Chiranjeevi’s Tagore Completed 17 Years

Thursday,September 24,2020 - 04:24 by Z_CLU

మెగాస్టార్ మాస్ బొమ్మ రిలీజైతే చాలు అభిమానులు థియేటర్స్ కి క్యూ కట్టడం సహజమే. అలాంటిది ఆయన సందేశంతో కూడిన ఓ యాక్షన్ సినిమా చేస్తే రికార్డులు బద్దలవుతాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులో ఎలాంటి సందేహం లేదని నిరూపించిన సినిమానే 'ఠాగూర్'. "నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను" అంటూ లంచగొండితనంపై ఉక్కుపాదం మోపిన మెగాస్టార్ బొమ్మ వచ్చి నేటికి పదిహేడేళ్లవుతుంది. ఈ సందర్భంగా సెన్సేషనల్ హిట్ సాధించిన ఆ సినిమాపై జీ సినిమాలు స్పెషల్ స్టోరి.

ఓ పవర్ ఫుల్ సందేశాన్ని స్క్రీన్ పై స్టార్ హీరో చెప్తే క్లాప్స్ కొడుతూ అబ్బా ఏం చెప్పాడు.... ఈ సినిమా చూసాకయినా ఇలాంటి అన్యాయాలు చేసే వారు మారితే సమాజం బాగుపడుద్ది అనుకుంటుంటాం. సరిగ్గా మెగస్టార్ 'ఠాగూర్' సినిమాతో చెప్పిన సందేశానికి అలాంటి రెస్పాన్సే దక్కింది. సిల్వర్ స్క్రీన్ పై లంచగొండితనంపై మెగాస్టార్ రియాక్ట్ అయిన విధానానికి ప్రేక్షలోకం దాసోహమయింది. క్లైమాక్స్ లో కోర్టు సన్నివేశంలో లంచం..లంచం..లంచం అంటూ చిరంజీవి చెప్పిన మెగా డైలాగ్ కి క్లాప్స్ కొట్టని వారు లేరు. అవును కొందరైతే ఆ సన్నివేశానికి కూర్చున్న సీటులోంచి లేచి నిలబడి అబ్బా ఏం చెప్పవన్నయ్యా సూపర్ అంటూ విజిల్స్ వేస్తూ మురిసిపోయారు. కొన్ని నిమిషాల పాటు చిరు నిర్విరామంగా చెప్పిన ఆ పవర్ డైలాగ్ కి అభిమానులకి పూనకలోచ్చాయి.

సమాజానికి పనికొచ్చే ఓ మంచి సినిమా చేయాలని ప్రతీ హీరోకి ఉంటుంది. కానీ అలాంటి కథలు కొందరిని మాత్రమే వెతుక్కుంటూ వెళ్తాయి. సరిగ్గా 'ఠాగూర్' విషయంలో అదే జరిగింది. తమిళ్ లో సూపర్ డూపర్ హిట్టైన 'రమణ' సినిమాను తెలుగులో చేయాలని కొందరు ట్రై చేసిన చివరికి ఆ సందేశం చిరు నోటి నుండి రావాలని కథ డిసైడ్ చేసింది. ఇంకేముంది అన్నీ చకచకా జారిపోయి ఫైనల్ గా రీమేక్ రైట్స్ తీసుకొని నిర్మాత మధు వినాయక్ డైరెక్షన్ లో మెగాస్టార్ ను పెట్టి సినిమా తీసారు.

ముందు నుండే సినిమా మీద ఉన్న హైప్ పైగా మెగా స్టార్ సినిమా కావడంతో ఓపెనింగ్ కే బాక్సాఫీస్ దద్దరిల్లింది. ఉదయాన్నే చిరు సినిమా చూడ్డానికి వచ్చిన ప్రేక్షకులతో సినిమా హాళ్ళన్ని కిక్కిరిసిపోతే మరో వైపు బ్లాక్ టికెట్ల దందా జోరుగా సాగింది. జంట నగరాల్లో 29 థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా అన్ని చోట్లా హౌజ్ ఫుల్ బోర్డులతో ఎకతాటిగా శతదినోత్సవం వరకూ పరుగులెట్టింది. మొదటి రోజు సప్తగిరి థియేటర్ లో ఒక్కో టికెట్టు బ్లాక్ లో రూ. 1500 అమ్మడం ఓ రికార్డు. ఇలా ఒకటి రెండూ కాదు 'ఠాగూర్' క్రియేట్ చేసిన కొత్త రికార్డులెన్నో. చాలా ఏరియాల్లో ఎప్పటికప్పుడు ప్రింట్లు పెరుగుతూ పోయాయి. ఫైనల్ గా వసూళ్ళ లెక్కతో నిర్మాత మధు ముందు 'ఠాగూర్' వచ్చి చేరి ఇండస్ట్రీలో ఠాగూర్ మధు అయిపోయాడు. వినాయక్ ఇమేజ్ ను మరింతగా పెంచింది.

ఇక సినిమా అంతటి ఘన విజయం సాధించడానికి చాలా కారణాలున్నాయి. అందులో మొదటి కారణం మెగాస్టార్ ఇమేజ్ అయితే సినిమా కథాంశం, బలమైన సన్నివేశాలు, మణిశర్మ పాటలు ఇలా అన్ని సంచలనానికి కలిసొచ్చాయి. ముఖ్యంగా హాస్పిటల్ లో చనిపోయిన ఓ వ్యక్తి బాడిని అడ్డం పెట్టుకొని డాక్టర్లు ఒక పేద కుటుంబాన్ని పీడించాలని చూసే ఎపిసోడ్ ఇప్పటికీ అందరికీ గుర్తుంటుంది. ఆ సన్నివేశం సినిమాకే హైలైట్. ఆ ఎపిసోడ్ తర్వాత హాస్పిటల్ యాజమాన్యంతో చిరు గొడవకు దిగడం వాళ్ళ ముక్కు పిండి ఆ పేద కుటుంబానికి డబ్బులు ఇప్పించడం ఇవన్నీ సినిమాను నిలబెట్టి ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయ్యాయి. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో జ్యోతికతో వచ్చే ఎమోషనల్ సన్నివేశం ప్రేక్షకుల కళ్ళల్లో నీళ్ళు తెప్పించి హృదయాలని కదిలించింది. ఇలా చెప్పుకుంటే పోతే సినిమాలో అదిరిపోయే ఎపిసోడ్స్ చాలానే ఉన్నాయి.

600 లకు పైగా స్క్రీన్ లో విడుదలైన ఈ సినిమా 253 సెంటర్స్ లో 50 రోజులు దాటి 192 సెంటర్స్ లో శతదినోత్సవం జరుపుకుంది. ఈ సినిమా సాధించిన విజయంతో తెలుగులో మెగాస్టార్ తో పాటు మిగతా హీరోలు కూడా సందేశంతో కూడిన యాక్షన్ సినిమాలు చేసినప్పటికీ అవేవి 'ఠాగూర్' స్థాయి విజయాన్ని అందుకోలేకపోయాయి.

రాజేష్ మన్నె.