Venkatesh Ganesh Movie completes 23 Years

Saturday,June 19,2021 - 08:26 by Z_CLU

ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్ అంటూ సింగిల్ హ్యాండ్ తో సూపర్ కొట్టాడు విక్టరీ వెంకటేష్. అప్పటి వరకు ప్రేక్షకులు చూడని మెడికల్ మాఫియా కథతో సినిమా చేసి అందరినీ మెప్పించాడు వెంకీ. 1998 జూన్ 19 న రిలీజైన ఆ సినిమానే 'గణేష్'. పవర్ ఫుల్ క్యారెక్టర్ తో స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చిన 'గణేష్' రిలీజై నేటితో 23 ఏళ్లవుతుంది. ఈ సందర్బంగా గణేష్ గురించి 'జీ సినిమాలు' స్పెషల్ స్టోరీ.

డైరెక్టర్ సురేష్ కృష్ణ దగ్గర పనిచేసిన తిరుపతి స్వామి కొన్ని కథలు రాసుకొని సురేష్ బాబుకి వినిపించాలనుకున్నారు. సురేష్ బాబు గురించి ఆయనకి బాగా తెలుసు. ఓ మాదిరి కథతో వెళ్లకూడదని అనుకున్నారు. అలా సిద్దం చేసుకొని వెళ్ళిన కథల్లో ముందుగా గణేష్ కథ చెప్పారు. ఇంక మిగతా కథలు చెప్పాల్సిన అవసరం రాలేదు. గవర్నమెంట్ హాస్పిటల్స్ పనితీరు, కార్పోరేట్ హాస్పిటల్స్ ఆగడాలు అంటూ పాయింట్ చెప్తూ మెడికల్ మాఫియా మీద అయన చెప్పిన గణేష్ కథను విన్న వెంటనే ఓకే చెప్పేసి తిరుపతి స్వామి కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు సురేష్ బాబు.

స్వతహాగా దర్శకుడు తిరుపతి స్వామీ జర్నలిస్ట్. అందుకే తను చూసిన సంఘటనల ఆధారంగా కథను సిద్దం చేసుకొని హీరో వెంకటేష్ కి జర్నలిస్ట్ క్యారెక్టర్ క్రియేట్ చేశారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టారు. మాటలకి పరుచూరి బ్రదర్స్ , పాటలకు మణిశర్మ ని ఫిక్స్ చేశారు. సినిమాను కెమెరాలో బందించడానికి రవీంద్రబాబుని, తీసిన సినిమాకి కత్తెర వేసేందుకు మార్తాండ్.కె వెంకటేష్ ని ఎంచుకున్నారు. టెక్నీషియన్స్ ఫైనల్ అయ్యారు.

venkatesh ganesh movie zeecinemalu 4 హీరోయిన్ గా రంభ ని తీసుకున్నారు. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే మరో హీరోయిన్ పాత్రకి మధుబాలని సెలెక్ట్ చేశారు. వెంకటేష్ తండ్రి పాత్రకు చంద్రమోహన్ ను, చెల్లెలుగా కీర్తన ఫిక్స్. సినిమాలో విలన్ హెల్త్ మినిస్టర్ క్యారెక్టర్ కి తెలంగాణ యాసలో మాట్లాడే మంచి నటుడు కావాలి. దర్శకుడు తిరుపతి స్వామీకి రైటర్స్ పరుచూరి, నిర్మాత సురేష్ బాబు కి కోటా శ్రీనివాస రావు ఒక్కరే ఆప్షన్ గా కనిపించారు. వెంటనే కోటాని సంప్రదించి ఫైనల్ చేసుకున్నారు. విలనిజం చూపిస్తూ నటన కి మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ దొరకడంతో కోటా ఫుల్ హ్యాపీ. తక్కువ నిడివితో ఉండే కీలక పాత్రకు రేవతి ని తీసుకున్నారు. మిగతా పాత్రలకు కూడా నటీ నటుల ఎంపిక పూర్తయింది.

venkatesh ganesh movie zeecinemalu 1

1997 లో విజయదశమి రోజు సినిమాను మొదలు పెట్టారు. దాసరి నారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై మొదటి షాట్ కి గౌరవ దర్శకత్వం వహించారు. ఓల్డ్ సిటీలో సిటీ కాలేజ్ లో కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూట్ చేశారు. చక చకా షూటింగ్ పూర్తి చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా శరవేగంగా పూర్తి చేసి సినిమాను థియేటర్స్ లోకి తెచ్చారు.

venkatesh ganesh movie zeecinemalu 5

1998 జూన్ 19న ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్ అంటూ పవర్ ఫుల్ మెసేజ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు వెంకటేష్. అప్పటి వరకు క్లాస్ సినిమాలలో వెంకీ ని చూసిన ప్రేక్షకులు విక్టరీ నుండి ఓ మాస్ యాక్షన్ డ్రామా సినిమా వచ్చేసరికి థియేటర్స్ లో క్యూ కట్టారు. భారీ ఓపినింగ్స్ వచ్చాయి. వెంకీ తనలో ఉన్న ఇంటెన్స్ నటనని బయటపెట్టి కొన్ని సన్నివేశాలకు మరింతం బలం చేకూర్చాడు. ఆ సన్నివేశాలు చూస్తూ ఫ్యాన్స్ మురిసిపోయారు. వెంకీ కోటాకి వార్నింగ్ ఇచ్చే సన్నివేశాలకు థియేటర్లు ఊగిపోయాయి. ఆ సన్నివేశాలకు పరుచూరి వారి కలంతో మరింతం బలం చేకూరింది. వెంకటేష్ నోట పరుచూరి వారి డైలాగులు రావడమే ఆలస్యం. థియేటర్స్ అంతా గోల గోల చేశారు. ముఖ్యంగా ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్ అంటూ వెంకటేష్ డైలాగ్ పూర్తి చేశాక వచ్చే మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అభిమానులకి పూనకం తెప్పించింది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో వెంకీ నటనని అందరూ మెచ్చుకున్నారు. ఇక గవర్నమెంట్ హాస్పిటల్ లో డాక్టర్లను నిలదీసే సన్నివేశాల్లో వెంకటేష్ నటన అభినందనీయం. ఇటివలే కరోన సమయంలో ఆ సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయంటే గణేష్ సన్నివేశాలు , మాటలు , వెంకీ యాక్టింగ్ ఏ రేంజ్ ఇంపాక్ట్ చూపించిందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాకు గానూ ఉత్తమ నటుడిగా ఆ ఏడాది నంది అవార్డుతో పాటు ఫిలిం ఫేర్ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు వెంకటెష్. అందుకే విక్టరీ ది బెస్ట్ రోల్స్ లో గణేష్ కచ్చితంగా ఉంటుంది.

venkatesh ganesh movie zeecinemalu 2 సినిమాలో కోటా శ్రీనివాసరావు నటన గురించి తప్పకుండా చెప్పుకోవాలి. ఆయన చేసిన బెస్ట్ క్యారెక్టర్స్ లో ఇదొకటి. ఆయన విలక్షణ నటుడని చెప్పడానికి ఇందులో పాత్ర ఓ మచ్చు తునక అనొచ్చు. అంతకు ముందు వెంకటేష్ తో ప్రేమ సినిమాలో నటించిన రేవతి ఇందులో భర్తను కాపాడుకోవడానికి గవర్న్ మెంట్ హాస్పిటల్ చుట్టూ తిరిగే పాత్రలో నటించి మెప్పించింది. రంభ , మధుబాల వారి పాత్రలకు న్యాయం చేశారు. ఫ్యామిలీ ,యాక్షన్ , లవ్ , సెంటిమెంట్ ఇలా గణేష్ కథలో అన్నీ జోడించి ఓ స్ట్రాంగ్ మెసేజ్ అందించాడు దర్శకుడు తిరుపతి స్వామి. అప్పటి వరకూ సాధారణ జనాలకు తెలియని మెడికల్ మాఫియా గురించి చెప్తూ అప్ డేటెడ్ వర్షన్ తో గణేష్ ని తెరకెక్కించి మెప్పించాడు దర్శకుడు.పరుచూరి మాటలు విజయంలో కీలక పాత్ర పోషించయనడంలో సందేహమే లేదు. ఇప్పటికీ సినిమాలో డైలాగ్స్ ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటాయి. మణిశర్మ కూడా తన మ్యూజిక్ తో సక్సెస్ లో పార్ట్ అయ్యాడు. ఆల్బంలో సిరి సిరి మువ్వలు పాటతో మిగతావన్నీ ఆకట్టుకున్నాయి. అలాగే నేపథ్య సంగీతంతో సినిమాను మరో మెట్టు ఎక్కించాడు మణి.

venkatesh ganesh movie zeecinemalu 3 ఆ ఏడాదికి గానూ గణేష్ సినిమాకి తృతీయ ఉత్తమ చిత్రంగా ఎన్నికై కాంస్య నంది అవార్డు అందుకుంది. సంభాషణలకు గానూ పరుచూరి బ్రదర్స్ కి అలాగే ఆర్ట్ డైరెక్టర్ రాఘవ కి కూడా నందులు లభించాయి. డైరెక్ట్ గా 43 సెంటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకున్న గణేష్ నాలుగు ముఖ్య సెంటర్స్ లో 100 రోజులాడింది. నైజాంలో 2 కోట్లు , ఆంధ్రలో 3 కోట్లు , సీడెడ్ లో 1 కోటి 25 లక్షలు మొత్తంగా 6 కోట్ల పాతిక లక్షల షేర్ వసూళ్ళు చేసింది.

-రాజేష్ మన్నె

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics