Megastar Chiranjeevi media interaction about God Father

Tuesday,October 04,2022 - 06:20 by Z_CLU

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ 'గాడ్ ఫాదర్' భారీ అంచనాల నడుమ రేపే గ్రాండ్ గా రిలీజవుతుంది. ఈ సందర్భంగా తన టీంతో కలిసి మీడియా ఇంటరాక్షన్ ఏర్పాటు చేశారు చిరంజీవి. ప్రెస్ మీట్ లో సినిమా గురించి చాలా విషయాలు పంచుకున్నారు చిరు. ఆ విశేషాలు మెగా స్టార్ మాటల్లోనే...

సోల్ కి కనెక్ట్ అవ్వగలగాలి 

ప్రతీ కథకు ఓ సోల్ ఉంటుంది. ఆ సోల్ తో మనం కనెక్ట్ అవ్వగలగాలి. మిగతా ఎలిమెంట్స్ కి కనెక్ట్ అవ్వకుండా ఆ కోర్ ఎలిమెంట్ ని నిశితంగా చూడగలిగితే కనుక సినిమా భవిష్యత్తు ఏంటో దాదాపుగా  చెప్పేయొచ్చు. అలా కనెక్ట్ అయినందు వల్లే ఈ సినిమాను కొత్త సినిమాగా భావించి కొత్త క్యారెక్టరైజేషన్ తో చేయగలిగాను.

ప్లాన్ చేసుకోలేదు

ఈ సినిమాకు నన్ను అభిమానించే చాలా మంది వర్క్ చేశారు. అయితే ఇది అనుకొని ప్లాన్ చేసింది కాదు. మోహన్ రాజా కానీ సత్య దేవ్ కానీ లక్ష్మి భూపాల్ ఇలా ఎవరితో కచ్చితంగా చేయాలని ప్లాన్ చేసింది లేదు. అన్ని అలా కుదిరిరాయి అంతే. అదే మొదటి సక్సెస్ గా నేను ఫీలవుతున్నాను.

ఆ ఆలోచన లేదు 

ఈ సినిమా మాతృక లూసిఫర్ లో ఉన్న పొలిటికల్ కథే గాడ్ ఫాదర్ లో కూడా చూపించాం. అంతే కానీ ఇక్కడ రాజకీయంగా సెటైర్స్ వేయాలనే ఆలోచన లేదు. లూసిఫర్ సినిమాలో ఉండే పోలిటిక్స్ సన్నివేశాలను మన తెలుగు నెగటివిటీకి తగ్గట్టుగా మార్చుకొని పెట్టడం జరిగింది. కొన్ని సన్నివేశాలు దర్శకుడు రాజా , లక్ష్మి భూపాల్ కలిసి మాట్లాడుకొని ఇలా చెప్తే బాగుంటుందని పెట్టారు తప్ప అందులో నా ప్రమేయం అస్సలు లేదు. కథలో నుంచి వచ్చిన మాటలే తప్ప ఎవరినీ ఉద్దేశించి చెప్పినవి కాదు.

ఆ రెండు మిక్స్ అయిన కథ ఇది 

బేసిక్ గా పొలిటికల్ డ్రామాలు చూస్తాం , అలాగే ఫ్యామిలీ డ్రామాలు వస్తుంటాయి. కానీ ఇటు పొలిటికల్ అటు ఫ్యామిలీ రెండూ డ్రామాలు కలిసి మిక్సయిన కథ ఇది. ఇలాంటి కథలు రేర్ గా వస్తుంటాయి. అది బాగా నచ్చి ఆసక్తిగా అనిపించి ఈ సినిమా చేశాను.

పండుగకి భోజనాలకు వస్తున్నాం 

దసరా పండుగకి నేను నాగ్ ఇద్దరం కలిసి ప్రేక్షకుల దగ్గరికి భోజనంకి వెళ్ళినట్టుగా ఫీలవుతాను. రేపు ప్రేక్షకులు మంచి భోజనం పెడతారు , అది ఆశ్వాదిస్తామని అనుకుంటున్నాను.

తన కెరీర్ కి నష్టమేముండదు 

 సత్య దేవ్ హీరోగా చేసిన కొన్ని సినిమాలు చూసి ఇతనెవరో బాగా నటిస్తున్నాడని అనుకున్నా. కానీ మన తెలుగు నటుడని తెలియదు ఎవరో కన్నడ యాక్టర్ అయి ఉంటాడులే అనుకునే వాడిని. కానీ తను తెలుగు నటుడని తెలిశాక పిలిపించి ఈ కథ చెప్పాను. ఆ కథ చెప్తుంటే ఎలాంటి ఎక్స్ ప్రెషన్ లేకుండా అలాగే నన్ను చూస్తూ ఉండిపోయాడు. బహుశా హీరోగా సినిమాలు చేస్తున్నాను విలన్ కేరెక్టర్ చేయమని అడుగుతారా ? ఈయనకి ఎలా నో చెప్పాలి అనుకుంటున్నాడేమో అనుకున్నా. కానీ తను చేస్తే బాగుంటుంది తన కెరీర్ కి హెల్ప్ అవుతుందే తప్ప నష్టమేముండదు అని భావించాను. తను ఒప్పుకోవడం, చేయడం గొప్ప విషయం. ఆఫ్ ది కెమెరా చాలా సైలెంట్ గా ఉంటాడు కానీ కెమెరా ముందు మాత్రం విజృంభించేవాడు.  ఇండియన్ యాక్టర్ గా సత్య దేవ్ ఎదుగుతాడు. 

మలయాళంలో నో రిలీజ్ 

ఈ సినిమాను మలయాళంలో రిలీజ్ చేయడం లేదు. ఎవరో అభిమాని ప్యాన్ మెడ్ పోస్టర్ చేసి పెడితే నేను కూడా కన్ఫ్యూజ్ అయి నిర్మాతలను అడిగాను. అక్కడ రిలీజ్ చేయడం లేదు. తెలుగులో రిలీజయ్యాక రెండో వారం లేదా మూడో వారంలో తమిళ్ లో రిలీజ్ ఉంటుంది. హిందీలో రేపే రిలీజ్ కానుంది.