Sundeep Kishan’s ‘Ooru Peru Bhairavakona’ Review

Friday,February 16,2024 - 01:38 by Z_CLU

నటీ నటులు : సందీప్ కిషన్, కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ, వైవా హర్ష , రవి శంకర్ , వెన్నెల కిషోర్ తదితరులు

సంగీతం: శేఖర్ చంద్ర

డీవోపీ: రాజ్ తోట

ఎడిటర్: ఛోటా కె ప్రసాద్

మాటలు : భాను భోగవరపు, నందు సవిరిగాన

సమర్పణ: అనిల్ సుంకర

నిర్మాత: రాజేష్ దండా

సహ నిర్మాత: బాలాజీ గుత్తా

బ్యానర్లు: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్

కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: విఐ ఆనంద్

విడుదల తేదీ : 16 ఫిబ్రవరి 2024

హారర్ ఎలిమెంట్స్ తో ఇంట్రెస్టింగ్ ఫాంటసీ స్టోరీ తో తెరకెక్కిన 'ఊరు పేరు భైరవ కోన' ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. టీజర్ , ట్రైలర్ తో మంచి బజ్ తెచ్చుకున్న ఈ సినిమా ఎక్స్ పెక్టేషన్స్ అందుకుందా ? వరుస ఫెయిల్యూర్స్ తో కెరీర్ కొనసాగిస్తున్న హీరో సందీప్ కిషన్ ఈ సినిమాతో హిట్ కొట్టాడా ? జీ సినిమాలు ఎక్స్ క్లూసివ్ రివ్యూ.

కథ :

షూటింగ్స్ లో ఫైటర్ గా పనిచేసే బసవ లింగం (సందీప్ కిషన్) భూమి( వర్ష బొల్లమ్మ) తో ప్రేమలో పడతాడు. మొదటి చూపులోనే భూమిపై అమితమైన ఇష్టం పెంచుకున్న బసవకి అనుకోకుండా ఆమెను కిడ్నప్ చేసి బందించాల్సి వస్తుంది. ఆ తర్వాత బసవ బంగారం దొంగతనం చేసి ఊహించని విధంగా ఆత్మలు నివసించే భైరవకోనలోకి అడుగుపెడతాడు.

ఇంతకీ భూమి ఎవరు ? ఆమె కథేంటి ?... బసవ తన స్నేహితుడితో కలిసి ఎంతో విలువైన బంగారాన్ని దొంగలించి భైరవకోన లో ఎలా అడుగుపెట్టాడు ? చివరికి ఆ ఊరి నుండి బంగారు నగలతో ఎలా బయట పడ్డాడు ? అనేది మిగతా కథ.

నటీ నటుల పనితీరు :

సందీప్ కిషన్ ఎప్పటిలానే తన పాత్రకు న్యాయం చేశాడు. బసవ పాత్రతో సినిమాకు హైలైట్ గా నిలిచాడు. వర్ష బొల్లమ్మకి కథలో చాలా ఇంపార్టెంట్ ఉన్న పాత్ర దక్కడంతో నటిగా మంచి మార్కులు అందుకుంది. అగ్రహారం గీత పాత్రలో కావ్య థాపర్ పరవాలేదనిపించుకుంది. జాన్ పాత్రలో వైవా హర్ష , డాక్టర్ నారప్ప పాత్రలో వెన్నెల కిషోర్ మంచి నటన కనబరిచి హిలేరియస్ గా నవ్వించారు. రాజప్ప గా రవిశంకర్ , పెద్దమ్మ గా వడివుక్కరసి ఆకట్టుకున్నారు. మిగతా నటీ నటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు :

సినిమాకు శేఖర్ చంద్ర ఇచ్చిన సంగీతం హైలైట్ గా నిలిచింది. నిజమే నే చెబుతున్నా .. హమ్మ హమ్మ పాటలు బాగున్నాయి. నిజమే నే చెబుతున్నా సాంగ్ సినిమాకు మేజర్ హైలైట్ అని చెప్పొచ్చు. అక్కడక్కడా వచ్చే నేపథ్య సంగీతం బాగుంది. మొదటి భాగంలో వచ్చే సన్నివేశాలకు బెస్ట్ స్కోర్ ఇచ్చాడు శేఖర్ చంద్ర. క్లైమాక్స్ లో వచ్చే సాంగ్ పరవాలేదు. రాజ్ తోట కెమెరా వర్క్ బాగుంది. కొన్ని సన్నివేశాల్లో అతని పనితనం కనిపించింది . చోటా కె ప్రసాద్ ఎక్కువ డ్రాగ్ లేకుండా ఎడిట్ చేశారు.

భాను , నందు అందించిన మాటలు కొన్ని చోట్ల బాగా వర్క్ అయ్యాయి. కామెడీ డైలాగులు థియేటర్ లో బాగా పేలాయి. విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ బాగుంది. కాస్ట్యూమ్స్ , మేకప్ బాగా కుదిరాయి. దర్శకుడు వి ఐ ఆనంద్ ఈ సినిమా కోసం తీసుకున్న పాయింట్ బాగుంది. దానికి రాసుకున్న స్క్రీన్ ప్లే లో కొన్ని మైనస్ లు కనిపిస్తాయి. తనకున్నఅనుభవంతో హారర్ కామెడీ తో నవ్వించాడు. రాజేష్ దండా మంచి ప్రొడక్షన్ వేల్యూస్ తో సినిమాను క్వాలిటీగా నిర్మించారు.

జీ సినిమాలు రివ్యూ :

ప్రస్తుతం హారర్ ఎలిమెంట్స్ తో వస్తున్న విలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమాలు మంచి సక్సెస్ అవుతున్నాయి. ఈ జోనర్ లో వచ్చిన విరూపాక్ష 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. హారర్ జోనర్ లో ఇది వరకే ఎక్కడికి పోతావు చిన్నవాడా తో మంచి సక్సెస్ అందుకున్నాడు వి ఐ ఆనంద్. ఎప్పటికప్పుడు సరికొత్త కాన్సెప్ట్స్ తో సినిమాలు చేసే ఈ దర్శకుడు మళ్ళీ హారర్ జోనర్ లో ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఊరు పేరు భైరవకోన సినిమా చేశాడు. గరుడ పురాణంలో కనిపించకుండా పోయిన నాలుగు పేజీలు , వాటిలో ఉండే విషయాలను తెలియజేస్తూ ఆసక్తిగా సినిమాను మొదలు పెట్టి అక్కడక్కడా వినోదం అందిస్తూ ఎంటర్టైన్ చేశాడు. మొదటి పది హేను నిమిషాల పాటు ప్రేక్షకుల్లో మంచి ఆసక్తినెలకొల్పాడు. బసవ తన మిత్రుడితో కలిసి బంగారం దొంగతనం చేసిన తర్వాత ఊహించని విధంగా భైరవ కోన అనే ఊరిలో అడుగుపెట్టడం నుండి...అసలు ఈ కథ ఎలా వెళ్తుందా ? అనే ఆసక్తి క్రియేట్ అయ్యేలా చేశాడు దర్శకుడు.

ఊరి నిండా ఆత్మలు , హీరో కారులో అక్కడికి అడుగు పెట్టడం ఆసక్తిగా ఉంది. ఆ ఆసక్తి అలా కొనసాగుతూనే వైవా హర్ష , వెన్నెల కిషోర్ పాత్రలతో మంచి వినోదం అందుతుంది. ఇంటర్వెల్ వరకూ ఏం జరగబోతుంది అని క్యూరియస్ గా ఎదురుచూసేలా చేశాడు దర్శకుడు వి ఐ ఆనంద్. ఫస్ట్ హాఫ్ లో వచ్చే సైకిల్ గ్యాంగ్ ఫైట్ , కామెడీ , ఇంటర్వెల్ బ్లాక్ బాగా కుదిరాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగా వర్కౌట్ అయ్యింది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సాంగ్  హైలైట్ గా నిలిచింది. సెకండాఫ్ లో కామెడీ, ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ , డివోషనల్ సాంగ్ తో వచ్చే క్లైమాక్స్ ఫైట్ పరవాలేదనిపిస్తుంది. లవ్ ట్రాక్ వర్కౌట్ అవ్వలేదు. ఇక సెకండాఫ్ చాలా ఫాస్ట్ ఫేజ్ లో వెళ్తున్నట్టు అనిపించి సినిమా తొందరగా ముగిసినట్టు అనిపిస్తుంది.

హారర్ ఎలిమెంట్స్ తో ఫాంటసీ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో కామెడీ , సాంగ్స్ , సైకిల్ ఫైట్ , వీ ఎఫ్ ఎక్స్ వర్క్ , విజువల్స్ ఇంటర్వెల్ బ్లాక్ , గరుడ పురాణంతో వచ్చే సీన్స్ , రెండో సారి రాజప్ప ఇంట్లోకి వెళ్లే సీన్ హైలైట్ గా నిలిచాయి. ఓవరాల్ గా ఊరు పేరు భైరవకోన ఎంటర్టైన్ మెంట్ కోసం చూడొచ్చు.

రేటింగ్ : 2. 75 / 5