Friendship Day Special Story on SV Krishna Reddy Atchi Reddy

Sunday,August 01,2021 - 08:25 by Z_CLU

"కొంత కాలం కిందట బ్రహ్మ దేవుడి ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం.. రూపు రేకలు వేరట ఊపిరొకటే చాలట ఆ వరాన్నే స్నేహం అంటున్నాం మనం "... అంటూ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన సాహిత్యానికి రూపం వీరిద్దరు. తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీసి ప్రేక్షకులను అలరించి 'ఇద్దరు మిత్రులు' అనే ట్యాగ్ తో కొనసాగుతున్న ఆ ఇద్దరే ఎస్.వి. కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి. దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి పేరు వినగానే మనకి టక్కువ గుర్తొచ్చే మరో అచ్చిరెడ్డి. అలాగే నిర్మాత అచ్చిరెడ్డి అనగానే మన మైండ్ లో మెదిలే పేరు కృష్ణా రెడ్డి. ముప్పై ఏళ్లుగా సినీ ప్రయాణం చేస్తూ స్నేహానికి గొప్ప అర్థం చెప్పిన వీరిద్దరిపై ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా 'జీ స్పెషల్' స్టోరీ

ఎస్ వి కృష్ణా రెడ్డి , అచ్చిరెడ్డి ఇద్దరు బాల్య మిత్రులు ఆరవిల్లి (పశ్చిమ గోదావరి) లో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. చిన్నతనం నుండే ఒకరంటే ఒకరు ఎంతో ఇష్టంగా కలిసుండేవారు. చిన్నతనం నుంచే కృష్ణారెడ్డి కి సినిమాలంటే వల్లమాలిన అభిమానం. ఆ సినిమా పిచ్చి చూసి అచ్చిరెడ్డితో పాటు మిగతా మిత్రులు కూడా కృష్ణారెడ్డిని మరింతగా అభిమానించేవారు. అయితే స్కూల్ డేస్ తర్వాత ఇద్దరు వేర్వేరు కాలేజీలో చదువుకున్నారు. కాలేజీలు వేరైనా, నివసించే ప్రాంతం ఏదైనా ఇద్దరూ ఫోన్ లో టచ్ లో ఉండేవారు. కృష్ణారెడ్డి MCom పూర్తిచేసాక సినిమాల మీద ఇష్టంతో చెన్నై వెళ్ళిపోయారు. అచ్చిరెడ్డి ఏవో వ్యాపారాలు చేస్తూ హైదరాబాద్ లో సెటిలయ్యారు. ఈ లోపు కృష్ణా రెడ్డి చెన్నైలో ఉంటూ నటుడిగా 'పగడాల పడవ', 'కిరాతకుడు' సినిమాల్లో నటించారు. ఆ సినిమాలు ఆయనకి పేరు తెచ్చిపెట్టలేదు.

దాంతో కొన్ని రోజులకి కృష్ణారెడ్డి హైదరాబాద్ రావడం మిత్రుడు అచ్చిరెడ్డిని కలవడం జరిగింది. ఇద్దరు కలిసి ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా వ్యాపార రంగంలోకి దిగారు. ఏవో చిరు వ్యాపారాలు చేసారు. కానీ ఎందులోనూ కృష్ణా రెడ్డి సంతృప్తి చెందలేదు. అది అచ్చిరెడ్డి గమనిస్తూనే ఉన్నారు. మిత్రుడి మనసంతా సినిమా చుట్టూనే తిరుగుతుందని అర్థం చేసుకున్నారు. చిన్నతనం నుంచి కృష్ణా రెడ్డిలో ఉన్న ప్రతిభ సినిమా రూపంలో అద్భుతం సృష్టిస్తుందని నమ్మిన ఏకైక వ్యక్తి అచ్చిరెడ్డి. అందుకే మనం ఈ వ్యాపారాలన్ని మానేసి సినిమాతో సంబంధం ఉండే ఏదైనా వ్యాపారం చేద్దామని కృష్ణారెడ్డితో అన్నారు అచ్చిరెడ్డి. సినిమా అనే పదం మళ్ళీ వినగానే కృష్ణా రెడ్డి మనసులో ఏవేవో ఆశలు, ఆలోచనలు మొదలయ్యాయి. ఇద్దరూ సినిమా రిలేటెడ్ బిజినెస్ చేయాలని నిర్ణయించుకొని ముందుగా దూరదర్శన్ కి సినిమాల శాటిలైట్ రైట్స్ అమ్మే వ్యాపారం మొదలు పెట్టారు. నిర్మాతల దగ్గర నుండి సినిమాలు కొనడం దూరదర్శన్ కి అమ్మడం చేస్తుండే వారు. అలా ఇద్దరు మొదలు పెట్టిన తొలి ప్రయాణం దిగ్విజయంగా సాగింది. ఆ తర్వాత 'సర్వర్ సుందరం' అనే డబ్బింగ్ సినిమాకు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేసే బాధ్యతను భూజలపై వేసుకున్నారిద్దరు. ఆ సమయంలో సినిమాకు సంబంధించి సాంకేతిక పరంగా కృష్ణా రెడ్డికి ఉన్న అవగాహన, డెడికేషన్ చూసి ఆశ్చర్యపోయారు అచ్చిరెడ్డి. తర్వాత ఇద్దరు కిషోర్ రాఠీతో కలిసి వీడియో క్యాసెట్ల వ్యాపారం చేసారు. తర్వాత ఇతర భాషలో హిట్టయిన సినిమాల తెలుగు రైట్స్ కొనుగోలు చేసి రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఇద్దరు కలిసి డబ్బింగ్ సినిమాల రిలీజ్ వ్యాపారం గురించి మాట్లాడుకోవడం, వెంటనే రంగంలో దిగడం జరిగింది.

1989 లో మమ్ముట్టి హీరోగా నటించిన మళయాళ సినిమా 'అయ్యర్ ది గ్రేట్' ను తెలుగులో 'సూర్య ది గ్రేట్' పేరుతో డబ్బింగ్ చేసి నిర్మాతలుగా మారారు. అక్కడి నుండి నిర్మాతలుగా సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టారు. ఆ తర్వాత మమ్ముట్టి నటించిన మరో సినిమాను 'దార్యప్తు' అనే టైటిల్ తో తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేసారు. అలా మళయాళం నుండి తెచ్చిన రెండు సినిమాలు వీరిద్దరికి మంచి లాభాలు తెచ్చిపెట్టాయి. ఆ వచ్చిన డబ్బుతో తెలుగులో ఓ స్ట్రైట్ సినిమా నిర్మించాలని డిసైడ్ అయ్యారు. మనిషా ఫిలిమ్స్ బ్యానర్ స్థాపించి కిషోర్ రాఠీతో కలిసి సినిమాలు తీయాలని నిర్ణయించుకున్నారు. ఆ బ్యానర్ లో మొదటి సినిమా కోసం కృష్ణారెడ్డి 'కొబ్బరి కొండం' టైటిల్ తో డిఫరెంట్ క్యారెకక్టరైజేషన్ తో రాసుకున్న కథను దర్శకుడు రవితేజ కాట్రగడ్డ చేతిలో పెట్టారు. హీరో రాజేంద్ర ప్రసాద్ కి కథ చెప్పడం ఆయనకి బాగా నచ్చడంతో సినిమా సెట్ అయ్యింది. అయితే సినిమాకు మ్యూజిక్ బాధ్యత ఎవరికి అప్పగిస్తే బాగుంటుంది అంటూ కొందరు సంగీత దర్శకుల పేర్లు చెప్పి కృష్ణారెడ్డి ఆలోచిస్తుండగా సంగీతంలో అనుభవం ఉంది కాబట్టి అది కూడా నువ్వే చేసేయ్ అంటూ అచ్చిరెడ్డితో పాటు టీం అందరూ ప్రోత్సహించారు. ఆ సినిమాకు ఒక నిర్మాతగానే కాకుండా కథ , స్క్రీన్ ప్లే , సంగీతం కూడా అందించాడు ఎస్.వి. ఆ సినిమా ద్వారా స్ట్రైట్ తెలుగు నిర్మాతలుగా మారిన ఇద్దరు తొలి సినిమాతోనే మంచి బోణి కొట్టి సక్సెస్ అందుకొన్నారు. తర్వాత అదే బ్యానర్ లో 'రాజేంద్రుడు గజేంద్రుడు' తో దర్శకుడిగా ప్రయాణం మొదలు పెట్టారు ఎస్.వి.కృష్ణా రెడ్డి. అక్కడి నుండి కృష్ణా రెడ్డి , అచ్చి రెడ్డి ప్రయాణం ఎంతో వైభవంగా సాగింది. హిట్ల మీద హిట్లతో వరుస విజయాలు అందుకొని అందరి చూపు ఆకట్టుకొని సక్సెస్ ఫుల్ కెరీర్ తో దూసుకెళ్ళారు. ఒక టైంలో సక్సెస్ కి కేరాఫ్ అడ్రస్ గా వీరి పేర్లు వినిపించేవి. ఏ మాటకామాటే ఎస్.వి.కృష్ణా రెడ్డి గారిలో ఉన్న ప్రతిభ, తపన గుర్తించి సినిమా పరిశ్రమ వైపు మళ్ళీ అడుగులు వేయడానికి ప్రోత్సహించి ఆయనకి వెన్నుదన్నుగా నిలిచిన అచ్చిరెడ్డి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. తన టాలెంట్ నిరూపించుకునే క్రమంలో ప్రోత్సహించడానికి అండగా నిలబడే ఇలాంటి మిత్రుడు ఒక్కరుంటే చాలు ఏదైనా సాధించొచ్చని కృష్ణా రెడ్డి నిరూపించారు.

ఈ ఇద్దరి కాంబినేషన్ లో దాదాపు పన్నెండు సినిమాలొచ్చాయి. చిన్నతనం నుండి ఇప్పటి వరకూ అంటే యాబై ఏళ్లుగా వీరిద్దరూ స్నేహితులుగా అంతే ప్రేమతో మెలుగుతూ, వెలుగుతూ కెరీర్ ని కొనసాగిస్తున్నారు. ఇంత కాలం సాన్నిహిత్యంగా మిత్రులుగా కొనసాగడం అంటే ఆషామాషీ కాదు. ఏ ఇద్దరు స్నేహితులు కలిసి వ్యాపారం చేసినా గొడవలు రావడం సహజం. దానికి లోకంలో ఎన్నో ఉదాహరణలున్నాయి. కానీ ఇన్నేళ్ళుగా సినిమాతో వ్యాపారం చేస్తూ కూడా అంతే ప్రేమగా అదే ఆప్యాయతతో కలిసుండటం ఈ ఇద్దరికే చెందింది. చిన్నతనం నుండి ఇప్పటి వరకు అంతే స్నేహంగా కలిసి ఉండటానికి కారణం ఏమిటని ఇద్దరిలో ఏ ఒక్కరిని అడిగినా... "స్నేహంలో ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండాలి తప్ప కోపాలు టపాలు ఉండకూడదు. ఒకరికి ఒకరు ఏం చేయాలనే ఆలోచన మాత్రం ఉండాలి. అవి ఉంటే చాలు స్నేహం ఎప్పటికి చెదిరిపోని సంతకంలా చిరస్థాయిగా ఉంటుందని" అంటుంటారు. అదీ వారిద్దరి బాండింగ్ ఎప్పటికీ చెక్కు చెదరకుండా ఉండటానికి రీజన్.

ఎస్.వి.కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డిలు ఎన్నాళ్లయినా ఇలాగే స్నేహంగా మెలుగుతూ ఫ్రెండ్ షిప్ అనే షిప్ లో సాఫీగా ప్రయాణం చేస్తూ ఇంకా ఎన్నో విజయాలు అందుకోవాలని ఆశిస్తూ వారిద్దరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తుంది జీ సినిమాలు.

-రాజేష్ మన్నె