Naandhi Movie review

Friday,February 19,2021 - 02:24 by Z_CLU

నటీనటులు - అల్ల‌రి న‌రేష్‌, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌, న‌వ‌మి, హ‌రీష్ ఉత్త‌మ‌న్‌, ప్ర‌వీణ్‌, ప్రియ‌ద‌ర్శి తదితరులు స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: విజ‌య్ క‌న‌క‌మేడ‌ల‌ నిర్మాత‌: స‌తీష్ వేగేశ్న‌ బ్యాన‌ర్‌: ఎస్‌వి2 ఎంట‌ర్‌టైన్‌మెంట్ సినిమాటోగ్ర‌ఫీ: సిద్‌ ఆర్ట్‌: బ‌్ర‌హ్మ క‌డ‌లి ఎడిటింగ్‌: చోటా కె. ప్ర‌సాద్‌ సంగీతం: శ్రీ‌చ‌ర‌ణ్ పాకాల‌ క‌థ‌: తూమ్ వెంక‌ట్‌ డైలాగ్స్‌: అబ్బూరి ర‌వి నిడివి: 2 గంటల 21 నిమిషాలు సెన్సార్: U/A రిలీజ్ డేట్: ఫిబ్రవరి 19, 2012

సీరియస్ సబ్జెక్ట్స్ హ్యాండిల్ చేయడం అల్లరి నరేష్ కు కొత్త కాదు. గతంలో ప్రాణం, గమ్యం లాంటి సినిమాలు చేశాడు. రీసెంట్ గా మహర్షిలో కూడా సీరియస్ రోల్ పోషించాడు. ఇప్పుడు నాంది చేశాడు. ప్రమోషన్స్ లో కూడా ఆడియన్స్ కు ఈ విషయంలో క్లారిటీ ఇచ్చాడు అల్లరి నరేష్. అలా మెంటల్లీ ప్రిపేర్ అయి వెళ్లిన ఆడియన్స్ ను అల్లరోడు ఎట్రాక్ట్ చేశాడా? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ

Naandhi movie telugu review

కథ:

సూర్యప్రకాష్ (అల్లరి నరేష్) ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి. మంచి ఉద్యోగం సంపాదించి అమ్మా-నాన్నను సుఖంగా చూసుకోవాలని, అందమైన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. అనుకున్నట్టుగానే మంచి ఉద్యోగం సంపాదిస్తాడు. తొలి జీతంతో నాన్న సత్యనారాయణకు (దేవిప్రసాద్)కు మందు కొనిపెడతాడు. అలా తండ్రిని సంతోషపరుస్తాడు. అదే ఊపులో ఓ గుడిలో అందమైన అమ్మాయి మీనాక్షి (నవమి)ని చూస్తాడు. తొలిచూపులోనే ప్రేమిస్తాడు. పెళ్లి కూడా ఫిక్స్ అయిపోతుంది. అంతా ఓకే అనుకున్న టైమ్ లో సడెన్ గా పెద్ద కుదుపు.

కాబోయే భార్యతో కలిసి బైక్ పై వెళ్తున్న సూర్యప్రకాష్ ను పోలీసులు నడిరోడ్డుపై అరెస్ట్ చేస్తారు. సామాజిక కార్యకర్తను హత్య చేసిన కేసులో అతడ్ని జైల్లో పెడతాడు ఎస్సై కిషోర్ (హరీష్ ఉత్తమన్). ప్రకాషే హత్య చేశాడనడానికి బలమైన సీసీటీవీ ఫూటేజ్ సాక్ష్యాలు కూడా ప్రవేశపెడతాడు. తనకు సంబంధం లేని హత్య కేసు నుంచి బయటపడ్డానికి అష్టకష్టాలు పడతాడు ప్రకాష్. జైల్లోనే ఐదేళ్లు గడిచిపోతాయి. తల్లిదండ్రుల్ని పోగొట్టుకుంటాడు. ప్రేయసి తనను వదిలి వెళ్లిపోతుంది. ఉద్యోగం పోతుంది.

సర్వస్వం పోగొట్టుకున్న ప్రకాష్.. లాయర్ ఆద్య ముల్లపూడి (వరలక్ష్మి శరత్ కుమార్) సహకారంతో నిర్దోషిగా జైలు నుంచి బయటకొస్తాడు. తన జీవితాన్ని నాశనం చేసిన ఎస్సై కిషోర్ పై న్యాయపోరాటం ప్రారంభిస్తాడు ప్రకాష్. ఓ సెక్షన్ ఆధారంగా అతడిపై కేసు వేయడంతో పాటు సాక్ష్యాలు కూడా సేకరిస్తాడు. ఫైనల్ గా ప్రకాష్ తను అనుకున్నది సాధించాడా లేడా? చట్టం సహకారంతో ఓ సామాన్యుడు గెలిచాడా లేదా అనేది ''నాంది''.

నటీనటుల పనితీరు:

హీరో అల్లరి నరేష్ అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అతడి ఎక్స్ ప్రెషన్స్, కథకు తగ్గట్టు అతడు చూపించిన పెయిన్ ఎవర్నయినా కదిలిస్తుంది. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ లో యాక్టింగ్, నటుడిగా అల్లరి నరేష్ ను మరో మెట్టు పైకి తీసుకెళ్తుంది. అల్లరినరేష్ తర్వాత చెప్పుకోదగ్గ పాత్ర ప్రవీణ్. సహాయ నటుడిగా ప్రవీణ్ ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపించాడు. అతడికి ఈ సినిమా మంచి పేరు, సరికొత్త ఇమేజ్ తెచ్చిపెడుతుంది.

లాయర్ పాత్ర పోషించిన వరలక్ష్మి తన సీరియస్ నటనతో ఆకట్టుకోగా.. కన్నింగ్ విలన్ గా హరీష్ ఉత్తమన్, నరేష్ జైల్ మేట్ గా ప్రియదర్శి బాగా నటించారు. హీరోయిన్ నవమి ఓకే అనిపిస్తుంది.

టెక్నీషియన్స్ పనితీరు:

డైరక్టర్ గా డెబ్యూ ఇవ్వాలనుకునేవాళ్లు ఎవ్వరూ ప్రయోగాలు చేయాలని అనుకోరు. కానీ హరీష్ శంకర్ శిష్యుడు విజయ్ కనకమేడల మాత్రం దాదాపు ప్రయోగమే చేశాడు. నాంది సినిమా ఓ కొత్త దర్శకుడు తీయాల్సిన సినిమా మాత్రం కచ్చితంగా కాదు. ఈ విషయంలో విజయ్ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఈ కథ కోసం తూమ్ వెంకట్ (అసలు కథ ఇతడిదే)తో కలిసి విజయ్ బాగానే స్టడీ చేశాడు. స్క్రీన్ ప్లే విషయంలో అక్కడక్కడ తడబడినా, దర్శకుడిగా విజయ్ ను నిలబెట్టే సినిమా ఇది.

ఈ సీరియస్ కథకు శ్రీచరణ్ పాకాల మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. పాటలతో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అబ్బూరి రవి డైలాగ్స్, బ్రహ్మకడలి ఆర్ట్ వర్క్ బాగున్నాయి. ఎస్వీ2 ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై కథకు తగ్గట్టు బడ్జెట్ పెట్టాడు నిర్మాత సతీష్ వేగేశ్న.

Naandhi movie telugu review

జీ సినిమాలు రివ్యూ

హీరోను విలన్లు ఓ కేసులో ఇరికించడం కామన్. దాన్నుంచి హీరో చాకచక్యంగా బయటపడడం కూడా అంతే కామన్. ఫైనల్ గా హీరో-విలన్ల మధ్య ఓ ఛేజ్, ఓ భారీ ఫైట్. ఈ సినిమాటిక్ ఫార్ములాను నేచురల్ గా తీస్తే ఎలా ఉంటుంది? అత్యంత సహజమైన పరిస్థితుల మధ్య, ఊహించని విధంగా ఓ కేసులో హీరో ఇరుక్కుపోతే ఎలా ఉంటుంది? నిజజీవితంలో ఇంత పెద్ద కేసు నుంచి హీరోలా ఓ వ్యక్తి బయటపడగలడా? నాంది సినిమా చూస్తే వీటికి సమాధానాలు దొరుకుతాయి.

నాంది యాక్షన్ సినిమా కాదు. అల్లరోడు ఇందులో హీరో కూడా కాదు. ఇదొక కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమా. అందులో ఓ పాత్రధారి అల్లరినరేష్. ప్రస్తుత న్యాయవ్యవస్థ వల్ల సగటు వ్యక్తి ఎలా ఇబ్బంది పడుతున్నాడనే విషయాన్ని నాందిలో సీరియస్ గా చర్చించారు. తప్పు చేయని వ్యక్తి కూడా విచారణ పేరిట ఏళ్ల తరబడి (అండర్-ట్రయల్ ఖైదీగా) జైలులో మగ్గుతున్న అంశాన్ని ఇందులో చూపించారు. దీనికితోడు ఓ కొత్త సెక్షన్ పై డిస్కస్ చేశారు.

సినిమా చూస్తున్నంతసేపు మనకు ఖైదీ కనిపిస్తాడు తప్ప, అల్లరినరేష్ కనిపించడు. గత సినిమాల్లో అతడు చేసిన అల్లరి అస్సలు కనిపించదు. జైల్లో ఖైదీల బాధలు, కోర్టులో వాదనలతో పాటు.. ఓ కేసులో ఇరుక్కుపోతే వ్యక్తిగత జీవితం ఎలాంటి ఒడిదుడుకులకు లోనౌతుందనే విషయాన్ని కూడా రియలిస్టిక్ గా చూపించారు. ఆర్ట్ వర్క్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ దీనికి మరింత ప్లస్ అయింది.

దర్శకుడు తను చెప్పదలుచుకున్న విషయాన్ని ఎక్కువసేపు దాచిపెట్టకుండా, చాలా తొందరగా కథలోకి వెళ్లిపోతాడు. ఎందుకంటే అతడు చెప్పాల్సింది, చూపించాల్సింది చాలా ఉంది. అందుకే హీరోయిన్, ప్రేమ లాంటి అంశాలకు ఇందులో చాలా తక్కువ స్కోప్ కనిపించింది. ఎప్పుడైతే మెయిన్ స్టోరీలోకి ఎంటరైపోయాడో ఇక అక్కడ్నుంచి నాంది పరుగెడుతుంది. వరలక్ష్మి శరత్ కుమార్ ఎంటరైన తర్వాత సినిమా నెక్ట్స్ లెవెల్ కు చేరుకుంటుంది. మరీ ముఖ్యంగా జైలు నుంచి అల్లరినరేష్ బయటకొచ్చిన తర్వాత సినిమా మలుపు తీసుకున్న విధానం బాగుంది.

తను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా-స్పష్టంగా చెప్పాడు దర్శకుడు విజయ్ కనకమేడల. ఈ కథ కోసం అతడు ఎంత రీసెర్చ్ చేశాడనే విషయం సినిమాలో అడుగడుగునా కనిపిస్తుంది. కనకమేడల కథకు అల్లరినరేష్ పూర్తి న్యాయం చేయగా.. సపోర్టింగ్ రోల్స్ లో వరలక్ష్మి, ప్రవీణ్ ది బెస్ట్ ఇచ్చారు. తన ఇంటర్వ్యూల్లో అల్లరినరేష్ చెప్పినట్టు, ఇది అతడి కెరీర్ బెస్ట్.

కాకపోతే డార్క్ థీమ్ తో ఉన్న ఇలాంటి సీరియస్ కథలకు ఏ రేంజ్ లో రీచ్ ఉంటుందనేది అప్పుడే చెప్పలేం. దీనికితోడు పొలిటికల్ డ్రామా, ల్యాండ్ మాఫియా లాంటి అంశాలు రొటీన్ అనిపిస్తాయి. ఇలాంటి మైనస్ పాయింట్స్ ఉన్నప్పటికీ క్లైమాక్స్ ఎపిసోడ్ కోసం, అల్లరి నరేష్ ఔట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ కోసం ఈ సినిమాను తప్పకుండా చూడాల్సిందే.

బాటమ్ లైన్ - రియలిస్టిక్ 'నాంది' రేటింగ్ - 3/5