Movie Review – Sreekaram

Thursday,March 11,2021 - 12:54 by Z_CLU

నటీ నటులు : శ‌ర్వానంద్, ప్రియాంక మోహన్ , రావు రమేష్, సాయి కుమార్, నరేష్ తదితరులు

సంగీతం :  మిక్కి జె.మేయ‌ర్‌

సినిమాటోగ్ర‌ఫీ:  యువ‌రాజ్‌

ఆర్ట్ డైరెక్ట‌ర్ :  అవినాశ్ కొల్ల‌

డైలాగ్స్‌:  సాయిమాధ‌వ్ బుర్రా

ఎడిట‌ర్‌:  మార్తాండ్ కె.వెంక‌టేశ్‌

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  హ‌రీశ్ క‌ట్టా

బ్యాన‌ర్‌ : 14 రీల్స్ ప్లస్‌

నిర్మాత‌లు:  రామ్ ఆచంట‌, గోపీచంద్ ఆచంట‌

క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం:  కిశోర్ రెడ్డి

విడుదల : 11 మార్చ్ 2021

సెన్సార్ : U

"రైతు కొడుకు రైతే అవ్వాలి" అనే కాన్సెప్ట్ తో శర్వానంద్ హీరోగా తెరకెక్కిన 'శ్రీకారం' ఈరోజే థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మరి వ్యవసాయం నేపథ్యంతో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా సందేశంతో మెప్పించిందా ? వరుస అపజయలతో కెరీర్ కొనసాగిస్తున్న శర్వా ఈ సినిమాతో విజయాలకు శ్రీకారం చుట్టాడా ? జీ సినిమాలు రివ్యూలో చూద్దాం.

Sharwanand Sreekaram Release March 11 zeecinemalu కథ :

హైదరాబాద్లో సాఫ్ట్ వేర్ గా ఉద్యోగం చేసే కార్తీక్(శర్వానంద్) చేస్తున్న ఉద్యోగం మానేసి తన సొంత ఊరికెళ్లి రైతుగా మారాలనుకుంటాడు. ఈ క్రమంలో నిత్యం తన వెంట పడే  ప్రేమించిన చైత్ర (ప్రియాంక) ని కూడా దూరం చేసుకుంటాడు.

మరో వైపు ఊరికి పెద్ద మనిషిగా ఉన్న ఏకాంబరం(సాయి కుమార్) మరణించిన తన మావయ్య అనంత రాజు(గిరిబాబు) జనాలకి ఉచితంగా పంచిన పొలాలను మళ్లీ తిరిగి సొంతం చేసుకునే ప్రయత్నాలు చేస్తుంటాడు.

వ్యవసాయం మానేసి ఊరి నుండి సిటీకెళ్లి పనులు చేసుకునే జనాల్ని మళ్లీ పల్లెటూరికి తీసుకొచ్చి వ్యవసాయంతో డబ్బు సంపాదించొచ్చని కార్తీక్ ఎలా తెలియజేశాడు.? పాత పద్దతిలో ఉమ్మడి సేద్యం చేసి లాభం అందుకోవచ్చని ఎలా రుజువు చేశాడు ? కార్తీక్ చేసే సేద్యాన్ని దెబ్బతీసేందుకు ఏకాంబరం ఎలాంటి ప్రయత్నాలు చేశాడు..? ఫైనల్ గా కార్తీక్ తను అనుకున్న పని చేసి రైతుగా ఎలాంటి గౌరవం అందుకున్నాడు  అనేది మిగతా కథ.

 

నటీ నటుల పనితీరు :

కార్తీక్ పాత్రలో శర్వానంద్ బాగా నటించాడు. ఈ టైప్ క్యారెక్టర్ ఇంతకుముందు   చేయడంతో చాలా ఈజ్ తో చేశాడు. కథానాయికగా ప్రియాంక మోహన్ నటనతో ఫరవాలేదనిపించుకుంది. కథలో కీలకమైన పాత్ర దొరకడంతో రావు రమేష్ మరోసారి నటుడిగా బెస్ట్ అనిపించుకున్నాడు. నరేష్ తన పాత్రలో ఒదిగిపోయాడు. సాయి కుమార్  క్యారెక్టర్ కి పెర్ఫెక్ట్ అనిపించాడు. హీరో తల్లి పాత్రలో ఆమని ఆకట్టుకుంది.

హీరోయిన్ తండ్రిగా మురళి శర్మ, రైతుగా దేవి ప్రసాద్ మంచి నటన కనబరిచారు. ప్రియ, ప్రభాస్ శ్రీను, సప్తగిరి, స్వప్నిక,  నాని తదితరులు పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు :

సినిమాకు మిక్కీ జే మేయర్ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. "వస్తానంటివో పోతానంటివో" పాట మినహా మిగతా పాటలు ఆకట్టుకోలేదు. యువరాజ్ కెమెరా వర్క్ బాగుంది. కొన్ని సన్నివేశాలను బాగా పిక్చరైజ్ చేసాడు. మార్తాండ్ ఎడిటింగ్ ఫరవాలేదు. కొన్ని సన్నివేశాల్లో ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా పనితనం కనిపించింది.

సాయి మాధవ్ బుర్రా అందించిన మాటలు కొన్ని సందర్భాల్లో అలరించాయి. ఆయన రాసిన డైలాగ్స్ కీలక సన్నివేశాలకు మరింత బలం చేకూర్చాయి. దర్శకుడు కిషోర్  కొన్ని సీన్స్ ని అనుభవం ఉన్న దర్శకుడిలా తెరకెక్కించాడు. కాకపోతే మొదటి సినిమా కావడంతో చాలా చోట్ల తడబడ్డాడు. 14 రీల్స్ ప్లస్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

Sharwanand-Sreekaram-movie-stills జీ సినిమాలు సమీక్ష :

సంక్రాంతి పండక్కి సిటీ నుండి ఊరెళ్లి తమ వారితో నాలుగు రోజుల పాటు సంతోషంగా గడిపే సన్నివేశాలు , పాటతో సినిమాను ప్రారంభించిన దర్శకుడు కిషోర్ మొదటి భాగాన్ని ఇరికించినట్టుగా ఉండే లవ్ ట్రాక్ , పల్లెటూరిలో వచ్చే ఎమోషనల్ సీన్స్ తో ముందుకు నడిపించాడు. 'రైతు కొడుకు రైతే అవ్వాలి' అంటూ తను చెప్పాలనుకున్న కథను ఎక్కడా తడబడకుండా కమర్షియల్ అంశాలను ఎక్కువగా ఇమిడించకుండా నిజాయితిగా చెప్పే ప్రయత్నం చేశాడు.

సినిమా ప్రారంభమైన చాలా సేపటికి అసలు కథలోకి తీసుకెళ్లాడు దర్శకుడు. అప్పటి వరకు సాఫ్ట్ వేర్ ఆఫీస్ సీన్స్, లవ్ ట్రాక్ తో నడిపించాడు. కొన్నేళ్ల క్రితం ఈ కథను రాసుకొని షార్ట్ ఫిల్మ్ చేసిన దర్శకుడు కిషోర్ దాన్ని సినిమాగా మార్చేందుకు సినిమాటిక్ లిబర్టీస్ తీసుకొని తెరకెక్కించాడు. అలాగే కరోన ఎఫెక్ట్, లాక్ డౌన్ ని కూడా కథలో చేర్చి దాని ద్వారా రైతు గొప్పదనం తెలియజేసే సన్నివేశాలు జోడించాడు. కిషోర్ రాసుకున్న కొన్ని ఎమోషనల్ సన్నివేశాలకు సాయి మాధవ్ బుర్రా సంభాషణలు  బలం చేకూర్చి ఆకట్టుకునేలా చేశాయి. అలాగే కొన్ని సన్నివేశాలను మనసుకి హత్తుకునేలా తెరకెక్కించాడు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అలాగే తండ్రి కొడుకుల మధ్య ఉండే ఎమోషన్ ని బాగా చూపించాడు. మొదటి సినిమాకు ఇలాంటి కథను ఎంచుకొని చక్కని సందేశం ఇచ్చిన దర్శకుడిగా కిషోర్ మెచ్చుకోవాలి. కానీ ఈ కథతో  ప్రేక్షకులను పూర్తి స్థాయిలో ఆకట్టుకునేలా  తెరకెక్కించడంలో మాత్రం విఫలమయ్యాడు. ముఖ్యంగా సినిమాను నిలబెట్టే బలమైన సన్నివేశాలు లేకపోవడం సినిమాకు మైనస్.

సినిమాలో వచ్చే కొన్ని రైతు సన్నివేశాలు 'శ్రీమంతుడు', 'మహర్షి' సినిమాలను గుర్తుచేస్తే , శ్రీకారం బ్రాండ్ తో కార్పొరేట్ కంపెనీకి పంటను అమ్మే సన్నివేశాలు 'భీష్మ' ని గుర్తుచేస్తాయి. కిషోర్ చెప్పాలనుకున్న పాయింట్ తో ఆల్రెడీ సినిమాలు రావడం అవి విజయవంతం అవ్వడం వల్ల ప్రేక్షకులకు ఈ సినిమా చూస్తే ఆ సినిమాలు మైండ్ లో మెదులుతాయి. అది సినిమాకు అతిపెద్ద మైనస్ అని చెప్పొచ్చు. ఉమ్మడి సేద్యం ఒక్కటే  ఇందులో దర్శకుడు చెప్పిన కొత్త పాయింట్. ఇక రెండో భాగం నుండి  వ్యవసాయం గురించి మెల్ల మెల్లగా చెప్తూ వచ్చిన దర్శకుడు క్లైమాక్స్ లో హీరోతో మరింత గట్టిగా ఏదైనా చెప్పిస్తాడనుకుంటే  ఉన్నపళంగా క్లైమాక్స్ ని చుట్టేసి శుభం కార్డు వేసేశాడు.  ఓవరాల్ గా 'శ్రీకారం' పూర్తి స్థాయిలో ఆకట్టుకోక పోవచ్చు కానీ నిరాశ పరచదు.

ప్లస్ పాయింట్స్ :

శర్వానంద్ నటన

కథ

కొన్ని ఎమోషనల్ సీన్స్

వస్తానంటివో పోతానంటివో సాంగ్

నేపథ్య సంగీతం

మైనస్ :

లవ్ ట్రాక్

స్క్రీన్ ప్లే

క్లైమాక్స్

 

రేటింగ్ : 2.75 / 5