Movie Review – Sardar

Friday,October 21,2022 - 03:31 by Z_CLU

నటీనటులు: కార్తీ, రాశి ఖన్నా, చుంకీ పాండే, రజిషా విజయన్, లైలా, బాలాజీ శక్తివేల్ తదితరులు కథ-దర్శకత్వం: పిఎస్ మిత్రన్ నిర్మాత: ఎస్ లక్ష్మణ్ కుమార్ బ్యానర్లు: ప్రిన్స్ పిక్చర్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంగీతం: జివి ప్రకాష్ కుమార్ డీవోపీ: జార్జ్ సి విలియమ్స్ ఎడిటర్: రూబెన్ రన్ టైమ్: 164 నిమిషాలు సెన్సార్: U/A రిలీజ్: అక్టోబర్ 21, 2022

మొన్ననే పొన్నియన్ సెల్వన్ సినిమాతో థియేటర్లలోకొచ్చిన కార్తి, మినిమం గ్యాప్ లో సర్దార్ అంటూ మరోసారి ప్రేక్షకుల్ని పలకరించాడు. దీపావళి కానుకగా వచ్చిన ఈ సర్దార్ ఆకట్టుకున్నాడా? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ

Sardar movie telugu review

కథ

విజయ్ ప్రకాష్ (కార్తి) వైజాగ్ లో ఏసీపీగా పనిచేస్తుంటాడు. ఇతడికి పబ్లిసిటీ పిచ్చి. అదే ఊరులో ఉన్న లాయర్ షాలినీ (రాశి ఖన్నా)కి విజయ్ తనకుతాను చేసుకుంటున్న సొంత పబ్లిసిటీ అంటే పడదు. కార్పొరేట్ వాటర్ బిజినెస్ కు వ్యతిరేకంగా సమీరా (లైలా) చేస్తున్న పోరాటానికి షాలినీ మద్దతిస్తుంది. కోర్టులో వాదిస్తుంది. కానీ ఇండియాలో ఎక్కడా కేసు నిలవదు. మహారాజ్ తలపెట్టిన వాటర్ ప్రాజెక్టును అడ్డుకోవాలంటే 32 ఏళ్లుగా ఉన్న సర్దార్ (కార్తి) జైలు నుంచి బయటకు రావాలి. అలా రావాలంటే అతడికి ఓ సీక్రెట్ లెటర్ అందాలి. ఆ మెసేజ్ అందించే క్రమంలో సమీరా చచ్చిపోతుంది. ఇంతకీ వాటర్ ప్రాజెక్టుకు సర్దార్ కు సంబంధం ఏంటి? ఏసీపీకి సర్దార్ కు ఉన్న అనుబంధం ఏంటి? అప్పటివరకు కనిపించకుండాపోయిన సర్దార్, ఒక్కసారిగా ఎలా బయటకొచ్చాడు, ప్రాజెక్టును ఎలా అడ్డుకున్నాడనేది బ్యాలెన్స్ కథ.

నటీనటుల పనితీరు ఇన్నాళ్లూ కార్తి చేసిన సినిమాలన్నీ ఒకెత్తు. సర్దార్ సినిమా మరో ఎత్తు. అతడి కెరీర్ లో యుగానికొక్కడు లాంటి సినిమా ఎలా ప్రత్యేకమైన మూవీగా నిలిచిపోతుందో, ఈ సర్దార్ సినిమా కూడా అంత ప్రత్యేకమైన సినిమానే. ఈ మూవీతో తనలోని నటుడ్ని పూర్తిస్థాయిలో ఆవిష్కరించాడు కార్తి. యాక్షన్, సెంటిమెంట్, ఎమోషన్.. ఇలా అన్నింటినీ రక్తికట్టించాడు. రాశిఖన్నాకు దక్కింది చిన్న పాత్రే అయినప్పటికీ, కథకు ఎంతో కీలకమైన పాత్రను పోషించింది. అయితే రాశి ఖన్నా కంటే మంచి పాత్రను లైలా పోషించి, ఎక్కువ మార్కులు కొట్టేసింది. చుంకీ పాండే, రజిషా విజయన్, బాలాజీ శక్తివేల్ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

టెక్నీషియన్స్ పనితీరు టెక్నికల్ గా సినిమా చాలా రిచ్ గా ఉంది. జార్జ్ విలియమ్స్ సినిమాటోగ్రఫీ, దిలీప్ సుబ్బరాయన్ స్టంట్స్ హైలెట్స్ గా నిలవగా.. ప్రిన్స్ పిక్చర్స్ నిర్మాణ విలువలు చాలా గ్రాండియర్ గా ఉన్నాయి. ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా సినిమాను నిర్మించారు. దర్శకుడిగా పీఎస్ మిత్రన్ మరోసారి ఆలోచింపజేసే కంటెంట్ ను ప్రేక్షకులకు అందించాడు. సేమ్ టైమ్, తన మార్క్ యాక్షన్ కూడా చూపించాడు. మరీ ముఖ్యంగా సినిమా సెకెండాఫ్ లో మంచి స్క్రీన్ ప్లే చూపించాడు. అయితే ఈ క్రమంలో టైమ్ కాస్త ఎక్కువ తీసుకున్నాడు. సినిమాను ఓ 10 నిమిషాలు కుదించొచ్చు, మరీ ముఖ్యంగా పాటలు తీసేయొచ్చు. జీవీ ప్రకాష్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.

Sardar movie telugu review

జీ సినిమాలు సమీక్ష

దర్శకుడు పీఎస్ మిత్రన్ సినిమాలు ఆలోచింపజేసేలా ఉంటాయనే విషయం అభిమన్యుడు సినిమాతో ప్రూవ్ అయింది. ఓ మంచి సబ్జెక్ట్ ను అతడు ఎంచుకుంటాడనే నమ్మకం ఆడియన్స్ లో ఉంది. ఆ నమ్మకానికి ఏమాత్రం తీసిపోని విధంగా తెరకెక్కింది సర్దార్ సినిమా. ఇందులో ఓ మంచి పాయింట్ ను చర్చించారు. కార్తి చెప్పినట్టు పాన్-ఇండియాకు సూట్ అయ్యే పాయింట్ ఇది. అందరూ ఆలోచించాల్సిన పాయింట్ కూడా.

ఇలాంటి సందేశాత్మక చిత్రాలు ఎవరైనా తీస్తారు. కానీ రెండున్నర గంటలు (ఈ సినిమా అంతకంటే పెద్దదే) కుర్చీల్లో కూర్చోబెట్టి సందేశం ఇవ్వాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఈ విషయంలో మిత్రన్ టాలెంట్ ఏంటో అభిమన్యుడు, హీరో సినిమాలతో చూశాం. ఇప్పుడు సర్దార్ సినిమాతో మరోసారి తన మేజిక్ చూపించాడు మిత్రన్.

అదిరిపోయే యాక్షన్, అక్కడక్కడ సెంటిమెంట్, కొద్దిసేపు విజ్ఞానం, మరికాసేపు థ్రిల్ అందిస్తూ ఎక్కడా బోర్ కొట్టకుండా సాగిపోతుంది సర్దార్ సినిమా. ఇంకా చెప్పాలంటే మంచి సందేశానికి విక్రమ్, ఖైదీ లాంటి యాక్షన్ డోస్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో, సర్దార్ సినిమా అలా ఉంటుంది.

సినిమా స్టార్ట్ చేయడమే నేరుగా కథలోకి వెళ్లిపోతాడు దర్శకుడు. ఏసీపీ విజయ్ ప్రకాష్ గా కార్తీని తెరపై చూపించాడు. అతడ్ని పబ్లిసిటీ పిచ్చి ఉన్న కాప్ గా ఎస్టాబ్లిష్ చేశారు. అతడు ఎందుకలా పబ్లిసిటీ పిచ్చితో ఉన్నాడనేది కథలోకి వెళ్లేకొద్దీ దర్శకుడు చూపించాడు. అదే క్రమంలో హీరోయిన్ ను, ప్రధాన సమస్యను కూడా మెల్లగా పరిచయం చేస్తూ.. ఇంటర్వెల్ కు వచ్చేసరికి సర్దార్ పాత్రపై పూర్తి ఎలివేషన్ ఇచ్చాడు.

ఎప్పుడైతే సర్దార్ పాత్రను పరిచయం చేశాడో, ఇక అక్కడ్నుంచి కథ మొత్తం సర్దార్ వైపు తిరుగుతుంది. గూఢచారిగా సర్దార్ ఏం చేశాడు, అతడి నేపథ్యం, ఫ్యామిలీ లైఫ్ లాంటివన్నీ వరుసపెట్టి చూపించాడు. ఇక్కడ మాత్రం దర్శకుడు కాస్త రొటీన్ స్టఫ్ చూపించాడు. పైగా ఈ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చిన సాంగ్ మరీ ఇబ్బంది పెడుతుంది.

అయితే ఆ వెంటనే సినిమా ఊపందుకుంటుంది. పైగా సాంగ్ లో కూడా స్టోరీ రన్ చేయడం కాస్త కలిసొచ్చింది. చివరగా ఆంధ్రా యూనివర్సిటీలో మిస్సయిన ఫైల్ లో ఏముంది? సర్దార్ ఎవరు? ఫైనల్ గా అసలు దొంగ ఎవరనే విషయాన్ని యాక్షన్ ప్యాక్డ్ గా చూపించి ఆకట్టుకున్నాడు దర్శకుడు.

మంచి కథలు ఎంచుకోవడంలో తన మార్క్ చూపించే కార్తి, సర్దార్ గా మరోసారి సూపర్ హిట్ కంటెంట్ ను సెలక్ట్ చేసుకున్నాడు. అంతేకాదు, తన పాత్రలకు పూర్తి న్యాయం చేశాడు కూడా. యంగ్ పోలీస్ గా, గూఢచారిగా, 60 ఏళ్ల సర్దార్ గా ఇలా అన్ని కోణాల్లో ఆకట్టుకున్నాడు. కార్తి నటన ఈ సినిమాకు హైలెట్. హీరోయిన్ గా నటించిన రాశిఖన్నాకు నటించడానికి పెద్దగా స్కోప్ లేనప్పటికీ, కథకు అవసరమైన పాత్ర పోషించి తన ఉనికి చాటుకుంది. ఫ్లాష్ బ్యాక్ లో హీరోయిన్ గా నటించిన రజీషా విజయన్ ను చెబితే తప్ప, ఆమె హీరోయిన్ అని ఎవ్వరూ గుర్తుపట్టలేరు. లైలా క్యారెక్టర్ చాలా బాగుంది. సినిమాలో కార్తి పాత్ర తర్వాత బాగా ఇంపాక్ట్ ఇచ్చిన పాత్ర లైలాదే.

టెక్నికల్ గా సినిమా అదిరిపోయింది. జార్జ్ విలియమ్స్ సినిమాటోగ్రఫీ, దిలీప్ సుబ్బరాయన్ స్టంట్స్, రూబెన్ ఎడిటింగ్ అన్నీ సింక్ లో ఉన్నాయి. అక్కడక్కడ జీవీ ప్రకాష్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం గాడి తప్పింది. పాటలైతే ఏ ఒక్కటీ బాగాలేవు. ఇక దర్శకుడు మిత్రన్ విషయానికొస్తే, అతడు మరోసారి తను అనుకున్న పాయింట్ కు కట్టుబడి సినిమా తీశాడు. కామెడీ, మసాలా సీన్లు, ఐటెంసాంగ్స్ లాంటి ఎలాంటి డీవియేషన్స్ కు పోకుండా అనుకున్న కథను అనుకున్నట్టు ప్రజెంట్ చేశాడు. మరీ ముఖ్యంగా ఈ కథ కోసం అతడు రెండేళ్లుగా చేసిన రీసెర్చ్ మొత్తం సినిమాలో కనిపిస్తుంది.

పాకిస్థాన్ క్యాంప్ ఎపిసోడ్ తప్పిస్తే, మిగతా సన్నివేశాలన్నీ లాజిక్ కు చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తాయి. ఒక్కోసారి నిజమేనేమో అనే అనుమానాన్ని కూడా కలిగించేలా సీన్స్ తీశాడు మిత్రన్. దర్శకుడికి గా అతడికి ఫుల్ మార్కులు పడతాయి. కాకపోతే తన గత సినిమాల్లానే ఈ సినిమాలో కూడా పాటలపై అతడు శ్రద్ధ పెట్టలేకపోయాడు. నేషనల్ అవార్డ్ గ్రహీత జీవీ ప్రకాష్ నుంచి సరైన ఔట్ పుట్ రాబట్టుకోలేకపోయాడు. నిర్మాణ విలువలు హై-లెవెల్లో ఉన్నాయి.

ఓవరాల్ గా సర్దార్ సినిమాలో కార్తి విశ్వరూపం కనిపిస్తుంది. అదే సమయంలో మనల్ని ఆలోచింపజేస్తుంది. మంచి కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా కచ్చితంగా కార్తి కెరీర్ లో బెస్ట్ మూవీగా నిలుస్తుంది.

రేటింగ్ - 2.75/5