Director Sagar Passes Away

Thursday,February 02,2023 - 12:58 by Z_CLU

ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు సాగర్ కన్నుమూశారు. ఆయన పూర్తి పేరు విద్యా సాగర్ రెడ్డి. వయసు 70. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న సాగర్.. చెన్నైలోని తన నివాసంలో ఈరోజు పొద్దున్న తుదిశ్వాస విడిచారు.

1983లో నరేష్, విజయశాంతి ప్రధాన పాత్రల్లో నటించిన 'రాకాసి లోయ' సినిమాతో దర్శకుడిగా తన సినీ జీవితాన్ని ప్రారంభించారు సాగర్. ఆ తర్వాత 'అమ్మ దొంగ', 'ఖైదీ బ్రదర్స్', 'స్టువర్ట్‌పురం దొంగలు', 'రామ సక్కనోడు', 'యాక్షన్ నెం.1', 'అన్వేషణ'.. వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు.

శ్రీను వైట్ల, వి.వి.వినాయక్, రవి కుమార్ చౌదరి, జి. నాగేశ్వర రెడ్డి వంటి అనేక మంది దర్శకులు ఒకప్పుడు సాగర్ శిష్యులు.

1952లో గుంటూరులో జన్మించారు సాగర్. 1983లో దర్శకుడిగా మారడానికి ముందు అనేక తెలుగు సినిమాలకు ఫిల్మ్ ఎడిటర్‌గా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా వివిధ హోదాల్లో పనిచేశారు. సాగర్ దర్శకత్వంలో 1991లో వచ్చిన 'స్టువర్ట్‌పురం దొంగలు' సినిమా మంచి ప్రజాదరణ పొందింది.

దర్శకుడిగానే కాకుండా, ఇండస్ట్రీలో కీలక పాత్ర పోషించారు సాగర్. తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడిగా 3సార్లు సేవలందించారు.