Naga Shourya’s ‘Phalana Abbayi Phalana Ammayi’ Review

Friday,March 17,2023 - 04:00 by Z_CLU

నటీనటులు : నాగ శౌర్య, మాళవిక నాయర్, శ్రీనివాస్ అవసరాల, మేఘ చౌదరి, అశోక్ కుమార్, అభిషేక్ మహర్షి, శ్రీ విద్య, వారణాసి సౌమ్య చలంచర్ల, హరిణి రావు, అర్జున్ ప్రసాద్ తదితరులు

సంగీతం : కళ్యాణి మాలిక్, వివేక్ సాగర్(కాఫీఫై సాంగ్)

కెమెరా  : సునీల్ కుమార్ నామ

సహ నిర్మాత : వివేక్ కూచిభొట్ల

నిర్మాతలు : టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి

రచన - దర్శకుడు : శ్రీనివాస్ అవసరాల

నిడివి : 128 నిమిషాలు

విడుదల తేదీ : 17 మార్చ్ 2023

నాగ శౌర్య - మాళవిక నాయర్ వంటి హిట్ పెయిర్ తో దర్శకుడు అవసరాల శ్రీనివాస్ 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమా కోసం చాలా టైమ్ తీసుకున్నాడు అవసరాల. మరి నాలుగేళ్ల కష్టానికి ప్రతి ఫలం దక్కిందా ? ఈ సినిమాతో శౌర్య హిట్ కొట్టాడా ? జీ సినిమాలు ఎక్స్ క్లూసివ్ రివ్యూ.

కథ : 

వైజాగ్ ఇంజినీరింగ్ కాలేజీలో చదివే సీనియర్ అనుపమ(మాళవిక నాయర్)తో సంజయ్ (నాగ శౌర్య) కి పరిచయం ఏర్పడుతుంది. ఇద్దరి ప్రయాణం స్నేహంతో మొదలై ప్రేమ వరకూ చేరుతుంది. ఒకరిని ఒకరు ఉండలేని ఇద్దరు కొన్నేళ్ళు దూరమవుతారు.  ఏడు చాప్టర్స్  రూపంలో వీరి ప్రేమ జరుగుతుంది. వీరిద్దరూ ఎలా ప్రేమలో పడ్డారు ? ఒకరికి  మరొకరు ఎందుకు దూరమయ్యారు ? అనేదే  మెయిన్ స్టోరీ.

నటీ నటుల పనితీరు : 

నాగ శౌర్య సంజయ్ పాత్రతో మెప్పించాడు. ఆ పాత్రకు న్యాయం చేశాడు. అనుపమ గా మాళవిక ఆకట్టుకుంది. ఇద్దరు గతంలో చేసిన కేరెక్టర్ కావడంతో సింపుల్ గా నటించి మంచి మార్కులు అందుకున్నారు. ఇద్దరి మద్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. శ్రీనివాస్ అవసరాల, మేఘ చౌదరి నటన బాగుంది. అశోక్ కుమార్, అభిషేక్ మహర్షి, శ్రీ విద్య, వారణాసి సౌమ్య చలంచర్ల, హరిణి రావు, అర్జున్ ప్రసాద్ మిగతా నటీ నటులంతా వారి పాత్రలతో ఆకట్టుకున్నారు.

సాంకేతిక వర్గం పనితీరు : 

లవ్ స్టోరీ కి ఆ మూడ్ లోకి తీసుకెళ్ళే మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాకు కళ్యాణీ మాలిక్ కంపోజ్ చేసిన మ్యూజిక్ హైలైట్ గా నిలిచింది. ముఖ్యంగా కనుల చాటు మేఘమా సాంగ్ బాగుంది. వివేక్ సాగర్ కంపోజ్ కాఫీఫీ పరవాలేదనిపించింది. సునీల్ కుమార్ నామ కెమెరా వర్క్ ఫరావలేదు. కిరణ్ గంటి ఎడిటింగ్ బాగుంది తక్కువ రన్ టైమ్ కి ఎడిట్ చేయడం సినిమాకు కొంత కలిసొచ్చింది.

శ్రీనివాస్ అవసరాల రాసుకున్న కథ -కథనంలో కొత్తదనం లేవు. ఈ తరహా ప్రేమ కథలు తెలుగులో చాలానే వచ్చాయి. బలమైన సన్నివేశాలు కూడా లేవు. ప్రొడక్షన్ వాల్యూస్ కథకి తగ్గట్టుగా ఉన్నాయి.

జీ సినిమాలు సమీక్ష : 

నాగ శౌర్య -మాళవికా సూపర్ హిట్ జోడీ , రెండు సినిమాలతో దర్శకుడిగా సక్సెస్ అందుకున్న అవసరాల డైరెక్షన్, వరుస సక్సెస్ లు అందుకుంటున్న ప్రొడక్షన్ కంపెనీ నుండి వచ్చిన 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' పై ఓ మోస్తరు అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడిగా రెండు సినిమాలతో మెప్పించి గుర్తింపు అందుకున్న అవసరాల తీసిన ఈ సినిమా కూడా అదే కోవలో ఉంటుందని ప్రేక్షకులు ఊహించారు. కానీ ఈసారి కంటెంట్ పరంగా అవసరాల పూర్తిగా మెప్పించకపోయాడు.

ఈ సినిమా కోసం గతంలో వచ్చేసిన ప్రేమ కథనే తీసుకోవడం మెయిన్ మైనస్. కాలేజీలో స్నేహితులుగా పరిచయమై తర్వాత ప్రేమలో పడటం , ఆ తర్వాత చిన్న చిన్న మనస్పర్థల తో విడిపోవడం కథలతో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. దీంతో 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' ప్రేక్షకులకు కొత్తదనం పంచలేదు. పైగా ఎంటర్టైన్ మెంట్ కూడా లేకుండా ప్లేన్ నరేషన్ తో  స్లో ఫేజ్ లో సినిమా ముందుకు సాగడం తేడా కొట్టింది.

అవసరాల మంచి రచయత , దర్శకుడు. మంచి సన్నివేశాలు రాసకోవడమే కాదు అంతే అందంగా తీయగలడు. 'ఊహలు గుసగుసలాడే' , 'జ్యో అచ్యుతానంద' సినిమాలో సన్నివేశాలు ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుంటాయి. అయితే ఈసారి ఇటు రచయితగా అటు దర్శకుడిగా రెండు విధంగా కాస్త విఫలమయ్యాడు. ఈ ప్రేమ కథకి బలమైన సన్నివేశాలు , ఆసక్తి కలిగించే స్క్రీన్ ప్లే రాసుకోకపోవడం మెయిన్ మైనస్ అనిపించాయి. విడిపోయాక మళ్ళీ ఓ స్నేహితుడి పెళ్లిలో కలిసిన హీరో హీరోయిన్ తాలూకు సన్నివేశాలు కూడా గతంలో చూసేసినట్టే అనిపించాయి తప్ప కొత్తగా అనిపించలేదు. మొదటి భాగంతో పోలిస్తే మలిభాగం కొంత ఫరవాలేదు. సెకండ్ హాఫ్ లో నీలిమ పాత్రతో కొంత వరకూ నవ్వించాడు అవసరాల. కాకపోతే ఆడియన్  కి హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ అందలేదు.

వైజాగ్ టూ లండన్ ప్రేమకథతో ఏడు చాప్టర్స్ ప్లాన్ చేసుకున్న అవసరాల ఒక్క చాప్టర్ తో కూడా పూర్తిగా మెప్పించలేక దర్శకుడిగా విఫలం అయ్యాడు. పాత ప్రేమ కథ తీసుకున్నప్పటికీ ఇందులో కొత్తదనంతో కూడిన సన్నివేశాలు , అలాగే ఆసక్తిగా సాగే కథనం ప్లాన్ చేసుకుంటే బాగుండేది. ఓవరాల్ గా 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' రొటీన్ లవ్ స్టోరీ తో నిరాశపరిచింది.

రేటింగ్ : 2.25/5