Chiranjeevi’s SwayamKrushi Completes 33 Years

Thursday,September 03,2020 - 02:46 by Z_CLU

హీరో చెప్పులు కుడతాడు. హీరోయిన్ గుడి ముందు చెప్పుల స్టాండ్ నడిపిస్తుంది. అప్పటికే మాస్ ఇమేజ్ తో దూసుకుపోతున్న చిరంజీవి లాంటి హీరో ఇలాంటి పాత్ర చేస్తాడని అప్పటివరకు ఎవ్వరూ కలలో కూడా ఊహించలేదు. కానీ చిరంజీవి సాహసం చేశారు. స్వయంకృషితో విజయాన్ని అందుకున్నారు.

బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ వస్తున్నాయి. మాస్ హీరోగా ఫుల్ ఇమేజ్ వచ్చేసింది. ప్రతి సినిమాతో కళ్లు చెదిరే కలెక్షన్లు వస్తున్నాయి. ఇలాంటి పొజిషన్ లో ఏ హీరో అయినా ఏం చేస్తాడు.. మాస్ జానర్ లో మరిన్ని సినిమాలు చేస్తాడు. స్టార్ డమ్ ఇంకాస్త పెంచుకోవాలని చూస్తాడు. కానీ చిరంజీవి మాత్రం ప్రయోగాలు చేశారు. అందుకే మెగాస్టార్ అనిపించుకున్నారు.

పసివాడి ప్రాణం లాంటి అద్భుతమైన విజయం. అందకంటే ముందు దొంగమొగుడు, రాక్షసుడు, అడవిదొంగ, ఖైదీ లాంటి పెద్ద హిట్స్ ఉన్నాయి. కెరీర్ ఇలా సాఫీగా సాగిపోతున్న టైమ్ లో స్వయంకృషి (SwayamKrushi ) లాంటి ప్రయోగాత్మక చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చిరంజీవి. కష్టపడితే ఎప్పటికైనా ఫలితం దక్కుతుంది. ఇష్టపడి పనిచేస్తే ఏ రంగంలోనైనా విజయం సాధిస్తామనే మంచి సందేశాన్ని స్వయంకృషి అందించింది.

కళాతపశ్వి కె.విశ్వనాథ్ (K. Viswanath) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా చిరంజీవిని (Chiranjeevi) సరికొత్తగా ఆవిష్కరించడమే కాకుండా.. ప్రయోగాలతో కూడా చిరంజీవి సక్సెస్ కొట్టగలరని నిరూపించింది. సరిగ్గా 33 ఏళ్ల కిందట ఇదే రోజు (సెప్టెంబర్ 3)న విడుదలైంది స్వయంకృషి.

ఏడాదికి 6-7 సినిమాలతో చిరంజీవి ఫుల్ బిజీగా ఉన్న రోజులవి. పైగా ముందే చెప్పుకున్నట్టు మాస్ హీరో ఇమేజ్ తో దూసుకుపోతున్న టైమ్. సరిగ్గా అలాంటి టైమ్ లో పూర్ణోదయ పిక్చర్స్ బ్యానర్ పై చిరంజీవి హీరోగా మూవీ ఎనౌన్స్ మెంట్ వచ్చింది. దీంతో అంతా ముక్కున వేలేసుకున్నారు. కొంతమంది నవ్వుకున్నారు కూడా.

దొంగమొగుడుతో శంకరాభరణం తీస్తారా అని కొందరు కామెడీ చేస్తే.. రాక్షసుడిని స్వాతిముత్యంగా చూపిస్తారేమో అంటూ మరికొందరు గుసగుసలాడారు.

ఇలా ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ చిరంజీవి-కె.విశ్వనాథ్ మాత్రం కథను నమ్మారు. వాళ్ల నమ్మకమే నిజమైంది. స్వయంకృషి సినిమా థియేటర్లలో సూపర్ హిట్టయింది. చిరంజీవిని ఇలా కూడా చూడొచ్చా అంటూ ఆశ్చర్యపోతూ థియేటర్లకు క్యూ కట్టారు జనం. అలా 26 కేంద్రాల్లో వంద రోజులాడింది ఈ సినిమా. అంతేకాదు.. ఈ సినిమాతో తొలిసారిగా ఉత్తమ నటుడిగా నంది అవార్డ్ అందుకున్నారు చిరంజీవి.

పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాలో విజయశాంతి హీరోయిన్ గా నటించగా, సుమలత మరో కీలక పాత్ర పోషించింది. రమేష్ నాయుడు సంగీతం సినిమాకు మరింత ప్రాణం పోసింది.