SP Balu’s Biggest risk in his life

Saturday,September 26,2020 - 12:47 by Z_CLU

సహజంగా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు డాక్టర్లు సర్జరీ చేయాలని చెప్తుంటారు. కానీ ఆపరేషన్ అనే పదం వినగానే మనం బెంబేలెత్తిపోతుంటాం. కానీ గాన గంధర్వుడు SP Balu మాత్రం ఎవరూ చేయలేని ఓ దైర్యం చేశారు. కమల్ హాసన్ హీరోగా నటించిన 'ఇంద్రుడు చంద్రుడు' సినిమాకు డబ్బింగ్ చెప్పే సందర్భంలో బాలు గారి వోకల్ కార్డ్స్ కి సమస్య వచ్చింది. అప్పటి నుండి ఆయన పాడుతున్న సందర్భంలో ఉన్నపళంగా గొంతులో బ్రేక్ పడేది. అయితే ఆ సమస్య వల్ల స్టూడియోలో పాట పాడే సమయంలో ఎన్నో ఇబ్బందులు పడేవారట బాలు.

అయితే మణిరత్నం తీసిన 'గీతాంజలి' సినిమాకు పాట పాడే సమయంలో ఆయన వోకల్ నాడ్యుల్స్ మరింత దెబ్బతిన్నాయట. దాంతో ఇక చేసేదేం లేక సమస్య తెలుసుకొని సర్జరీకి సిద్దమయ్యారట బాలసుబ్రమణ్యం. ఆ సమయంలో లతా మంగేష్కర్ వంటి ప్రఖ్యాత సింగర్స్ బాలుకి ఫోన్ చేసి ఆపరేషన్ చేయించుకోవద్దని అలా చేయించుకుంటే గొంతు పోయే అవకాశం కూడా ఉందని చెప్పారట. కానీ ఆ టైంలో తన గొంతుతో సినిమా యూనిట్ ని ఇబ్బంది పెడుతున్నానని తన వల్ల చాలా పాటల రికార్డింగ్ ఆలస్యమవుతుందని అది సబబు కాదని భావించి ఎట్టకేలకు ఆపరేషన్ చేయించుకున్నారట.

సర్జరీ అనంతరం పూర్తి ఆరోగ్యంతో ఆయన మళ్ళీ మునుపటి గొంతుతో పాటలు పాడి అభిమానుల్ని అలరించారు. ఏదేమైనా ఆ సమయంలో ఏ సింగర్ చేయలేని ఓ ధైర్యం చేసి మళ్ళీ పాటకు దగ్గరయ్యారు బాలు. అలాంటి ఆరోగ్య సమస్యను సైతం ధైర్యంతో ఎదుర్కొన్న బాలు ఇప్పుడిలా కన్నుమూయడం ఆయన అభిమానుల్ని కలచివేస్తుంది. SP Balu లేరనే చేదు వార్త దిగమింగుకోవడానికి సంగీత అభిమానులకి చాలా సమయం పడుతుంది.