RRR Movie – Dosti Song Review

Sunday,August 01,2021 - 01:43 by Z_CLU

కీరవాణి కంపోజిషన్ లో ఏదో మేజిక్ ఉంది. ఓ పాటను సైలెంట్ గా స్టార్ట్ చేసి, శిఖరం అంచుల వరకు తీసుకెళ్లి ఊపు తీసుకురావడంలో కీరవాణి దిట్ట. ఈరోజు రిలీజైన RRR Movie Dosti Song లో కూడా ఇదే మేజిక్ రిపీట్ అయింది. ఫ్రెండ్ షిప్ డే కానుకగా విడుదలైన RRR Song అదిరిపోయింది. కేవలం మ్యూజిక్ పరంగానే కాదు, మేకింగ్ పరంగా కూడా.

సినిమాలో తారక్-చరణ్ ఫ్రెండ్ షిప్ ను ఎలివేట్ చేయడమే కాదు, వాళ్ల పాత్రల స్వభావం, పరిస్థితుల్ని కూడా ఈ దోస్తీ సాంగ్ సాహిత్యంలో చక్కగా వివరించారు. "పులికి విలుకాడికి, తలకి ఉరితాడుకి, రగిలే కార్చిచ్చుకి కసిరే వడగళ్లకి, రవికి మేఘానికి.. దోస్తీ" అనే లిరిక్స్ చూస్తే.. సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ రెండు వ్యతిరేక ధృవాలుగా ఉంటారనే విషయం అర్థమౌతోంది. అలాంటి రెండు వ్యతిరేక ధృవాలు స్నేహం పేరిట కలిస్తే ఏం జరుగుతుందో ఆర్ఆర్ఆర్ సినిమాలో చూపించబోతున్నాడు రాజమౌళి.

సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం ఈ పాటకు హైలెట్ గా నిలిస్తే.. కీరవాణి సంగీతం, హేమచంద్ర గాత్రం ఆ సాహిత్యానికి ప్రాణం పోశాయి. ఇక ఇదే పాటను వివిధ భాషల్లో అనిరుధ్, అమిత్ త్రివేది, విజయ్ ఏసుదాసు, యాజిన్ నజర్ పాడారు. వాళ్లకు కూడా మేకింగ్ వీడియోలో చోటు కల్పించారు.

కీరవాణితో కలిసి వీళ్లంతా పాట పాడుతుంటే.. చివర్లో రామ్ చరణ్, ఎన్టీఆర్ వచ్చి వీళ్లను అభినందించే సీన్, లిరికల్ వీడియోలో హైలెట్ గా నిలిచింది. సినిమాలో మాంటేజ్ సాంగ్ గా రాబోతోంది ఈ పాట. రీసెంట్ గా షూటింగ్ కూడా పూర్తిచేసుకుంది. లహరి మ్యూజిక్, టి-సిరీస్ లేబుల్స్ పై రిలీజైంది ఈ సాంగ్.