V Movie Review

Saturday,September 05,2020 - 09:08 by Z_CLU

న‌టీన‌టులు: నాని, సుధీర్‌బాబు, నివేదా థామ‌స్‌, అదితిరావు హైద‌రి, వెన్నెల కిషోర్ త‌దిత‌రులు సంగీతం : అమిత్ త్రివేది బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : తమన్ సినిమాటోగ్ర‌ఫీ: పి.జి.విందా ఎడిటింగ్‌: మార్తాండ్ కె.వెంక‌టేశ్‌ నిర్మాత‌లు: శిరీష్‌, ల‌క్ష్మ‌ణ్‌, హ‌ర్షిత్‌ బ్యానర్ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ద‌ర్శ‌క‌త్వం: మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి విడుదల తేదీ : సెప్టెంబర్ 5, 2020 రన్ టైమ్ : 2 గంటల 20 నిమిషాలు

లాక్ డౌన్ తో థియేటర్లు మూతపడిన తర్వాత సినిమాలన్నీ వరుసగా OTTల్లో విడుదలవుతున్నాయి. ఈ క్రమంలో ఓటీటీలో డైరక్ట్ గా రిలీజైన మొదటి పెద్ద సినిమాగా నిలిచింది V. నాని-సుధీర్ బాబు నటించిన ఈ మల్టీస్టారర్ సినిమా ఈరోజు స్ట్రీమింగ్ కొచ్చింది. మరి సినిమా రిజల్ట్ ఏంటి? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ

కథ

డీసీపీ ఆదిత్య (Sudheer Babu) సక్సెస్ ఫుల్ పోలీసాఫీసర్ గా పేరుతెచ్చుకుంటాడు. ఇంకా చెప్పాలంటే అతడికి సెలబ్రిటీ స్టేటస్ వచ్చేస్తుంది. ఇంతలో సడెన్ గా ఆదిత్య లైఫ్ లోకి విష్ణు (Nani) ఎంటరవుతాడు. వరుసగా హత్యలు చేస్తూ, ఆదిత్యనే టార్గెట్ చేస్తూ సవాళ్లు విసురుతుంటాడు. ఈ ఛాలెంజ్ ను పర్సనల్ గా తీసుకున్న ఆదిత్య, విష్ణును పట్టుకునేందుకు రంగంలోకి దిగుతాడు.

ఇంతకీ ఆదిత్య, విష్ణును పట్టుకున్నాడా లేదా? ఆదిత్యకు అపూర్వ (Nivetha Thomas) నుంచి ఎలాంటి సహకారం లభించింది? విష్ణుకు, సాహెబా (Aditi Rao)కు ఉన్న సంబంధం ఏంటి? విష్ణు, ఆదిత్యనే ఎందుకు టార్గెట్ చేశాడు? లాంటివన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

నటీనటుల పనితీరు

ముందుగా చెప్పుకోవాల్సింది నాని గురించే. టాలీవుడ్ తో సంబంధం లేని ఓ ప్రేక్షకుడికి ఈ సినిమా చూపిస్తే.. కచ్చితంగా నేచురల్ స్టార్ ను చూసి టాలీవుడ్ మెయిన్ స్ట్రీమ్ విలన్ అనుకుంటాడు. అంతలా పాత్రలో జీవించేశాడు నాని. తన క్రూరమైన లుక్ తో, జీర గొంతుతో విష్ణు పాత్రకు ప్రాణప్రతిష్ట చేశాడు.

నానితో సమానంగా స్క్రీన్ స్పేస్ దక్కించున్నాడు సుధీర్ బాబు. నిజానికి సినిమా ఓపెనింగ్ ఇతడిపైనే ఉంటుంది. సూపర్ స్టయిలిష్ పోలీస్ గా సుధీర్ బాబు తను పోషించిన ఆదిత్య పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. సిక్స్ ప్యాక్ తో ఆ పాత్రను మరింత రక్తికట్టించాడు.

హీరోయిన్లు ఈసారి మైనస్ అయ్యారు. ఇద్దరిలో ఎవ్వరికీ ఎక్కువ స్కోప్ దక్కలేదు. మరీ ముఖ్యంగా మంచి పాత్రలకు పెట్టింది పేరైన నివేత థామస్ ఈసారి ఫెయిలైంది. ఆమె క్యారెక్టర్ వచ్చిన ప్రతిసారి కథ పక్కదారి తప్పుతున్నట్టు అనిపిస్తుంది. ఇక అదితికి మంచి పాత్ర దక్కిందనే ఫీలింగ్ మనసుకు కలిగేలోపే ఆమె పాత్ర అంతమౌతుంది. అంత చిన్నది ఆ క్యారెక్టర్.

టెక్నీషియన్స్ పనితీరు

టెక్నికల్ గా V Movie చాలా రిచ్ గా ఉంది. నిర్మాతగా దిల్ రాజు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా డబ్బులు పెడితే.. టెక్నీషియన్స్ అంతా ఆ ఖర్చును తెరపై చక్కగా చూపించారు. సినిమాటోగ్రాఫర్ పీజీ విందా మరోసారి తన కెమెరా కంటికి పదునుపెట్టగా.. రీసెంట్ గా ఫుల్ ఫామ్ లో ఉన్న తమన్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఇరగదీశాడు. మరీ ముఖ్యంగా హీరో-విలన్ ఎలివేషన్స్, మిలట్రీ ఎపిసోడ్ కు తమన్ నేపథ్య సంగీతమే బ్యాక్ బోన్ గా నిలిచింది. పాటలు కంపోజ్ చేసిన అమిత్ త్రివేది ఫర్వాలేదనిపించుకున్నాడు.

రచయితగా, దర్శకుడిగా ఇంద్రగంటికి ఈసారి అక్కడక్కడ మైనస్ మార్కులు పడతాయి. దర్శకుడితా అతడి చమక్కులు సినిమాలో చాలానే ఉన్నప్పటికీ.. రైటర్ గా అతడు డౌన్ అయిన సందర్భాలు కూడా అన్నే ఉన్నాయి. ఇంద్రగంటి రాసిన కొన్ని సన్నివేశాలు సినిమాను కిందకు లాగుతాయి. మరీ ముఖ్యంగా హీరోకు విలన్ పజిల్స్ విసరడం, పొడుపుకథలు చెప్పడం లాంటివి ఓల్డ్ స్టయిల్ ఫార్ములాను గుర్తుచేస్తాయి.

నిర్మాతగా దిల్ రాజు మరోసారి సూపర్ సక్సెస్ అయ్యాడు. కథను నమ్మితే ఎంత ఖర్చు చేయడానికి సిద్ధపడే ఈ నిర్మాత.. V Movie విషయంలో కూడా అదే కమిట్ మెంట్ చూపించాడు.

జీ సినిమాలు సమీక్ష

ఒక సూపర్ కాప్.. రౌడీల్ని చితక్కొట్టేస్తుంటాడు. ఎక్కడ ఏ సమస్య ఉన్నప్పటికీ చిటికెలో పరిష్కరిస్తుంటాడు. అన్ని ప్రశంసలు అతడికే, అన్ని మెడల్స్ అతడివే. అలాంటి వ్యక్తి ఓ సీరియస్ కేసు విషయంలో ఎలా ఉండాలి. V సినిమాలో సుధీర్ బాబు మాత్రం చాలా చోట్ల అలా కనిపించడు. ఓడిపోతే మెడల్స్ అన్నీ ఇచ్చేసి పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేస్తావా అనే సీరియల్ సవాల్ విలన్ నుంచి వచ్చిన తర్వాత కూడా సదరు పోలీస్ హీరో సీరియస్ గా కనిపించడు. ఈ మల్టీస్టారర్ కథలో లోపం ఎక్కడుందో చెప్పడానికి ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు.

ప్రమోషన్స్ లో దర్శకుడు చెప్పినట్టు నిజంగానే ఇవి రెండు బలమైన పాత్రలు. మానసికంగా, శారీరకంగా ఏమాత్రం తీసిపోని పాత్రలు. మంచి-చెడు ఆలోచించకుండా తాము అనుకున్నది మాత్రమే చేసే స్ట్రాంగ్ క్యారెక్టర్లు. క్యారెక్టరైజేషన్ లో కనిపించిన ఈ బలం, సన్నివేశాల్లో మాత్రం కనిపించలేదు. ఫస్టాఫ్ లోనే సినిమా కొన్ని చోట్ల ఇబ్బంది పెడితే.. సెకండాఫ్ కు వచ్చేసరికి ఆ ఇబ్బందులు మరింత పెరుగుతాయి.

రెండు బలమైన పాత్రలు, ఆ పాత్రలకు తగ్గ బలమైన ట్విస్ట్ ఉన్నప్పుడు ఎమోషన్ కూడా అదే రేంజ్ లో ఉండాలి. నిజానికి నాని, సుధీర్ బాబు లాంటి హీరోలు.. నివేత-అదితిరావు లాంటి హీరోయిన్లు ఉన్నప్పుడు ఇక ఎమోషన్ పరంగా తిరుగుండదని సగటు ప్రేక్షకుడు అనుకోవడంలో తప్పులేదు. కానీ ఆ అంచనాల్ని దర్శకుడు అందుకోలేకపోయాడు. ఫస్ట్ టైమ్ యాక్షన్ జానర్ ట్రై చేసిన ఇంద్రగంటి.. తన Core USP అయిన ఎమోషన్ ను మిస్ అయ్యాడు.

ఈ సినిమాలో బలహీనతలు ఎన్ని ఉన్నాయో.. అన్ని బలాలు కూడా ఉన్నాయి. 24 సినిమాల్లో హీరోగా చేసిన నాని, ఈ సినిమాలో ఒక్కసారిగా కరడుగట్టిన విలన్ గా (కొన్ని సీన్స్ లో సైకోగా కూడా) కనిపించి మెస్మరైజ్ చేసి పడేశాడు. నిజానికి మెస్మరైజ్ అనే పదం కూడా చిన్నదేమో. సినిమా లోపలకు వెళ్లేకొద్దీ నానిలో మచ్చుకు కూడా హీరోను చూడలేం. అంతలా విష్ణు పాత్రను పండించాడు. ఇక సూపర్ కాప్ గా సుధీర్ బాబు మరోసారి తన టాలెంట్ చూపించాడు. సిక్స్ ప్యాక్ బాడీలో, కొన్ని ఎమోషన్స్ లో సుధీర్ బెస్ట్ ఇచ్చాడు. అయితే ఇంతకుముందే చెప్పుకున్నట్టు సన్నివేశాల్లో బలం లేకపోవడంతో కొన్నిసార్లు ఇటు నాని, అటు సుధీర్ కూడా తేలిపోయారు.

ఓవరాల్ గా దర్శకుడు.. ఓ యాక్షన్ కథను తనదైన స్టయిల్ లో కొత్తగా చెప్పడానికి ట్రై చేశాడు. కానీ ఈ కథ, ఆ ట్విస్టులు అన్నీ తెలుగు ప్రేక్షకుడికి తెలిసినవే. మరీ ముఖ్యంగా ఈ 4 నెలల కాలంలో ఓటీటీలో యూనివర్సల్ కంటెంట్ చూసి ముదిరిపోయిన ప్రేక్షకుడికి V సినిమా ఆశించిన స్థాయి థ్రిల్ ఇవ్వదు.

ప్లస్ పాయింట్స్ - నాని విలనీ - సుధీర్ బాబు యాక్టింగ్ - తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ - సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ - కథలో కొత్తదనం లేకపోవడం - లవ్ ట్రాక్ పండకపోవడం - కామెడీ సీన్స్ క్లిక్ అవ్వకపోవడం - కొన్ని సన్నివేశాలు తేలిపోవడం

బాటమ్ లైన్ - పాత కథతో కొత్త ప్రయత్నం రేటింగ్ - 2.5/5