Vishwak Sen’s ‘Ori Devuda’ Movie Review

Friday,October 21,2022 - 02:43 by Z_CLU

నటీ నటులు : విశ్వక్ సేన్ , వెంకటేష్ , మిథిలా పాల్కర్, ఆశా భట్, ముర‌ళీ శ‌ర్మ, రాహుల్ రామకృష్ణ తదితరులు

కెమెరా : విదు అయ్యన

ఎడిటింగ్ : విజయ్ ముక్తవరపు

సంగీతం : లియోన్ జేమ్స్

ఎగ్జిక్యూటివ్ నిర్మాత : వంశీ కాకా

నిర్మాణం : PVP సినిమా

నిర్మాత : ప్రసాద్ వి. పొట్లూరి

రచన -దర్శకత్వం : అశ్వ‌త్ మారి ముత్తు

నిడివి : 143 నిమిషాలు

సెన్సార్ : U/A

విడుదల తేది : 21 అక్టోబర్ 2022

విశ్వక్ సేన్ హీరోగా విక్టరీ వెంకటేష్ ముఖ్య పాత్రలో అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన 'ఓరి దేవుడా' థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తమిళ్ లో సూపర్ హిట్టైన 'ఓమై కడవులే' కి రీమేక్ తెరకెక్కిన ఈ సినిమాలో వెంకటేష్ మోడరన్ గాడ్ గా నటించడంతో సినిమాపై బజ్ క్రియేట్ అయింది. రిలీజ్ కి ముందు విశ్వక్ సేన్ ప్రమోషన్స్ కూడా సినిమాపై హైప్ తీసుకొచ్చింది. మరి దీపావళి స్పెషల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా ? రీమేక్ సినిమాతో విశ్వక్ సేన్ మరో హిట్ అందుకున్నాడా ? జీ సినిమాలు ఎక్స్ క్లూసివ్ రివ్యూ.

కథ :

చిన్నప్పటి నుండి కలిసి పెరిగిన బెస్ట్ ఫ్రెండ్ అను (మిథిలా పాల్కర్)   మ్యారేజ్ ప్రపోజల్ పెట్టడంతో ఇష్టం లేకపోయినా ఓ సందర్భంలో డిసిషన్ తీసుకొని ఆమెను పెళ్లి చేసుకుంటాడు అర్జున్ (విశ్వక్ సేన్). పెళ్ళైన తర్వాత తనకి ఇష్టం లేని పని చేస్తూ ఇబ్బంది పడుతుంటాడు. అదే సమయంలో స్కూల్ సీనియర్ మీరా (ఆశ భట్) అర్జున్ లైఫ్ లోకి వస్తుంది. మీరాతో అర్జున్ ఫ్రెండ్లీగా మూవ్ అవుతాడు. దీంతో అర్జున్- అనుల మధ్య గొడవలు మొదలవుతాయి.

ఒకరికొకరు కరెక్ట్ కాదని విడాకులు అప్లై చేసుకుంటారు. వీరిద్దరి విడాకుల గొడవ కోర్టులో ఉండగా అర్జున్ కి ఒక వ్యక్తి పరిచయమై లవ్ కోర్టులో నీ సమస్య కి పరిష్కారం లభిస్తుందని అక్కడికి రమ్మని చెప్పి మాయమవుతాడు.  కోర్టులో ఉన్న అర్జున్ విడాకుల సమస్యకు లవ్ కోర్టులో పరిష్కారం లభించిందా ?  దేవుడు (వెంకటేష్) ఇచ్చిన రెండో చాన్స్ తీసుకొని అర్జున్ తన తప్పుల్ని ఎలా సరిదిద్దుకున్నడు ? ఇదంతా తెలియాలంటే 'ఓరి దేవుడా' చూడాల్సిందే.

 

నటీ నటుల పనితీరు :

 హీరో విశ్వక్ సేన్ నటుడిగా మరోసారి అర్జున్ పాత్రతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో విశ్వక్ నటన బాగుంది. స్పెషల్ రోల్ లో కనిపించిన వెంకటేష్ తన పాత్రకు పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు. హీరోకి రెండో ఛాన్స్ ఇచ్చే దేవుడి పాత్రలో అలరించాడు. పూరి జగన్నాథ్ స్పెషల్ రోల్ లో కనిపించి ఆడిషన్ సీన్ హైలైట్ అయ్యేలా చేశాడు.

హీరోయిన్స్ గా మిథిలా పాల్కర్, ఆశా భట్ వారి కేరెక్టర్స్ ఫిట్ అయ్యారు. ఇద్దరూ తమ నటనతో సినిమాకు ప్లస్ అయ్యారు. మురళి శర్మ , నాగినీడు , రాజ శ్రీ నాయర్ , జయలలిత తదితరులు వారి పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు :

 సినిమాకు మ్యూజిక్ బిగ్ ప్లస్ పాయింట్. లియో జేమ్స్ సినిమాకు బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాడు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ బాగుంది. అలాగే "గుండెల్లోనా" , "ఔననవా" సాంగ్స్ వినసొంపుగా ఉన్నాయి. అనిరుద్ , సిద్ శ్రీరాం సింగింగ్ ఆ సాంగ్స్ కి ప్రాణం పోసింది.

విదు అయ్యన కెమెరా వర్క్ సినిమాకు మరో హైలైట్. విజయ్ ముక్తవరపు ఎడిటింగ్ ఫరవాలేదు. తరుణ్ భాస్కర్ అందించిన డైలాగ్స్ సన్నివేశాలకు అందం తీసుకొచ్చాయి. అశ్వత్ మారిముత్తు కథ -కథనం కొత్తగా ఉన్నాయి. పివిపి సినిమా ప్రొడక్షన్ వేల్యూస్ కథకు తగ్గట్టుగా ఉన్నాయి.

జీ సినిమాలు సమీక్ష :

ఒక భాషలో ఏదైనా సినిమా హిట్టయితే , మిగతా భాషల్లో ఆ సినిమాను రీమేక్ చేయడం సర్వసాధారణం. అలా తమిళ్ లో సూపర్ హిట్ అనిపించుకున్న 'ఓమై కడవులే' సినిమా తర్వాత కన్నడలో ఇప్పుడు తెలుగులో రీమేక్ అయింది. ఒరిజినల్ దర్శకుడు రీమేక్ ని హ్యాండిల్ చేస్తే సోల్ మిస్ అవ్వదు. ఓరి దేవుడా కి అదే మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. తమిళ దర్శకుడు అశ్వత్ మారిముత్తు చేతిలో ఈ తెలుగు రీమేక్ పెట్టడం  కలిసొచ్చిన ప్రధాన అంశం. తను రాసుకున్న కథను తనకంటే గొప్పగా తీయలేరని కొంత మంది దర్శకులు నిరూపించారు. అశ్వత్ మారిముత్తు కూడా ఆ కోవలోకి చెందుతాడు. అందుకే ఈ సినిమాను ఎలాంటి రిస్క్ చేయకుండా అశ్వత్ కి అప్పగించారు నిర్మాత పీవీపీ.

"ఇష్టం లేకుండా స్నేహితురాలిని పెళ్ళాడి ఆమెతో కలిసి జీవించలేక విడాకులు తీసుకోవడానికి సిద్దమైన ఓ కుర్రాడికి దేవుడు రెండో చాన్స్ ఇస్తే ? ఆ చాన్స్ వాడుకొని అతడు చేసిన తప్పు తెలుసుకొని సరిదిద్దుకుంటే ?" ఈ కథతో  కోలీవుడ్ ప్రేక్షకులను మెప్పించి సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు అశ్వత్ తెలుగు ప్రేక్షకులను కూడా పూర్తి స్థాయిలో కాకపోయినా ఓ మోస్తరుగా మెప్పించాడు. కథలో పెద్దగా ఎలాంటి మార్పులు చేయకుండా అశ్వత్ కేవలం కొన్ని బెటర్ మెంట్స్ మాత్రమే చేసుకున్నాడు. దీంతో సినిమా సోల్ మిస్ అవ్వలేదు. ముఖ్యంగా కథలో ఉన్న ఎమోషన్ ని మరో సారి స్క్రీన్ పైకి తీసుకొచ్చి దర్శకుడిగా మంచి మార్కులు అందుకున్నాడు. సెకండాఫ్ లో ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకున్నాయి. తమిళ్ లో విజయ్ సేతుపతి , కన్నడలో పునీత్ రాజ్ కుమార్ చేసిన మోడరన్ గాడ్ కేరెక్టర్ కి తెలుగులో వెంకటేష్ ను తీసుకోవడం మంచి ఛాయిస్. కానీ ఆ పాత్ర నిడివి తక్కువగా కాకుండా కాస్త పెంచి ఉంటే బాగుండేది. దర్శకుడు ఆ విషయంలో ఎలాంటి రిస్క్ చేయకుండా ఒరిజినల్లో ఆ పాత్ర నిడివినే ఇక్కడ కూడా రిపీట్ చేశాడు. తెలుగులో వెంకటేష్ ని చూసి థియేటర్స్ కి వచ్చే వారిని తక్కువ నిడివి గల ఆ పాత్ర కాస్త నిరాశ  పరుస్తుంది. కానీ దర్శకుడు చెప్పినట్టు వెంకీ ఇంట్రో అండ్ ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం ఫ్యాన్స్ కి పూనకం తెప్పిస్తాయి. ఇక డైరెక్టర్ అశ్వత్ తెలుగు వర్షన్ లో ఒక సాంగ్ జత చేయడం ప్లస్ అయ్యింది. అనిరుద్ పాడిన ఆ సాంగ్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. అలాగే సిద్ శ్రీరాం పాడిన సాంగ్ కూడా సినిమాకు హెల్ప్ అయ్యింది.

సినిమాలో కామెడీ ఆశించిన స్థాయిలో లేదు. తెలుగులో గాడ్ పాత్రలో  వెంకటేష్ నటించడం వల్ల ఆ పాత్ర ద్వారా ఇంకా ఎక్కువ కామెడీ ఊహించి థియేటర్స్ కి వస్తే, వారిని సినిమా కాస్త నిరాశ పరుస్తుంది.  అంతో ఇంతో స్నేహితుడి పాత్ర చేసిన వెంకటేష్ కాకుమాను ద్వారా కొంత కామెడీ పండింది. ఇంటర్వెల్ తర్వాత అర్జున్ కి దేవుడు సెకండ్ ఛాన్స్ ఇచ్చాక వచ్చే సన్నివేశాలు డ్రాగ్ అనిపించాయి. అలాగే సెకండాఫ్ లో మురళి శర్మ టాయిలెట్ కంపెనీ గురించి ఎక్స్ ప్లేన్ చేస్తూ హీరో రియలైట్ అయ్యేలా చేస్తాడు. ఆ సీన్ బాగుంది కానీ దానికి సంబంధించి క్లైమాక్స్ లో హీరో తన తప్పు తెలుసుకొని ఆ జాబ్ ని ఎంజాయ్ చేసే షాట్ వేస్తే బాగుండేది. విశ్వక్ సేన్ నటన , కేరెక్టర్స్ , హీరోయిన్స్ పెర్ఫార్మెన్స్ , మ్యూజిక్ , కెమెరా వర్క్ , ఇంటర్వెల్ బ్లాక్ , ఎమోషనల్ సీన్స్ హైలైట్ గా నిలిచాయి.కాకపోతే స్లో అనిపించే సన్నివేశాలు , నత్తనడకన సాగే నరేషన్ సినిమాకు మైనస్ నైపిస్తాయి. ఎలాంటి అంచనాలు లేకుండా వస్తే సినిమా ఓ మోస్తరుగా ఆకట్టుకుంటుంది.

రేటింగ్ : 2.75 /5