Movie Review – Sridevi Soda center

Friday,August 27,2021 - 03:10 by Z_CLU

నటీనటులు : సుదీర్ బాబు , ఆనంది , VK నరేష్ , రఘుబాబు, పవేల్ నవగీతాన్ , అజయ్, హర్ష వర్ధన్, సత్యం రాజేష్, రోహిణి తదితరులు

సంగీతం : మణిశర్మ

ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్

కెమెరా మెన్ : శ్యామ్ దత్ సైనుద్దీన్

నిర్మాణం : 70MM ఎంటర్టైన్మెంట్స్

నిర్మాతలు : విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి

ర‌చ‌న‌-దర్శకత్వం : కరుణ కుమార్

విడుదల తేది : 27 ఆగస్ట్ 2021

నిడివి : 153 నిమిషాలు

ఫస్ట్ గ్లిమ్స్ తోనే అందరినీ ఎట్రాక్ట్ చేసింది 'శ్రీదేవి సోడా సెంటర్'. 'పలాస 1978' ఫేం కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఓ మోస్తరు అంచనాలతో ఈరోజే థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మరి ఈ సినిమా అంచనాలను అందుకుందా ? సుదీర్ బాబు హిట్ కొట్టాడా? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

sridevi soda center highlights కథ :

అమలాపురంలో ఓ పల్లెటూరిలో ఉండే సూరి బాబు(సుదీర్ బాబు) ఆ ఊరిలో జరిగే అన్ని కార్యక్రమాలకు లైటింగ్ పెడుతూ ఎప్పటికైనా పట్నంలో ఓ లైటింగ్ షాపు పెట్టుకోవాలనుకుంటాడు. అందుకోసం డబ్బులు దాచుకుంటూ ఉంటాడు. ఇక అదే ఊరిలో ఉండే కాశి( పవేల్ నవగీతన్)తో అనుకోకుండా సూరి బాబుకి గొడవ అవుతుంది. సూరి బాబు తనకి దొరక్కపోతాడా? అంటూ చాన్స్ కోసం ఎదురుచూస్తుంటాడు కాశీ.

ఊళ్ళో జరిగే తిరనాళ్ళల్లో శ్రీదేవి సోడా సెంటర్ లో ఉండే శ్రీదేవి(ఆనంది)ని చూసి ప్రేమలో పడతాడు సూరిబాబు. శ్రీదేవి కూడా మెల్లగా సూరి బాబు ప్రేమలో పడుతుంది. ఇంతలో సూరిబాబు హత్య కేసులో జైలుకి వెళ్తాడు. ఇంతకీ ఆ హత్య చేసిందెవరు? చివరికి సూరిబాబు, శ్రీదేవి ఒకటయ్యారా ? కథలో ట్విస్టు ఏంటి ? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

 

నటీ నటుల పనితీరు :

సూరిబాబు పాత్రలో హీరో సుధీర్ బాబు మంచి నటన కనబరిచాడు. పల్లెటూరి కుర్రాడిగా మెప్పించాడు. యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు ఎమోషనల్ సీన్స్ లో కూడా మంచి మార్కులు అందుకున్నాడు. చాలా ఏళ్ళకి మళ్ళీ తెలుగులో హీరోయిన్ గా కనిపించిన ఆనంది శ్రీదేవి పాత్రకు న్యాయం చేసింది. పల్లెటూరి అమ్మాయిగా ఆకట్టుకుంది. విలన్ గా నటించిన పవేల్ నవగీతన్ తన నటనతో పాత్రను రక్తి కట్టించాడు. అతనికి రఘు కుంచె డబ్బింగ్ చెప్పడంతో క్యారెక్టర్ ఎలివేట్ అయింది. నరేష్ విజయ కృష్ణ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. కథలో కీలకమైన పాత్రలో ఒదిగిపోయాడు. హీరో తండ్రి పాత్రలో రఘు బాబు, ఫ్రెండ్ క్యారెక్టర్ లో సత్యం రాజేష్ , హీరోకి హెల్ప్ చేసే పాత్రలో హర్శవర్షన్, హీరోయిన్ తల్లి పాత్రలో నటించిన నటి బాగా నటించారు. అజయ్ , కోటేశ్వరావు, రోహిణి , రాకెట్ రాఘవ తదితరులు వారి పాత్రలకు న్యాయం చేశారు.

 

సాంకేతిక వర్గం పనితీరు :

సినిమాకు టెక్నీషియన్స్ నుండి బెస్ట్ సపోర్ట్ లభించింది. దర్శకుడు ఈసారి అందరూ సీనియర్ లను తీసుకోవడంతో సినిమాకు టెక్నికల్ గా బలం చేకూరింది. ముఖ్యంగా మణిశర్మ మ్యూజిక్ సినిమాకు హైలైట్. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా బాగుంది. కొన్ని ఎమోషనల్ సన్నివేశాలకు , యాక్షన్ సీన్స్ కి మణి అందించిన నేపథ్య సంగీతం మంచి ఇంపాక్ట్ తీసుకొచ్చింది. శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ కూడా ప్లస్ అయింది. కొన్ని సన్నివేశాలను తన కెమెరా వర్క్ తో అందంగా చూపించారు. ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమాను కట్ చేసిన శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ కూడా కలిసొచ్చింది. రామ‌కృష్ణ‌- మౌనిక‌ ఆర్ట్ వర్క్ బాగుంది. జాతర సెట్ తో పాటు కొన్ని సన్నివేశాల్లో వారి ఆర్ట్ ప్రతిభ కనిపించింది. డ్రాగ‌న్ ప్ర‌కాష్‌, కె ఎన్ ఆర్ (నిఖిల్‌) , రియ‌ల్ స‌తీష్ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ మాస్ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసేలా ఉన్నాయి.

నాగేంద్ర కాశీ రాసిన కథను తన తన టేకింగ్ తో రియాలిటీగా చూపిస్తూ తెరకెక్కించాడు కరుణ కుమార్. సందర్భానుసారంగా వచ్చే మాటలు బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కథకి తగ్గట్టుగా ఉన్నాయి.

Sridevi Soda Centre movie Sudheer Babu 2

జీ సినిమాలు రివ్యూ :

తమిళ్, మలయాళంలో తెరకెక్కే కొన్ని మట్టి కథలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఇప్పుడు తెలుగులో కూడా అలాంటి కథలు పుట్టుకొస్తున్నాయి. కొందరు సీనియర్ దర్శకులతో పాటు అప్ కమింగ్ దర్శకులు కూడా అలాంటి కథలతో సినిమాలు చేస్తున్నారు. శ్రీదేవి సోడా సెంటర్ అలాంటి కథే. మొదటి సినిమాతోనే దర్శకుడిగా ఓ సాహసం చేసి మంచి గుర్తింపు అందుకున్న కరుణ కుమార్ మరోసారి అలాంటి ఎమోషనల్ కథనే ఎంచుకొని దాని చుట్టూ కమర్షియల్ హంగులు అద్దాడు. లవ్ , సెంటిమెంట్ ,ఎమోషన్ ఇలా అన్ని లేయర్స్ ని ఫిక్స్ చేసి స్క్రీన్ పై ఓ మంచి కథను చూపించాడు.

రస్టిక్ క్యారెక్టర్స్ తో మంచి సన్నివేశాలు రాసుకొని వాటిని అంతే రస్టిక్ గా తెరకెక్కించాడు దర్శకుడు. ఒక గ్రామీణ కథ అందులో కొన్ని పాత్రలు , వాటి చుట్టూ జరిగే సంఘటనల ఆదరంగా ప్రేమతో కూడిన డ్రామాగా సినిమాను తెరకెక్కించాడు. మొదటి భాగంలో వచ్చే ఐటెం సాంగ్ , పడవ పోటీలు ఆ తర్వాత వచ్చే కొన్ని సన్నివేశాలు అలరిస్తాయి. అలాగే రెండో భాగంలో వచ్చే ఇంటెన్స్ సీన్స్ , ప్రీ క్లైమాక్స్ .. క్లైమాక్స్ సన్నివేశాలు , ఊహించని ట్విస్ట్ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా సినిమాను ఎవరూ ఊహించని ఓ ట్విస్టుతో ముగించి దాని తర్వాత సిరివెన్నెల మాటలతో సందేశం అందించాడు దర్శకుడు. నాగేంద్ర కాశి రాసిన కథను తన డైరెక్షన్ స్కిల్స్ తో చాలా నేచురల్ గా రియలిస్టిక్ గా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు.

సుదీర్ బాబు నటన , యాక్షన్ ఎపిసోడ్స్ , రొమాంటిక్ ఎపిసోడ్ , డ్రామా , ఎమోషనల్ సీన్స్ , క్లైమాక్స్ ట్విస్ట్ సినిమాను నిలబెట్టాయి. కాకపోతే లవ్ ట్రాక్ మాత్రం అంత ఎఫెక్టివ్ గా అనిపించదు. సుదీర్ బాబు , ఆనంది మద్య కెమిస్ట్రీ అంతగా కుదరకపోవడంతో లవ్ సీన్స్ ఇంప్రెస్ చేయలేకపోయాయి. అలాగే దర్శకుడు కొన్ని లాజిక్స్ కూడా మిస్ అయ్యాడు. అలాగే మొదటి భాగంలో కొన్ని సన్నివేశాలు ల్యాగ్ అనిపిస్తూ బోర్ కొట్టిస్తాయి. ఫైనల్ గా విలేజ్ రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా 'శ్రీదేవి సోడా సెంటర్' ఆకట్టుకుంటుంది.

రేటింగ్ : 3/5

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics