OTT Review – Oka Chinna Family Story (Telugu Web series)

Saturday,November 20,2021 - 12:21 by Z_CLU

నటీనటులు: సంగీత్ శోభన్, సిమ్రాన్ శర్మ, సీనియర్ నరేష్, తులసి, 'గెటప్' శీను తదితరులు.. బ్యానర్: పింక్ ఎలిఫెంట్స్ పిక్చర్స్ నిర్మాత: నిహారికా కొణిదెల దర్శకత్వం: మహేష్ ఉప్పాల కథ-మాటలు: మహేష్ ఉప్పాల, మానసా శర్మ రిలీజ్ డేట్: నవంబర్ 19 ఎపిసోడ్స్: 5 వేదిక: ZEE5

మధ్యతరగతి కథలు ఎప్పుడూ మెప్పిస్తాయి. ఎందుకంటే అవి హార్ట్ టచింగ్ గా ఉంటాయి, అందరికీ కనెక్ట్ అవుతాయి, అందరికీ తెలిసిన పాత్రలు ఉంటాయి కాబట్టి. సరిగ్గా ఇవే ఎలిమెంట్స్, క్వాలిటీస్ తో వచ్చింది ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ. మెగా డాటర్ నిహారిక కొణెదల ప్రొడ్యూస్ చేసిన ఈ వెబ్ సిరీస్ కు వరుణ్ తేజ్, నాగార్జున, నాని లాంటి స్టార్స్ ప్రమోషన్ చేశారు. దీంతో అందరి దృష్టిలో పడిన ఈ వెబ్ సిరీస్, జీ5లో స్ట్రీమింగ్ కొచ్చింది. మరి అందర్నీ ఎట్రాక్ట్ చేసిందా? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ

Oka Chinna Family Story review

కథ

మహేష్ (సంగీత్ శోభన్) ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి. ఇంజినీరింగ్ ఫెయిల్ అయి ఖాళీగా ఇంట్లో ఉంటాడు. తన కోసం అమ్మ రుక్మిణి (తులసి), నాన్న హరిదాస్ (సీనియర్ నరేష్) ఏం చేయలేదని ఫ్రస్ట్రేట్ అవుతుంటాడు. తక్కువ పనితో ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం కోరుకుంటాడు. దానికితోడు పొరుగునే ఉన్న కీర్తి (సిమ్రాన్ శర్మ)ను ప్రేమిస్తాడు. కొడుకు ఏం చేసినా రుక్మిణి వత్తాసు పలుకుతుంది. తల్లికొడుకు వరస చూసి హరిదాస్ చిరాకు పడుతుంటాడు. ఇలా చిన్న గొడవలు, సర్దుబాట్లుతో సాగుతున్న ఆ మిడిల్ క్లాస్ కుటుంబంలో ఒక్కసారిగా కుదుపు.

సడెన్ గా హరిదాస్ చనిపోతాడు. దీంతో ఒక్కసారిగా ఆ కుటుంబం ఆర్థిక కష్టాల్లో చిక్కుకుంటుంది. దీనికితోడు సరిగ్గా మరణించడానికి కొన్ని రోజుల ముందు హరిదాసు ఏకంగా పాతిక లక్షలు పర్సనల్ లోన్ తీసుకుంటాడు. ఆ డబ్బు ఏం చేశాడో ఎవ్వరికీ అర్థంకాదు. ఇలాంటి పరిస్థితుల్లో మహేష్ ఏం చేశాడు? తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు? పొరుగింటి పిల్ల కీర్తిని దక్కించుకున్నాడా లేదా? అసలు హరిదాస్ ఎందుకు అంత లోన్ తీసుకున్నాడు? ఆ డబ్బును ఏం చేశాడు? అనేది ఈ వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే.

నటీనటుల పనితీరు

5 ఎపిసోడ్స్ గా సాగిన ఈ సిరీస్ మొత్తం తల్లికొడుకుగా నటించిన తులసి-మహేష్ చుట్టూనే తిరుగుతుంది. వాళ్ల నటనే ఈ సిరీస్ కు ప్రాణం పోసింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే తులసి-మహేష్ చించేశారు. వాళ్లు లేకపోతే ఈ సిరీస్ లేదు. చేసిన పాత్ర చిన్నదే అయినప్పటికీ తన సీనియారిటీ మొత్తం చూపించారు సీనియర్ నరేష్. గమ్మత్తేంటంటే.. ఆయన పాత్ర నిడివి చాలా తక్కువ. కానీ సిరీస్ మొత్తం ఆయనే కనిపిస్తారు. అంతా ఆయన గురించే మాట్లాడుకుంటారు. మహేష్ లవర్ గా నటించిన సిమ్రాన్, అతడి మేనమామగా నటించిన రాజీవ్ కనకాల, లోన్ రికవరీ ఏజెంట్ గా నటించిన గెటప్ శీను తమ పాత్రలకు న్యాయం చేశారు.

 

టెక్నీషియన్స్ పనితీరు

ముందుగా చెప్పుకోవాల్సింది మహేష్ ఉప్పాల గురించే. మహేష్ రైటింగ్ ఈ సినిమాకు ప్లస్ అయింది. మానసా శర్మతో కలిసి అతడు తయారుచేసుకున్న ఈ కథ, రాసుకున్న డైలాగ్స్ ఈ సిరీస్ ను నిలబెట్టాయి. పేపర్ పై ఈ స్టోరీ ఇంత స్ట్రాంగ్ గా ఉంది కాబట్టే, తెరపై ఆ పాత్రలు అంత బాగా ఎలివేట్ అయ్యాయనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అయితే పనిగట్టుకొని మరీ వరంగల్ బ్యాక్ డ్రాప్ ఇచ్చి, తెలంగాణ యాస ఎందుకు పెట్టారో అర్థంకాదు. హైదరాబాద్ లో కూడా ఓ స్లమ్ ఏరియాలో తీసి, కామన్ తెలుగుతో ఈ సిరీస్ తీయొచ్చు. దండి సంగీతం, రాజు సినిమాటోగ్రఫీ బాగున్నాయి. ఆర్ట్ వర్క్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మిడిల్ క్లాస్ ఫీల్ తీసుకొచ్చేలా యాంబియన్స్ భలే సెట్ చేశారు.

Oka Chinna Family Story review

జీ సినిమాలు రివ్యూ

తల్లికొడుకు ఒకటైపోతారు, తండ్రిని బద్నాం చేస్తుంటారు. చాలా కుటుంబాల్లో చూస్తున్న ఆ రియల్ లైఫ్ పాయింట్ ను ఈ వెబ్ సిరీస్ కోసం వాడుకున్న విధానం బాగుంది. సిరీస్ మొత్తం అత్యంత సహజంగా తీశారు. నటీనటుల గెటప్స్, కాస్ట్యూమ్స్ నుంచి లొకేషన్, ఆర్ట్ వర్క్ వరకు ప్రతి విషయంపై దృష్టి పెట్టి, శ్రద్ధగా తీశారు. ఒక్కో ఎపిసోడ్ పరంగా చూస్తే..

ముందుగా House No.9 అనే ఎపిసోడ్ తో ఈ సిరీస్ ప్రారంభం అవుతుంది. ఇందులో హీరో, హీరోయిన్, అతడి తల్లితండ్రులు, ఇంట్లో ఉన్న బామ్మ, ఓ టీవీ లాంటి ఎలిమెంట్స్ ను బాగా ఇంట్రడ్యూస్ చేశారు. అలా అని పాత్రల పరిచయానికే ఎక్కువ టైమ్ వేస్ట్ చేయకుండా నేరుగా కథలోకి వెళ్లిపోయారు. తండ్రి పాత్ర చనిపోవడం, ఆర్థిక కష్టాలు, ఈఎంఐం భారం లాంటి కీలకమైన అంశాలన్నింటినీ ఫస్ట్ ఎపిసోడ్ లోనే పెట్టి ఇంట్రెస్ట్ జనరేట్ చేశారు.

ఇక The First EMI అంటూ సెకెండ్ ఎపిసోడ్ తో వెబ్ సిరీస్ పరుగులు పెడుతుంది. మధ్యమధ్యలో కాస్త బోర్ కొట్టించే సీన్లు వచ్చినప్పటికీ టెంపో మాత్రం మిస్ అవ్వదు. ఈఎంఐ కట్టడానికి హీరో పడే కష్టాలతో పాటు, తండ్రి పాత్ర ఎందుకు అంత అప్పు చేసిందనే ట్విస్ట్ ను ఇందులో రివీల్ చేశారు.

Of the Money, by the Money, for the Money అంటూ సాగే మూడో ఎపిసోడ్ ను పూర్తిగా హీరో ఆర్థిక కష్టాలకు కేటాయించారు. ఈ ఎపిసోడ్ లో ట్విస్ట్ ఏంటంటే.. హీరో తండ్రి తను అప్పు చేసి తెచ్చిన పాతిక లక్షలు ఎక్కడ ఉన్నాయో చూపించారు. హీరో లవ్ ఎపిసోడ్ ను ఇంకాస్త ముందుకు తీసుకెళ్లడంతో పాటు బ్రేకప్ కూడా చూపించారు. ఇక Ousting Days అంటూ నాలుగో ఎపిసోడ్ లో హీరో ఈఎంఐ నుంచి తప్పించుకోవడానికి పడే పాట్లుతో పాటు డబ్బు సంపాదన కోసం తల్లికొడుకు పడే పాట్లను చూపించారు. Truth Or Dare? అంటూ సాగే ఫైనల్ ఎపిసోడ్ లో హీరో రీలైజేషన్, హీరో తండ్రి ఆశయం, తల్లి ప్రేమ లాంటి ఎలిమెంట్స్ పెట్టి కథను సుఖాంతం చేశారు.

ఇలా 5 ఎపిసోడ్స్ గా సాగిన ఈ చిన్న ఫ్యామిలీ స్టోరీలో నాలుగో ఎపిసోడ్ లో వచ్చే స్లో నెరేషన్ తప్ప.. మిగతా అన్ని ఎపిసోడ్స్ అలరిస్తాయి. సిరీస్ మొత్తాన్ని కామెడీ బ్యాక్ డ్రాప్ తో నడపడం బాగుంది. హీరో కష్టాలు, లవ్ ఫెయిల్యూర్, ఈఎంఐ కష్టాల్ని కూడా సరదాగా చూపించడం బాగుంది. డబ్బు సంపాదించడం కోసం హీరో, హీరో తల్లి చేసే పనులు ఆడియన్స్ ను ఎంతగానో నవ్విస్తాయి. ఆఖర్లో పెట్టిన ఎమోషనల్ సీన్స్ గుండె బరువెక్కేలా చేస్తాయి. ఓ సగటు తండ్రి ఆలోచన విధానాన్ని, ఆవేదనను ఆవిష్కరిస్తుంది. సంగీత్ శోభన్, తులసి కామెడీ ఈ సిరీస్ కు హైలెట్ గా చెప్పుకోవాలి. పాతిక లక్షల చుట్టూ తిరిగే ఈ సిరీస్ లో, ఆ డబ్బు సదరు కుటుంబం కంట పడకుండా చివర్లో వచ్చిన ట్విస్ట్, దర్శకుడి టాలెంట్ ను చూపిస్తుంది.

ఓవరాల్ గా.. కడుపుబ్బా నవ్వించే సన్నివేశాలతో మొదలైన ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ.. హార్ట్ టచింగ్ సీన్స్, ఎమోషన్స్ తో ముగుస్తుంది. ZEE5లో ఇప్పటికే వచ్చిన ఎన్నో సూపర్ హిట్ సిరీస్ లిస్ట్ లోకి ఇది కూడా చేరింది.

బాటమ్ లైన్ - బాధల్లో నవ్వులు.. నవ్వులో బాధలు రేటింగ్: 3.25/5