Zee Special Story on Classic GundammaKatha Completes 60Years

Wednesday,June 15,2022 - 05:03 by Z_CLU

తెలుగు సినిమా చరిత్రలో కొన్ని క్లాసిక్ సినిమాలు ప్రేక్షకులకి ఎప్పటికీ గుర్తుంటాయి. అందులో 'గుండమ్మకథ' ది ఓ ప్రత్యేక స్థానం అనే చెప్పాలి. అవును ఎన్టీఆర్ , ఏ ఎన్నార్ కలిసి నటించిన ఈ మల్టీ స్టారర్ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఓ ఆవకాయ్ లాంటి సినిమా అయింది. ఎప్పటికీ మర్చిపోలేని గొప్ప అనుభూతి అందించింది. ఈ ఏడాదితో ఈ సినిమాకు అరవై ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విశేషాలతో జీ సినిమాలు స్పెషల్ స్టోరీ.

'గుండమ్మ కథ' సినిమా కథలో ఎన్ని మలుపులు ఉన్నాయో.. ఈ సినిమాను తెరకెక్కించడంలో కూడా అన్నే మలుపులున్నాయి. 'పాతాళ భైరవి', 'మిస్సమ్మ', 'మాయా బజార్' వంటి ఎన్నో క్లాసిక్ సినిమాలను తెరకెక్కించిన విజయా సంస్థ తొలిసారిగా చేసిన రీమేక్ సినిమా 'గుండమ్మ కథ'. ఈ సినిమా కన్నడలో విఠలాచార్య దర్శకత్వంలో తెరకెక్కిన 'మనె తుంబిద హెణ్ణు' అనే కన్నడ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది.

 

'గుండమ్మ కథ'ను ముందుగా బి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిద్దామనున్నారు. ఒక రీమేక్ సినిమాకు అంత పెద్ద దర్శకుడు ఎందుకని .. పౌరాణిక సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కమలకర్ కామేశ్వరరావుతో ఈ సినిమాను డైరెక్ట్ చేయించారు బీ నాగిరెడ్డి , చక్రపాణి. 'మనె తుంబిద హెణ్ణు' మూల కథతో షేక్ స్పియర్‌‌కు చెందిన ‘ట్రేమింగ్ ఆఫ్ ది ష్రూ’ ఆధారంగా తీసుకొని దాన్ని తెలుగు నెేటివిటీకి తగ్గట్టు మార్పులు చేర్పులతో ఈ సినిమాను తెరకెక్కించారు.

ఎన్టీఆర్ , ఏ ఎన్నార్ వంటి ఇద్దరు స్టార్ హీరోలున్న ఈ సినిమాకు సూర్యకాంతం వంటి నటి రోల్ ను ‘గుండమ్మ కథ’ అంటూ టైటిల్ పెట్టడం అప్పట్లో పెద్ద సంచలనం. గుండమ్మ పేరు మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా కనపడదు. ఇది కన్నడలో వినిపించే పేరు. అయినా.. ఈ సినిమా రిలీజ్ తర్వాత తెలుగు ప్రేక్షకులు గుండమ్మ పేరుతో బాగా కనెక్ట్ అయ్యారు.

'గుండమ్మకథ' హీరోగా ఎన్టీఆర్‌‌ కి 100వ చిత్రంకాగా , ఏఎన్నార్‌ కి 99వ చిత్రం కావడం విశేషం. అదే సమయంలో ఈ సినిమాను తమిళంలో జెమినీ గణేషన్, అక్కినేనిలతో రీమేక్ చేశారు. ఇక నందమూరి, అక్కినేని కలిసి నటించిన 10వ సినిమా ఇది. ఇద్దరు కలిసి పదిహేను సినిమాల్లో నటించారు కానీ అందులో 'గుండమ్మకథ' ఓ ప్రత్యేకమైన సినిమాగా మిగిలిపోయింది.మళ్లీ 1977లో విడుదలైన 'చాణక్య-చంద్రగుప్త' చిత్రంతో ఈ ఇద్దరు అగ్రనటులు కలిసి నటించారు. ఈ మూవీని రామారావు ఆయన సొంత నిర్మాణ సంస్థ రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్‌లో స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ చంద్రగుప్తుడుగా నటిస్తే.. అక్కినేని చాణక్యుడిగా నటించారు. మరోవైపు తమిళ నటుడు శివాజీ గణేషన్ ఈ చిత్రంలో అలెగ్జాండర్ పాత్రలో నటించారు.

 

ఈ సినిమాకు సంబంధించిన సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేయకుండా.. అందుకు అయ్యే ఖర్చును అప్పటి భారత్ - చైనా వార్ ఫండ్‌కు అందజేయడం విశేషం. గుండమ్మ కథలోని అన్ని పాటలను పింగళి నాగేంద్రరావు రాశారు. ఘంటసాల సంగీతమందించిన ఈ సినిమాలో ప్రతీ పాట ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఈ సినిమాలో 'కోలో కోలో యమ్మ' అనే పాటను ఎన్టీఆర్, సావిత్రిలపై ఒకసారి.. అక్కినేని , జముమలపై మరోసారి చిత్రీకరించారు. కానీ ఈ పాట చూస్తే ఒకేసారి తీసినట్టు కనిపిస్తోంది.

 

ఎన్టీఆర్, ఏయన్నార్ వంటి స్టార్ హీరోలు కలిసి నటించిన ఈ సినిమాలో తెరపై ఎవరి పేరు ముందు వేయాలనే సమస్య వచ్చింది. ముందుగా ఎవరి పేరు వేయకుండా..ఎన్టీఆర్, ఎయన్నార్, సావిత్రి, జమున, ఎస్వీఆర్ ఫోటోలు పడతాయి. ఆ తర్వాత సూర్యకాంతం, ఛాయా దేవి, రమణారెడ్డి ఫోటోలను వేశారు. ఇలా హీరో పేర్లు కాకుండా ఫోటోలతో టైటిల్స్‌ను వేయడం ఈ సినిమాతోనే మొదలు.

ఈ సినిమాకు సంబంధించి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఓ విషయం ఉంది. ఈ సినిమాకు మూడేళ్ళ ముందు ఎన్టీయార్, ఏ ఎన్నార్ లతో జమునకి మనస్పర్థలు తలెత్తాయి. అక్కడి నుండి జమునతో వీరిద్దరూ కలిసి నటించలేదు. కానీ గుండమ్మకథ సినిమాలో ఎన్టీఆర్ సరసన సావిత్రి , ఏ ఎన్నార్ సరసన జమునని అనుకున్నారు. సూపర్ హిట్ జంట ఇలా చిన్న చిన్న గొడవలతో విడిపోవడం కరెక్ట్ కాదని నాగి రెడ్డి , చక్రపాణి , కేవీ రెడ్డి కలిసి రాజీ చేసేందుకు ప్రయత్నించారు. కానీ మొదటి సారి ప్రయత్నం విఫలం అవ్వడంతో చివరికి చక్రపాణి గారు జోక్యం చేసుకొని ఈ ముగ్గురిని కలిపారు. ఇలా నందమూరి , అక్కినేనితో జమునని మళ్ళీ కలిపిన సినిమాగా గుండమ్మ కథ నిలిచిపోయింది.

 

1962 జూన్ 7న గుండమ్మకథ విడుదలైంది. రిలీజైన మొదటి రోజు నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని 24 కేంద్రాల్లో వంద రోజులాడింది. రీ రిలీజ్ లో కూడా బాగానే వసూళ్ళు చేసింది.

తెలుగు చిత్రపరిశ్రమను విస్తృతం చేయాలనే లక్ష్యంతో, ధ్యేయంతో కృషి చేసిన ఎన్టీఆర్, ఏయన్నార్ సేవలను ప్రేక్షకులే కాదు కేంద్రప్రభుత్వం గుర్తించింది. 1968 జనవరి 26న ఇద్దరినీ ఒకేసారి పద్మశ్రీ బిరుదుతో సత్కరించి, గౌరవించింది. మొత్తంగా గుండమ్మ కథ సినిమా నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు అభిమానులకు ఇప్పటికీ ఎప్పటికీ ఓ తీపి గుర్తు అనే చెప్పాలి.

'గుండమ్మ కథ' ను బాలకృష్ణ, నాగార్జున కలిసి మళ్ళీ రీమేక్ చేయాలనుకున్నారు. కానీ ఎందుకో ఆ ప్రాజెక్ట్ వర్కౌట్ కాలేదు. దీంతో ఒకే స్క్రీన్ పై వీళ్లిద్దరిని చూడాలకున్న అభిమానుల ఆశలు ఇప్పటికీ నెరవేరలేదు. ఆ తర్వాత అక్కినేని, నందమూరి మూడో తరం వారసులు ఎన్టీఆర్, నాగ చైతన్య గుండమ్మ కథ సినిమాను భవిష్యత్తులో చేస్తారమే చూడాలి.

 
  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics