Chakra Movie Review

Friday,February 19,2021 - 03:42 by Z_CLU

నటీనటులు: విశాల్‌, శ్ర‌ద్దా శ్రీ‌నాథ్, రెజీనా, మ‌నోబాల, రోబో శంక‌ర్‌, కెఆర్ విజ‌య త‌దిత‌రులు

సినిమాటోగ్ర‌ఫి : బాల‌సుబ్ర‌మ‌నియం‌ సంగీతం: యువ‌న్ శంక‌ర్ రాజా నిర్మాత: విశాల్‌ ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: ఎం.ఎస్ ఆనంద‌న్ సెన్సార్: U/A రన్ టైమ్: 2 గంటల 10 నిమిషాలు రిలీజ్ డేట్: ఫిబ్రవరి 19, 2021

విశాల్ సినిమాలు ఎలా ఉంటాయో, ఎలా ఉండాలో ప్రేక్షకులకు ఓ ఐడియా ఉంది. ఈసారి కూడా విశాల్ తన ట్రాక్ తప్పలేదు. చక్ర పేరిట మార్క్ మూవీ వదిలాడు. ఈరోజు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా విశాల్ కోరుకుంటున్న విజయాన్ని అందించిందా? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ..

Chakra Movie telugu Review 1

కథ

హీరో సుభాష్ చంద్రబోస్ అలియాస్ చంద్రు (విశాల్)ది మిలట్రీ కుటుంబం. ఈయన తాత, తండ్రి దేశానికి సేవలందించారు. తండ్రి అశోక చక్ర గౌరవాన్ని కూడా దక్కించుకున్నారు. విశాల్ కూడా మిలట్రీలో ఉంటూ దేశానికి సేవ చేస్తుంటాడు. మరోవైపు విశాల్ గర్ల్ ఫ్రెండ్ గాయత్రి (శ్రద్ధా శ్రీనాధ్) సిటీలో పెద్ద పోలీసాఫీసర్. సిన్సియర్ పోలీస్ గా, ఎలాంటి కేసునైనా ఛేధించే ఆఫీసర్ గా పేరుతెచ్చుకుంటుంది.

సరిగ్గా ఆగస్ట్ 15 స్వతంత్ర దినోత్సవం రోజున హైదరాబాద్ సిటీలో వరుసపెట్టి దొంగతనాలు జరుగుతాయి. గంటల వ్యవధిలో 50 ఇళ్లు కొల్లగొడతారు దొంగలు. అందులో విశాల్ నాయనమ్మ ఇల్లు కూడా ఉంటుంది. అదే సమయంలో చంద్రు అత్యంత విలువైనదిగా భావించే అశోక చక్ర మెడల్ ను కూడా దొంగలు కొట్టేస్తారు.

దీంతో ఇటు గాయత్రితో పాటు అటు చంద్రు కూడా రంగంలోకి దిగుతారు. వరుస దొంగతనాల వెనక పెద్ద సైబర్ క్రైమ్ ఉందనే విషయాన్ని గ్రహిస్తారు. ఇంతకీ ఆ సైబర్ క్రైమ్ చేస్తున్నది ఎవరు? కంటికి కనిపించకుండా తిరుగుతున్న ఆ సైబర్ దొంగను విశాల్ పట్టుకున్నాడా లేదా? తన తండ్రికి చెందిన అశోక చక్రను తిరిగి దక్కించుకున్నాడా లేదా అనేది చక్ర కథ

నటీనటుల పనితీరు

విశాల్ కు ఇలాంటి కథలు కొత్తకాదు. మరీ ముఖ్యంగా ఇంతకుముందు దాదాపు ఇలాంటి కథతోనే అభిమన్యుడు సినిమా చేశాడు. ఈ సినిమాలో అతడికి సవాల్ విసిరే సీన్ ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. దీంతో అతడు ఆడుతూపాడుతూ నటించేశాడు. సినిమాను ఒంటి చేత్తో బాగానే నడిపించాడు కానీ, అతడి యాక్టింగ్ లో కొత్తదనం లేదు.

సిన్సియర్ పోలీసాఫీసర్ గా శ్రద్ధ శ్రీనాధ్ ఓకే అనిపిస్తుంది. నటనపరంగా, గ్లామర్ పరంగా ఆమె పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక మరో హీరోయిన్ రెజీనా మాత్రం తన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. రోబో శంకర్, మనోబాల, కేఆర్ విజయ్ తమ పాత్రల మేరకు నటించారు.

టెక్నీషియన్స్ పనితీరు

దర్శకుడు ఆనందన్ కొత్త కథ తీసుకోలేదు. ఆల్రెడీ మార్కెట్ లో ఉన్న కథకే తనదైన సన్నివేశాలు, యాక్షన్ జోడించాడు. అతడు రాసుకున్న కథ, చాలాచోట్ల స్క్రీన్ ప్లే రొటీన్ గా ఉంది. బాలసుబ్రమణ్యం సినిమాటోగ్రఫీ, యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నాయి. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ తన ప్రొడక్షన్ వాల్యూస్ ను మరోసారి నిలబెట్టుకుంది. ఖర్చుకు వెనకాడకుండా డబ్బు పెట్టారు.

Chakra Movie telugu Review 1

జీ సినిమాలు సమీక్ష

ఇదివరకే అభిమన్యుడు లాంటి సైబర్ క్రైమ్ థ్రిల్లర్ ను చేసిన విశాల్ ను, అలాంటిదే మరో కథతో ఒప్పించినందుకు దర్శకుడు ఆనందన్ ను కచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే, చక్రలో ఫస్టాఫ్ మొత్తం అభిమన్యుడు కనిపిస్తాడు. అక్కడ ఉన్నట్టే ఇక్కడ కూడా హీరో-విలన్ మధ్య పిల్లి-ఎలుక ఆటను చూపించాడు దర్శకుడు. విలన్ ఎత్తులు వేయడం, దాన్ని హీరో చిత్తు చేయడం ఆఖరి వరకు కనిపిస్తుంది. కాకపోతే అభిమన్యుడులో మగ విలన్, ఇందులో లేడీ విలన్ అంతే తేడా.

ఒకేరోజు 50 దొంగతనాలు జరిగాయనే పాయింట్ ను దర్శకుడు తీసుకున్నాడు. దానికి సైబర్ క్రైమ్ కోణం యాడ్ చేశాడు. ఇక సీన్ లోకి దిగిన హీరో ఒక్కో చిక్కుముడిని విప్పుకుంటూ వెళ్తాడు. ఈ ఎపిసోడ్స్ ను దర్శకుడు బాగా డీల్ చేశాడు. అనవసరమైన సీన్లు, పాటలు లేకుండా క్రిస్పీగా స్క్రీన్ ప్లే నడించాడు.

కాకపోతే ఇంతకుముందే చెప్పుకున్నట్టు కథలో కొత్తదనం లేకపోవడం, సన్నివేశాల్లో ఎమోషనల్ కనెక్ట్ లోపించడం చక్రకు పెద్ద మైనస్ అయింది. చివరికి విశాల్ ను ఇందులో కూడా ఆర్మీ ఆఫీసర్ (అభిమన్యుడులో కూడా మిలట్రీ) గా చూపించడం రొటీన్ అనిపిస్తుంది. దీనికితోడు పోలీసులందర్నీ పక్కనపెట్టి.. ఓ ఆర్మీ ఆఫీసర్ తో కేసును సాల్వ్ చేయించడం అంత కన్విన్సింగ్ గా అనిపించదు. ఇంత ప్రయాస పడినబదులు హీరోను కూడా పోలీసాఫీసర్ గా చూపించేస్తే సరిపోయేది. అశోక చక్ర ఎపిసోడ్ కోసం హీరోను మిలట్రీగా చూపించిన దర్శకుడు.. ఆ పాత్రకు మిలట్రీ బ్యాక్ డ్రాప్ సరిపోదని తెలిసి కూడా, అభిమన్యుడు ఇచ్చిన ధైర్యంతో కథను నడిపించేశాడు.

విశాల్ ఆర్మీ ఆఫీసర్ గా సరిపోయాడు. కానీ అతడు తన కథల ఎంపికతో పాటు గ్లామర్ పై కూడా కాస్త దృష్టిపెట్టాల్సిన టైమ్ వచ్చింది. విశాల్ తన కండలపైనే కాకుండా, ముఖంపై కూడా శ్రద్ధ పెట్టాలి. లేదంటే ఫ్యూచర్ లో అతడు ఇలాంటి యాక్షన్ కథలకు తప్పితే మరో జానర్ కు పనికిరాకుండా పోతాడు.

మొత్తంగా చూసుకుంటే, చక్ర సినిమాలో కొత్తగా మనకు ఏదీ కనిపించదు. ఓ సైబర్ క్రైమ్ ను బోర్డర్ నుంచి వచ్చిన మిలట్రీ ఆఫీసర్.. పోలీస్ వ్యవస్థ మొత్తాన్ని పక్కనపెట్టి ఎలా ఛేదించాడనేది మాత్రం చూపించారు. సినిమాలో ప్రతి సీన్ ఊహించుకునేట్టుగానే ఉంటుంది. దీంతో ఇదొక యావరేజ్ యాక్షన్ డ్రామాగా.. అభిమన్యుడుకు డూప్లికేట్ గా తయారైంది.

బాటమ్ లైన్ - చక్ర అలియాస్ అభిమన్యుడు రేటింగ్ - 2.5/5