Samantha’s ‘Shaakuntalam’ review

Friday,April 14,2023 - 02:56 by Z_CLU

Samantha's 'Shaakuntalam' review

నటీనటులు : సమంత , దేవ్ మోహ‌న్, మోహన్ బాబు , సచిన్ ఖేడేకర్, బేబీ అల్లు అర్హ తదితరులు

సంగీతం : మ‌ణిశ‌ర్మ‌

సినిమాటోగ్ర‌ఫీ : శేఖ‌ర్ వి.జోసెఫ్‌

మాట‌లు : సాయి మాధ‌వ్ బుర్రా

స‌మ‌ర్ప‌ణ : దిల్ రాజు

నిర్మాణం : డిఆర్‌పి , గుణ టీమ్ వ‌ర్క్స్‌

నిర్మాత : నీలిమా గుణ‌

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం : గుణ శేఖ‌ర్‌

విడుదల తేదీ : 14 ఏప్రిల్ 2023

సమంత శకుంతల దేవిగా నటించిన మైథాలాజికల్ డ్రామా 'శాకుంతలం' ప్రేక్షకుల ముందుకొచ్చింది. గుణ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో సమంత బ్లాక్ బస్టర్ అందుకుందా ? జీ సినిమాలు ఎక్స్ క్లూసివ్ రివ్యూ.

Shaakuntalam team wishes Samantha with a Birthday Poster కథ :

ఇంద్రుడి ఆజ్ఞ మీద విశ్వామిత్రుడి తపస్సు భగ్నం చేయడానికి వచ్చిన మేనకకు కలిగిన సంతానం శకుంతల(సమంత). అడవిలో అనాథగా ఉంటే కణ్వ మహర్షి(సచిన్ కెడ్కర్) పెంచి పెద్ద చేస్తాడు. వయసొచ్చిన శకుంతల ఓ యాగం కోసం వచ్చిన మహారాజు దుశ్యంతుడి(దేవ్ మోహన్) ని గాంధర్వ వివాహం చేసుకుని గర్భం దాలుస్తుంది. ఓసారి ఆశ్రమానికి వచ్చిన దుర్వాసుడి(మోహన్ బాబు) శాపానికి గురవుతుంది. దీని వల్ల తిరిగి వస్తానని రాజ్యానికి వెళ్ళిపోయిన దుశ్యంతుడు మాట తప్పుతాడు. కడుపులో బిడ్డతో అతని కోసం రాజ్యానికి వెళ్లిన శకుంతలకు తీవ్ర అవమానాలు ఎదురవుతాయి. ఒంటరిగా ఎటో వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆమెకి భరతుడు పుడతాడు. తర్వాత కథ ఏమైంది ? దుష్యంతుడు మళ్ళీ తిరిగొచ్చి శాకుంతలంను ఎలా కలుస్తాడు ? అనేది కథ.

నటీ నటుల పనితీరు :

శకుంతలగా సమంత ఆకట్టుకుంది. కొన్ని సన్నివేశాల్లో ఆమె నటనతో మెప్పించింది. దుష్యంత్ గా దేవ్ మోహన్ బెస్ట్ ఇచ్చాడు. ఫిజిక్ , పెర్ఫార్మెన్స్ తో  పాత్రకు పర్ఫెక్ట్ అనిపించాడు. దూర్వాస ముని గా మోహన్ బాబు , కణ్వ మహర్షి గా సచిన్ ఖేడేకర్, కశ్యప మహర్షి గా కబీర్ బేడీ ఆ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.   చెలికత్తెలు ప్రియంవద గా అదితి బాలన్ , అనసూయగా అనన్య నాగళ్ల పరవాలేదనిపించారు.  ఇంద్రుడు గా జీసు సేన్ గుప్తా , మేనక గా మధు బాల ఆకట్టుకున్నారు. భరత పాత్రలో అల్లు అర్హ నటన బాగుంది. బుడి బుడి నడకలతో ముద్దు ముద్దు మాటలతో సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

సాంకేతిక వర్గం పనితీరు :

ఈ తరహా మైథాలాజికల్ డ్రామా సినిమాలకు వినసొంపైన సంగీతం చాలా ముఖ్యం. మణి శర్మ అందించిన పాటలు పరవాలేదు అనిపించాయి తప్ప, మళ్ళీ మళ్ళీ పాడుకునేలా లేవు.  అక్కడక్కడా నేపథ్య సంగీతం బాగుంది. కొన్ని సన్నివేశాల్లో రిపీటెడ్ గా కూడా అనిపించింది.

శేఖర్ వీ జోసెఫ్ విజువల్స్ బాగున్నాయి. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ పరవాలేదు. ఇంకాస్త ట్రిమ్ చేయాల్సింది , సాయి మాధావ బుర్రా అందించిన  సంబాషణాలు  అక్కడక్కడా బాగున్నాయి. ఆర్ట్ డైరెక్టర్ అశోక్ సెట్స్ సినిమాకు అందం తీసుకొచ్చాయి. విజువల్ ఎఫెక్ట్స్ పరంగా ఇంకాస్త జాగ్రత్త తీసుకుని ఉంటే బెటర్ అవుట్ పుట్ వచ్చేది. యాక్షన్ ఎపిసోడ్స్ ఎట్రాక్ట్ చేసేలా కంపోజ్ చేయలేకపోయారు. దీంతో యుద్దపు ఎపిసోడ్స్ ఆకట్టుకోలేకపోయాయి.

ప్రొడక్షన్స్ వెల్యూస్ గ్రాండియర్ గా ఉన్నాయి. గుణ శేఖర్ డైరెక్షన్ బాగుంది. కొన్ని సన్నివేశాలని ఆయన తీసిన తీరు ఆకట్టుకుంది. కథ బాగున్నా కథనం మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు.

 

జీ సినిమాలు సమీక్ష :

కొన్ని కథలు వినడానికి బాగుంటాయి, మరికొన్ని సినిమాగా తీయడానికి ఉపయోగపడతాయి.  హిస్టారికల్ , మైథాలాజికల్ కథ తీసుకునే ముందు ఏ దర్శకుడైన బాగా ఆలోచించుకోవాలిన విషయం ఇది. ఇలాంటి కథల్ని తీసి మెప్పించడం కత్తి మీద సాము లాంటి వ్యవహారం.  మహా భారతంలో శకుంతల , దుష్యంత్ ల ప్రేమాయణంను తీసుకొని కాళిదాసు అభిజ్ఞ శాకుంతలం అనే డ్రామా క్రియేట్ చేశాడు. దాన్నే కథా వస్తువుగా తీసుకొని గుణ శేఖర్ 'శాకుంతలం' తీశాడు. అయితే మన పురాణాలు , చరిత్రలు సినిమాగా తీయడం మంచి ఆలోచనే. ఇందుకు గాను ముందుగా దర్శకుడు గుణ శేఖర్ ను మెచ్చుకోవాలి.  కానీ శకుంతల , దుష్యంత్ ల చిన్న కథ పట్టుకొని సినిమా చేయాలంటే చాలా హోమ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడే గుణ శేఖర్ ఎక్కువ మార్కులు స్కోర్ చేయలేకపోయాడు. ఈ చిన్న కథను పెద్ద సినిమాగా చెప్పేందుకు ప్రయత్నించినా సినిమాకు కావలసినంత మేటర్ లేకపోవడంతో ఫైనల్ గా శాకుంతలం పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది. సమంత అందంతో ఆకట్టుకోలేదు కానీ అభినయంతో శకుంతలగా మెప్పించింది.  తన అంద చందాలతో దుష్యంత్ మహారాజును ఆకట్టుకునే సన్నివేశాల్లో సమంత కాకుండా మరో హీరోయిన్ అయితే బాగుండేదనే అభిప్రాయం ప్రేక్షకులకు రాక తప్పదు. మిగతా పాత్రలకు గుణ శేఖర్ పర్ఫెక్ట్ కాస్టింగ్ ను తీసుకున్నాడు. మోహన్ బాబు , ప్రకాష్ రాజ్ , సచిన్ ఖేడేకర్ , కబీర్ బేడీ ఇలా సినిమాకు మంచి కాస్టింగ్ కుదిరింది. కానీ శకుంతల , దుష్యంత్ ప్రేమ కావ్యం కథతో తీసిన సినిమా కాబట్టి ఆ పాత్రలన్నీ కొన్ని నిమిషాలకే సరిపెట్టుకొని ఇలా వచ్చి అలా వెళ్లిపోతాయి.  ఆ పాత్రలు అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాయి.

సినిమా ఆరంభం నుండి చివరి వరకు ఒకే ఫార్మెట్ లో స్లో నేరేషన్ తో ముందుకు సాగడం ప్రేక్షకులకు కాస్త బోర్ కొట్టించింది. ముఖ్యంగా బలమైన సన్నివేశాలు లేకపోవడం కూడా సినిమాకు మైనస్. శాకుంతలంకి విజువల్స్ ఎఫెక్ట్స్ కూడా  మైనస్ అని చెప్పవచ్చు. విజువల్ ఎఫెక్ట్స్ లో క్వాలిటీ మిస్ అయ్యింది. ఇలాంటి తరహా సినిమాలకు ఎక్కడా రాజీ పడకుండా వీఎఫ్ ఎక్స్ చేయించాల్సి ఉంటుంది. ఇక  ఫస్ట్ హాఫ్ అంతా శకుంతల, దుష్యంత్ కేరెక్టర్స్ తో వారి ప్రేమాయణం చూపిస్తూ నడిపించిన గుణ శేఖర్ రెండో భాగంలో  సమంతను ఎక్కువగా చూపించలేదు. ఎక్కడా సినిమా లిబర్టీ తీసుకోకుండా కథను కథలా తీసే ప్రయత్నం చేశాడు. ఎలాంటి మార్పు చేసినా వక్రీకరించారు అనే ముద్ర పడుతుందని జాగ్రత్త పడి ఉండవచ్చు. కానీ ఇలాంటి షార్ట్ స్టోరీ తీసుకున్నప్పుడు సినిమాకు కావాల్సిన మార్పులు కూడా చేయాల్సి ఉంటుంది. ఒక రకంగా ఈ కథను తీసుకోవడమే గుణ శేఖర్ రాంగ్ ఛాయిస్ అనిపించింది.

గుణ శేఖర్ మంచి దర్శకుడు. గతంలో ఆయన తీసిన సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అయితే రుద్రమదేవి సినిమా నుండి ఆయన ఆలోచన విధానం మారింది. చారిత్రాత్మక కథలు తీసుకుంటూ సినిమా రూపంలో ప్రయోగాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. దర్శకుడిగా 'శాకుంతలం' గుణ శేఖర్ మంచి ప్రయత్నం అని చెప్పవచ్చు. కానీ సినిమాగా ఆకట్టుకునే సరుకు ఈ కథలో లేకపోవడం, కథనం వీక్ అనిపించడంతో సినిమా పూర్తిగా ఆకట్టుకోలేక కొన్ని మార్కులతో సరిపెట్టుకుంది.  క్లైమాక్స్ లో భరత పాత్రలో అల్లు అర్హ తన నటనతో మేజిక్ చేసి బయటికి పంపింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా అర్హకి మంచి పాత్ర దక్కింది. ఓవరాల్ గా సమంత 'శాకుంతలం' నిరాశ పరిచింది.

రేటింగ్ : 2.5/5