక్షకులు సంభ్రమాశ్చర్యం పొందారు.

ఎవరి ఊహకు అందని విధంగా తెరకెక్కింది 2.0. ఇది కేవలం సినిమా కాదు. ఇదొక కంప్లీట్ ఎక్స్ పీరియన్స్. దీన్ని కచ్చితంగా త్రీడీలోనే చూడాలి. త్రీడీలోనే అనుభూతి పొందాలి. ఒక్కో సన్నివేశం ముందుకు నడుస్తుంటే, ఒక్కో అనుభూతి కలుగుతుంది. మనసులోనే శంకర్ ను మెచ్చుకుంటాం. కళ్లను మాత్రం తెరకు అప్పగించేస్తాం. ప్రతి నిమిషం ఆశ్చర్యం, అద్భుతం కలగలిపిన ఓ ఆనందం. దీనికి తోడు సూపర్ స్టార్ ఎప్పీయరెన్స్, మధ్యమధ్యలో ఆయన పంచ్ లు.. ఇలా అన్ని కలిసి సినిమాను ఓ విజువల్ వండర్ గా మార్చేశాయి.

600 కోట్లు పెట్టినా తన మూలాల్ని మరిచిపోలేదు శంకర్. ఇందులో కూడా ఓ మంచి సందేశాన్నిచ్చాడు. దాన్ని రజనీకాంత్ లాంటి స్టార్ చెబితేనే బాగుంటుందని నమ్మాడు. ఆ నమ్మకమే నిజమైంది. కళ్లుచెదిరే గ్రాఫిక్స్ మాత్రమే కాదు, ఆలోచింపజేసే మెసేజ్ ఈ సినిమాకు హైలెట్.

విజువల్ ఎఫెక్ట్స్ మీద తనకున్న అనుభవంతో అందరికీ నచ్చేలా సినిమాను గ్రాండియర్ విజువల్స్, గ్రాఫిక్స్ తో తెరకెక్కించి సక్సెస్ అయ్యాడు శంకర్. మరీ ముఖ్యంగా పక్షిరాజు క్యారెక్టర్ ను శంకర్ తీర్చిదిద్దిన విధానం అద్భుతం. ఈ పాత్రకు అక్షయ్ కుమార్ ని తీసుకోవడం సినిమాకి పెద్ద ప్లస్. ఇక శంకర్ ఈ సినిమాను 3Dటెక్నాలజీ తో ఎందుకు తెరకెక్కించాలనుకున్నాడు..? అనే ప్రశ్నకి సినిమా చూస్తే ఆన్సర్ దొరుకుతుంది. సినిమా అయ్యాక ఇలాంటి సినిమాను కచ్చితంగా 3Dలోనే చూడాలి అని ఫీలవుతారు ప్రేక్షకులు.

చిట్టి గా రజనీ ఎంట్రీ సీన్స్ , ఇంటర్వెల్ ఎపిసోడ్ , సెకండ్ హాఫ్ లో గ్రాఫిక్స్ తో వచ్చే సీన్స్ , పక్షి రాజా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, క్లైమాక్స్ సినిమాకు మెయిన్ హైలైట్స్ గా నిలుస్తాయి. దాదాపు 20 కోట్లు పెట్టి తీసిన పాటను మాత్రం ఎండ్ టైటిల్స్ లో పెట్టడం బాధేస్తుంది. కానీ కథను డిస్టర్బ్ చేయకూడదనే ఆలోచనతో ఇంత కాస్ట్ లీ సాంగ్ ను కూడా రోలింగ్ టైటిల్స్ కు పరిమితం చేసిన శంకర్ కు హ్యాట్సాఫ్ చెప్పాలి. ఓవరాల్ గా 2.0 సినిమాను బిగ్ స్క్రీన్ పై త్రీడీలో చూసి అనుభూతి చెందాల్సిందే.

బాటమ్ లైన్ : 2.O విజువల్ ట్రీట్

రేటింగ్ : 3.5 /5