Director Radha Krishna Interview about ‘Radheshyam’

Monday,December 13,2021 - 07:54 by Z_CLU

గోపీచంద్ హీరోగా తెరకెక్కిన 'జిల్' సినిమాతో టాలీవుడ్ కి డైరెక్టర్ గా పరిచయమైన రాధా కృష్ణ ఇప్పుడు ప్రభాస్ తో తన రెండో సినిమా తీసి వచ్చే సంక్రాంతి కి 'రాధే శ్యామ్' సినిమాతో రాబోతున్నాడు. ఈ సందర్భంగా దర్శకుడు రాధా కృష్ణ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు తన మాటల్లోనే.

ప్రభాస్ కి కథ బాగా నచ్చింది 

'జిల్' సినిమా కథ చెప్పడానికి ప్రభాస్ గారి దగ్గరికి వెళ్లాను. కథ విన్నాక ఆయన చాలా బాగుంది డార్లింగ్ అన్నారు. ఆ తర్వాత 'రాధే శ్యామ్' పాయింట్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. అదే టైంలో ప్రభాస్ గారు కూడా ఓ లవ్ స్టోరీ చేయాలనుకున్నారు. సో ప్రభాస్ గారిని దృష్టిలో పెట్టుకునే ఎలాగైనా ఇంప్రెస్ చేయాలని రెడీ చేసిన కథ ఇది. వంశీ గారు, ప్రమోద్ గారు విన్నాక ప్రభాస్ దగ్గరికి తీసుకెళ్ళారు. కథ విన్న వెంటనే ప్రభాస్  బాగుంది... చేస్తున్నాం డార్లింగ్ అని చెప్పేశారు.

జీవితానికి , మరణానికి మధ్యలో జరిగే పార్టీ 

ప్రభాస్ గారితో ఎలాంటి సినిమా అయినా చేయొచ్చు. ఆయన చాలా షేడ్స్ ఉన్న యాక్టర్. ఏ కథకయినా పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతారు. రాధే శ్యామ్ ఇంటెన్స్ తో కూడిన ఓ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. జీవితానికి , మరణానికి మధ్యలో ఓ పార్టీ జరిగితే ఎలా ఉంటుందో సినిమా సరిగ్గా అలా ఉంటుంది. చాలా మంది జాతకాలు నమ్ముతారు. కానీ నిజమా కదా అనే విషయంలో ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వారిది. అలా జాతకాల మీద స్టోరీ రాసి అందులో లవ్ స్టోరీ ఇంక్లూడ్ చేస్తే ఎలా ఉంటుందనే బేసిక్ ఐడియా నుండి పుట్టిన కథ ఇది. ఈ కథతో దాదాపు 15 ఏళ్ల ప్రయాణం ఉంది.

అందుకే ఆలస్యం 

ఈ సినిమాను 'సాహో' తో పాటే మొదలు పెట్టాం. కానీ 'సాహో' పోను పోను చాలా పెద్ద  సినిమాగా మారింది. ఒకే ప్రొడక్షన్ హౌజ్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో రాధే శ్యామ్ కి గ్యాప్ తీసుకున్నాం. ఆ తర్వాత కోవిడ్ పాండమిక్ వచ్చింది. సరిగ్గా కోవిడ్ ఫస్ట్ వేవ్ టైం కి ఇటలీలో ఉన్నాం. ఇండియా రావడానికి చాలా ఇబ్బంది పడ్డాం. ఫ్లైట్స్ క్యాన్సెల్ అవ్వడంతో వేరే కంట్రీకి వెళ్లి అక్కడి నుండి ఫ్లైట్స్ ఎక్కి వచ్చాం. ఆ టైంలో చాలా భయమేసింది. ఆ పరిస్థితిలో అబ్రోడ్ లో షూట్ అంటే ఎంత కష్టమో తెలిసిందే. కొన్ని నెలలకి ఫస్ట్ వేవ్ తర్వాత వెళ్లి షూట్ చేస్తున్నాం. మళ్ళీ సెకండ్ వేవ్ ఎంటరయింది. ఆ టైంలో నాకు మా కెమెరా మెన్ మనోజ్ పరమహంస గారికి కోవిడ్ వచ్చింది. ఇద్దరం ఎఫెక్ట్ అయ్యాం. దాంతో ఏడెనిమిది రోజులు షూట్ ఆపేశాం. దాని వల్ల షూట్ పోస్ట్ అవుతూ వచ్చింది.

బిగినింగ్ నుండే గ్రాండ్ ఫిలిం 

ఐడియా నుండే ఇది గ్రాండ్ ఫిలిం అవుతుంది. చాలా ఖర్చుతో కూడిన సినిమా అని ఊహించాం. ప్రభాస్ గారు అనేసరికి ఆ బడ్జెట్ ఇంకా ఎక్కువ అయింది. నిజానికి నేను యూరప్ బ్యాక్డ్రాప్ అనుకోలేదు. కానీ ఆయన డార్లింగ్ ఇప్పటి వరకూ ఎవరూ వింటేజ్ యూరప్ ని చూపిస్తూ లవ్ స్టోరీ చేయలేదు. ఒకసారి ఆలోచించు అన్నారు. ఆ ఐడియా వినగానే నాకు ఎగ్జైటింగ్ గా అనిపించింది. ఇక మా నిర్మాతలు కూడా ఒకే అనేసి అంతా అరేంజ్ చేశారు.

అది మాకు అతి పెద్ద ఛాలెంజింగ్ 

పీరియాడిక్ ఫిలిం అంటే ఒకప్పటి లొకేషన్ తో పాటు అప్పటి వస్తువులు, కార్లు అన్నీ చూపించాల్సి వస్తుంది. ఆస్ట్రియా, ఇటలీ , జార్జియా  ఇలా మూడు కంట్రీస్ లో షూట్ చేశాం. లక్కీగా అక్కడ మాకు కలిసొచ్చింది ఏమిటంటే ఆల్మోస్ట్ అక్కడ ఇప్పుడు అప్పడు ఒకేలా ఉంటుంది. సో మేము పెద్దగా కష్టపడలేదు. కానీ  ఒక సాంగ్ లీడ్ కోసం బ్రిడ్జ్ సీక్వెన్స్ చేశాం. ఒక రెండొందల కార్లు , బస్సులు పెట్టి గ్రాండ్ గా పిక్చరైజ్ చేశాం. ఆ ఎపిసోడ్ మాత్రం మాకు అతిపెద్ద ఛాలెంజింగ్ అనిపించింది. అక్కడ పార్కింగ్ పర్మీషణ్స్ కోసమే చాలా టైం పట్టేసేది. కొన్ని రోజుల ముందే అక్కడ పార్కింగ్ లో వెహికిల్స్ తొలగించాలని రిక్వెస్ట్ చేసి అంతా ఎడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది.

'రాధే శ్యామ్' న్యూ ఎక్స్ పీరియన్స్ 

సినిమా ఆలస్యం అవుతూ వచ్చినప్పటికీ రాబోయే సర్ ప్రయిజ్ లు చూస్తే ఫ్యాన్స్ చాలా హ్యాపీ గా ఫీలవుతారు. చాలా సర్ప్రయిజ్ లు రాబోతున్నాయి. ట్రైలర్ కానీ మిగతావి వచ్చినప్పుడు కచ్చితంగా ఒక కొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ఓవరాల్ గా సినిమా థియేటర్స్ లో చూస్తుంటే ఓ కొత్త అనుభూతి కలగడం ఖాయం.

- Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics