Rishab Shetty’s ‘Kantara’ movie review

Saturday,October 15,2022 - 02:27 by Z_CLU

నటీనటులు : రిషబ్ శెట్టి, కిషోర్ కుమార్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి, ప్రకాష్ తుమినాడు, మానసి సుధీర్, శనిల్ గురు, దీపక్ రాయ్ పనాజే తదితరులు

సినిమాటోగ్రాఫర్ : అరవింద్ ఎస్ కశ్యప్

ఎడిటర్ :  ప్రతీక్ శెట్టి, కె ఎం ప్రకాష్

సంగీతం : అజనీష్ లోకనాథ్

నిర్మాణం  : హోంబలే ఫిల్మ్స్

నిర్మాత : విజయ్ కిరగందూర్

రచన -దర్శకత్వం : రిషబ్ శెట్టి

రిలీజ్ : గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్

విడుదల తేది : 15 అక్టోబర్ 2022

నిడివి : 149 నిమిషాలు

సెన్సార్ :  U/A

కొన్ని రోజులుగా మూవీ లవర్స్ ఎక్కువగా మాట్లాడుకుంటున్న కన్నడ సినిమా 'కాంతార'. సెప్టెంబర్ 30న రిలీజైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. అందుకే తెలుగులో అల్లుఅరవింద్ ఉన్నపళంగా ఈ సినిమాను డబ్బింగ్ సినిమాగా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మరి కన్నడలో బ్లాక్ బస్టర్ సాధించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించిందా ? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ.

కథ : 

ఓ అటవీ ప్రాంతంలో ఓ గ్రామం. ఆ గ్రామానికి భూస్వామ్య ప్రభువు (అచ్యుత్ కుమార్) ఉంటాడు. ప్రజలందరితోనూ మంచిగా ఉంటూ వాళ్లకు సమస్యలు వస్తే ముందు నిలుచుంటాడు. కావాల్సిన సాయం చేస్తాడు. తరతరాలుగా పల్లె ప్రజలకు ఆ కుటుంబమే అండగా ఉంటుంది.  అతడికి కొన్ని పనుల్లో సహాయంగా శివ(రిషబ్ శెట్టి) ఉంటాడు. స్నేహితులతో కలిసి అప్పుడప్పుడు అడవిలోకి వేటకు వెళ్తాడు శివ.  ఫారెస్ట్ ఆఫీసర్ గా మురళీ(కిశోర్) వస్తాడు. శివ చేసే పనులపై అనుమాన పడుతూ అతనికి అడ్డుగా వెళ్లేందుకు చూస్తుంటాడు మురళి.

శివ ఎప్పుడూ ఊరి కోసం పోరాడుతుంటాడు. అయితే అటవీ భూమిని ఆక్రమించుకున్నారని ఊరికి సరిహద్దులు పెట్టేందుకు ప్రయత్నం చేస్తాడు ఫారెస్ట్ ఆఫీసర్ మురళి. శివ ప్రియురాలు లీల(సప్తమి గౌడ) ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో ఫారెస్ట్ గార్డ్‌గా చేరి ప్రభుత్వ అటవీ భూమిని సర్వే చేయడంలో డిపార్ట్‌మెంట్‌కి సహాయం చేస్తుంది. ఈ క్రమంలోనే అనుకోని సంఘటన జరిగి శివ జైలుకు వెళ్తాడు.

ఇదే సమయంలో శివ చిన్ననాటి మిత్రుడు హత్యకు గురవుతాడు. దైవరాధన చేసే తన చిన్ననాటి మిత్రుడు చనిపోయిన విషయం తెలిసి జైలులో ఉన్న శివ తట్టుకోలేక పోతాడు. ఇంతకీ ఆ హత్య చేసింది ఎవరు? ఊరి పెద్దమనిషి ఎవరి వైపు ? తన గ్రామం కోసం శివ  భూమిని కాపాడుకున్నాడా? లేదా? అసలు భూమిని ఎవరు స్వాధీనం చేసుకోవాలనుకున్నారు? అనేది మిగతా కథ.

నటీ నటుల పనితీరు : 

శివ పాత్రలో రిశబ్ శెట్టి నటన సినిమాకు ప్లస్ పాయింట్. ముఖ్యంగా క్లైమాక్స్ లో నట విశ్వరూపం చూపించి సినిమాకు మేజర్ హైలైట్ గా నిలిచాడు. సప్తమి గౌడ తన పాత్రలో ఒదిగిపోయి నటించింది. ఫారెస్ట్ పోలీస్ పాత్రలో కిషోర్ మంచి నటన కనబరిచాడు. ఊరి పెద్దగా అచ్యుత్ కుమార్ ఆకట్టుకున్నాడు. ప్రమోద్ శెట్టి, ప్రకాష్ తుమినాడు, మానసి సుధీర్, శనిల్ గురు, దీపక్ రాయ్ పనాజే తదితరులు తమ నటనతో పాత్రలకు పర్ఫెక్ట్ అనిపించుకున్నారు.

సాంకేతిక వర్గం పనితీరు : 

ఏ సినిమాకైనా టెక్నీషియన్స్ నుండి బెస్ట్ సపోర్ట్ అందితే... కంటెంట్ ఎక్కువ రీచ్ అవుతుంది. ఈ సినిమాకు సంబంధించి ప్రతీ టెక్నీషియన్ బెస్ట్ ఇచ్చాడు. ముఖ్యంగా అజనీష్ లోకనాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళి ఆడియన్స్ మెస్మరైజ్ అయ్యేలా చేసింది. అలాగే అరవింద్ ఎస్ కశ్యప్ సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు బిగ్ ప్లస్ అయ్యింది. విజువల్స్ ఎట్రాక్ట్ చేసేలా ఉన్నాయి. ప్రతీక్ శెట్టి, కె ఎం ప్రకాష్ ఎడిటింగ్ బాగుంది. ఆర్ట్ వర్క్ , మేకప్ బాగా కుదిరాయి. అలాగే యాక్షన్ సీక్వెన్స్ కోరియోగ్రఫీ బాగుంది.

రిషబ్ శెట్టి రచన - దర్శకత్వం బాగున్నాయి. ముఖ్యంగా స్క్రీన్ ప్లే బాగా వర్కౌట్ అయింది. హోంబలే ఫిల్మ్స్ ప్రొడక్షన్ వేల్యూస్ కథకు తగ్గట్టుగా ఉన్నాయి.

జీ సినిమాలు సమీక్ష : 

కంటెంట్ బాగుంటే ఏ భాషలో డబ్ చేసి రిలీజ్ చేసినా ఆడియన్స్ ఆదరిస్తారు. అందుకే కన్నడలో బ్లాక్ బస్టర్ సాధించిన ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేశారు అల్లు అరవింద్. అయితే కాంతార ఇప్పటి వరకూ చూడని సరికొత్త కథతో వచ్చిన సినిమా కాదు. ఇది వరకూ చాలా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో చూసిన కథే ఇందులో కూడా కనిపిస్తుంది. భూ సేకరణ , మంచిగా కనిపిస్తూ వెనక గోతులు తొవ్వే విలన్ , ఊరికి అండగా నిలిచే హీరో ఇవే కాంతారలో కూడా ఉన్నాయి. అయితే రిషబ్ శెట్టి ఈ కథకు డిఫరెంట్ టచ్ ఇచ్చాడు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ కథకు దైవబలం అనే కాన్సెప్ట్ ను జత చేశాడు. దీంతో సినిమా ట్రీట్ మెంట్ కొత్తగా అనిపిస్తుంది. అక్కడే రైటర్ గా సక్సెస్ అయ్యాడు రిషబ్. దర్శకుడిగా కూడా ఈ కథను పర్ఫెక్ట్ గా డీల్ చేశాడు.

ఎక్కడా బోర్ కొట్టకుండా కామెడీ ప్లాన్ చేసుకొని టికెట్టు కొన్న ప్రేక్షకుడికి మంచి వినోదం పంచాడు. ముఖ్యంగా హీరోతో ఉండే స్నేహితుల డైలాగ్ కామెడీ వర్కౌట్ అయింది. సినిమా కథను ఆసక్తిగా మొదలు పెట్టి ఆధ్యంతం ఆకట్టుకునేలా ఈ కథను నడిపించిన తీరు ఆకట్టుకుంది. ముఖ్యంగా అజనీష్ లోక్ నాథ్ సన్నివేశాలకు తన నేపథ్య సంగీతంతో ప్రాణం పోశాడు. సినిమా పూర్తయ్యాక రిషబ్ తనని తను కొత్తగా మలుచుకునేందుకు ఈ కథ రాసుకున్నట్టుగా అనిపిస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ అద్భుతంగా రాసుకున్నాడు. అక్కడ రైటర్ , దర్శకుడిగా కంటే నటుడిగా ఎక్కువ మార్కులు అందుకున్నాడు. తన నట విశ్వరూపం చూపించి ప్రేక్షకుల చేత క్లాప్స్ కొట్టించుకుంటూ విజిల్స్ వేయించుకున్నాడు. ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా బాగుంది. అలాగే ఇంటర్వెల్ బ్లాక్ హైలైట్ గా నిలిచింది. లవ్ ట్రాక్ తో పాటు కామెడీ ట్రాక్ కూడా అలరిస్తుంది. సిచ్యువేషనల్ సాంగ్స్ పరవాలేదనిపిస్తాయి. తెలుగు డబ్బింగ్ బాగా చేశారు. తెలుగు డైలాగ్స్ , డబ్బింగ్ చక్కగా కుదిరాయి.

రిషబ్ శెట్టి నటన , అజనీష్ లోక నాథ్ మ్యూజిక్ , అరవింద్ ఎస్ కశ్యప్ విజువల్స్ , యాక్షన్ ఎపిసోడ్స్ , గూస్ బంప్స్ తెప్పించే క్లైమాక్స్ సినిమాకు మేజర్ హైలైట్స్ అని చెప్పొచ్చు. ఓవరాల్ గా రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించిన 'కాంతార' మంచి ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. ఈ వారం మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమా ఇది.

రేటింగ్ : 3 /5