Nagarjuna- NagaChaitanya’s ‘Bangarraju’ Movie Review

Friday,January 14,2022 - 02:17 by Z_CLU

నటీనటులు : అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి, నాగబాబు, చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజి, వెన్నెల కిషోర్, ఝాన్సీ.

సంగీతం : అనూప్ రూబెన్స్

సినిమాటోగ్రఫర్ : యువరాజ్

బ్యానర్స్ : జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి.

నిర్మాత : అక్కినేని నాగార్జున

స్క్రీన్ ప్లే : సత్యానంద్

కథ, దర్శకత్వం : కళ్యాణ్ కృష్ణ

నిడివి : 160 నిమిషాలు

విడుదల తేది : 14 జనవరి 2022

కింగ్ నాగార్జున , యువ సామ్రాట్ నాగ చైతన్య కాంబినేషన్ లో 'సోగ్గాడే చిన్ని నాయన' కి సీక్వెల్ అనగానే 'బంగార్రాజు' పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి పండగ కోసమే తీసిన ఈ సినిమాను అనుకున్నట్లే పొంగల్ బరిలో నిలిపాడు నాగ్. మరి ఈ ఏడాది సంక్రాంతి బరిలో ఏకైక బడా సినిమాగా నిలిచిన 'బంగార్రాజు' ప్రేక్షకులను మెప్పించి సంక్రాంతి విన్నర్ అనిపించుకున్నాడా ? సోగ్గాడు మళ్ళీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడా ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

bangarraju nagarjuna కథ :

సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో వచ్చే ఎండింగ్ నుండి లీడ్ తీసుకొని బంగార్రాజు కథ తయారు చేశారు. రాము , సీతకి ఒక కొడుకు పుట్టడం, ఆ తర్వాత సీత చనిపోవడం, ఆ బాధతో కొడుకు బంగార్రాజు(నాగ చైతన్య) ని తల్లి సత్తెమ్మ (రమ్య కృష్ణ) చేతిలో పెట్టి రాము మళ్ళీ అమెరికాకి వెళ్ళిపోవడంతో ఈ సీక్వెల్ కి లీడ్ తీసుకున్నారు. పుట్టిన కొన్ని రోజులకే నాయనమ్మ సత్తెమ్మ చనిపోవడంతో ఊళ్ళో అల్లరి చిల్లరిగా తిరుగుతూ సోగ్గాడిగా మారతాడు బంగార్రాజు. దాంతో సత్తెమ్మ మళ్ళీ బంగార్రాజు(నాగార్జున) ఆత్మని కిందకి పంపించి తర్వాత తన మనవడిని దారిలో పెట్టి మరదలు నాగ లక్ష్మి(కృతి శెట్టి) తో పెళ్లి చేయాలని కోరుతుంది.

అలా సత్తెమ్మ కోరిక మేరకూ మళ్ళీ భూమి మీదకొచ్చిన పెద్ద బంగార్రాజు చిన్న బంగారాజుని ఎలా లైన్లో పెట్టాడు..? నాగలక్ష్మి తో మనవడి పెళ్లి ఎలా సెట్ చేశాడు ? ఫైనల్ గా పగతో రగిలిపోతూ చిన్న బంగార్రాజుని చంపాలని చూస్తున్న విలన్స్ నుండి మనవడిని , అలాగే ఊరి శివాలయాన్ని నుండి ఎలా కాపాడాడు ? అనేది మిగతా కథ.

నటీ నటుల పనితీరు :

'సోగ్గాడు బంగార్రాజు' పాత్రలో నాగార్జున మరోసారి మెస్మరైజ్ చేశాడు. తన మేనరిజమ్స్ , పెర్ఫార్మెన్స్ తో సినిమాకు హైలైట్ గా నిలిచాడు. చిన్న బంగార్రాజు ని ఎప్పటికప్పుడు కాపాడుతూ వచ్చే సన్నివేశాల్లో ఆకట్టుకున్నాడు. తండ్రి చేసిన పాత్రలో నాగ చైతన్య కూడా ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా పెద్ద బంగార్రాజు తనలోకి ప్రవేశించే సన్నివేశాల్లో చైతూ ట్రాన్స్ఫర్ మేషన్ పర్ఫెక్ట్ గా ఉంది. ఆ సన్నివేశాలతో చైతూ ఆడియన్స్ ని అలరించి నటుడిగా మంచి మార్కులు అందుకున్నాడు. సత్తెమ్మ పాత్రలో రమ్య కృష్ణ అల్టిమేట్ అనిపించుకుంది. గతంలో చేసిన పాత్రే కావడంతో మరోసారి ఆ క్యారెక్టర్ తో అలరించింది. సర్పంచ్ నాగలక్ష్మిగా కృతి శెట్టి క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ అనిపించుకుంది. యమధర్మరాజుగా నాగబాబు , ఇంద్రుడుగా రవి ప్రకాష్ మంచి నటన కనబరిచారు. ఫరియా అబ్దుల్లా , దక్ష పాటల్లో మెరిసి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు.

విలన్స్ గా సంపత్ రాజ్ , సూర్య తమ క్యారెక్టర్స్ కి బెస్ట్ ఇచ్చారు. వెన్నెల కిషోర్ కామెడీ కొన్ని సన్నివేశాల్లో నవ్వించింది. బ్రహ్మాజీ , అన్నపూర్ణమ్మ , ఝాన్సి , సురేఖ వాణి , నాగ మహేష్ , మనోజ్ నందన్ , అనిత చౌదరి తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

 

సాంకేతిక వర్గంపనితీరు :

సినిమాకు టెక్నికల్ గా అన్ని డిపార్ట్ మెంట్స్ నుండి బెస్ట్ సపోర్ట్ దక్కింది. ముఖ్యంగా అనూప్ తన మ్యూజిక్ తో మేజిక్ క్రియేట్ చేసి సినిమాకు హైలైట్ అనిపించుకున్నాడు. సినిమాకు మంచి సాంగ్స్ అందించడమే కాకుండా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ది బెస్ట్ ఇచ్చాడు అనూప్. ముఖ్యంగా క్లైమాక్స్ లో అనూప్ స్కోర్ మంచి ఇంపాక్ట్ తీసుకొచ్చి ఆ బ్లాక్ ని ఎలివేట్ అయ్యేలా చేసింది. యువరాజ్ సినిమాటోగ్రఫీ సినిమాకు మరో ప్లస్ పాయింట్. చాలా సన్నివేశాల్లో తన కెమెరా టెక్నిక్స్ తో మేజిక్ చేశాడు. విజువల్ ఎఫెక్ట్స్ చక్కగా కుదిరాయి. బ్రహ్మ కడలి ఆర్ట్ వర్క్ బాగుంది. ముఖ్యంగా యమలోకం సెట్ , సాంగ్ కోసం వేసిన సెట్స్ లో అతని పనితనం కనిపించింది. విజయ్ వర్ధన్ ఎడిటింగ్ బాగుంది.

రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు హైలైట్ గా నిలిచి మాస్ ఆడియన్స్ ని అలరించేలా చేశాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్ ని గూస్ బంప్స్ తెప్పించేలా కంపోజ్ చేశారు. సత్యానంద్ స్క్రీన్ ప్లే బాగుంది. కళ్యాణ్ కృష్ణ దర్శకుడిగా మరోసారి మంచి మార్కులు అందుకున్నాడు. అన్ని అంశాలు ఉండేలా ప్లాన్ చేసుకొని పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ గా ఈ సీక్వెల్ ని తీర్చిదిద్దాడు. జీ స్టూడియోస్ , అన్నపూర్ణ స్టూడియోస్ ప్రొడక్షన్ వాల్యూస్ గ్రాండియర్ గా ఉన్నాయి.

bangarraju nagarjuna nagachaitanya

జీ సినిమాలు సమీక్ష :

సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అందులో అన్ని ఎలిమెంట్స్ ఉండే పక్కా కమర్షియల్ సినిమాలు మాత్రం అరుదుగా వస్తుంటాయి. అందులో ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా థియేటర్స్ కి రప్పించే ఎలిమెంట్స్ జోడిస్తే ఇంకేముందు సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్ళు రాబట్టడం చాలా సులువు. 'బంగార్రాజు' సరిగ్గా అలాంటి సినిమానే. 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమాకు కొనసాగింపుగా కళ్యాణ్ కృష్ణ తీసిన ఈ సినిమాలో అన్ని ఎలిమెంట్స్ చక్కగా కుదిరాయి. ఈ సీక్వెల్ ని సంక్రాంతి కోసమే చేశారు కాబట్టి అన్ని వర్గాల ఆడియన్స్ ని మెప్పించే కంటెంట్ రెడీ చేసుకున్నాడు దర్శకుడు. అలాగే సోగ్గాడే లో వర్కౌట్ అయిన సక్సెస్ ఫ్యాక్టర్స్ ని వాడుకుంటూ ఈ కథను రాసుకున్నాడు. శివుడి ఆలయం , దేవుడి మహిమ , ఆత్మ , రొమాంటిక్ సీన్స్ ఇలా మొదటి భాగంలో కలిసొచ్చిన అంశాలన్నీ ఇందులోనూ పొందుపరిచాడు దర్శకుడు. ముఖ్యంగా శివుడి ఆలయంలో సునామి వచ్చే విజువల్ ఎఫెక్స్ట్ సీక్వెన్స్ తో సినిమాను స్టార్ట్ చేసి ఆ తర్వాత చిన్న బంగార్రాజు ని లైన్లో పెట్టి పెళ్లి చేసేందుకు సత్తెమ్మ కోరిక మేరకూ బంగార్రాజు ఆత్మ కిందకి రావడం , ఊళ్ళో చిన్న బంగార్రాజు చేసే అల్లరితో సినిమాను నడిపించాడు. బంగార్రాజు - నాగ లక్ష్మి లవ్ ట్రాక్ ఊళ్ళో సరదా సన్నివేశాలతో ఫస్ట్ హాఫ్ ని పాస్ చేయించేసిన కళ్యాణ్ కృష్ణ సెకండాఫ్ లో దర్శకుడిగా తన టాలెంట్ చూపించి మెప్పించాడు.

పెద్ద బంగార్రాజు, చిన్న బంగార్రాజు శరీరంలోకి వచ్చే సన్నివేశాలు బాగా వర్కౌట్ అయ్యాయి. ఆ సన్నివేశాలను బాగా రాసుకున్నాడు కళ్యాణ్ కృష్ణ. అలాగే అక్కడక్కడా వచ్చే మాటలు కూడా ఆకట్టుకున్నాయి. "ప్రాణం ఉన్నప్పుడు చిన్న చిన్న గొడవలు పెట్టుకుంటారు. పోయాక ఏం మిగులుతుంది ఫోటో తప్ప" అంటూ పెద్ద బంగార్రాజు పాత్రతో ప్రాణం విలువ చెప్పించిన మాటలు క్లాప్స్ కొట్టించేలా చేశాయి. పిల్లాడిని ఎద్దు తరిమే ఎపిసోడ్ తో పాటు ప్రీ క్లైమాక్స్ , క్లైమాక్స్ సినిమాకు హైలైట్స్ గా నిలిచాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో రాము క్యారెక్టర్ ని తీసుకొచ్చి యాక్షన్ ఎపిసోడ్ తో గూస్ బంప్స్ తెప్పించాడు కళ్యాణ్ కృష్ణ. ఆ యాక్షన్ బ్లాక్ కి రామ్ లక్ష్మణ్ మాస్టర్ కంపోజిషన్ పాటు అనూప్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసి ఆడియన్స్ చేత విజిల్స్ వేయించేలా చేశాయి.

అలాగే నాగార్జున -రమ్య కృష్ణల మధ్య వచ్చే సన్నివేశాలు , నాగ చైతన్య -కృతి శెట్టి ల మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ కూడా అలరించాయి. మధ్య మధ్యలో వచ్చే అనూప్ పాటలు సినిమాకు మరింత బలం చేకూర్చి ఎంటర్టైన్ చేశాయి. ఫస్ట్ హాఫ్ నెమ్మదిగా సాగడం , హిలేరియస్ ఎంటర్టైన్ మెంట్ లేకపోవడం, కొన్ని సన్నివేశాలు పేలవంగా ఉండటం సినిమాకు మైనస్ అని చెప్పొచ్చు. కానీ ఆ మైనస్ లను క్లైమాక్స్ కొచ్చే సరికి మరిచిపోయేలా చేశాడు కళ్యాణ్ కృష్ణ. సంక్రాంతి సినిమా అంటే పసందైన పండుగ విందులాగ లవ్ , యాక్షన్ , కామెడీ, రొమాన్స్ , ఫ్యామిలీ సెంటిమెంట్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉండాల్సిందే. అవన్నీ బంగార్రాజులో ఉండటంతో ముందు నుండి టీం చెప్తున్నట్లు ఇది పండగ సినిమా అనిపించుకుంది. ఫైనల్ గా ఈ సంక్రాంతి సీజన్ లో చిన్న బంగార్రాజుతో కలిసి 'బంగార్రాజు' మెప్పించాడు. పొంగల్ బరిలో ఏకైక బడా సినిమాగా వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్ళు అందుకొని బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం ఖాయం.

బాటం లైన్ : 'సోగ్గాళ్ళు' మెప్పించారు

రేటింగ్ : 3 / 5