Vijay’s ‘Varasudu’ Movie Review

Saturday,January 14,2023 - 07:25 by Z_CLU

నటీ నటులు : విజయ్, రష్మికా మందన్న, శరత్ కుమార్, ప్రభు, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, జయసుధ, శామ్, యోగిబాబు, సంగీత, సంయుక్త తదితరులు

కెమెరా మెన్ : కార్తీక్ పళని

సంగీతం: ఎస్ థమన్

కథ, స్క్రీన్ ప్లే: వంశీ పైడిపల్లి, హరి, అహిషోర్‌ సాల్మన్‌

డైలాగ్స్, అడిషనల్ స్క్రీన్ ప్లే: వివేక్

నిర్మాణం : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా

సహ నిర్మాతలు: శ్రీ హర్షిత్ రెడ్డి, శ్రీ హన్షిత

నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి

దర్శకత్వం: వంశీ పైడిపల్లి

విడుదల తేది : 14 జనవరి 2023

నిడివి : 170 నిమిషాలు

 

విజయ్ తో వంశీ పైడిపల్లి తీసిన 'వారసుడు' డబ్బింగ్ మూవీ గా ప్రేక్షకుల ముందుకొచ్చింది.  దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా తమిళ్ కంటే రెండ్రోజులు ఆలస్యంగా తెలుగులో విడుదలైంది. మరి సంక్రాంతి బరిలో ఫ్యామిలీ డ్రామాగా వచ్చిన వారసుడు మెప్పించి విజయం అందుకున్నాడా ? జీ సినిమాలు ఎక్స్ క్లూసివ్ రివ్యూ.

varasudu movie

కథ : 

రాజేంద్ర (శరత్ కుమార్) ది ఉమ్మడి కుటుంబం. బిజినెస్ లో ఉన్నత స్థాయికి ఎదిగిన రాజేంద్ర కి తన కొడుకులు కూడా బిజినెస్ మెన్ గా సక్సెస్ అవ్వాలని కోరుకుంటాడు. కానీ అన్నయ్యలా తండ్రి చెప్పింది వినే రకం రాదు విజయ్ (విజయ్ ). దీంతో తండ్రి తో ఆలోచన చెప్పేసి తన కాళ్ళ మీద తాను నిలబడతానని ఇంట్లో నుండి బయటికి వచ్చేస్తాడు.

ఇక రాజేంద్ర బిజినెస్ దెబ్బ కొట్టేందుకు ఆపోజిట్ బిజినెస్ మెన్ ఆర్ పీ (ప్రకాష్ రాజ్) ప్రయత్నిస్తుంటాడు. అమ్మ పిలుపు మేరకు ఇష్టం లేకపోయినా మళ్ళీ తిరిగి తన ఇంటికి వచ్చిన విజయ్ తండ్రి కోరిక మేరకు వారసుడి కంపెనీ భాద్యతలు చేపట్టి ఆర్ పీ చెక్ పెడుతూ ముందుకు వెళతాడు. ఇంతకీ అమ్మ పిలుపు కాదనలేక ఇంటికొచ్చిన విజయ్ ను రాజేంద్ర ఎందుకు వారసుడిగా ఎనౌన్స్ చేసి కంపెనీ భాద్యతలు అప్పగించాడు ? ఫైనల్ గా తన కుటుంబంలో సమస్యలను విజయ్ ఎలా సాల్వ్ చేసుకున్నాడు ? అనేది మిగతా కథ.

నటీ నటుల పనితీరు : 

 విజయ్ లో మంచి ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీతో విజయ్ కేరెక్టర్ కి పూర్తి న్యాయం చేశాడు. ఫైట్స్ , డాన్సులతో ఆకట్టుకున్నాడు. కొన్ని ఎమోషనల్ సీన్స్ లో మంచి నటన కనబరిచాడు. రష్మిక తన పాత్ర మేరకు మెప్పించింది. గ్లామర్ తో ఆకట్టుకుంది. తల్లిదండ్రుల పాత్రల్లో శరత్ కుమార్ , జయసుధ ఎప్పటి లానే మంచి మార్కులు అందుకున్నాడు. తమ అనుభవంతో ఆ పాత్రలను రక్తి కట్టించారు. అన్నదమ్ముల పాత్రల్లో శ్రీకాంత్ , కిక్ శ్యామ్ ఆకట్టుకున్నారు. ప్రకాష్ రాజ్ రొటీన్ విలన్ లానే కనిపించాడు. ఆ పాత్రలో అస్సలు కొత్తదనం లేదు. సంగీత , నందిని రాయ్ మిగతా వారందరూ ఆ పాత్రలకు న్యాయం చేశారు. యోగి బాబు పాత్ర బొమ్మరిల్లు లో సునీల్ ని గుర్తుచేసింది కానీ ఆ పాత్ర ద్వారా యోగిబాబు కొంత నవ్వించి ఎంటర్టైన్ చేశాడు. మన కమెడియన్ సత్య డబ్బింగ్ చెప్పడం ఆ పాత్రకు కలిసొచ్చింది.

సాంకేతిక వర్గం పనితీరు : 

తమన్ మ్యూజిక్ సినిమాకి బిగ్ ప్లస్ అయ్యింది. ముఖ్యంగా రంజితమే సాంగ్ సినిమాకి హైలైట్ గా నిలిచింది. అమ్మ పాట బాగుంది. మిగతా పాటలు పరవాలేదు. నేపథ్య సంగీతంలో మరో సారి తమన్ మాస్టర్ అనిపించుకున్నాడు. కార్తీక్ పళని విజువల్స్ రిచ్ గా ఉన్నాయి. పీటర్ హెయిన్స్ , దిలీప్ మాస్టర్ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ మాస్ ఆడియన్స్ ను అలరించాయి. సునీల్ బాబు, వైష్ణవి రెడ్డి ప్రొడక్షన్ వెల్యూస్ రిచ్ గా ఉన్నాయి. కెఎల్ ప్రవీణ్ ఎడిటింగ్ లో ఇంకాస్త శ్రద్ద తీసుకొని కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేసి క్రిస్ప్ చేసి ఉంటే బెటర్ గా ఉండేది. వివేక్ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి.

వంశీ పైడిపల్లి, హరి, అహిషోర్‌ సాల్మన్‌ స్టోరీ స్క్రీన్ ప్లే రొటీన్ గా ఉన్నాయి. వంశీ పైడిపల్లి టేకింగ్ , కొన్ని సన్నివేశాలను తీసిన విదానం ఆకట్టుకుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా పెట్టిన ఖర్చు ప్రతీ ఫ్రేమ్ లోనూ కనిపించింది.

varasudu movie

జీ సినిమాలు సమీక్ష : 

సంక్రాంతి సీజన్ లో ఫ్యామిలీ సినిమాలకు ఉండే డిమాండ్ వేరు. మాస్ కంటెంట్ తో బడా సినిమాలు వచ్చినప్పటికీ ప్రేక్షకుల చూపు ఫ్యామిలీ సినిమా మీద ఉంటూనే ఉంటుంది. గతంలో సంక్రాంతి సీజన్ లో కాసుల వర్షం కురిపించిన ఫ్యామిలీ సినిమాలే ఇందుకు చక్కని ఉదాహరణ. అందుకే దిల్ రాజు తెలుగులో రెండు బడా సినిమాలున్నప్పటికీ తమిళ్ లో విజయ్ తో తీసిన 'వారసుడు' ను తెలుగు ప్రేక్షకుల ముందుకు డబ్బింగ్ మూవీగా తీసుకొచ్చాడు. రొటీన్ కథ తీసుకున్నా అందులో ఎమోషన్ సరిగ్గా వర్కవుట్ అయితే మాత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా అద్భుతాలు సృష్టిస్తుంది ఇందులో సందేహమే లేదు.  అయితే మొదటి సారి తమిళ్  సినిమా చేసిన వంశీ పైడిపల్లి సినిమాలో ఎమోషన్ తో తెలుగు ప్రేక్షకులను పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయాడు. ముఖ్యంగా విజయ్ కేరెక్టర్ మీద , తల్లి కొడుకుల సన్నివేశాల మీద  ఫైనల్ గా విజయ్ నుండి ఫ్యాన్స్ కోరుకునే కామెడీ , యాక్షన్ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టాడు వంశీ పైడిపల్లి. దీంతో ఎమోషనల్ సీన్స్ ఆశించిన స్థాయిలో పండలేదు.

విజయ్ తో ప్రాపర్ తమిళ్ సినిమా తీసినప్పటికీ అల్మోస్ట్ అన్ని మెయిన్ కేరెక్టర్స్ కి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటులనే తీసుకోవడంతో ఎక్కడా తమిళ్ ఫ్లేవర్ కనిపించలేదు. విజయ్ తో తెలుగు స్టైల్ లో ఓ ఫ్యామిలీ సినిమా ప్లాన్ చేసుకున్న వంశీ పైడిపల్లి గతంలో తెలుగులో వచ్చిన ఫ్యామిలీ సినిమాల్లోని కొన్ని ఎలిమెంట్స్ ను రిఫరెన్స్ గా తీసుకున్నట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా ఫ్యామిలీ డ్రామా అంతా చూస్తే 'బ్రహ్మోత్సవం' గుర్తుకువచ్చింది. ఇక అన్నదమ్ముల మధ్య రీవెంజ్ డ్రామా చూస్తే 'లక్ష్మీ' సినిమా ఛాయలు కనిపిస్తాయి. షష్టి పూర్తి కోసం తన చిన్న కొడుకుని రప్పించాలనే డ్రామా చూస్తే 'శతమానం భవతి' మైండ్ లో మెదులుతుంది. ఇక హీరో కేరెక్టరైజేషన్ చూస్తే 'బొమ్మరిల్లు' లో సిద్దార్థ్ గుర్తుకొస్తాడు. అయితే తెలుగు సినిమాల రిఫరెన్స్ తో తను అనుకున్న ఫ్యామిలీ డ్రామా సినిమాను తమిళ లో ప్లాన్ చేసుకున్నట్టున్నాడు వంశీ పైడిపల్లి. అయితే 'వారసుడు'తో తల్లి దండ్రుల గురించి పిల్లలు తీసుకోవాల్సిన కేర్ , వారి పట్ల కచ్చితంగా ప్రేమ చూపించాలని ఉమ్మడి కుటుంబం వెల్యూ చెప్పే ప్రయత్నం చేశాడు. కుటుంబంలో పెద్దకి ఓ వ్యాది ఉంటే ఆ టైమ్ లో కొడుకు నిలబడి కుటుంబాన్ని ముందుకు నడిపించాలని వారసుడు తో చెప్పాడు వంశీ పైడిపల్లి.

'వారసుడు' లో శరత్ కుమార్ కేరెక్టర్ తో వచ్చే ఎమోషనల్ సీన్స్ , జయసుధ -విజయ్ మధ్య వచ్చే తల్లి కొడుకుల సన్నివేశాలు బాగున్నాయి. అలాగే తమన్ మ్యూజిక్ కూడా సినిమాకు ప్లస్ అయ్యింది. విజయ్ నుండి ఫ్యాన్స్ కోరుకునే మాస్ యాక్షన్ తో పాటు డాన్సులు , ఎట్రాక్ట్ చేసే విజువల్స్ ఇలా కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఈ ఫ్యామిలీ డ్రామాలో యాడ్ చేసి కొంత వరకు మాస్ ను కూడా మెప్పించాడు వంశీ పడిపల్లి. అయితే రొటీన్ అనిపించే కథ -కథనం , తెలుగు సినిమాళ్లో ఉండే కొన్ని సన్నివేశాల ఛాయలు ఉండటం , ఎమోషన్ ఫుల్ ఫ్లెడ్జడ్  గా వర్కవుట్ అవ్వకపోవడం , ఈ కథ కోసం దర్శకుడు తీసుకున్న ఎక్కువ రన్ టైమ్ సినిమాకి మైనస్ అనే చెప్పాలి. ఓవరాల్ గా  తమిళ్ ప్రేక్షకులకు ఈ వారిసు  కొత్తగా ఉండవచ్చు. తెలుగు ప్రేక్షకులు గతంలో ఇలాంటి సినిమాలు చూసేయడంతో ఇక్కడ కాస్త రొటీన్ ఫ్యామిలీ డ్రామా అనిపిస్తుంది.

రేటింగ్ : 2 .5/5