Sai Dharam Tej’s ‘Virupaksha’ Review

Friday,April 21,2023 - 02:03 by Z_CLU

నటీనటులు : సాయిధరమ్ తేజ్, సంయుక్తా మీన‌న్‌ , సాయి చంద్ , అజయ్ , సునీల్ , రాజీవ్ కనకాల , బ్రహ్మజీ , సోనియా సింగ్ , కమల్ కామ రాజు తదితరులు

సినిమాటోగ్ర‌ఫీ: శ్యామ్ ద‌త్ సైనుద్దీన్‌

సంగీతం: బి.అజ‌నీష్ లోక్‌నాథ్‌

ఎడిట‌ర్‌: న‌వీన్ నూలి

స్క్రీన్ ప్లే: సుకుమార్‌

స‌మ‌ర్ప‌ణ‌: బాపినీడు

నిర్మాణం : శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్

నిర్మాత‌: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌

స్టోరీ -డైరెక్షన్ : కార్తీక్ వర్మ దండు

రన్ టైమ్ : 148 నిమిషాలు

రిలీజ్ డేట్ : 21 ఏప్రిల్ 2023

యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత సాయిధరమ్ తేజ్ నుంచి వస్తున్న సినిమాగా విరూపాక్షాపై అందరి ఫోకస్ పడింది. పైగా మిస్టిక్ థ్రిల్లర్ అంటూ ప్రమోషన్స్ గట్టిగా చేయడంతో అంచనాలు కూడా పెరిగాయి. మరి ఈరోజు థియేటర్లలోకొచ్చిన ఈ సినిమా సాయితేజ్ కెరీర్ కు ప్లస్ అయిందా? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ.

కథ :

రుద్రవనం అనే ఊరిలో అనుకోని ఓ సంఘటన జరుగుతుంది. ఆ ఘటన జరిగిన పుష్కరం తర్వాత ఆ ఊరిలో ఒక్కొక్కరు వరుసగా ప్రాణాలు కోల్పోతుంటారు. అయితే వీటన్నిటికీ పరిష్కారంగా ఊరిని అష్ట దిగ్బంధనం చేయాలని పూజారి చెప్పడంతో జనాలు దానికి సిద్దమవుతారు. ఆ తర్వాత కూడా ఊరిలో ఉన్న వాళ్ళు వరుసగా చనిపోతారు. ఆ ఊరి జాతర కోసం అమ్మతో కలిసి వచ్చిన సూర్య (సాయి తేజ్) దీని వెనుక జరుగుతున్న విషయాన్ని పసిగట్టి దాని పరిష్కారం కోసం వెతుకుటుంటాడు.

ఒక టైమ్ లో తను ప్రేమించిన నందిని(సంయుక్తా మీనన్) ను కాపాడుకోవడం కోసం సూర్య తన ప్రాణాలను పణంగా పెట్టి అష్ట దిగ్బంధనం నుండి బయటికొస్తాడు. దీని వెనుక ఉన్నది ఎవరు ? రుద్రవనం ప్రజలపై కక్ష పెట్టుకోవడానికి కారణం ఏమిటి ? చివరికి సూర్య నందిని ప్రాణాలతో పాటు ఆ ఊరి జనాన్ని కాపాడగలిగాడా లేదా అనేది మిగతా కథ.

నటీ నటుల పనితీరు :

సాయి ధరం తేజ్ సూర్య పాత్రలో ఆకట్టుకున్నాడు. కానీ యాక్టర్ గా ఎక్కువ మార్కులు అందుకోలేకపోయాడు. కొన్ని చోట్ల మెప్పించినా మరికొన్ని చోట్ల నటుడిగా తెలిపోయాడు. సంయుక్తా మీనన్ కి కథలో స్కోప్ ఉన్న ఇంపార్టెంట్ రోల్ దక్కడంతో ఆ పాత్రకు పూర్తి న్యాయం చేసి నటిగా వందకి వంద మార్కులు సొంతం చేసుకుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో సంయుక్తా నటన అభినందనీయంగా ఉంది. పూజారి పాత్రలో సాయి చంద్ మంచి నటన కనబరిచాడు. సుధ పాత్రలో సోనియా సింగ్ నటన బాగుంది. అబ్బయ్ రాజు పాత్రలో సునీల్ నటన పరవాలేదు. కానీ ఆ పాత్ర కథలో కీలకంగా లేదు. అఘోరా గా అజయ్ , డాక్టర్ గా బ్రహ్మాజీ పాత్రలకు సూటయ్యారు. శ్యామల , శేఖర్ , కమల్ కామరాజు తది తరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు :

థ్రిల్లర్ సినిమాలకు నేపథ్య సంగీతం కుదిరితే చాలు , ప్రేక్షకులు సినిమాకు కనెక్ట్ అయిపోతారు. విరూపాక్ష కి అజనీష్ లోక్ నాథ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మెయిన్ హైలైట్ గా నిలిచింది. అలాగే కథకి అనుకూలంగా వచ్చే లవ్ సాంగ్ ఆకట్టుకుంది. కొన్ని సన్నివేశాలకు అజనీష్ ఇచ్చిన స్కోర్ చాలా హెల్ప్ అయింది. సౌండ్ డిజైనింగ్ మరో ప్లస్ పాయింట్. శ్యామ్ ద‌త్ అందించిన విజువల్స్ బాగున్నాయి. కొన్ని సన్నివేశాల్లో అతని కెమెరా పనితనం కనిపించింది. నవీన్ నూలి ఎడిటింగ్ ల్యాగ్ లేకుండా ఉంది. రుద్రవనం అనే  గ్రామాన్ని సృష్టించిన ఆర్ట్ వర్క్ బాగుంది.

కార్తీక్ దండు రాసుకున్న కథ రొటీన్ అనిపించినప్పటికీ , సుకుమార్ స్క్రీన్ ప్లే వర్కవుట్ అయింది. కథను ఊహించని విధంగా తిప్పిన మలుపులు సినిమాకు బాగా కలిసొచ్చాయి. ఎస్ వీ సీ సీ , సుకుమార్ రైటింగ్స్ ప్రొడక్షన్ వెల్యూస్ సినిమా క్వాలిటీ ను పెంచాయి.

జీ సినిమాలు రివ్యూ:

క్షుద్రపూజలు, తంత్రవిద్యలు, మాంత్రికులు... ఇవన్నీ ఓ సెపరేట్ జానర్. ఈ జానర్ లో సినిమా వచ్చి చాన్నాళ్లయింది. మసూద మంచి థ్రిల్ అందించింది కానీ, విరూపాక్ష మరో రకం. ఒకప్పుడు వచ్చిన అరుంధతి, చంద్రముఖి సినిమాల తర్వాత ఆ స్థాయిలో మెప్పించిన మూవీగా విరూపాక్ష నిలుస్తుంది.

దేవుడు-దెయ్యం  కథలు 90వ దశకంలో బాగా వచ్చాయి. ఆ తర్వాత క్షుద్రపూజలు, వాటిపై దైవబలం పైచేయి సాధించడం లాంటి కథలు కొనసాగాయి. విరూపాక్ష కూడా అలాంటి కథే. ఇందులో మాయలు, మంత్రాలు, క్షుద్రపూజలు, ఆత్మలు.. ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. కానీ ఇంతకుముందొచ్చిన సినిమాలతో పోలిస్తే, ఇందులో కొత్త అంశం ఒకటుంది. సినిమాను అదే నిలబెట్టింది. ప్రీ-క్లయిమాక్స్ లో వచ్చే ఆ ఎలిమెంట్, విరూపాక్ష సినిమాను ప్రేక్షకులకు కనెక్ట్ చేసింది. థ్రిల్లర్ మూవీ కాబట్టి, అదేంటనేది ఇక్కడ చెప్పడం కరెక్ట్ కాదు, థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాల్సిందే.

అన్నట్టు ఈ సినిమా మంచి థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ కూడా ఇస్తుంది. కాస్త పాత కథే అయినప్పటికీ, ఇప్పటి టెక్నాలజీని సరిగ్గా వాడుకున్నారు. శ్యాందత్ ఫ్రేమింగ్ ఎంత బాగుందో, ఆ సన్నివేశాలకు కాంతార ఫేం అజనీష్ అందించిన బ్యాక్ గ్రౌండ్ అంతకంటే బాగుంది. థియేటర్లలో కూర్చొని రెండున్నర గంటల పాటు ఈ సినిమాను అస్వాదించగలిగామంటే టెక్నికల్ గా ఈ రెండు అంశాలే కారణం. వీటికితోడు 90ల నాటి నేపథ్యాన్ని తలపించేలా వేసిన గ్రామం సెట్, ఇళ్లు, గుడి సెట్ సరిగ్గా కుదిరాయి.

సినిమాను స్టార్ట్ అవ్వడమే ఆలస్యం దర్శకుడు నేరుగా కథలోకి వెళ్లిపోయాడు. క్షుద్రపూజలు చేస్తున్నారనే అనుమానంతో రుద్రవనం గ్రామస్తులు, ఓ జంటను చెట్టుకు కట్టి కాల్చడంతో స్ట్రయిట్ గా కథలోకి ఎంటరవుతాం. ఆ వెంటనే హీరో-హీరోయిన్ల ఇంట్రడక్షన్ కూడా మొదలైపోతుంది. చాలా సినిమాల్లో చూసినట్టు ఇందులో కూడా అసలు కథ ఓవైపు, హీరోహీరోయిన్ల ప్రేమ మరోవైపు సాగుతుంటుంది. ఎక్కడో గాడి తప్పుతుందని భావించేలోపే, దర్శకుడు.. ఈ రెండు ట్రాక్స్ ను కలిపిన విధానం ఆకట్టుకుంది.

ఇంటర్వెల్ కు వచ్చేసరికి ఊపిరి బిగపట్టేంత థ్రిల్ అందిస్తాడు దర్శకుడు. హీరోయిన్ ఉన్నఫలంగా వెళ్లి బావిలో దూకడం ఏంట్రా బాబూ అనే ఆలోచనతోనే ఇంటర్వెల్ తీసుకుంటారు ప్రేక్షకులు. ఇక ఆ తర్వాత నుంచి ఆ గ్యాప్ కూడా ఇవ్వడు దర్శకుడు, బ్యాక్ టు బ్యాక్ థ్రిల్ ఎలిమెంట్స్, ట్విస్టులతో కథను పరుగులు పెట్టిస్తాడు.

ప్రీ-క్లయిమాక్స్ లో చిక్కుముడులు విప్పడం, అసలు ట్విస్ట్ ను బయటపెట్టడం లాంటి సన్నివేశాల్లో దర్శకుడికి వందకి వంద మార్కులు వేసేయొచ్చు. క్లయిమాక్స్ కాన్సెప్ట్ ను అర్థం చేసుకోవడం కాస్త ఇబ్బందిగా అనిపించినప్పటికీ.. అసలైన ట్విస్ట్ వల్ల సినిమా పాస్ అయిపోతుంది. అందరితో బాగుందనిపించుంది.

అయితే ఇలాంటి రేసీ స్క్రీన్ ప్లేలో కూడా కొన్ని విస్మరించాడు దర్శకుడు. కథ ప్రకారం క్లయిమాక్స్ పండాలంటే హీరోహీరోయిన్ల రొమాన్స్ అద్భుతంగా ఉండాలి. ఫస్టాఫ్ లో అది మిస్సయింది. ఇక ఓ కీలకమైన పాయింట్ దగ్గర ఎమోషన్ పండాలంటే.. హీరోయిన్, ఆమె తండ్రి పాత్ర మధ్య అనుబంధాన్ని కూడా బలంగా చూపించాల్సింది. ఆ ఎపిసోడ్ కూడా మిస్సయింది. ఇక సునీల్ పాత్రతో సస్పెన్స్ క్రియేట్ చేయాలనుకున్న ఆలోచన కూడా బెడిసికొచ్చింది.

ఇలాంటి మైనస్ పాయింట్స్ కొన్నింటిని మినహాయిస్తే విరూపాక్ష పైసా వసూల్ అనిపించుకుంటుంది. యాక్సిడెంట్ తర్వాత సాయిధరమ్ తేజ్ లో శారీరకంగా వచ్చిన కొన్ని ఇబ్బందులు తెరపై కనిపించాయి. అతడి రన్నింగ్ స్టయిల్ మారిపోయింది. డైలాగ్ డెలివరీ కూడా మునుపటి స్థాయిలో లేదు. అయితే కష్టపడి వాటన్నింటినీ అధిగమించే ప్రయత్నం చేస్తున్నాడనే విషయం కూడా సినిమాలో కనిపించింది. హీరోయిన్ సంయుక్త మీనన్ అదరగొట్టింది. ఈమె పాత్ర సినిమాకు పిల్లర్. ఈ సినిమా వరకు ఆమెను హీరోయిన్ అనడం కంటే, సెకెండ్ హీరో అంటే బెటర్. అంత ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్ ఇది. సోనియా సింగ్ చేసింది చిన్న పాత్రే అయినప్పటికీ చాలా కీలకమైన పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. సాయిచంద్, సునీల్ రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

ఇంతకుముందే చెప్పుకున్నట్టు టెక్నికల్ గా సినిమా చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఆర్ట్ వర్క్, ఎడిటింగ్ అన్నీ బాగా సెట్ అయ్యాయి. దర్శకుడు కార్తీక్ దండు తను అనుకున్న పాయింట్ ను, అనుకున్నట్టుగా స్క్రీన్ పైకి తీసుకొచ్చాడు. కేవలం ఒక్క సినిమా ఎక్స్ పీరియన్స్ తో దర్శకుడిగా సినిమాను బాగా డీల్ చేశాడు. సుకుమార్ అందించిన స్క్రీన్ ప్లే హైలెట్.

ఓవరాల్ గా.. మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కోసం, టెక్నికల్ గా థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ కోసం విరూపాక్ష సినిమాను కచ్చితంగా ఓసారి చూడాల్సిందే.

రేటింగ్3/5