Karuna Kumar’s ‘Kalapuram’ Movie Review

Friday,August 26,2022 - 03:05 by Z_CLU

నటీ నటులు : సత్యం రాజేష్ , సంచిత పూనాచ, కాశిమ, చిత్రం శ్రీను, 'పలాస' జనార్థన్  తదితరులు

సంగీతం : మణిశర్మ

కెమెరా : ప్రసాద్ జీకే

నిర్మాణం : జీ స్టూడియోస్ , R4 Entertainments

రచన – దర్శకత్వం : కరుణ కుమార్

నిడివి : 127 నిమిషాలు

విడుదల తేది : 26 ఆగస్ట్ 2022

'పలాస 1978', 'శ్రీదేవి సోడా సెంటర్' సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు అందుకున్న కరుణ కుమార్ 'కళాపురం' అనే సినిమాతో  ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సినిమా నేపథ్యంతో  జీ స్టూడియోస్ , R4 Entertainments బేనర్స్ పై తెరకెక్కించిన ఈ సినిమా ఆకట్టుకుందా ? జీ సినిమాలు రివ్యూ.

కథేంటి ?

రాజేష్ కుమార్ (సత్యం రాజేష్) ఓ స్ట్రగ్లింగ్ డైరెక్టర్ . ఎప్పటికైనా డైరెక్టర్ అవ్వలనుకుంటూ ఎన్నో ప్రయత్నాలు చేస్తూ విఫలమవుతుంటాడు. చాలా మంది నిర్మాతలకు కథలు చెప్తుంటాడు కానీ ప్రాజెక్ట్ సెట్టవ్వదు. అదే సమయంలో కుమార్ దగ్గర డబ్బు లేదని, ఫ్యూచర్ లో డైరెక్టర్ అవ్వలేడనే భావనతో అతను ఎంతగానో ప్రేమించిన ఇందు(కాషిమ రఫీ) బ్రేకప్ చెప్పేసి దూరమవుతుంది.  ఈ క్రమంలో తిరిగి ఊరికి వెళ్లిపోదామని నిర్ణయం తీసుకున్న కుమార్ కి అప్పారావు(జనార్ధన్) డైరెక్షన్ చాన్స్ ఇచ్చి అడ్వాన్స్ చేతిలో పెడతాడు. కాకపోతే తన ఊరు కళాపురంలో షూటింగ్ జరపాలని కోరతాడు.

అలా నిర్మాత కోరిక మేరకు షూటింగ్ చేసేందుకు తన మిత్రుడితో కలిసి కళాపురంలో అడుగుపెట్టిన కుమార్ కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అనుకోకుండా పోలీసులకు పట్టుబడి అదే ఊరిలో నెల రోజులు ఉండాల్సి వస్తుంది. అసలు కుమార్ ని పోలీసులు ఎందుకు పట్టుకున్నారు ?  ఫైనల్ గా తను తీయాలనుకున్న సినిమా తీయగలిగాడా ? లేదా ? అనేది మిగతా కథ.

ఎవరెలా చేశారు ?

సత్యం రాజేష్ కుమార్ పాత్రలో ఒదిగిపోయాడు. సీరియస్ రోల్ లో కనిపిస్తూ ఓ స్ట్రగ్లింగ్ డైరెక్టర్ గా మెప్పించాడు. డబ్బింగ్ ఆర్టిస్ట్ కం హీరోగా ప్రవీణ్ తన నటనతో ఆకట్టుకున్నాడు. శారద పాత్రలో సంచిత పూనాచ హీరోయిన్ గా మెప్పించింది. మరో హీరోయిన్ గా కాశిమా రఫీ పరవాలేదనిపించుకుంది.మ్యూజిక్ డైరెక్టర్ రోల్ లో చిత్రం శ్రీను , పొలిటిషియన్ గా ప్రదీప్ రుద్ర, అప్పారావు పాత్రలో జనార్ధన్, ముఖ్య మంత్రి పాత్రలో సనా తమ పాత్రలకు న్యాయం చేశారు. మిగతా నటీ నటులంతా తమ నటనతో ఆకట్టుకున్నారు.

మణిశర్మ  సంగీతం కథకు తగ్గట్టుగా ఉంది. కెమెరా వర్క్ బాగుంది. రాజు తలారి ఎడిటింగ్ పరవాలేదు. మిగతా టెక్నిషియన్స్ సినిమాకు తమ వర్క్ తో హెల్ప్ అయ్యారు. దర్శకుడు కరుణ కుమార్ రైటర్ గా దర్శకుడిగా మంచి మార్కులు అందుకున్నాడు.   ప్రొడక్షన్ వేల్యూస్ కథకు తగ్గట్టుగా ఉన్నాయి.

జీ సినిమాలు సమీక్ష :

సినిమా నేపథ్యంతో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయి. తేజ తీసిన 'ఒక వీ చిత్రం' సినిమాలో బడ్జెట్ లేకుండా ఆ హీరోకి తెలియకుండా ఓ కుర్రాడు సినిమా డైరెక్ట్ చేయడం చూపించారు. ఆ తర్వాత పూరి 'నేనింతే' తాజాగా 'సినిమా బండి' ఇలా కొన్ని సినిమాలొచ్చాయి. అయితే కళాపురంలో కూడా అదే కథ కనిపిస్తుంది. దర్శకుడిగా ఓ సినిమా తీసేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తూ ఇబ్బందులు పడే ఓ కుర్రాడు, నిర్మాతగా మారి తన ఊళ్ళో పేరు సంపాదించుకోవాలని చూసే ఓ పెద్దాయన , డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఉంటూ హీరో అవ్వాలనే కోరిక ఉన్న కుర్రాడు , సినిమాల్లో నటి అవ్వాలనుకునే వ్యక్తి , ఆర్కెస్ట్రా నడుపుతూ సినిమా మీద ఆసక్తితో ఎప్పటికైనా సంగీత దర్శకుడవ్వాలని చూసే మ్యూజిషియన్ ఇలా అందరి పాత్రలను కలిపి కళాపురం అనే ఊళ్ళో జరిగే కథతో ఈ సినిమాను తీశాడు దర్శకుడు.

అయితే సినిమా ఆరంభం నుండి చివరి వరకూ చాలా నేచురల్ గా , రియలిస్టిక్ గా తెరకెక్కించాడు కరుణ కుమార్. అలాగే పాత్రలకు తగిన నటీ నటులను ఎంపిక చేసుకొని ఆ పాత్రల ద్వారా మెప్పించాడు. అప్పారావు , శిఖామణి పాత్రల ద్వారా మంచి హాస్యం వడ్డించి నవ్వించాడు. కుమార్ అతని ఫ్రెండ్ తో కళాపురం వెళ్ళగానే అక్కడ ఎదురయ్యే ఇబ్బందులతో వచ్చే సన్నివేశాలు బాగున్నాయి. అలాగే పటాస్ ఫైమాను రైటర్ గా చూపిస్తూ వచ్చే సన్నివేశం బాగా నవ్విస్తుంది. ఆమె పాటకు రాసే సాహిత్యంతో మంచి కామెడీ క్రియేట్ చేశాడు దర్శకుడు. అలాగే సినిమా తీసేందుకు ఇబ్బంది పడే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. కాకపోతే ప్రీ క్లైమాక్స్ కి ముందు వచ్చే సన్నివేశాలు పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు. సినిమాను కామెడీ డ్రామాగా నడుపుతూ కాస్త పొలిటికల్ టచ్ ఇచ్చిన దర్శకుడు క్లైమాక్స్ లో ఎవరూ ఊహించని ఓ ట్విస్ట్ పెట్టి థ్రిల్ చేశారు. ఒక్క క్లైమాక్స్ తో సినిమాను పొలిటికల్ డ్రామాగా మార్చేశాడు. ఆ ఎలిమెంట్ ని వాడుకొని ఈ స్క్రిప్ట్ రాసుకోవడం దర్శకుడ్ని మెచ్చుకోదగిన విషయం. ఫైనల్ గా పొలిటికల్ టచ్ తో సినిమా నేపథ్యంతో తెరకెక్కిన 'కళాపురం' ప్రేక్షకులను అలరిస్తూ ఆకట్టుకుంటుంది.