Raj Tarun’s ‘Anubhavinchu Raja’ Movie Review

Friday,November 26,2021 - 04:04 by Z_CLU

న‌టీన‌టులు: రాజ్ త‌రుణ్‌, క‌షీష్ ఖాన్‌, పోసాని కృష్ణముర‌ళి, ఆడుకాల‌మ్ న‌రేన్‌, అజ‌య్‌, సుద‌ర్శ‌న్‌, టెంప‌ర్ వంశీ, ఆద‌ర్శ్ బాల‌కృష్ణ‌, ర‌వికృష్ణ‌, భూపాల్ రాజు, అరియానా, పమ్మి సాయి, చందు, నాగేంద్ర త‌దిత‌రులు.

మ్యూజిక్‌:  గోపీసుంద‌ర్

సినిమాటోగ్ర‌ఫీ:  న‌గేశ్ బానెల్‌

నిర్మాణ సంస్థ‌లు:  అన్న‌పూర్ణ స్టూడియోస్‌, శ్రీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్ఎల్‌పి

నిర్మాత :  సుప్రియ యార్ల‌గ‌డ్డ‌

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  శ్రీను గ‌విరెడ్డి

విడుదల తేది : 26 నవంబర్ 2021

నిడివి : 130 నిమిషాలు

 

వరుస అపజయాలతో సతమతమవుతున్న రాజ్ తరుణ్ కొంత గ్యాప్ తర్వాత అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్  'అనుభవించు రాజా' సినిమాతో థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. శ్రీనివాస్ గవిరెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాతో రాజ్ తరుణ్ పూర్తి స్థాయిలో మెప్పించి సూపర్ హిట్ అందుకున్నాడా ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

 

కథ : 

భీమవరం పక్కన పల్లెటూరిలో ఉండే బంగారం (రాజ్ తరుణ్) తాత చెప్పిన అనుభవించు రాజా మంత్రం పాటిస్తూ  తనకున్న ధనంతో జీవితాన్ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంటాడు. ఊళ్ళో పందేలు వేస్తూ అల్లరి చిల్లరగా తిరిగే బంగారం ఓ సందర్భంలో తను పుట్టి పెరిగిన ఊళ్ళో పెద్దరికంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రెసిడెంట్ గా పోటీ చేస్తాడు. ఈ క్రమంలో అమ్మిరాజు(అజయ్)కి ఎదురువెళ్తాడు.

ప్రెసిడెంట్ ఎన్నికల కంటే ముందే ప్రెసిడెంట్ (ఆడుకల‌మ్ న‌రేన్‌) కొడుకు ఊళ్ళో జరిగే జాతరలో కొందరు ముఠా చేతిలో హత్య కాపాడతాడు. ఆ హత్య కేసులో జైలుకి వెళతాడు బంగారం. ఆ తర్వాత  జైలు నుండి బయటికివచ్చి సిటీలో ఓ సాఫ్ట్ వేర్ కంపనీలో సెక్యూరిటీగా పనిచేస్తూ ప్రెసిడెంట్ కొడుకుని హత్య చేసిందవరెవరని తెలుసుకునే పనిలో ఉంటాడు. ఇంతకీ ప్రెసిడెంట్ కొడుకుని హత్య చేయించిందెవరు ? ఆ హత్యకి బంగారంకి సంబంధం ఏమిటి ? ఫైనల్ గా ఈ మిస్టరీని బంగారం ఎలా రివీల్ చేసాడనేది మిగతా కథ.

 

నటీ నటుల పనితీరు : 

తనకి సూటయ్యే క్యారెక్టర్ కావడం, ఇంతకుముందు చేసిన పాత్రే  కావడంతో రాజ్ తరుణ్ చాలా ఈజ్ తో చేసేశాడు. భీమవరం కుర్రాడిగా ఆకట్టుకున్నాడు. తెలుగులో ఇదే మొదటి సినిమా అయినప్పటికీ క‌షీష్ ఖాన్‌ బాగా నటించింది. హీరోయిన్ గా ఎట్రాక్ట్ చేసింది. హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన సింధు ఆకట్టుకుంది. తనకి మరిన్ని మంచి పాత్రలు వచ్చే అవకాశం ఉంది. సుదర్శన్ డైలాగ్ కామెడీ కొన్ని సందర్భాల్లో నవ్వించింది. నెగిటివ్ రోల్స్ లో  టెంపర్ వంశీ, ఆదర్శ్ బాలకృష్ణ  బాగా నటించారు. ఇంపార్టెంట్ రోల్ లో భువన్ తన పాత్రకు న్యాయం చేశాడు.

ఊరి ప్రెసిడెంట్ గా ఆడుకల‌మ్ న‌రేన్‌ , అమ్మిరాజు పాత్రలో అజయ్ సినిమాకు ప్లస్ అయ్యారు. పల్లెటూరి పాత్రల్లో పమ్మి సాయి, చందు , అరియానా మిగతా నటీ నటులు తమ పాత్రలతో ఆకట్టుకున్నారు. ఊరికి వెళ్లేందుకు లీవ్ పర్మీషణ్ అడిగే సన్నివేశంలో కొత్త నటుడు నాగేంద్ర బాగా నటించాడు.

 

సాంకేతిక వర్గం పనితీరు : 

గోపి సుందర్ మ్యూజిక్ పర్వాలేదు. టైటిల్ సాంగ్ మినహా మిగతా పాటలు ఆకట్టుకోలేదు. నేపథ్య సంగీతం కూడా అంతంత మంత్రంగానే ఉంది.  న‌గేశ్ బానెల్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. చోటా కే నాయుడు ఎడిటింగ్ పరవాలేదు. సుప్రియ బ‌ట్టెపాటి, రామ్ కుమార్‌ ఆర్ట్ వర్క్ బాగుంది. రియల్ సతీష్ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకున్నాయి. భాస్క‌ర భ‌ట్ల‌ సాహిత్యం బాగుంది.

శ్రీనివాస్ రెడ్డి కథ -కథనం రొటీన్ గానే అనిపించాయి. దర్శకుడిగా కొన్ని సన్నివేశాలు బాగా డీల్ చేశాడు.  ప్రొడక్షన్ వాల్యూస్ కథకి తగ్గట్టుగా ఉన్నాయి.

 

జీ సినిమాలు సమీక్ష : 

ఈమధ్య రాజ్ తరుణ్ నుండి పూర్తి స్థాయిలో మెప్పించే సినిమా రాలేదు. అందుకే ఈసారి సేఫ్ జోన్ లో అవుట్ అండ్ అవుట్ విలేజ్ ఎంటర్టైనర్ తో వచ్చాడు. కానీ ఈసారి కూడా  పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. దీనికి రీజన్  దర్శకుడు ఎంచుకున్న కథ, రాసుకున్న కథనం. అదే సినిమాకు మెయిన్ మైనస్. పోనీ ట్రీట్ మెంట్ అయినా కొత్తగా ఉందా అంటే అదీ లేదు. దీంతో సినిమా ఆరంభం నుండి చివరి వరకూ ఎక్కడా కొత్తగా అనిపించదు. అలా అని బోర్ కొట్టదు. అలా నడిచిపోతుందంతే. హీరో సెక్యూరిటీ గా కనిపించడం అనే ఎలిమెంట్ తప్ప మిగతా అంతా గతంలో వచ్చిన సినిమాల్లో చూసిందే.

ఒక పల్లెటూరు, తనకున్న డబ్బుతో ఎంజాయ్ చేస్తూ ఊళ్ళో అల్లరిచిల్లరిగా తిరిగే హీరో, ఊరి ప్రెసిడెంట్ పదవి కోసం గొడవలు, అనుకోని తప్పు చేయడంతో ఊరి నుండి హీరోను వెలివేస్తారు. ఎప్పటి నుండో మన తెలుగు సినిమాల్లో చూస్తూ వస్తున్న పాత  కథనే తీసుకొని మెస్మరైజ్ చేయడానికి చాలానే కష్టపడ్డాడు దర్శకుడు. కాకపోతే ఇందులో మర్డర్ మిస్టరీ అనే ఎలిమెంట్ ని యాడ్ చేశాడు. నిజానికి ఒక పల్లెటూరు అక్కడ వచ్చే పాత్రలు వాటి నుండి పుట్టే కామెడీ ఇది ఆడియన్స్ ని బాగా కనెక్ట్ చేయగలిగే ఎవర్గ్రీన్ కంటెంట్ అని చెప్పొచ్చు. ఈ సినిమాను పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లోనే చేశాడు శ్రీను గవిరెడ్డి కాకపోతే ఆ ఎపిసోడ్స్ అన్నీ రెండో భాగంలో పెట్టి ఫస్ట్ హాఫ్ అంతా సెక్యురిటీ గార్డ్ కష్టాలు, హీరో హీరోయిన్ లవ్ ట్రాక్, రెండు యాక్షన్ ఎపిసోడ్స్ తో నడిపించాడు. ఫస్ట్ హాఫ్ లో వచ్చే లవ్ ట్రాక్ కూడా అంతగా ఆకట్టుకోలేదు. ఇక రెండో భాగంలో వచ్చే సంక్రాంతి ఎపిసోడ్ మినహా మిగతా సన్నివేశాలు కూడా అంతగా ఎక్కవు.

గతంలో రాజ్ తరుణ్ తో ఇదే తరహా సినిమా తీసిన దర్శకుడు శ్రీనివాస్ గవిరెడ్డి మళ్ళీ అదే రిపీట్ చేసి ఈసారి ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని చూశాడు. కానీ ఈసారి కూడా పూర్తిస్థాయిలో సక్సెస్ అవ్వలేకపోయాడు. రెండో సినిమాకు ఏదైనా డిఫరెంట్ కథ ఎంచుకొని కొత్తగా ట్రై చేసి ఉంటే బాగుండేది.

ఇక సినిమాలో మర్డర్ మిస్టరీ ఎలిమెంట్ తో క్లైమాక్స్ వరకూ సస్పెన్స్ క్రియేట్ చేయాలని చూసిన దర్శకుడు ఆ ముగింపులో కూడా కొత్తదనం చూపించలేదు. మర్డర్ చేయించిందెవరనేది ఆడియన్ పర్ఫెక్ట్ గా గెస్ చేయలేకపోవచ్చు కానీ క్లైమాక్స్ లో ఆ ట్విస్ట్ తెలిశాక ఎన్ని సినిమాల్లో చూడలేదు అనేలా అనిపిస్తుంది తప్ప "వావ్" అనిపించదు.

రాజ్ తరుణ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, టైటిల్ సాంగ్, అక్కడక్కడా వచ్చే కామెడీ, సెకండాఫ్ లో వచ్చే సంక్రాంతి ఎపిసోడ్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. కథ-కథనం రొటీన్ గా అనిపించడం,  బలమైన సన్నివేశాలు లేకపోవడం, ఈ తరహా జానర్ మూవీస్ నుండి ఆశించే ఎంటర్టైన్ మెంట్ ప్రేక్షకులకి  అందకపోవడంతో.. 'అనుభవించు రాజా' సినిమా, పూర్తిస్థాయిలో అనుభూతిని అందించదు.

రేటింగ్ : 2.5 /5

- Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics