Special Story on Nithiin -Teja’s ‘Jayam’ Movie

Tuesday,June 14,2022 - 04:39 by Z_CLU

2002 వెంకట్ చేయి గుర్తు...

కొన్ని ఊర్లల్లో గోడలపై పెద్దగా ఈ అక్షరాలు కనిపించేవి. అసలెవరీ వెంకట్ ...? ఈ చేయి గుర్తేంటి ? అందరు మాట్లాడుకుంటున్నారు.

ఓ వారమైంది. దర్శకుడు తేజ కొత్తవాళ్ళతో తీసిన 'జయం' సినిమా థియేటర్స్ లోకొచ్చింది. కొన్ని ఏరియాల్లో మొదటి సినిమాకే నితిన్ కి కటౌట్లు పుట్టుకొచ్చాయి. అప్పటి వరకూ కేవలం స్టార్ హీరోలకు మాత్రమే అభిమానులు సినిమా హాళ్ళ ముందు కటౌట్ కట్టేవారు. బడా డిస్ట్రిబ్యూటర్ కొడుకు కావడంతో థియేటర్స్ యాజమాన్యంతో డిస్ట్రిబ్యూటర్లు ఆ కటౌట్స్ కట్టించారు. ఆ సంగతి వచ్చిన ప్రేక్షకులకు తెలియక ఆశ్చర్య పోయారు. అప్పటికే పాటలు సూపర్ హిట్టవ్వడం, 'చిత్రం','నువ్వు నేను' లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు తీసిన తేజ అనే బ్రాండ్ చూసి కొత్తవాళ్ళు నటించిన ఈ సినిమాకు కౌంటర్ లో టికెట్స్ తెగాయి. మరీ భారీగా కాదు కానీ సగం పైన సినిమా హాళ్ళు నిండాయి.

 

"వీరి వీరి గుమ్మడి పండు" అంటూ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో చైల్డ్ ఎపిసోడ్ సన్నివేశాలతో సినిమా మొదలవుతుంది. అక్కడి నుండే ప్రేక్షకులు సినిమాకి కనెక్ట్ అవ్వడం మొదలెట్టారు. సాధారణంగా సినిమాల్లో హీరో -హీరోయిన్ మధ్య చైల్డ్ ఎపిసోడ్ ఉంటుంది. కానీ తేజ ఈ సినిమాకు ఆ ఫార్మేట్ ఫాలో అవ్వలేదు. తను రాసుకున్న కథను , క్యారెక్టర్స్ ను ఎలా ప్రెజెంట్ చేయాలో ఆయనకో ఐడియా ఉంది. అందుకే విలన్ గోపీచంద్ - హీరోయిన్ సదా కి మధ్య చైల్డ్ ఎపిసోడ్ తో సినిమాను స్టార్ట్ చేసి గోపీచంద్ క్యారెక్టర్ లో ఉండే నెగిటివ్ ను చూపించాడు. ఐదారేళ్ళ తర్వాత అంటూ అసలు కథలోకెళ్ళాడు తేజ.

హీరోయిన్ మీద తన తండ్రికి ఉండే ప్రేమను ఎలివేట్ చేస్తూనే మరో వైపు హీరో క్యారెక్టర్ ను ఎష్టాబిలిష్ చేసారు తేజ. తేనె కోసం వెంకట్ ను వెతుక్కుంటూ హనుమంతు వచ్చే సన్నివేశం ఆ తర్వాత వెంకట్ కష్టాలు చూపిస్తూ హీరో పాత్రపై ఓ సింపతి క్రియేట్ చేసాడు. ఆ సన్నివేశాలు స్క్రీన్ మీద వర్కౌట్ అవుతున్నాయి. అక్కడి నుండి ప్రేక్షకుల్లో ప్రేమకథపై అంచనాలు పెరుగుతున్నాయి. వాటిని అన్ని విధాలా అందుకునే పని తేజ ముందే చేసేసాడు.

తర్వాత వెంకట్ - సుజాత ప్రేమకథకు కాలేజీలో పునాది వేసాడు తేజ. కళాశాలలో వచ్చే ప్రేమ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా మెప్పించాయి. ఒక వైపు అందమైన ప్రేమకథను చూస్తున్నప్రేక్షకులకు మరోవైపు సుమన్ శెట్టి- షకీలా కామెడీ ట్రాక్ తో మంచి వినోదం అందింది. అచ్చ తెలుగమ్మాయిగా సదాను చూస్తూ అమ్మాయంటే ఇలా ఉండాలిరా అంటూ అబ్బాయిలనుకుంటుంటే... ఇన్నోసెంట్ అబ్బాయిగా నితిన్  అమ్మాయిలను ఎట్రాక్ట్ చేశాడు. ఇద్దరూ ఇద్దరే అందం అభినయంతో సదా ఎట్రాక్ట్ చేస్తే వెంకట్ పాత్రలో ఒదిగిపోయి ఓ పేద అబ్బాయిగా నితిన్ మెప్పించాడు. మొదటి సినిమాకే ఆ రేంజ్ లో నటిస్తుంటే ప్రేక్షకులు షాక్ అయ్యారు. దర్శకుడు తేజ సంగతి తెలుసుకదా వాళ్ళతో ఆ పాత్రలను అద్భుతంగా చేయించుకున్నాడు మరి. కొన్ని సన్నివేశాల్లో నితిన్ , సదా కెమిస్ట్రీ అదిరిపోయింది. అందుకే ప్రేమ సన్నివేశాలు ఆ రేంజ్ లో ఆకట్టుకొని సినిమాకు ఆయువుపట్టులా నిలిచాయి.

వెంకట్ - సుజాత మధ్య వచ్చే ఇంటెన్స్ తో కూడిన లవ్ సన్నివేశాలు చాలా నేచురల్ గా ఉంటాయి. ముఖ్యంగా రైల్వే స్టేషన్ లో వారిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక అప్పటి వరకు సాఫీగా సాగిన వెంకట్ -సుజాత ప్రేమకథలోకి రఘు ఎంటరయ్యాక సినిమా పరుగులు పెడుతుంది. క్రూరుడు రఘు ఈ ప్రేమ జంటను చంపేస్తాడా అంటూ స్క్రీన్ కి అతుక్కుపోయిన కళ్లెన్నో.

వెంకట్ తో ప్రేమాయణం నడుపుతున్న సుజాతను చూసి తండ్రి నర్సింగ్(శివ రామకృష్ణ) చెవిలో వేస్తాడు పంతులు(రాళ్ళపల్లి). దీంతో వెంటనే మిత్రుడు రాముడుకి ఫోన్ చేసి రేపోద్దున్నే సుజాత-రఘులకు నిశ్చితార్థం అంటాడు. విషయం తెలుసుకున్న వెంకట్ పెళ్లి వాళ్ళు వచ్చే లోపే సుజాత ఇంటికి వెళ్లి అక్కడ మగ పెళ్లి వారికి తమ ప్రేమ సంగతి చెప్పాలనుకుంటాడు. కట్ చేస్తే అనుకున్న టైం కంటే రెండు గంటల ముందే రఘు కుటుంబం సుజాత ఇంటికి చేరుకోవడం పెళ్లి నిశ్చయం చేసుకోవడం జరిగిపోతుంటాయి. సరిగ్గా ఆ సందర్భంలో రఘుతో మాట్లాడాలి అంటూ సుజాత తన గదిలోకి తీసుకెళ్ళడం అక్కడ వెంకట్ ను ప్రేమిస్తున్నాని, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాని చెప్పడంతో  నువు ఎవరితో పడుకున్నా నువు వాడిని ప్రేమిస్తున్నావా అయినా పరవాలేదు పెళ్లి మాత్రం నన్నే చేసుకోవాలి అని గోపీచంద్ సదా మెడ పట్టుకొని పైకి లేపే సన్నివేశం నుండి ప్రేక్షకుల్లో రఘు క్యారెక్టర్ భయం పుట్టించింది.

ఆ తర్వాత సుజాత -వెంకట్ ఓ గుడిలో చాటుగా కలుసుకోవడం అదే సమయంలో రఘు అక్కడ వాలిపోయి వెంకట్ ను కొడుతూ వార్నింగ్ ఇవ్వడం. ఈ లవ్ స్టోరీలో కీలక మలుపు తీసుకొచ్చింది. ఆ తర్వాత  వెంకట్ చేయి గుర్తు అంటూ రఘు గుండెల్లో రైళ్ళు పరిగెత్తించడం నుండి సినిమా వేగం పుంజుకుంటుంది. ఆ క్షణం గోడలపై వెంకట్ చేయి గుర్తు అని చూసి ప్రేక్షకులకు అప్పుడు మేటర్ అర్థమైంది. ఓహో ఇందుకా గోడలపై రాశారు అనుకున్నారు లోలోపల. ఇక అక్కడి నుండి విలన్ నుంచి హీరోయిన్ ను కాపాడుకోవడానికి హీరో వేసే ఎత్తులు దానికి విలన్ పైఎత్తులు ఇలా స్క్రీన్ ప్లే ను బిగించి కథను రసవత్తరంగా రాసుకున్నాడు తేజ. ముఖ్యంగా పెళ్లి ముహూర్తానికి వెంకట్ వచ్చి సుజాతను తీసుకెళ్ళే సన్నివేశానికి థియేటర్స్ లో క్లాప్స్ పడ్డాయంటే అతిశయోక్తి కాదు. అప్పటి వరకు హీరో టైంకి రాగలడా అని కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్న ప్రేక్షకులకు వెంకట్ పెంకులు తీసి తాడుకట్టుకొని ఇంట్లోకొచ్చి సుజాతను ఎత్తుకెళ్ళడం భలే కిక్ ఇచ్చింది. ఆ సన్నివేశం నుండి రఘు గ్యాంగ్ వెంట పడుతున్నా ఇద్దరు కలిసి పారిపోయి ఓ అడవిలో ఉండటం ఇక అక్కడే ఈ ప్రేమకథకు తేజ అదిరిపోయే క్లైమాక్స్ పెట్టడంతో సినిమా చూసి బయటికొచ్చిన ప్రేక్షకులు ఓ సూపర్ హిట్ లవ్ స్టోరీ చూసోచ్చామనే ఆనందంతో బయటికొచ్చారు. 'జయం' లో హైలైట్స్ అనిపించే సన్నివేశాలెన్నో... అందుకే ప్రేక్షకులు సినిమాను ఘన వి'జయం' చేశారు.

సినిమా ప్రారంభంలోనే హీరోకి తాడు కట్టి స్నేహితులు పైకి లాగడం అనేది చూపిస్తాడు తేజ. అది హీరో డబ్బు సంపాదించడంతో పడి కష్టం అనుకుంటాం. తర్వాత ఆ తాడును లాగే స్నేహితుల్ని వాడి చాలా సందర్భాల్లో మెప్పించాడు తేజ. ఇక 'ప్రియతమా తెలుసునా ' సాంగ్ ను కూడా ఆ తాడుతోనే కోరియోగ్రఫీ చేయించి ప్రేక్షకులకు కొత్త ఎక్స్ పీరియన్స్ కలిగించాడు.

సినిమాలో సదా కి 'వెళ్ళవయ్యా వెళ్ళు' అనే సిగ్నేచర్ డైలాగ్ పెట్టాడు తేజ. అది ఊహించని విధంగా పాపులర్ అయింది. ఇప్పటికీ ఈ సినిమా టైటిల్ విన్నా , సదా ను చూసినా ఈ డైలాగే గుర్తొస్తుంది. అలాగే గోపీచంద్ క్యారెక్టర్ కి కూడా 'అర్థమయిందా' అంటూ ఓ సిగ్నేచర్ డైలాగ్ ఇచ్చాడు. అది కూడా సినిమాలో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. చివర్లో గోపీచంద్ ను కొట్టాక నితిన్ తో ఆ డైలాగ్ చెప్పించి మాంచి కిక్ ఇచ్చాడు తేజ.

సినిమాకు దర్శకుడు తేజ తర్వాత ఎక్కువ కష్టపడిన టెక్నీషియన్ అంటే ఆర్.పి.పట్నాయకే. 'జయం' కి అదిరిపోయే పాటలు అందించి ఓ సూపర్ హిట్ మ్యూజికల్ లవ్ స్టోరీని చేసాడు RP. సినిమాలో ప్రతీ సాంగ్ పెద్ద హిట్ అయింది. అందమైన మనసులో .... సబాసి సబాసి ... వీరి వీరి గుమ్మడి పండు ఇలా సాంగ్స్ అన్నీ ఒకెత్తయితే 'రాను రానుంటూనే' ఓ ఊపు ఊపేసింది. రిలీజ్ కి ముందు రిలీజ్ తర్వాత కూడా ఎక్కడ విన్నా ఈ పాటే వినబడేది. ఆడియో క్యాసెట్లు కూడా రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. నేపథ్య సంగీతం విషయంలోనూ బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చి తేజ తీసిన సన్నివేశాలకు మరింత అందం తీసుకొచ్చాడు. ఆర్.పి గారి ట్యూన్స్ కి తన కలంతో మరింత బలం చేకూర్చి అందరూ పాడుకునే సాహిత్యం అందించాడు కులశేఖర్. 'జయం' తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ పట్నాయక్ మరింత బిజీ అయిపోయాడు.

ఆర్.పి.పట్నాయక్ తర్వాత సమీర్ రెడ్డి వర్క్ గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. అవును తనే సినిమాటోగ్రఫీ అయ్యుండి మిత్రుడు సమీర్ కి అవకాశం ఇచ్చాడు తేజ. ఇక మిత్రుడు తేజ విజన్ ను పర్ఫెక్ట్ గా క్యాప్చర్ చేసి సన్నివేశాలను బాగా తీసారు సమీర్. ఇక హార్స్ మెన్ బాబు కంపోజ్ చేసిన క్లైమాక్స్ ఫైట్ కూడా హైలైట్ గా నిలిచింది.

బ్లాక్ బస్టర్ ప్రేమకథల్లో 'జయం' ఒకటి. కేవలం 4 కోట్లతో నిర్మించిన ఈ సినిమా 32 కోట్లు కలెక్ట్ చేసి చాలా ఏరియాల్లో అరుదైన రికార్డులు సొంతం చేసుకుంది. హైదరాబాద్ లో ఒక్క శాంతి థియేటర్ లో కోటి పై కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది. బెంగళూరులో దాదాపు 500 రోజులు ప్రదర్శించబడింది. షోలాపూర్ లో రెండేళ్ళు ఆడిన ఘనత కూడా జయంకే ఉంది.

2002 ఏడాది కి గానూ 'జయం' మూడు నంది అవార్డులు వచ్చాయి. డెబ్యూ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హీరో నితిన్ ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు.

* చిత్రం మూవీస్ సంస్థను ప్రారంభించి 'జయం' తో నిర్మాతగా మారాడు తేజ. మొదటి సినిమాతోనే నిర్మాతగా కలెక్షన్లతో అందలం చూసాడు.

* సినిమాలో నితిన్ కి హీరో శివాజీ డబ్బింగ్ చెప్పగా సదా కి సునీత డబ్బింగ్ చెప్పారు.

* నితిన్ , సదా , కాకుండా దాదాపు 35 నటీ నటులు ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేసారు తేజ. నితిన్ కి బెస్ట్ డెబ్యూ యాక్టర్ (మేల్) కేటగిరీలో ఫిలిం ఫేర్  అవార్డు దక్కింది.

* దర్శక -నిర్మాతగా భారీ సక్సెస్ అందుకోవడంతో సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ లో అమ్మాయిలు ఉన్న వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ బహుమతిగా ఇచ్చారు తేజ.

* షూటింగ్ కి ముందు తేజ ఆడిషన్ నిర్వహించారు. ఆడిషన్ లో సుమన్ శెట్టి ఫెయిల్ అయ్యాడు. అయినా తన ఫేస్ కామెడీగా ఉందని భావించి డైరెక్ట్ గా షూటింగ్ పిలిచి అతనితో నితిన్ స్నేహితుడి పాత్ర చేయించి కామెడీ పండించాడు తేజ. జయం తర్వాత సుమన్ శెట్టి కమెడియన్ గా బాగా బిజీ అయ్యాడు. ఈ ఒక్క సినిమా అతానికి ఎన్నో అవకాశాలు తెచ్చిపెట్టింది.

* సినిమాలో రైలు ఆలస్యం మీద వచ్చే సాంగ్ బాగా పాపులరైంది. కానీ రైల్వే డిపార్ట్ మెంట్ సీరియస్ అవ్వడంతో మళ్ళీ ఆ పాటను మార్చి రైలుని పొగుడుతూ రికార్డ్ చేసి సినిమా రన్నింగ్ లో ఉండగా యాడ్ చేసారు.

* ఈ సినిమా 'జయం' టైటిల్ తోనే తమిళ్ లో రవి హీరోగా రీమేక్ అయింది. అక్కడి నుండి హీరో రవి ముందు జయం చేరి జయం రవిగా మారింది.

 

---రాజేష్ మన్నె