Nani’s ‘Ante Sundaraniki’ Movie Review

Friday,June 10,2022 - 02:35 by Z_CLU

హీరో హీరోయిన్లు : నాని, న‌జ్రియా ఫ‌హాద్‌, అనుపమ పరమేశ్వరన్, నరేష్ , నదియా, రోహిణీ, హర్ష వర్ధన్ , పృథ్వి, ఆలి తదితరులు

మ్యూజిక్‌: వివేక్ సాగ‌ర్‌

సినిమాటోగ్ర‌ఫీ: నికేత్ బొమ్మి

ఎడిటింట్‌: ర‌వితేజ గిరిజాల‌

నిర్మాణం : మైత్రి మూవీ మేక‌ర్స్‌

నిర్మాత‌లు : న‌వీన్ యెర్నేని, ర‌విశంక‌ర్ వై.

ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: వివేక్ ఆత్రేయ‌

నిడివి : 176 నిమిషాలు

విడుదల తేది : 10 జూన్ 2022

నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన 'అంటే సుందరానికీ' ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ బేనర్ పై రూపొందిన ఈ సినిమా టీజర్ , ట్రైలర్ తో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. మరి వివేక్ ఆ అంచనాలను అందుకున్నాడా ? నాని తన ఖాతాలో మరో హిట్ వేసుకున్నాడా ? జీ సినిమాలు ఎక్స్ క్లూసివ్ రివ్యూ.

కథ : 

బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన సుందర్ (నాని) చిన్నతనంలో జరిగిన ఓ ఇన్సిడెంట్ కారణంగా ఎప్పటికైనా అమెరికా వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. కానీ సముద్రాలు దాటి ప్రయాణం చేస్తే అతనికి గండమని భావించి తల్లిదండ్రులు సుందర్ అమెరికా వెళ్లేందుకు ఒప్పుకోరు. మరోవైపు సుందర్ తన చిన్నప్పటి ఫ్రెండ్ లీల(నజ్రియా) తో ప్రేమలో ఉంటాడు.

లీల క్రిస్టియన్ కుటుంబానికి చెందిన అమ్మాయి కావడంతో తన తండ్రి తమ పెళ్ళికి ఒప్పుకోడని సుందర్ ఇంట్లో చెప్పకూడని ఓ అబద్దం చెప్పి పెళ్లి చేసుకునే ప్లాన్ వేస్తాడు. ఇక లీల కూడా సుందర్ కోసం తన ఇంట్లో ఓ అబద్దం చెప్పి పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అవుతుంది. మరి సుందర్ లీల చెప్పిన అబద్దాలు నమ్మి వాళ్ళింట్లో వీళ్ళకి పెళ్లికి ఒప్పుకున్నారా? చివరికి సుందర్, లీల ఈ చిక్కుల నుండి బయటపడి పెళ్లి చేసుకున్నారా? లేదా అనేది మిగతా కథ.

నటీనటుల పనితీరు : 

నాని కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. మొదటి సినిమా 'అష్టాచమ్మా' నుండే తన కామిక్ టైమింగ్ తో హిలేరియస్ ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నాడు. తన పెర్ఫార్మెన్స్, టైమింగ్ తో సుందర్ పాత్రతో మెస్మరైజ్ చేశాడు నేచురల్ స్టార్. ఈ పాత్రలో నాని కాకుండా మరెవరైనా అనే ఆలోచన కూడా రానివ్వలేదు. తన నటనతో సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచాడు నాని. ఈ సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నజ్రియా లీల పాత్రలో ఒదిగిపోయింది. సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాల్లో ఆమె నటన సినిమాకు ప్లస్ అయ్యింది.

నానికి కొలీగ్ పాత్రలో కనిపించిన అనుపమ తన నటనతో ఆకట్టుకుంది. నరేష్ నటన  గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సుందర్ తండ్రిగా బ్రాహ్మిన్ పాత్రలో మంచి నటన కనబరిచాడు. కొన్ని సన్నివేశాల్లో తన నటన ప్రేక్షకులకు బాగా నవ్వు తెప్పిస్తుంది. రోహిణీ మరోసారి నానికి తల్లి పాత్రలో మెప్పించింది. లీల తండ్రిగా పెరుమాళ్, తల్లిగా నదియా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. స్పెషల్ కేరెక్టర్ లో వెంకటేష్ మహా ఆకట్టుకున్నాడు. సుందరం చిన్నప్పటి కేరెక్టర్ లో విన్ని బాగా నటించాడు.

సెకండాఫ్ లో వచ్చే ఓ సీన్ లో రాహుల్ రామకృష్ణ హిలేరియస్ గా నవ్వించాడు.  బాస్ పాత్రలో హర్షవర్ధన్ తన నటనతో డైలాగ్ డెలివరీతో నవ్వించాడు. బామ్మ పాత్రలో అరుణ బిక్షు, అలాగే మిగతా పాత్రల్లో పృథ్వీ, ఆలి, శ్రీకాంత్ అయ్యంగార్ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు : 

సినిమాకు వర్క్ చేసిన టెక్నీషియన్స్ అందరు వారి వారి విభాగాల్లో బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చారు. ముఖ్యంగా వివేక్ సాగర్ నేపథ్య సంగీతం సినిమాకు బిగ్ ఎస్సెట్ అయ్యింది. "ఎంత చిత్రం" , "రంగ రంగ"  పాటలు బాగున్నాయి. కానీ సినిమా అనంతరం గుర్తుచేసుకొని పాడుకునేలా లేవు. నికేత్ బొమ్మి కెమెరా వర్క్ బాగుంది. తన సినిమాటోగ్రఫీతో సినిమాను ఎట్రాక్టివ్ గా చూపించాడు నికేత్. రవితేజ ఎడిటింగ్ పరవాలేదు. కొన్ని డ్రాగ్ అనిపించే సన్నివేశాలు కట్ చేసి ఫైనల్ వర్షన్ ఇంకాస్త ట్రిమ్ చేసి ఉంటే బెటర్ గా ఉండేది. ఆర్ట్ వర్క్ బాగుంది.

వివేక్ ఆత్రేయ స్టోరీ , స్క్రీన్ ప్లే నీట్ గా ఉన్నాయి. తను అనుకున్న కథను పెర్ఫెక్ట్ నరేషన్ తో డైరెక్ట్ చేశాడు. కాకపోతే కొన్ని సందర్భాలో స్క్రీన్ ప్లే స్లోగా సాగడం, సన్నివేశాలు డ్రాగ్ అనిపించడం సినిమాకు మైనస్ అని చెప్పొచ్చు. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వేల్యూస్ బాగున్నాయి. దర్శకుడికి కావాల్సింది అందించి సినిమా క్వాలిటీని పెంచడంలో నిర్మాతలుగా నవీన్ , రవి సక్సెస్ అయ్యారు.

జీ సినిమాలు సమీక్ష : 

మొదటి సినిమా 'మెంటల్ మదిలో' తో యావరేజ్ మూవీ డెలివరీ చేసిన దర్శకుడు వివేక్ ఆత్రేయ రెండో సినిమా 'బ్రోచేవారెవరురా' తో డైరెక్టర్ గా  సక్సెస్ తో పాటు మంచి గుర్తింపు అందుకున్నాడు. ఆ సినిమా తర్వాత నాని హీరోగా మైత్రి బేనర్ లో వివేక్ ఆత్రేయ మూడో సినిమా ఎనౌన్స్ అవ్వగానే  'అంటే సుందరానికీ' మీద మంచి అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను అందుకొని డీసెంట్ మూవీ డెలివరీ చేసి దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు వివేక్. ముఖ్యంగా తను ఎంచుకున్న కథ అలాగే రాసుకున్న కథనం బాగున్నాయి. ఒక చిన్న లైన్ పట్టుకొని దానికి తగిన స్క్రీన్ ప్లే రాసుకోవడం  అంటే మామూలు విషయం కాదు. ఈ సినిమా కోసం వివేక్ రైటింగ్ లో బాగానే కష్టపడ్డాడు. ఆ కష్టం స్క్రీన్ పై కనిపించింది. ముఖ్యంగా ఇంటర్ కాస్ట్ పెళ్లి చుట్టూ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే రాసుకొని ఎంటర్టైన్ చేశాడు.

నానికి సుందర్ అనే పర్ఫెక్ట్ క్యారెక్టరైజేషన్ రాసుకొని మెప్పించాడు వివేక్. నిజానికి వివేక్ ఆత్రేయ చేసిన సినిమాల్లో పాత్రలు ఆకట్టుకుంటాయి. మంచి సంభాషణలు, ఆకట్టుకునే సన్నివేశాలతో ఆ పాత్రలను ప్రేక్షకులకు కనెక్ట్ చేయడంలో వివేక్ దిట్ట అనే చెప్పాలి. ఈ సినిమాలో బామ్మ పాత్ర కూడా కనెక్ట్ అయ్యిందంటే అది వివేక్ టాలెంటే. వివేక్ లో ఇంకో బెస్ట్ క్వాలిటీ కూడా ఉంది. తన సినిమాల్లో అచ్చ తెలుగు మాటలతోనే సన్నివేశాలు రాసుకుంటాడు. పాటల్లో సాహిత్యం కూడా అలాగే ఉండేలా చూసుకుంటాడు. ఈ సినిమాకు సంబంధించి టైటిల్స్ కూడా తెలుగులోనే వేసుకున్నాడు వివేక్.

మొదటి భాగాన్ని చైల్డ్ ఎపిసోడ్ , అక్కడక్కడా వచ్చే ఫన్ తో ఓ మోస్తరుగా అలరించిన  వివేక్ రెండో భాగంలో తన ప్రతిభ చూపించి స్క్రీన్ ప్లే, సన్నివేశాలతో మెప్పించాడు.  ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ లో ఎక్కువ ఎంటర్టైన్ మెంట్ క్రియేట్ చేసి హిలేరియస్ గా నవ్వించాడు దర్శకుడు. హర్షవర్ధన్ తో నాని సీన్స్, రాహుల్ రామకృష్ణ తన కొడుకు సమస్య గురించి నరేష్ కి అర్థమయ్యేలా చెప్తూ వచ్చే సీన్ పర్ఫెక్ట్ టైంలో వాడుకొని వాటితో ఆడియన్స్ ని బాగా నవ్వించాడు. ఫస్ట్ హాఫ్ లో చైల్డ్ ఎపిసోడ్ డ్రాగ్ చేస్తూ చూపించడం, అలాగే స్లో నెరేషన్ మాత్రం కాస్త ఇబ్బంది పెడుతుంది. ఇంటర్వెల్ ఎప్పుడు వస్తుందని ఎదురుచూసేలా చేస్తుంది. ఇక సెకండాఫ్ లో లెంగ్త్ పెద్ద సమస్యగా అనిపించదు కానీ అందులో కూడా కొన్ని సన్నివేశాలు ట్రిమ్ చేయొచ్చనే ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్ లో హర్శవర్షన్ కిందా మీద పడి ఇంత చెప్పడం అవసరమా డైరెక్ట్ గా పాయింట్ చెప్పొచ్చు కదా అని నానితో అంటాడు.  ప్రేక్షకుడిది కూడా అదే ఫీలింగ్. వివేక్ ఇంత డ్రాగ్ చేస్తూ లెన్తీ రన్ టైంతో కథ చెప్పడం అవసరమా అనిపిస్తుంది.   ఇక ప్రీ క్లైమాక్స్ లో వచ్చే కామెడీ సీన్స్ , అలాగే క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి.

నాని కామెడీ టైమింగ్, నజ్రియా పెర్ఫార్మెన్స్, కామెడీ సీన్స్, వివేక్ ఆత్రేయ రైటింగ్ - డైరెక్షన్, క్యారెక్టర్స్, వివేక్ సాగర్ నేపథ్య సంగీతం సినిమాకు హైలైట్స్ కాగా లెంగ్త్ అనిపించే రన్ టైం , డ్రాగ్ అనిపించే సీన్స్ , స్లోగా సాగే ఫస్ట్ హాఫ్ సినిమాకు మైనస్ అనిపిస్తాయి. ఫైనల్ గా 'అంటే సుందరానికీ' నాని మార్క్ కామెడీ టైమింగ్ , హిలేరియన్ ఎంటర్టైన్ మెంట్ తో మెప్పిస్తుంది.

బాటమ్ లైన్ : 'అంటే' సుందర్ నవ్వించాడు

రేటింగ్ : 2.75 /5

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics