Kannada Power Star Punith Rajkumar is no more !

Friday,October 29,2021 - 03:59 by Z_CLU

శాండల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్(46) ఇవాళ కన్నుమూశారు. ఉదయం పదిగంటల సమయంలో జిమ్ లో వర్కౌట్స్ చేస్తుండగా ఛాతిలో నొప్పి రావడంతో హఠాత్తుగా కిందపడిపోయారు.వెంటనే కుటుంబ సభ్యులు పునీత్ రాజ్ కుమార్ ని బెంగుళూరులో ఉన్న విక్రమ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే  పునీత్ ఆరోగ్యం  విషమించడంతో చివరికి కన్నుమూశారు. దీంతో హాస్పిటల్ వద్ద భారీగా ఫ్యాన్స్ చేరుకొని పునీత్ మరణ వార్తను జీర్ణించుకోలేకపోతూ చివరి చూపు కోసం ఎదురుచూస్తున్నారు.

కన్నడ ఇలవేల్పుగా కొలుచుకునే స్వర్గీయ రాజ్ కుమార్ చివరి సంతానం పునీత్ రాజ్ కుమార్. చాలా చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా తెరంగేట్రం చేసిన పునీత్ మొదటిసారి 'లోహిత్' పేరుతో తెరమీద కనిపించాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన 'బెట్టాడు హూవు' అనే సినిమాతో  బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నేషనల్ అవార్డు అందుకున్నాడు.

పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన 'అప్పు' అనే సినిమా ద్వారా 2002 లో పునీత్ హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. డెబ్యూతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఆ తర్వాత చాలా సినిమాల్లో హీరోగా నటించి కన్నడ పవర్ స్టార్ గా ఎదిగాడు పునీత్. ఇటీవలే పునీత్ రాజ్ కుమార్ నటించిన కన్నడ సినిమాలు తెలుగులోనూ విడుదలై ఇక్కడ కూడా మంచి ఓపెనింగ్స్ తెచ్చుకున్నాయి. ప్రస్తుతం కన్నడ చిత్ర పరిశ్రమ పునీత్ మరణవార్తతో తీవ్ర విషాదంలో ఉంది. పునీత్ లేని లోటు తీరలేదని కన్నడ స్టార్స్ సోషల్ మీడియా ద్వారా తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ తో కూడా పునీత్ కి మంచి అనుబంధం ఉంది. ఎన్టీఆర్ తో ఎక్కువ సన్నిహితంగా ఉంటాడు పునీత్. కన్నడ ఏ తెలుగు సినిమా రిలీజ్ ప్రమోషన్ జరిగినా గెస్ట్ గా హాజరై ఆ సినిమాను సపోర్ట్ చేస్తుంటాడు. ఇప్పుడు పునీత్ మరణవార్తతో టాలీవుడ్ స్టార్స్ కూడా ఆ మూమెంట్స్ గుర్తుచేసుకుంటూ అతని ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics