OTT Review – Recce (ZEE5)

Saturday,June 18,2022 - 06:10 by Z_CLU

నటీ నటులు : శ్రీరామ్ , శివ బాలాజీ ,ధన్య బాలకృష్ణ , ఆడుకలం నరేన్ , సమ్మెట గాంధీ ,రేఖ , శరణ్య ప్రదీప్,రాజశ్రీ నాయర్,రామరాజు, తోటపల్లి మధు ,సమీర్,తదితరులు

సంగీతం : శ్రీరామ్ మద్దూరి

కెమెరా : రామ్. కె. మహేష్

నిర్మాత : శ్రీ రామ్ కొలిశెట్టి

రచన -దర్శకత్వం : పోలూరు కృష్ణ

రిలీజ్ : ZEE5

విడుదల తేది : 17 జూన్ 2022

జీ5 నుండి 'రెక్కీ' అనే వెబ్ సిరీస్ తాజాగా రిలీజైంది. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో క్రైం డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్ ట్రైలర్ తోనే అందరినీ ఆకట్టుకుని మంచి బజ్ క్రియేట్ చేసింది. మరి ఈ సిరీస్ లో సీజన్ 1 ఓటీటీ ఆడియన్స్ ని ఎలా మెప్పించింది ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

కథేంటి ?

1992 తాడిపత్రి లో ఓ వ్యక్తి ఘోరంగా హత్య చేయబడతాడు. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ భాద్యత SI లెనిన్ (శ్రీరాం )కి అప్పగిస్తారు. తనకి మొదటి కేసు కావడంతో లెనిన్ ఈ కేసుని చాలెంజింగ్ గా తీసుకొని తన స్టైల్ లో ఇన్వెస్టిగేషన్ మొదలు పెదతాడు.

పరదేశి (సమ్మెట గాంధి) ముఠా ఓ మర్డర్ చేసేందుకు రెక్కీ చేస్తుంటారు. ఆరు నెలల్లో మున్సిపల్ ఎలక్షన్స్ ఉందనగా తాడిపత్రిలో రెండు హత్యలు జరుగుతాయి. వరదరాజులు , అతని కొడుకు చలపతి కొన్ని నెలల గ్యాపులో హత్య చేయబడతారు. ఇంతకీ ఈ తండ్రి కొడుకులను హత్య చేసిందెవరు ? ఈ మర్డర్ మిస్టరీని చేదించేందుకు లెనిన్ ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేశాడు. చివరికి ఈ హత్యల వెనుక ఉన్న వ్యక్తులను ఎలా కనిపెట్టాడనేది మిగతా కథ.

   

నటీ నటీ నటుల పనితీరు :

శ్రీరామ్ మంచి నటుడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మంచి పాత్ర దక్కితే బెస్ట్ ఇస్తాడు. ఎస్ ఐ లెనిన్ పాత్రలో మంచి నటన కనబరిచాడు. ఆ పాత్రను ఎలా బిహేవ్ చేయాలో సరిగ్గా అలాగే బిహేవ్ చేశాడు. శివబాలాజీ కి చాలా గ్యాప్ తర్వాత చాలెంజింగ్ రోల్ దొరకడంతో చలపతిగా మెప్పించాడు. ముఖ్యంగా చివరి రెండు ఎపిసోడ్స్ లో శివబాలాజీ నటన బాగా ఆకట్టుకుంది. ధన్య బాలకృష్ణ కి కథలో ఎక్కువ ప్రాధాన్యత లేకపోయినప్పటికీ ఉన్న రెండు మూడు సన్నివేశాల్లో మంచి నటన కనబరిచింది. వరదరాజులు గా ఆడుకలం నరేన్ కేరెక్టర్ కి పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు. కథలో కీలకమైన రేఖ పాత్రలో ఎస్టర్ నోరోన్హా ఆకట్టుకుంది. పెర్ఫార్మెన్స్ తో పాటు ఆమె గ్లామర్ కూడా సిరీస్ కి ప్లస్ అయ్యింది. పరదేశి పాత్రలో సమ్మెట గాంధి ఒదిగిపోయి నటించాడు. రెక్కీ చేసే సన్నివేశాలలో అతని నటన బాగుంది. బాషా గా ఉమా దానం కుమార్, సుబ్బడు గా కృష్ణకాంత్, నల్లంజీ గా మణి, ఎమ్మెల్యే గా జీవా , దేవకమ్మ గా రాజశ్రీ నాయర్, బుజ్జమ్మగా శరణ్య ప్రదీప్, రంగనాయకులు గా రామరాజు , కుళ్ళాయప్పగా తోటపల్లి మధు , పోలీస్ ఆఫీసర్ గా సమీర్ , ఈ.ఓ పాత్రలో సూర్య తేజ , బసవ పాత్రలో మురళి ,కానిస్టేబుల్ స్వామి పాత్రలో స్వామి నాయుడు, కానిస్టేబుల్ స్వామి భార్య పాత్రలో ప్రభావతి మంచి నటన కనబరిచి వారి పాత్రలకు పూర్తి న్యాయం చేసి ఆకట్టుకున్నారు.

 

సాంకేతిక వర్గం పనితీరు :

క్రైం ఇన్వెస్టిగేషన్ డ్రామా కథలకు ఇంటరెస్ట్ కలిగిస్తూ మంచి ఇంపాక్ట్ తీసుకొచ్చే నేపథ్య సంగీతం చాలా అవసరం. తన బ్యాక్ స్కోర్ తో రెక్కీకి ప్రాణం పోశాడు శ్రీరామ్ మద్దూరి. కొన్ని సన్నివేశాలకు అతని అందించిన స్కోర్ సిరీస్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది. తన స్కోర్ తో మంచి ఇంపాక్ట్ తీసుకొచ్చాడు. రామ్. కె. మహేష్ కెమెరా వర్క్ చాలా బాగుంది. కొన్ని సన్నివేశాలను చూపించిన విధానం ఆకట్టుకుంది. సాయి సౌండ్ డిజైనింగ్ బాగుంది. కుమార్. పి. అనిల్ ఎడిటింగ్ క్రిస్ప్ గా గ్రిప్పింగ్ గా ఉంది. కొన్ని సన్నివేశాలు డ్రాగ్ అనిపించినప్పటికీ బోర్ కొట్టకుండా తన ఎడిటింగ్ మేజిక్ చూపించాడు అనీల్.

ఈ సిరీస్ కోసం పోలూరు కృష్ణ ఎంచుకున్న కథ పాతదే అయినప్పటికీ కథనం మాత్రం బాగా రాసుకున్నాడు. అలాగే దర్శకుడిగా ఈ సిరీస్ ను డీల్ చేసిన విధానం ఆకట్టుకుంది. సిరీస్ లాస్ట్ ఎపిసోడ్ ఫినిష్ అయ్యాక దర్శకుడిగా అతనికి మంచి భవిష్యత్తు ఉందనిపించింది. శ్రీ రామ్ కొలిశెట్టి ప్రొడక్షన్ వేల్యూస్ బాగున్నాయి.

 

జీ సినిమాలు సమీక్ష :

వెబ్ సిరీస్ అంటే స్కిప్ చేయకుండా ఆసక్తిగా చూసే విధంగా ఉండాలి. ఇక మర్డర్ మిస్టరీతో క్రైం థ్రిల్లర్ అంటే చాలా ప్లాన్ చేసుకోవాలి. రైటింగ్ తో పాటు మేకింగ్ లో కూడా క్వాలిటీ ఉండేలా చూసుకుంటే ఈ జోనర్ కథలతో ప్రేక్షకులను మెప్పించడం సులువే. అదే విధంగా గతంలో వచ్చిన సిరీస్ లను మిగతా సినిమాలను గుర్తుచేయకుండా చూసుకోవడం కూడా ముఖ్యం. ఇవన్నీ అనాల్సిస్ చేసుకొని తన టాలెంట్ తో మెప్పించి ప్రేక్షకులకు మంచి ఎక్స్ పీరియన్స్ ఇచ్చాడు దర్శకుడు పోలూరు కృష్ణ. ఈ సిరీస్ కోసం రొటీన్ పాయింట్ తీసుకున్నప్పటికీ ఆసక్తి కలిగించే స్క్రీన్ ప్లేతో మేజిక్ చేశాడు.

మొదటి ఎపిసోడ్ తో సిరీస్ పై ఆసక్తి నెలకొల్పిన దర్శకుడు కృష్ణ... ఎపిసోడ్ మారే కొద్ది ఇంకా ఆసక్తిగా కథను నడిపించిన తీరు ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇలాంటి కథలో ఉండాల్సిన ఊహించని ట్విస్టులు , కథలో మలుపులు బాగా ప్లాన్ చేసుకొని మెస్మరైజ్ చేశాడు. నాలుగో ఎపిసోడ్ , ఐదో ఎపిసోడ్ తో పాటు చివరి ఎపిసోడ్ ని అతను డీల్ చేసిన విధానం చాలా బాగుంది.

'రెక్కీ' అనే టైటిల్ తో వచ్చిన ఈ సిరీస్ తో  ఒక మర్డర్ వెనుక ఎలాంటి రెక్కీ చేస్తారనేది క్లియర్ కట్ గా చూపించే ప్రయత్నం చేసిన అందులో పూర్తిగా సక్సెస్ అయ్యాడు దర్శకుడు. అక్కడక్కడా సన్నివేశాలు డ్రాగ్ అనిపించినా బోర్ కొట్టకుండా నడిపించాడు. ఆ విషయంలో దర్శకుడిని మెచ్చుకోవాల్సిందే. సహజంగా కొన్ని సిరీస్ లు పూర్తయ్యాక ఈ కథకి ఇన్ని ఎపిసోడ్స్ అనవసరం అనిపిస్తుంటుంది. కానీ రెక్కీ చూసాక అలాంటి ఫీల్ కలగదు. అది పూర్తిగా దర్శకుడి మేజిక్ అని చెప్పొచ్చు. పాత్రలకు పర్ఫెక్ట్ అనిపిస్తూ బెస్ట్ ఇచ్చే నటీ నటులను ఎంచుకోవడం దర్శకుడికి బాగా కలిసొచ్చింది. అలాగే  బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చే టెక్నీషియన్స్ ని తీసుకోవడం సిరీస్ కి హెల్ప్ అయ్యింది.

రెక్కీ లో మనం ఊహించని ట్విస్టులు చాలానే ఉన్నాయి. చాలా క్రైం థ్రిల్లర్స్ చూసిన వారు సైతం చివరి ట్విస్టులు ఊహించలేని విధంగా రాసుకున్నాడు దర్శకుడు కృష్ణ. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్టులు బాగా వర్కౌట్ అయ్యి ప్రేక్షకులను థ్రిల్ చేశాయి. ఇక క్లైమాక్స్ లో రెక్కీ సీజన్ 2 కి సంబంధించి లీడ్ ఇచ్చి మరో సీజన్ కూడా ఉండనుందని హింట్ ఇచ్చి సీజన్ 1 ని ఫినిష్ చేశాడు కృష్ణ. క్రైం థ్రిల్లర్స్ జోనర్స్ ఇష్టపడే వారికీ రెక్కీ బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. ఒకరకంగా చెప్పాలంటే ఈ వీక్ లో మిస్ అవ్వకుండా చూడాల్సిన సిరీస్ ఇది.

రేటింగ్ : 3 .25/ 5