Pawan Kalyan to do a movie with Producer Koneru Satyanarayana

Wednesday,February 09,2022 - 08:40 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జెట్ స్పీడులో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. వకీల్ సాబ్ తర్వాత పవన్ హ్యాండ్ లో ఇప్పటికే నాలుగు సినిమలున్నాయి. ప్రస్తుతం సాగర్ కే చంద్ర డైరెక్షన్ లో 'భీమ్లా నాయక్', క్రిష్ దర్శకత్వంలో 'హరి హర వీర మల్లు' సినిమాలు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. త్వరలోనే హరీష్ శంకర్ తో 'భవదీయుడు భగత్ సింగ్' అనే సినిమా కూడా చేయబోతున్నాడు. అలాగే సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో SRT ఎంటర్టైన్ మెంట్స్ బేనర్ ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇవే కాదు సముద్ర ఖని దర్శకత్వంలో 'వినోదయ సిత్తం' అనే రీమేక్ కూడా డిస్కషన్ లో ఉంది.

ఇక తాజాగా పవన్ లిస్టులో ఇంకో సినిమా కూడా ఉందనే న్యూస్ బయటికొచ్చింది. ఖిలాడి సినిమా తీసిన కోనేరు సత్యనారాయణ బేనర్ లో పవన్ ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడనే టాక్ వినబడుతుంది. దీనిపై నిర్మాత సత్యనారాయణ కూడా క్లారిటీ ఇచ్చారు. ఖిలాడి ప్రమోషన్స్ లో భాగంగా పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ గురించి చెప్పారు. పవన్ కళ్యాణ్ గారిని ఇటివలే ఒకసారి కలిసి మాట్లాడానని , ఆయనతో మా బేనర్ లో సినిమా చేయాలనే ఆలోచన ఉందని దానికి ఆయన కూడా సానుకూలంగా ఉన్నారని కథ రెడీ అయితే ఆయన్ని కలిసి వినిపిస్తామని అన్నారు.

ఖిలాడి రిలీజ్ తర్వాత పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ పై డిస్కస్ చేయబోతున్నారని తెలుస్తుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే రమేష్ వర్మ పవన్ కళ్యాణ్ ను డైరెక్ట్ చేసే చాన్స్ ఉంది. ఇటివలే రమేష్ వర్మ కి కారుని గిఫ్ట్ గా ఇచ్చారు నిర్మాత. ఇప్పటికే ఈ బేనర్ లో ఆయన సినిమాలు డైరెక్ట్ చేశాడు. సో పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ కూడా నిర్మాత రమేష్ వర్మ చేతిలోనే పెట్టే చాన్స్ ఉంది. ఈ లోపు రమేష్ వర్మ పవర్ స్టార్ కోసం ఏదైనా కథ రెడీ చేస్తే ప్రాజెక్ట్ సెట్ అవ్వడం ఖాయం.