Senior Journalist PRO BA Raju Passed away

Saturday,May 22,2021 - 12:21 by Z_CLU

ప్రముఖ సినీ పాత్రికేయుడు, నిర్మాత, సీనియర్ పీఆర్వో బి ఏ రాజు కన్నుమూశారు. నిన్న రాత్రి హైదరాబాద్ కేర్ హాస్పిటల్ లో ఆయన తుదిశ్వాస విడిచారు.ఆయన వయస్సు 61 సంవత్సరాలు. బీఏ రాజుకు ఇద్దరు కుమారులు. అరుణ్ కుమార్, శివ కుమార్. ఆయన సతీమణి ప్రముఖ రచయిత్రి, జర్నలిస్టు, కాలమిస్ట్, దర్శకురాలు కలిదిండి జయ రెండు సంవత్సరాల క్రితం మరణించారు.

కాగా బి ఏ రాజు మరణం పట్ల తెలుగు చలనచిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. సూపర్ స్టార్ కృష్ణ వద్ద పి ఆర్ ఓ గా సినీ జీవితాన్ని ప్రారంభించిన బి. ఏ. రాజు ఆ తరువాత ఆయన ప్రోద్బలంతోనే ఫిల్మ్ జర్నలిస్ట్ గా మారారు. ఆంధ్రజ్యోతి, జ్యోతి చిత్ర, ఉదయం, శివరంజని వంటి దినవార పత్రికలలో సినీ పాత్రికేయుడుగా వివిధ హోదాలలో పని చేశారు.

BA raju died 2

1600కు పైగా సినిమాలకు పైగా పబ్లిసిటీ ఇన్చార్జిగా పనిచేసిన బి.ఏ. రాజు ఆయా సినిమాల విజయంలో కీలక పాత్ర పోషించారు. చిత్ర పరిశ్రమలో పెద్దా చిన్నా ప్రతి ఒక్కరితో ఆత్మీయ అనుబంధాన్ని ఏర్పరుచుకున్న రాజు నిర్మాతగా మారి తన సతీమణి జయ.బి దర్శకత్వంలో ప్రేమలో పావని కళ్యాణి, చంటిగాడు, ప్రేమికులు, గుండమ్మగారి మనవడు, సవాల్, లవ్లీ, వైశాఖం వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించారు.

చిత్ర పరిశ్రమలోని ప్రముఖులందరితోనూ అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ సూపర్ స్టార్ కృష్ణ , యంగ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లతో బి ఏ రాజుకు సొంత కుటుంబ సభ్యుని వంటి అనుబంధం ఉంది. "కృష్ణ గారి సినిమాలకు పని చేశాను, ప్రస్తుతం మహేష్ సినిమాలకు వర్క్ చేస్తున్నాను, రేపు గౌతమ్ కృష్ణ హీరోగా చేసే సినిమాలకు కూడా నేనే పి ఆర్ ఓ గా చేస్తాను" అని అంటుండేవారు బి. ఏ.రాజు.

బి.ఏ.రాజు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అలాగే ఏ సినిమాను ఎప్పుడు ఏ దర్శకుడు ఏ హీరోతో నిర్మించాడు... ఆ బ్యానర్ ఏమిటి... రిలీజ్ డేట్ ఏమిటి... అది ఏ ఏ సెంటర్స్ లో ఎన్ని రోజులు ఆడింది - వంటి సమస్త వివరాలను, విశేషాలను ఫింగర్ టిప్స్ మీద చెప్పగలిగిన సినీ పరిజ్ఞానం బి.ఏ రాజు సొంతం.

  • - Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics