‘SoloBrathukeSoBetter’ Movie Review

Friday,December 25,2020 - 02:08 by Z_CLU

నటీ నటులు : సాయితేజ్‌, న‌భా న‌టేశ్, రాజేంద్ర ప్రసాద్ , రావు రమేష్ , ఝాన్సీ, వెన్నెల కిషోర్ త‌దిత‌రులు

సంగీతం: త‌మ‌న్‌

సినిమాటోగ్ర‌ఫీ: వెంక‌ట్ సి.దిలీప్‌

నిర్మాత‌: బీవీఎస్ఎన్‌.ప్ర‌సాద్‌

రచన - ద‌ర్శ‌క‌త్వం: సుబ్బు

విడుదల : జీ స్టూడియోస్

విడుదల తేది : 25 డిసెంబర్ 2020

Covid19 వ్యాప్తి కారణంగా మూత పడిన సినిమా థియేటర్లు ఎట్టకేలకు తెరుచుకున్నాయి. లాక్ డౌన్ తర్వాత మొట్ట మొదటి తెలుగు సినిమాగా థియేటర్స్ లోకి సోలోగా ఎంట్రీ ఇచ్చింది 'సోలో బ్రతుకే సో బెటర్'. మరి చాలా నెలలుగా ఇబ్బందులు ఎదుర్కున్న జనాలకి ఈ సినిమా పూర్తి వినోదం అందించి ఆకట్టుకుందా ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

కథ :

తన స్టూడెంట్ లైఫ్ ను సోలో  గా ఎంజాయ్ చేస్తూ పెళ్లికి దూరంగా ఉండాలనుకుంటాడు విరాట్ (సాయి ధరం తేజ్). తన అనుభవంతో సింగిల్ గా ఎందుకు ఉండాలో 108 శ్లోకాలతో ఓ పుస్తకం రాసి తన కాలేజీలో ఉన్న  సింగిల్స్ అందరికీ అందజేస్తాడు. విరాట్ రాసిన ఆ శ్లోకాలను అతని మాటలను సీరియస్ గా తీసుకొని పెళ్లికి దూరంగా ఉంటారు కొందరు సింగిల్స్.

సోలో బ్రతుకే సో బెటర్ అంటూ విరాట్ చెప్పిన మాటలను విని తన కాలేజిలో జూనియర్ అయిన అమృత(నభా నటేష్) కూడా సింగిల్ గా ఉండాలని నిర్ణయించుకొని పెళ్లికి దూరంగా ఉంటుంది. అయితే ఒకానొక టైంలో వేణు మావయ్య(రావు రమేష్) సోలో జీవితాన్ని చూసి అతని మాటలు విని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న విరాట్ అనుకోకుండా అమృత ప్రేమలో పడతాడు. చివరికి తన సిద్దాంతాన్ని పాటిస్తూ పెళ్ళికి దూరంగా ఉండాలనుకున్న అమృతను విరాట్ ఎలా పెళ్లి వైపుకి తీసుకొచ్చాడు అనేది మిగతా కథ.

నటీ నటుల పనితీరు :

మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ లో మంచి ఈజ్ ఉంటుంది. ఎలాంటి క్యారెక్టర్ అయినా తన ఎనర్జీతో పర్ఫెక్ట్ డైలాగ్ డెలివరీతో న్యాయం చేస్తాడు. ఈ సినిమాలో కూడా విరాట్ క్యారెక్టర్ పర్ఫెక్ట్ అనిపించుకొని హీరోగా మంచి మార్కులే కొట్టేశాడు. మొదట ప్రేమ, పెళ్లికి దూరంగా ఉంటూ చివరికి మనసు మార్చుకొని పెళ్లి చూసుకోవాలనుకునే కుర్రాడి పాత్రతో మెప్పించాడు. గత సినిమాల్లో తన ఎనర్జిటిక్ టాలెంట్ తో హీరోయిన్ గా రుజువు చేసుకున్న నభా నటేష్ మరోసారి అమృతగా ఆకట్టుకొని యువతను ఎట్రాక్ట్ చేసింది.

రావు రమేష్ , రాజేంద్ర ప్రసాద్, నరేష్ తమకిచ్చిన ఎమోషనల్ క్యారెక్టర్స్ లో ఎప్పటిలాగే జీవించారు. ముఖ్యంగా రావు రమేష్ పాత్ర తాలుకు ఎమోషన్ కథకు బలం చేకూర్చింది. వెన్నెల కిశోర్, సత్య కామెడీ వర్కౌట్ అయ్యింది. రెండో భాగంలో వచ్చే వెన్నెల కిషోర్ కామెడీ ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్ మెంట్ అందించింది. హైపర్ ఆది పెయింటింగ్ కామెడీ క్లిక్ అయ్యింది. ఝాన్సీ , సుదర్శన్ , కళ్యాణి నటరాజన్ తదితరులు తమ రోల్స్ కి న్యాయం చేసారు.

సాంకేతిక వర్గం పనితీరు :

యూత్ ని థియేటర్స్ కి రప్పించాలంటే ముందుగా సినిమాలో మంచి పాటలు ఉండాలి. రిలీజ్ కి ముందే తన సాంగ్స్ తో ఎట్రాక్ట్ చేసి సినిమాకు వెన్నుముకలా నిలిచిన తమన్ నేపథ్య సంగీతంతోనూ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా 'నో పెళ్లి ','హే ఇది నేనెనా','ఒగ్గిసి పోకే అమృత' పాటలు థియేటర్స్ లో మేజిక్ క్రియేట్ చేసాయి. అలాగే వెంక‌ట్ సి.దిలీప్‌ సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. నవీన్ నూలి క్రిస్పి ఎడిటింగ్ బోర్ కొట్టకుండా చేసింది.

అవినాష్ ఆర్ట్ వర్క్ బాగుంది. సినిమాలో ఉన్న రెండు యాక్షన్ ఎపిసోడ్స్ మాస్ ఆడియన్స్ అలరించేలా ఉన్నాయి. దర్శకుడు సుబ్బు తను రాసుకున్న కథను మంచి స్క్రీన్ ప్లేతో బ్యాలెన్సింగ్ గా తీసి మెప్పించాడు. అక్కడక్కడా అనుభవం ఉన్న దర్శకుడిగా తన మార్క్ చూపించి అలరించాడు సుబ్బు . శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

జీ సినిమాలు సమీక్ష :

లైఫ్ అంతా సోలోగా బతికేయాలనుకునే కుర్రాళ్లు చాలామంది ఉంటారు. కానీ దాన్నే ఓ స్లోగన్ గా మార్చి, ఉద్యమం చేసిన కరడుగట్టిన కుర్రాడి కథ ఇది. సోలో బ్రతుకే సో బెటర్ అనుకునే ఇలాంటి కుర్రాడు ప్రేమలో పడాలంటే బలమైన కారణాలుండాలి, అందమైన అమ్మాయి కావాలి. వీటన్నింటికీ తోడు సోలో బ్రతులో సోల్ ఉండదనే విషయాన్ని తనకుతానుగా తెలుసుకోవాలి. ఈ సెటప్ అంతా సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలో చక్కగా కుదిరింది. అందుకే ఇది అందరికీ నచ్చింది.

ప్రేమంటే ఇష్టంలేని వ్యక్తి లవ్ లో పడడం కామన్. కానీ ఇక్కడ హీరో పరిస్థితి అది కాదు. ఏకంగా ఓ సమూహాన్నే మోటివేట్ చేస్తాడు. ప్రేమించొద్దని చెబుతాడు. అలాంటి వ్యక్తి కొన్ని బలమైన పరిస్థితుల వల్ల మారతాడు. మరి ఇన్నాళ్లూ తను ప్రభావితం చేసిన జనాల్ని ఎలా మార్చాడు. చెప్పుకోడానికి సీరియస్ గా ఉన్నప్పటికీ.. దీన్ని సింపుల్ గా, సరదాగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు సుబ్బు.

విరాట్ రాసుకున్న 108 శ్లోకాస్ ను టైటిల్ నుండి ఆడియన్స్ కి ఎక్కించిన దర్శకుడు తను చెప్పాలనుకున్న పాయింట్ ను క్లియర్ కట్ గా చెప్తూ మంచి ఎండింగ్ ఇచ్చాడు. సాయితేజ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ కు, నభా నటేష్ అందాలు, రావురమేష్ లాంటి ఇతర సీనియర్ నటుల సహకారం తోడవ్వడంతో.. చాన్నాళ్ల తర్వాత థియేటర్లకు వచ్చిన ఆడియన్స్ కు మంచి ఫీల్ అందించింది ఈ మూవీ.

యూత్ కి నచ్చే సన్నివేశాలు, ఫన్ ఎలిమెంట్స్, సూపర్ హిట్ సాంగ్స్ ఇలా అన్ని కలగలిపిన 'సోలో బ్రతుకే సో బెటర్' జనాలకు మంచి వినోదం అందించింది. సినిమాలో సాయి తేజ్ , నభా నటేష్ లవ్ ట్రాక్ ని బాగా రాసుకొని లవ్ సీన్స్ తో మెప్పించాడు దర్శకుడు. మొదటి భాగంలో వచ్చే ఫన్ ఎలిమెంట్స్ తో పాటు రెండో భాగంలో కూడా కొన్ని కామెడీ సన్నివేశాలు రాసుకొని నవ్వించాడు.

సోలో బ్రతుకే సో బెటర్ అనుకున్న ఓ కుర్రాడు తనకు ఎదురైన పరిస్థితుల దృష్ట్యా సోలో బ్రతుకంటే సోల్ లేని బ్రతుకని తెలుసుకొనే కథతో సినిమాను తెరకెక్కించిన సుబ్బు.. అక్కడక్కడ తడబడినప్పటికీ క్లీన్ ఎంటర్ టైనర్ ను అందించగలిగాడు. బోర్ కొట్టే టైంలో సరైన కామెడీతో నవ్వించి ఆడియన్స్ కి రిలీఫ్ ఇచ్చాడు.

రెండో భాగంలో తేజ్, నభా లవ్ ట్రాక్ , సాంగ్స్ , రావు రమేష్ డెత్ సీన్ ఇలా దర్శకుడు కొన్ని పకడ్బందీగా ప్లాన్ చేసి కంప్లీట్ కమర్షియల్ సినిమాగా తీర్చిదిద్దాడు. యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం కథలో ఇరికించినట్టుగా అనిపించినప్పటికీ... సీత-రాముడి కాన్సెప్ట్ తో కొత్తగా కంపోజ్ చేసి ఎపిసోడ్స్ మాస్ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తాయి. క్లైమాక్స్ ను సింపుల్ గా ముగించినప్పటికీ.. ఓవరాల్ గా 'సోలో బ్రతుకే సో బెటర్' కంప్లీట్ ఎంటర్టైనర్ విత్ ఎమోషనల్ టచ్ అనిపించుకుంటుంది

రేటింగ్ : 3 /5