Movie Review – SkyLab

Saturday,December 04,2021 - 03:18 by Z_CLU

న‌టీన‌టులు: నిత్యామీన‌న్‌, స‌త్య‌దేవ్‌, రాహుల్ రామ‌కృష్ణ, తనికెళ్ల భరణి, తులసి, విష్ణు, అనుష త‌దిత‌రులు

సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాది

మ్యూజిక్‌: ప్ర‌శాంత్‌ ఆర్‌.విహారి

సహ నిర్మాత: నిత్యామీనన్‌

నిర్మాత: పృథ్వీ పిన్నమరాజు

రచన- ద‌ర్శ‌క‌త్వం: విశ్వ‌క్ కందెరావ్‌

విడుదల తేది : 4 డిసెంబర్ 2022

సత్యదేవ్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రల్లో 1979 లో జరిగిన అతిపెద్ద సంఘటన ఆధారంగా తెరకెక్కిన 'స్కై ల్యాబ్' ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిత్యా మీనన్ నటించడమే కాక నిర్మాణ భాగస్వామిగా ఉండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా ? నిత్యామీనన్ నిర్మాతగా విజయం అందుకుందా ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

Skylab movie Telugu review కథ :

1979లో తెలంగాణాలోని బండలింగంపల్లి లో జరిగే కథ ఇది. ఆ ఊళ్ళో జమీందార్ వంశానికి చెందిన గౌరీ (నిత్యా మీనన్) హైదరాబాద్ లో ప్రతిబింబం అనే పత్రికలో పనిచేస్తూ ఓ సందర్భంలో ఊరి నుండి ఉత్తరం రావడంతో బండలింగంపల్లిలో అడుగుపెడుతుంది. అలాగే హైదరాబాద్ లో డాక్టర్ గా సస్పెండ్ అయి లైసెన్స్ క్యాన్సిల్ అవ్వడంతో ఊరికి వచ్చిన ఆనంద్(సత్య దేవ్) 5వేల రూపాయిల కోసం తాతని కాకా పడుతుంటాడు.

అదే ఊరిలో పెద్ద వంశానికి చెందిన సుబేదారి రామారావు (రాహుల్ రామకృష్ణ) తన అప్పులు తీరే మార్గం కోసం ఎదురుచూస్తుంటారు. అనుకోని పరిస్థితుల్లో ఊరికి వచ్చిన గౌరీకి తన రచనలు నచ్చక ఉద్యోగం నుండి తీసేసిన విషయం తెలుస్తుంది. అక్కడి నుండి ఆమె ఓ కథనం రాసి రచయితగా నిరూపించుకోవాలని చూస్తోంది. కావాలనుకున్న డబ్బు దొరక్కపోవడంతో రామారావు తో కలిసి ఊళ్ళో ఓ క్లినిక్ పెట్టి సెటిల్ అవ్వాలని చూస్తుంటాడు ఆనంద్. ఈ క్రమంలో ఆ ఊరిలో అమెరికా ప్రయోగించిన స్పేస్ స్కై ల్యాబ్ పడనుందనే విషయం తెలుసుకున్న ఊరి జనం ఎలాంటి ఆందోళన చెందారు? చివరికి స్కైలాబ్ ముప్పు నుండి తప్పించుకొని ఎలా తమ జీవితాలను యథాతథంగా కొనసాగించారనేది మిగతా కథ.

నటీ నటుల పనితీరు :

తక్కువ టైంలోనే తన నటనతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్ మరోసారి డా.ఆనంద్ పాత్రలో మెప్పించాడు. రచయిత గౌరి పాత్రలో నిత్యా మీనన్ ఆకట్టుకుంది. తన నటనతో సినిమాకు హైలైట్ గా నిలిచింది. సుబేదారి రామారావు పాత్రలో రాహుల్ రామకృష్ణ అలరించాడు. తన డైలాగ్ కామెడీతో నవ్వించాడు. నిత్యా మీనన్ కి తల్లి పాత్రలో తులసి పాత్రకు పూర్తి న్యాయం చేసింది. పనిమనిషి పాత్రలో విష్ణు, శరణ్య ఊరిలో ఉండే పాత్రల్లో తనికెళ్ళ భరణి, మీసం సురేష్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేసి ఆ పాత్రల్లో ఒదిగిపోయారు.

సాంకేతిక వర్గం పనితీరు :

సినిమాకు ప్రశాంత్ విహారి అందించిన మ్యూజిక్ బాగుంది. రెండో భాగంలో వచ్చే స్కైలాబ్ పాటతో పాటు అక్కడక్కడా వచ్చే నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. ఆదిత్య జవ్వాది కెమెరా వర్క్ సినిమాకు మరో ప్లస్ పాయింట్. నేచురల్ లోకేషన్స్ ని తన విజువల్స్ తో మరింత నేచురల్ గా చూపించాడు. శివరాం ఆర్ట్ వర్క్ పల్లెటూరి వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించాయి. రవితేజ గిరిజాల ఎడిటింగ్ పరవాలేదు. మొదటి భాగంలో కొన్ని సన్నివేశాలు ట్రిమ్ చేసి సినిమాను స్పీడప్ చేసి ఉంటే బాగుండేది. పూజిత తడికొండ కాస్ట్యూమ్స్ పాత్రలకు పర్ఫెక్ట్ గా సూటయ్యాయి. విశ్వక్ ఎంచుకున్న కథ బాగున్నా కథనం వీక్ గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కథకి తగ్గట్టుగా ఉన్నాయి.

Skylab movie Telugu review

జీ సినిమాలు సమీక్ష :

ఇప్పటి జనరేషన్ కి తెలియని ఓ విషయాన్ని సినిమాగా మలచాలన్న ప్రయత్నం కొత్తగానే ఉంది  కానీ దాని చుట్టూ మంచి కథనం రాసుకోవడం, మెస్మరైజ్ చేసే సన్నివేశాలు రాసుకోవడం అతిపెద్ద ఛాలెంజ్. సరిగ్గా ఈ సినిమా విషయంలో అలాంటి ఛాలెంజ్ నే ఎంచుకున్నాడు దర్శకుడు విశ్వక్. 1979 లో జరిగిన అతిపెద్ద స్కైలాబ్ ఇన్సిడెంట్ ఎంచుకొని ఈ సినిమా కథ రాసుకున్న దర్శకుడు దాని చుట్టూ ఆకట్టుకునే కథనం రాసుకోవడంలో విఫలమయ్యాడు. అతిపెద్ద ఇన్సిడెంట్ తీసుకోవడం వరకూ కరెక్టే కానీ స్క్రీన్ ప్లే పై ఎక్కువ వర్క్ చేయాల్సి ఉంటుంది. సినిమాలో కొన్ని సన్నివేశాలు చూస్తే ప్రీ ప్రొడక్షన్ లో దర్శకుడు చేసిన లోపాలు తెలుస్తాయి.

తెలంగాణాలో ఓ పల్లెటూరు, స్కైలాబ్ విషయం తెలుసుకొని కంగారు పడుతూ అతలాకుతలమైన జనాలు. ఇది సినిమా కథ. దీన్ని ఇటు కామెడీగా లేదా ఎమోషనల్ గా రెండూ విధాలుగా చెప్పొచ్చు. కానీ దర్శకుడు కామెడీ స్టైల్ లోనే ఈ కథను చెప్పలనుకున్నట్టున్నాడు. కాకపోతే బాగా పేలే కామెడీ రాసుకోలేకపోయాడు. దర్శకుడు డిజైన్ చేసిన క్యారెక్టర్స్ బాగున్నాయి. కానీ వాటిని పూర్తిగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయాడు. అలాగే కామెడీ పండించే నటీనటులను సరిగ్గా వాడుకోలేకపోయాడు. రాహుల్ రామకృష్ణని పెద్దగా వాడుకోలేకపోయాడు. కేవలం ఫస్ట్ హాఫ్ లో 2-3 డైలాగులు, సెకండాఫ్ లో కుటుంబానికి క్లాస్ పీకే సందర్భంలో మాత్రమే రాహుల్ క్యారెక్టర్ ఎలివేట్ అయింది. అలాగే సత్యదేవ్ పాత్ర కూడా అంతగా క్లిక్ అవ్వలేదు. రెండో భాగంలో ఉన్నంతలో ఆ పాత్రకు అలాగే నిత్యా మీనన్ పాత్రకు న్యాయం జరిగింది.

పల్లెటూరి మనుషుల భయాలు కొంత వరకే చూపించగలిగాడు దర్శకుడు. స్కైలాబ్ పడి అంతా అంతమవుతుందనే భయంతో తల్లడిల్లిన జనాలను వారి భయాలను క్లైమాక్స్ కి ముందు కూడా సరిగ్గా చూపించలేకపోయాడు. నిజానికి ఆ సమయంలో జనాలు ఎలా భయపడ్డారో ? కొన్ని ఊళ్ళల్లో ఏం జరిగిందో లాంటివి రీసెర్చ్ చేసి అవన్నీ కూడా చూపించి ఉంటే బాగుండేది. అలాగే మొదటి భాగాన్ని మరీ సాగదీసినట్టుగా నడిపించి కాస్త బోర్ కొట్టించాడు దర్శకుడు. మొదటి భాగంతో పోలిస్తే కొన్ని సన్నివేశాలతో రెండో భాగం పరవాలేదనిపిస్తుంది. ఓవరాల్ గా 'స్కైలాబ్' మంచి ప్రయత్నం అని చెప్పొచ్చు. కానీ కథనం వీక్ గా ఉండటం , స్లోగా సాగడం, బలమైన సన్నివేశాలు లేకపోవడం, హిలేరియస్ కామెడీ పండకపోవడం వల్ల.. మంచి ప్రయత్నం మిస్ ఫైర్ అయింది.

రేటింగ్ 2.25/5