Movie Review – RRR

Friday,March 25,2022 - 12:59 by Z_CLU

నటీనటులు : రామ్ చరణ్, ఎన్టీఆర్, అలియా భట్, ఒలివ, అజయ్ దేవగన్, శ్రియ, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ , శేఖర్, రాజీవ్ కనకాల తదితరులు సంగీతం : కీరవాణి సినిమాటోగ్రఫీ : సెంథిల్ ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్ మాటలు : సాయి మాధవ్ బుర్రా ఆర్ట్ డైరెక్టర్ : సబు సిరిల్ కథ : విజయేంద్ర ప్రసాద్ నిర్మాణం : డి.వి.వి.దానయ్య కథనం-దర్శకత్వం : రాజమౌళి విడుదల తేది : 25 మార్చి 2022 నిడివి : 186 నిమిషాలు

బాహుబలి-2 లాంటి చరిత్ర తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా. ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి బిగ్ స్టార్లు కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ. భారతీయ సినీచరిత్రలోనే భారీ బడ్జెట్ ప్రాజెక్టు. ఇలా ఎన్నో లక్షణాలు, మరెన్నో అంచనాలతో ఈరోజు రిలీజైంది RRR. మరి ఈ సినిమా తెలుగు సినిమా స్థాయిని పెంచిందా? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ

RRR-Third-single-on-nov-25th-RamCharan-Ntr-zeecinemalu

కథ :

నిజాం పరిపాలనలో ఉన్న తెలంగాణలోని అదిలాబాద్ లో గిరిజన ప్రాంతంలో కథ మొదలవుతోంది. నిజాంను కలవడానికి వచ్చిన ఓ బ్రిటిష్ దొర తన భార్య చెప్పడంతో ఓ గోండు పిల్లను బలవంతంగా తీసుకువెళ్తాడు. ఆ గోండు జాతి కాపరి కొమురం భీమ్ కి(ఎన్టీఆర్) ఈ విషయం తెలుస్తోంది. కొమురం భీమ్ తమగూడెం పిల్ల కోసం దొరల ఏలుబడిలో ఉన్న ఢిల్లీలో అడుగుపెట్టి ఆ పిల్లను రక్షించేందుకు ప్రయత్నిస్తుంటాడు. విషయం తెలుసుకున్న బ్రిటిష్ ప్రభుత్వం కొమురం భీం (ఎన్టీఆర్)ను పట్టుకునే బాధ్యతను తమ దగ్గర పోలీస్ గా పనిచేస్తున్న సీతారామరాజు (రామ్ చరణ్)కు అప్పగిస్తోంది. అయితే, రామరాజు కొమురం భీమ్ లోని నిజాయితీ, మంచితనం నచ్చి అతనికి సాయం చేస్తాడు. భీమ్ కి సహాయం చేసే క్రమంలో బ్రిటీష్ ప్రభుత్వానికి ఎదురు తిరిగినందుకు రామరాజుకు బ్రిటీషు ప్రభుత్వం శిక్ష విధిస్తుంది.

ఈ విషయం ఏమి తెలియని భీమ్ అనుకోకుండా సీత(అలియా భట్) ను కలుసుకుంటాడు. ఆమె పెట్టిన సద్ది తిని ఆకలి తీర్చుకున్న భీమ్ ఆమె కష్టానికి కరిగిపోతాడు. మనువాడిన వాడు బ్రిటిష్ వారి దగ్గర శిక్ష అనుభవిస్తున్నాడని భీమ్ కి తెలియజేస్తుంది సీత. తన మిత్రుడు రామరాజు గురించి తెలుసుకున్న భీమ్ రామ్ ని ఎలాగైనా తీసుకొచ్చి తనతో కలుపుతానని మాటిచ్చి మళ్లీ బ్రిటీష్ పై అటాక్ చేసి రామరాజును జైలు నుంచి తప్పిస్తాడు. అసలు రామరాజు కథేంటి ? బ్రిటిష్ ప్రభుత్వంలో తను పోలీస్ ఆఫీసర్ గా ఎందుకు చేరాడు ? బ్రిటిష్ ప్రభుత్వం పై భీమ్, రామరాజు కలిసి ఫైనల్ గా ఎలాంటి పోరాటం చేశారు ? అనేది మిగిలిన కథ.

 

నటీనటుల పనితీరు :

సినిమాలో ముందుగా చెప్పుకోవాల్సింది ఎన్టీఆర్-చరణ్ ల గురించే. కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ , రామరాజు పాత్రలో రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. కొన్ని సన్నివేశాల్లో వారి కష్టం కళ్ళకు కట్టినట్టు కనిపించింది. సన్నివేశాలను రక్తి కట్టించేందుకు ఇద్దరు ఎంతో ఎఫర్ట్ పెట్టి వర్క్ చేసి తమ డెడికేషన్ తో సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళారు. అలాగే ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా పూర్తి స్థాయిలో ఆకట్టుకున్నారు. అలియా భట్ సీత పాత్రలో ఒదిగిపోయి నటించింది. తక్కువ సన్నివేశాలే ఉన్నప్పటికీ తన నటనతో రిజిస్టర్ అయ్యింది. ముఖ్యంగా భీమ్ కి రామరాజు గురించి చెప్తూ వచ్చే ఎమోషనల్ సన్నివేశంలో ఆకట్టుకుంది. ఒలివియా తన పాత్ర మేరకు మెప్పించింది. నాటు నాటు పాటలో ఎన్టీఆర్, చరణ్ లతో స్టెప్స్ వేసి అలరించింది.

ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే పాత్రల్లో అజయ్ దేవగన్, శ్రియ శరన్ తమ నటనతో ఆకట్టుకున్నారు. సముద్ర ఖని , రాహుల్ రామకృష్ణ , శేఖర్ తమ పాత్రలకు బెస్ట్ ఇచ్చారు. రాజీవ్ కనకాల ట్రైలర్ లో ఉన్న ఆ ఒక్క సీన్ తోనే సరిపెట్టుకున్నాడు. స్కాట్ గా రే స్టీవెన్సన్ అలాగే లేడీ స్కాట్ గా అలిసన్ డూడీ క్యారెక్టర్స్ పర్ఫెక్ట్ అనిపించుకున్నాయి. యంగ్ అల్లూరి సీతారామరాజుగా వరుణ్ బుద్దదేవ్, యంగ్ సీతగా సందన చతుర్వేది మెప్పించారు. మిగతా నటీ నటులంతా తమ పాత్రలకు న్యాయం చేశారు.

 

సాంకేతిక వర్గం పనితీరు :

తను అనుకున్నది అనుకున్నట్టుగా రావడానికి టెక్నీషియన్ కి ఛాలెంజ్ విసురుతూ వారి ప్రతిభను వాడుకుంటూ ఎప్పటికప్పుడు గొప్ప సినిమా తీసేందుకు ప్రయత్నిస్తుంటాడు రాజమౌళి. RRR విషయంలోనూ అదే జరిగింది. ప్రతీ విభాగం నుండి సినిమాకు బెస్ట్ వర్క్ అందింది.

ముందుగా మాట్లాడుకోవాల్సింది కీరవాణి మ్యూజిక్ గురించి. సినిమాకు కావాల్సిన మంచి పాటలతో పాటు ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించి సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాడు కీరవాణి. 'దోస్తీ' ,'నాటు నాటు' పాటలతో మంచి సందర్భంలో వచ్చే కొమురం భీముడో పాట కూడా ఆకట్టుకుంది. ఎండ్ టైటిల్స్ లో వచ్చే 'ఎత్తర జెండా' సాంగ్ కూడా బాగుంది. తన మేజికల్ మ్యూజిక్ తో సినిమాకు హైలైట్ గా నిలిచాడు కీరవాణి. ఇక "నాటు నాటు" సాంగ్ విజువల్ గా మరింత ఆకట్టుకుంది. ఆ సాంగ్ కి ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీ ప్లస్ అయ్యింది.

ఇక కీరవాణి తర్వాత కచ్చితంగా చెప్పుకోవాల్సింది సెంథిల్ సినిమాటోగ్రఫీ గురించి. తన కెమెరా వర్క్ తో సినిమాకు బెస్ట్ విజువల్స్ అందించి సినిమాకు మరో హైలైట్ గా నిలిచాడు. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ లో కొన్ని బ్లాక్స్ లో సెంథిల్ బెస్ట్ వర్క్ కనిపించింది. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాగుంది. సాబు సిరిల్ ఆర్ట్ వర్క్ సినిమాకు బ్యాక్ బోన్ గా నిలిచింది. ఆయన వేసిన భారీ సెట్స్ స్క్రీన్ పై ఆకట్టుకుంటూ వర్క్ గురించి మాట్లాడుకునేలా చేశాయి. పీటర్ హెయిన్స్ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ మాస్ ఆడియన్స్ తో విజిల్స్ వేయించేలా కంపోజ్ చేశాడు. విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ బాగుంది.

సాయిమాధవ్ బుర్రా అందించిన కొన్ని మాటలు సన్నివేశాలకు బలాన్నిచ్చాయి. సందర్భానుసారంగా వచ్చే మాటలు ఆకట్టుకున్నాయి కానీ ఫ్యాన్స్ మళ్ళీ మళ్ళీ గుర్తుచేసుకుంటూ చెప్పుకునే డైలాగ్స్ మాత్రం పెద్దగా లేవనే చెప్పాలి. విజయేంద్ర ప్రసాద్ అందించిన కథ బాగుంది. కథ డెవలప్ మెంట్ లో కాంచి రైటింగ్ స్జిల్స్ కూడా ప్లస్ అయింది. రాజమౌళి టేకింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తను ఊహించుకున్న విజువల్ ని ప్రేక్షకులకు చూపించడం కోసం ఆయన పడే శ్రమ ప్రతీ సన్నివేశంలో కనిపించింది. ముఖ్యంగా తను స్క్రీన్ ప్లే తో పాటు గూస్ బంప్స్ తెప్పించే ఎపిసోడ్స్ మూవీ లవర్స్ కి బెస్ట్ ఎక్స్ పీరియన్స్ అందిస్తాయి. డి.వి.వి,ఎంటర్టైన్ మెంట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి. నిర్మాత దానయ్య పెట్టిన భారీ బడ్జెట్ సినిమాకు గ్రాండియర్ లుక్ తీసుకొచ్చింది.

RRR-ramcharan-ntr1 జీ సినిమాలు సమీక్ష :

సహజంగా రాజమౌళి సినిమా అంటే గ్రాండియర్ విజువల్స్ తో పాటు ఆకట్టుకునే ఎమోషన్, గూస్ బంప్స్ తెప్పించే ఎపిసోడ్స్, వినసొంపైన సాంగ్స్, అదిరిపోయే ఇంటర్వెల్ బ్లాక్, మంచి అనుభూతి కలిగింఛి సంతోషంగా ఇంటికి పంపించే క్లైమాక్స్ ఇలా అన్నీ కలగలిపి ఉంటాయి. జక్కన్న కష్టం ఈసారి కూడా ఇంకా చెప్పాలంటే RRR కోసం 'బాహుబలి' రెండు పార్ట్స్ కంటే ఎక్కువే కష్టపడ్డాడనిపించింది. తనకున్న ఇమేజ్ తో మరో గొప్ప సినిమా అందించి ఇండియన్ సినిమా గురించి మాట్లాడుకునేలా చేశాడు జక్కన్న.

ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి ఈక్వల్ క్రేజ్ ఉన్న ఇద్దరు స్టార్ హీరోలను పెట్టి ఒక మల్టీ స్టారర్ చేయడం అంటే ఆషామాషీ కాదు. ఏమాత్రం తేడా వచ్చినా ఇద్దరిలో ఎవరికీ ఇంపార్టెన్స్ తగ్గినా ఫ్యాన్స్ ఫైర్ అవ్వడం, మూవీ లవర్స్ కి ఏదో వెలితి కలగడం కామన్. నిజానికి రాజమౌళికి ఇదో పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి. ఇద్దరికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలనే కొలమానం పెట్టుకోలేదని కేవలం రామరాజు, కొమురం భీమ్ లను చరణ్, తారక్ లో చూసి సినిమా చేశానని రాజమౌళి చాలా సార్లు చెప్పుకున్నప్పటికీ ఇద్దరికీ బెస్ట్ క్యారెక్టర్స్ డిజైన్ చేసి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి మెగా-నందమూరి ఫ్యాన్స్ ను మెప్పించేలా ప్లాన్ చేసుకున్నాడు. ముఖ్యంగా పులిని పట్టుకునేందుకు భీమ్ అడవుల్లో పరిగెత్తే సీక్వెన్స్ తో ఎన్టీఆర్ ఇంట్రో ప్లాన్ చేసి తారక్ ఫ్యాన్స్ ని ఖుషి చేసిన రాజమౌళి క్లైమాక్స్ లో రామ్ చరణ్ ని అల్లూరి సీతారామరాజు గా చూపించి అదిరిపోయే ఎలివేషన్ తో మెగా ఫ్యాన్స్ ని కూడా ఖుషి చేశాడు.

స్వతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ ఇద్దరి పాత్రలను తీసుకొని ఓ చక్కని కల్పిత కథతో ఈ సినిమా తెరకెక్కించిన రాజమౌళి వారిద్దరి నిజజీవితాలను ఎక్కడా చూపించే ప్రయత్నం చేయలేదు. ఇద్దరు కొన్నేళ్ళు ఎవరికీ కనిపించకుండా ఎక్కడికి వెళ్ళారనే చిన్న ఆసక్తికరమైన ఐడియా నుండి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో రాజమౌళి రాయించిన కల్పిత కథతో పాటు రాజమౌళి కథనం కూడా ఆకట్టుకుంది.

ఇక సినిమా ఆరంభం నుండే ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించే ఇంట్రో ఎపిసోడ్స్ ప్లాన్ చేసి ఇంటర్వెల్ వరకూ అదే టెంపో మెయింటైన్ చేస్తూ ఫస్ట్ హాఫ్ ని సాలిడ్ కంటెంట్ తో నడిపించిన రాజమౌళి ఇంటర్వెల్ బ్లాక్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచేసి రోమాలు నిక్కపోడిచే యాక్షన్ ఎపిసోడ్ తో మెస్మరైజ్ చేశాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ కి ముందు ఎన్టీఆర్-చరణ్ మధ్య వచ్చే ఫైట్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

ఇక ఫ్యాన్స్ కి కావాల్సిన ఎలిమెంట్స్ తో ఫస్ట్ హాఫ్ ని అదిరిపోయే కంటెంట్ తో నింపేసిన రాజమౌళి రెండో భాగాన్ని మాత్రం తన గత సినిమాల్లో లాగే ఎమోషనల్ గా నడిపించే ప్రయత్నం చేశాడు. దీంతో ఫస్ట్ హాఫ్ చూసి బిర్యానీ తిన్న అనుభూతి పొందిన ఆడియన్స్ కి సెకండాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ చూసి మీల్స్ తిన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ తో సినిమా గ్రాఫ్ ని మళ్ళీ అమాంతంగా పెంచేసి థియేటర్స్ నుండి బయటికొచ్చే ప్రేక్షకుడు సంతృప్తి చెందేలా చేశాడు జక్కన్న.

ఇక సెకండాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా అంత ఎఫెక్టివ్ గా అనిపించదు. ఎన్టీఆర్ , ఒలివియా లవ్ ట్రాక్ కొంతవరకూ అలరిస్తుంది. ఇక రామరాజు -సీత ట్రాక్ ఎందుకో పొడిపొడిగా ఉంది. బహుశా వారిద్దరూ కలిసి ఉన్న సీన్స్ పెద్దగా లేకపోవడమే దానికి రీజన్ అనిపించింది. ఎన్టీఆర్-రామ్ చరణ్ లు మొదటిసారి కలుసుకునే సందర్భం కోసం ఓ భారీ ట్రైన్ సీక్వెన్స్ పెట్టాడు రాజమౌళి. ఆ తర్వాత వారిద్దరి మధ్య దోస్తీ సాంగ్ తో బాండింగ్ హైలైట్ చేస్తూ వచ్చాడు. నిజజీవితంలో కూడా క్లోజ్ ఫ్రెండ్స్ కావడంతో ఎన్టీఆర్-రామ్ చరణ్ మధ్య బాండింగ్ స్క్రీన్ మీద బాగా వర్కౌట్ అయింది.

ఇలా సెకండాఫ్ లో కొన్ని చిన్న చిన్న కంప్లైంట్స్ మినహాయిస్తే గ్రాండియర్ విజువల్స్, ఊహించని యాక్షన్ ఎపిసోడ్స్ , వావ్ అనిపించే మూమెంట్స్ , క్లాప్స్ , విజిల్స్ వేయిస్తూ ఆకట్టుకునే గూస్ బంప్స్ స్టఫ్ తో బెస్ట్ సినిమా అందించి మరోసారి తన టాలెంట్ నిరూపించుకున్నాడు రాజమౌళి. ఎన్టీఆర్, రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ , గ్రాండియర్ విజువల్స్ , రాజమౌళి మార్క్ బ్లాక్స్ , ఇంటర్వెల్ ఎపిసోడ్, ప్రీ క్లైమాక్స్, కైమాక్స్ సీన్లు సినిమాకు హైలైట్స్ అని చెప్పొచ్చు.

ఫైనల్ గా యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన RRR సినిమా.. ఇన్నేళ్ల ప్రేక్షకుడి నిరీక్షణకు న్యాయం చేసింది. వందల రూపాయలు పెట్టి టికెట్ కొని థియేటర్లలోకి వెళ్లిన ప్రేక్షకుడ్ని ఈ సినిమా ఎక్కడా డిసప్పాయింట్ చేయదు.

రేటింగ్ : 3.5 / 5

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics