Movie Review – Sultan

Friday,April 02,2021 - 04:44 by Z_CLU

నటీనటులు: కార్తీ, ర‌ష్మిక, యోగిబాబు, నెపోలియ‌న్‌, లాల్‌, హరీష్, నవాబ్ షా ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: బ‌క్కియ‌రాజ్ క‌ణ్ణ‌న్‌ నిర్మాత‌లు: య‌స్‌.ఆర్‌. ప్ర‌కాష్ బాబు, య‌స్‌.ఆర్‌. ప్ర‌భు బ్యాన‌ర్‌: డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్‌ సినిమాటోగ్ర‌ఫీ: స‌త్య‌న్ సూర్య‌న్‌ మ్యూజిక్‌: వివేక్ మెర్విన్‌ ఎడిటింగ్‌: రూబెన్‌ రన్ టైమ్: 2 గంటల 38 నిమిషాలు సెన్సార్: U/A రిలీజ్ డేట్: ఏప్రిల్ 2, 2021

ఖైదీతో సూపర్ హిట్ కొట్టిన కార్తి.. కరోనా వల్ల లాస్ట్ ఇయర్ మొత్తం సినిమా రిలీజ్ చేయలేకపోయాడు. ఈ ఏడాది సుల్తాన్ గా మనముందుకొచ్చాడు. మరి సుల్తాన్ ఆకట్టుకున్నాడా..? కార్తి హిట్ కొట్టాడా? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ

sultan movie telugu review 1 కథ

సేతుపతి (నెపోలియన్) వైజాగ్ లో పెద్ద రౌడీ. అతడి వద్ద ప్రాణాలిచ్చే వంద మంది రౌడీలుంటారు. సేతుపతికి ఒకే ఒక్క కొడుకు సుల్తాన్ (కార్తి.) చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన సుల్తాన్ ను ఈ వంద మంది రౌడీలు ప్రేమగా పెంచుతారు.

ఓ సమస్యను పరిష్కరించడం కోసం అమరావతి దగ్గర్లోని వెలగపూడి గ్రామానికి వెళ్తాడు సుల్తాన్. అక్కడే రుక్మిణి (రష్మిక)ని చూసి ప్రేమలో పడతాడు. అయితే ఆ గ్రామానికి ఓ సమస్య ఉంటుంది. ఆ సమస్యను తీరుస్తానని సుల్తాన్ తండ్రి గతంలోనే మాటిచ్చి ఉంటాడు.

తండ్రి మాట నెరవేర్చేందుకు సుల్తాన్, గ్రామంలోనే ఉండిపోతాడు. ఈ క్రమంలో తను అన్నలుగా భావించే వంద మంది రౌడీలకు, సుల్తాన్ కు మధ్య అభిప్రాయబేధాలొస్తాయి. అసలు రౌడీలకు, సుల్తాన్ కు మధ్య గ్యాప్ ఎందుకొస్తుంది.. ఇంతకీ ఊరికి వచ్చిన సమస్యేంటి అనేది బ్యాలెన్స్ కథ.

నటీనటుల పనితీరు

సుల్తాన్ గా కార్తి మరోసారి బాగా యాక్ట్ చేశాడు. క్యారెక్టర్ లో అతడు ఒదిగిపోయే విధానం బాగుంటుంది. తండ్రి మాటను నిలబెట్టే కొడుకుగా.. వంద మంది రౌడీలను కాపాడుకునే లీడర్ గా... ప్రేయసి కష్టాన్ని తీర్చే ప్రేమికుడిగా.. ఇలా డిఫరెంట్ షేడ్స్ లో బాగా నటించాడు.

ఫస్ట్ టైమ్ పల్లెటూరి పిల్ల పాత్ర పోషించిన రష్మిక.. వీలైనంతవరకు తన పాత్రను పండించే ప్రయత్నం చేసింది. ఆమె యాక్టింగ్ టాలెంట్ పెద్దగా కనిపించనప్పటికీ.. పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఆమె లుక్స్ మాత్రం బాగున్నాయి. మిగతా నటీనటులంతా తమ పాత్రల మేరకు మెప్పించారు.

ఇక వందమంది రౌడీలుగా వంద మంది ఆర్టిస్టులు.. సినిమాలో ఎక్కడా సింగిల్ ఫ్రేమ్ లో కనిపించరు. పైగా అందులో ఓ నలుగురికి మాత్రమే నటించే అవకాశం కలిగింది. యోగిబాబును అటు విలన్ గ్యాంగ్ లో చూపించలేక, ఇటు హీరో పక్కన కమెడియన్ గా సెట్ చేయలేక దర్శకుడు పడిన ఇబ్బంది స్పష్టంగా కనిపించింది.

టెక్నీషియన్స్ పనితీరు

టెక్నీషియన్స్ లో హీరో ఎవరంటే సినిమాటోగ్రాఫర్ సత్యన్ కే ఆ గౌరవం ఇవ్వాలి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సినిమాను బ్రహ్మాండంగా ప్రజెంట్ చేశాడు ఈ డీవోపీ. యువన్ శంకర్ రాజా ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది కానీ, వివేక్-మెర్విన్ ఇచ్చిన సాంగ్ ట్యూన్స్ మాత్రం బాగా లేవు. ఎప్పట్లానే డ్రీమ్ వారియర్స్ బ్యానర్... గ్రాండియర్ ప్రొడక్షన్ వాల్యూస్ తో తన ఇమేజ్ ను నిలబెట్టుకుంది.

దర్శకుడిగా బక్కియరాజ్ కణ్నన్ కు ఫుల్ మార్కులు వేయలేం. అతడు సెలక్ట్ చేసుకోవడమే రొటీన్ కథను సెలక్ట్ చేసుకున్నాడు. కాకపోతే దానికి డిఫరెంట్ ట్రీట్ మెంట్ ఇవ్వడంలో అతడు సక్సెస్ అయ్యాడు. యాక్షన్ సీన్స్ లో, కొన్ని ఎమోషనల్ సీన్స్ లో అతడి టేకింగ్ మెప్పిస్తుంది. కాకపోతే కుటుంబ బంధాల్లేని ఈ సినిమాలో డ్రామా ఎక్కువగా పెట్టేశాడు. రెండున్నర గంటలు సినిమా తీయాలని కంకణం కట్టుకొని తీసినట్టున్నాడు డైరక్టర్. లేదంటే ఈ మూవీని 2 గంటల్లోనే నీట్ గా ముగించొచ్చు.

sultan movie telugu review 1 జీ సినిమాలు రివ్యూ

ఒక హీరో.. వంద మంది రౌడీలు.. ఆ రౌడీలతో హీరో ఫైట్ చేయడం రొటీన్. అదే వంద మంది రౌడీల్ని తన అన్నలుగా భావించి వాళ్లతోనే కలిసి ఉండడం వెరైటీ. పాయింట్ చెప్పుకోవడానికి చాలా థ్రిల్లింగ్ గా ఉంది కదా. కానీ దర్శకుడు మాత్రం ఆ థ్రిల్ ను రెండున్నర గంటల సేపు కంటిన్యూ చేయలేకపోయాడు. సినిమా ఒక దశకు చేరేసరికి రౌడీల స్థానంలో రెగ్యులర్ గా కనిపించే కుటుంబ సభ్యులు మామ, అక్క, వదిన, అన్న లాంటి పాత్రల్ని పెట్టినా సరిపోయేదనిపిస్తుంది.

ఊరికి సమస్య వస్తుంది. ఆ సమస్యను హీరో తీరుస్తాడు. ఈమధ్య కొంతమంది తెలుగు హీరోలు చేసినట్టుగానే ఊరిలో వ్యవసాయం కూడా చేస్తాడు. అదే ఊరిలో ఓ పిల్లను చూసి పెళ్లి చేసుకుంటాడు. పరమ రొటీన్ గా ఉన్న ఈ స్టోరీలైన్ కు "వంద మంది రౌడీలు" అనే యాంగిల్ ను యాడ్ చేశాడు దర్శకుడు. వాళ్ల చుట్టూ కథ నడపడంలో, వాళ్లను ఎలివేట్ చేయడంలో బాగానే సక్సెస్ అయ్యాడు. అయితే సెకెండాఫ్ కు వచ్చేసరికి రౌడీలు-హీరోల మధ్య ఎమోషన్ ను సగటు ఫ్యామిలీ సినిమాలా చూపించి నిరాశపరిచాడు.

ఇక క్లైమాక్స్ కు వచ్చేసరికి దాదాపు ప్రతి ప్రేక్షకుడు ఊహించినట్టుగానే ముగింపు ఉంది. అందులో కొత్తదనం చూపించడానికి లేదంటే ట్విస్టులు ఇవ్వడానికి ఏమాత్రం ప్రయత్నించలేదు డైరక్టర్. మనకెందుకొచ్చిన రిస్క్ అన్నట్టు రాసుకున్నాడు.

సుల్తాన్ పాత్రను పరిచయం చేయడం.. వంద మంది రౌడీల్ని చూపించడం.. ఊరికి ఓ సమస్యను సృష్టించడం.. అందులో మరో విలన్ ను పెట్టడం లాంటి ఎలిమెంట్స్ తో మొదటి భాగాన్ని బాగానే కూర్చాడు దర్శకుడు. మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ కు వచ్చేసరికి కార్తిని ఫుల్ లెంగ్త్ హీరోగా ప్రజెంట్ చేసిన విధానం బాగుంది. అయితే రెండో అర్థభాగం మొదలయ్యేసరికి రొటీన్ సినిమాను తలపించాడు.

ఉన్నంతలో ఈ సినిమాను ఆదుకున్న ఏకైక నటుడు కార్తి. అతడి ప్రజెన్స్, యాక్టింగ్, ఫైట్స్ అన్నీ బాగున్నాయి. పల్లెటూరి పిల్లగా రష్మిక ఓకే అనిపించుకుంది. ఆమె పాత్రను డైరక్టర్ సరిగ్గా రాసుకోలేదు.

ఓవరాల్ గా సుల్తాన్ సినిమా అక్కడక్కడ ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్, మార్కెట్ సీన్ తో పాటు మరికొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి.

రేటింగ్ : 2.5/5