Rangamarthanda Movie Review

Wednesday,March 22,2023 - 01:49 by Z_CLU

నటీ నటులు : ప్రకాష్ రాజ్ , రమ్యకృష్ణ, బ్రహ్మానందం, అనసూయ, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక రాజశేఖర్, అలీ రేజా , ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు

సంగీతం : ఇళయరాజా

కెమెరా : రాజ్ కె నల్లి

కథ : కుసుమగ్రాజ్

నిర్మాతలు : కలిపు మధు, ఎస్ వెంకట్ రెడ్డి

దర్శకత్వం : కృష్ణ వంశీ

విడుదల తేదీ : 22 మార్చ్ 2023

నిడివి : 153 నిమిషాలు

 

కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగమార్తాండ' ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ తారాగణంతో నటసామ్రాట్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రీమియర్ షోస్ ద్వారా రిలీజ్ కి ముందే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ కుటుంబ కథ చిత్రంతో కృష్ణ వంశీ మెప్పించాడా? దిగ్గజాల నటన ఎలా ఉంది? జీ సినిమాలు ఎక్స్ క్లూసివ్ రివ్యూ.

 

కథ :

నాటకాలల్లో రంగమార్తాండగా పేరు తెచ్చుకున్న రాఘవ రావు (ప్రకాష్ రాజ్) తన చివరి సన్మాన వేడుకలో ఇకపై తను నాటకాలు వేయబోనని ప్రకటించి నాటక రంగానికి దూరమవుతాడు. తనకి ఉన్న ఆస్తిని కొడుకు , కూతురుకి రాసిచ్చేసి శేష జీవితం గడపాలని నిర్ణయించుకుంటాడు.

అక్కడి నుండి రాఘవరావు జీవితం సరికొత్త మలుపు తిరుగుతుంది. అనుకోని సంఘటనలతో రాఘవరావు, అతని భార్య రాజు గారు (రమ్యకృష్ణ) కుటుంబ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అలాగే రాఘవరావు స్నేహితుడు రంగస్థల నటుడు చక్రపాణి(బ్రహ్మానందం) కూడా పట్టరాని బాధను ఎదుర్కుంటాడు. ఇంతకీ వీరిద్దరికీ బాధకి కారణం ఎవరు? చివరికి రంగస్థల నటుడిగా ఎంతో ఉన్నత స్థాయి అనుభవించిన రాఘవరావు నిజజీవితం గురించి తెలుసుకున్న సత్యమేంటి?

 

నటీనటుల పనితీరు :

ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ , బ్రహ్మానందం ఈ ముగ్గురి నటన గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. కొన్ని వందల సినిమాలు చేసిన అనుభవంతో ఈ సినిమాలో పాత్రలను రక్తి కట్టించి ప్రేక్షకుల చేత క్లాప్స్ కొట్టించుకున్నారు. రాఘవరావు పాత్రలో ప్రకాష్ రాజ్ నటించలేదు, జీవించేశాడు. నాటకాలు, డైలాగులతో మెస్మరైజ్ చేశాడు.  రాజు గారు పాత్రలో రమ్యకృష్ణ నటన బాగుంది. ఇక బ్రహ్మానందం ఇప్పటివరకూ కనిపించని పాత్రలో కనిపించి సినిమాకు హైలైట్ గా నిలిచారు. రెండు సన్నివేశాల్లో కంటతడి పెట్టించారు.

రాఘవరావు కూతురిగా శివాత్మిక, కొడుకు గా ఆదర్శ్ బాలకృష్ణ, కోడలు గా అనసూయ, అల్లుడు గా రాహుల్ సిప్లిగంజ్ తమ పాత్రలకు న్యాయం చేశారు. వీళ్ళల్లో శివాత్మిక తన నేచురల్ నటనతో కాసిన్ని ఎక్కువ మార్కులు అందుకుంది. అలీ రెజా హీరో పాత్రలో ఆకట్టుకున్నాడు. కాశీ విశ్వనాథ్, ప్రభాకర్, భద్రం, వేణు టిల్లు తదితరులు తమ పాత్రలతో ఆకట్టుకున్నారు.

 

సాంకేతిక వర్గం పనితీరు :

ఇళయరాజా సంగీతం సినిమాకు కొంత వరకు ప్లస్ అయ్యింది. కానీ నేపథ్య సంగీతం అంత ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది. ఆయన అనుభవంతో ఈ సినిమాకు ఉన్నంతలో న్యాయం చేశారు. సందర్భానుసారంగా వచ్చే పాటలు ఫరవాలేదనిపిస్తాయి తప్ప మళ్ళీ మళ్ళీ పాడుకునేలా, విలేనా లేవు. రాజ్ కె నల్లి కెమెరా వర్క్ పరవాలేదు. ఎడిటింగ్ బాగుంది. ఆకెళ్ళ శివప్రసాద్ మాటలు సన్నివేశాలకు బలం చేకూర్చాయి.

కృష్ణవంశీ టేకింగ్, కొన్ని సన్నివేశాలను తీసిన విధానం బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కథకి తగ్గట్టుగా ఉన్నాయి.

 

జీ సినిమాలు సమీక్ష :

నాటకరంగంలో గొప్ప పేరు తెచ్చుకున్న ఒక వ్యక్తి నిజజీవితంలో ఎలాంటి సంఘటనలు ఎదుర్కున్నాడు? తన కుటుంబం కారణంగా ఎంతటి బాధకి లోనయ్యాడు? అనే పాయింట్ తో మరాఠీలో వచ్చిన 'నటసామ్రాట్' మంచి సినిమా అనిపించుకుంది. అందుకే ప్రకాష్ రాజ్ ఈ సినిమాను ఏరి కోరి మరీ రైట్స్ కొనుగోలు చేసి టేకప్ చేయాలని భావించాడు. తనే నటించి దర్శకత్వం చేయాలనుకున్నాడు. చివరికి ఈ కథ తెలుగు ప్రేక్షకులకి కృష్ణవంశీ చెప్పాలని డెస్టినీ డిసైడ్ చేయడంతో ఫైనల్ గా కృష్ణవంశీ ఈ సినిమాను డైరెక్ట్ చేయాల్సి వచ్చింది.

కొన్ని సినిమాలను రీమేక్ చేయడం చాలా కష్టం. అక్కడ పండిన సన్నివేశాలు ఇక్కడ కూడా పండాలంటే దర్శకుడు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా నటీనటుల ఎంపిక అన్నది చాలా కీలకం. నానా పటేకర్ చేసిన పాత్రను అంత గొప్పగా చేయాలంటే అలాంటి విలక్షణ నటుడే కావాలి. ప్రకాష్ రాజ్ ను ఈ పాత్రకు కృష్ణవంశీ ఎంచుకోలేదు ప్రకాష్ రాజే ఆ పాత్రను ఎంచుకున్నాడు కాబట్టి తన నటనతో ఇక్కడ కూడా మెప్పించి మెస్మరైజ్ చేశాడు.

రంగమార్తాండ కేరెక్టర్స్, నటన మీదే ఎక్కువ ఆధారపడిన సినిమా. ఎమోషనల్ సీన్స్ గొప్పగా పండించే నటీనటులు దొరకడంతో మళ్ళీ మేజిక్ రిపీట్ అయింది. ముఖ్యంగా ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం మెయిన్ పిల్లర్స్ గా ఉంటూ సినిమాను నిలబెట్టారు. బ్రహ్మానందం పాత్ర, ఆయన గొప్ప నటన తెలుగు ప్రేక్షకులకు షాక్ ఇస్తుంది. ఇప్పటివరకూ తన కామెడీతో నవ్వించిన బ్రహ్మీ, చక్రి పాత్రతో కంటతడి పెట్టిస్తారు. బ్రహ్మానందం సన్నివేశాలు చూస్తూ ఈయన్ని ఇలాంటి పాత్రలకు ఇంత వరకూ ఎవరూ వాడుకోలేదంటని ప్రేక్షకుడు బాధపడతాడు.

నత్తనడక కథనం, కొన్ని సన్నివేశాలు గతంలో చూసేసినట్టే అనిపించడం, ప్రొడక్షన్ వాల్యూస్ లో క్వాలిటీ లేకపోవడం సినిమాకు మైనస్ అనిపిస్తాయి. కృష్ణవంశీ గత సినిమాల్లో కనిపించే రిచ్ నెస్ ఇందులో ఎక్కడా కనిపించలేదు. తన మేకింగ్ కి భిన్నంగా నేచురల్ గా తీసే ప్రయత్నం చేశాడనుకోవచ్చు. ఈ రీమేక్ ను హానెస్టీగా తీసే ప్రయత్నం చేసి దర్శకుడిగా మెప్పించాడు వంశీ. "నేనొక నటుడ్ని" అంటూ మెగా స్టార్ చెప్పే షాయరీ తో సినిమాను ప్రారంభించిన తీరు బాగుంది.

రంగమార్తాండ నటన చుట్టూ తిరిగే సినిమానే కానీ ఇందులో స్ట్రాంగ్ ఎమోషన్ ఉంది. అమ్మనాన్నలతో కూడిన గొప్ప కథ ఉంది. దిగ్గజాల నటన మెప్పిస్తుంది. ఇళయరాజా సంగీతం ఉంది. ఇవన్నీ కలిసి రంగమార్తాండ, తెలుగు ప్రేక్షకుల హృదయాల్ని తాకుతుంది.

 

రేటింగ్ : 3 /5