Movie Review – Rowdy Boys

Friday,January 14,2022 - 06:51 by Z_CLU

నటీనటులు: ఆషిశ్, అనుపమా పరమేశ్వరన్, విక్రమ్ సహదేవ్, శ్రీకాంత్ అయ్యంగార్, జయ ప్రకాష్, కార్తీక్ రత్నం తదితరులు సినిమాటోగ్రఫీ: మాధి మ్యూజిక్: దేవీ శ్రీ ప్రసాద్ ఎడిటర్: మధు నిర్మాత: దిల్ రాజు రచన,దర్శకత్వం: హర్ష కొనుగంటి రన్ టైమ్ : 2 గంటల 25 నిమిషాలు రిలీజ్ డేట్: జనవరి 14,2022

rowdy boys january 14 release

కథ అల్లరిచిల్లరిగా తిరిగే సగటు కుర్రాడు అక్షయ్ (ఆశిష్). ఎలాంటి బాధ్యతల్లేని అక్షయ్ ఇంజనీరింగ్ లో చేరతాడు. తొలి చూపులోనే కావ్య (అనుపమ పరమేశ్వరన్)ను చూసి ప్రేమిస్తాడు. ఆమె కోసం తన కాలేజీలోనే తెగ వెదుకుతాడు. కానీ ఆమె పక్కనే ఉన్న మెడికల్ కాలేజ్ స్టూడెంట్ అని తెలుసుకుంటాడు. అయితే కావ్యను, అదే మెడికల్ కాలేజీకి చెందిన విక్రమ్ (విక్రమ్ సహదేవ్) కూడా ప్రేమిస్తాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఈ రెండు కాలేజీలకు అస్సలు పడదు. మెడికల్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మధ్య ఎప్పుడూ గ్యాంగ్ వార్సే. అలాంటి కాలేజీ పిల్లను ప్రేమించిన అక్షయ్.. కావ్యను లవ్ లో పడేశాడా లేదా అనేది మాత్రమే స్టోరీ కాదు. అక్షయ్-విక్రమ్ లో కావ్య ఎవర్ని ప్రేమించింది? అక్షయ్ తో ఆమె సహజీవనం ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇంత చేసిన తర్వాత కావ్యను అక్షయ్ ఎందుకు వదిలేశాడు? మధ్యలో కావ్య తండ్రి ఏం చేయాల్సి వచ్చింది? ఈ మొత్తం కథలో విక్రమ్ పాత్ర ఎంత? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే రౌడీబాయ్స్ చూడాల్సిందే.

నటీనటుల పనితీరు దిల్ రాజు తమ్ముడు శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా పరిచయమైన సినిమా ఇది. ఈ సినిమా చూస్తున్నంతసేపు ఆశిష్ కు నిజంగా ఇది డెబ్యూ మూవీనేనా అనిపిస్తుంది. అంత ఈజ్ తో నటించాడు ఈ కుర్రాడు. కాలేజీ స్టూడెంట్ గా అతడి మేనరిజమ్స్ పెర్ ఫెక్ట్ గా సింక్ అయ్యాయి. ఇక డాన్స్ విషయానికొస్తే, టాలీవుడ్ కు మరో అద్భుతమైన డాన్సర్ దొరికాడనిపిస్తోంది. మంచి పాత్రలు సెలక్ట్ చేసుకుంటే శిరీష్ ను భవిష్యత్తులో మంచి హీరోగా చూడొచ్చు.

ఇక హీరోయిన్ అనుపమ పరమేశ్వన్ ఇందులో హీరోయిన్. ఈ సినిమాకు సర్ ప్రైజ్ ఎలిమెంట్ గా ఈమెను చెప్పుకోవచ్చు. తొలిసారి ఆమె లిప్ కిస్సుల్లో నటించింది. ఆమె యాక్టింగ్ లో చాలా మెచ్యూరిటీ కనిపించింది. క్లైమాక్స్ లో, ఇంటర్వెల్ లో అనుపమ యాక్టింగ్ హైలెట్ అని చెప్పాలి. ఇక ఆశిష్-అనుపమ కెమిస్ట్రీ కూడా చాలా బాగా కుదిరింది. సహదేవ్ విక్రమ్ కూడా మెప్పించగా.. కార్తీక్ రత్నం, శ్రీకాంత్ అయ్యంగార్, జయప్రకాష్, కోమలీ ప్రసాద్ తమ పాత్రల మేరకు నటించారు.

టెక్నీషియన్స్ పనితీరు టెక్నీషియన్స్ తో ముందుగా చెప్పుకోవాల్సింది సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ గురించే. తమ మ్యూజిక్ తో రిలీజ్ కు ముందే సినిమాపై హైప్ తీసుకొచ్చిన ఈ దర్శకుడు.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కూడా ఆకట్టుకున్నాడు. కొత్త హీరో నటించిన ఇలాంటి సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంత కీలకమో రౌడీ బాయ్స్ చూస్తే తెలుస్తుంది. ఇక సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ఆర్ట్ వర్క్ అన్నీ కథకు తగ్గట్టు చక్కగా కుదిరాయి. దర్శకుడు హర్ష మంచి యూత్ ఫుల్ లైన్ రాసుకున్నాడు. తన గత చిత్రం హుషారు టైపులోనే యూత్ ఎలిమెంట్స్ అన్నీ అమర్చుకున్నాడు. కానీ నెరేషన్ విషయంలో అక్కడక్కడ తడబడ్డాడు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. సినిమాకు పెట్టాల్సిన ఖర్చు కంటే కాస్త ఎక్కువే పెట్టాడు నిర్మాత దిల్ రాజు.

rowdy boys january 14 release

జీ సినిమాలు రివ్యూ కాలేజీ బ్యాక్ డ్రాప్ ఎప్పుడూ బోర్ కొట్టదు. ఎందుకంటే, స్టూడెంట్స్ కు కనెక్ట్ అవ్వడంతో పాటు, ఆ దశ దాటి వచ్చిన మిగతా జనాలకు కూడా కాలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీలు కనెక్ట్ అవుతాయి. అయితే యూనివర్సల్ సబ్జెక్ట్ సెలక్ట్ చేసుకున్నప్పటికీ దాంట్లో నెరేషన్ గ్రిప్పింగ్ గా ఉండాలి. ఈ విషయంలో రౌడీ బాయ్స్ పై అక్కడక్కడ కంప్లయింట్స్ ఉన్నప్పటికీ.. ఓవరాల్ గా బాయ్స్ మెప్పిస్తారు.

కాలేజ్ గొడవలు ఈ కాలం వెరీ కామన్. ఏ కాలేజ్ లో చూసుకున్నా గ్రూపులు, కొట్టుకోవడాలు కామన్ అయిపోయాయి. రౌడీ బాయ్స్ కూడా ఈ గొడవలతోనే స్టార్ట్ అవుతుంది. యూత్ కు కావాల్సిన అన్ని హంగులు, ఫస్టాఫ్ లో నింపేశాడు దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి. కాలేజ్ స్టూడెంట్స్ చేసే చిలిపి పనులు, గొడవలు, వాళ్ల ఫ్యాషన్స్, మైండ్ సెట్, మేనరిజమ్స్.. ఇలా అన్నింటినీ ఈ జనరేషన్ యూత్ కు కనెక్ట్ అయ్యేలా చక్కగా ఎలివేట్ చేశాడు. నేటి యూత్ ఎలా ఉంది, కాలేజ్ కు వెళ్లి వాళ్లు చేసే పనులేంటి లాంటివన్నీ ఇందులో ఉన్నాయి.

అయితే ఈ క్రమంలో అసలు కథలోకి తీసుకెళ్లడానికి చాలా టైమ్ తీసుకున్నాడు దర్శకుడు. దీనికి తోడు రెగ్యులర్ సీన్స్ కూడా ఎక్కువైపోయాయి. నెరేషన్ లో ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఇంటర్వెల్ కు వచ్చేసరికి మంచి ట్విస్ట్ ఇచ్చాడు దర్శకుడు. సెకెండాఫ్ పై భారీ అంచనాలు పెట్టుకునేలా చేశాడు.

రెండో భాగంలో లివ్ ఇన్ రిలేషన్ షిప్ చూపించిన దర్శకుడు ప్రేక్షకులకు ఓ మోస్తరు షాక్ ఇచ్చాడు. నిజానికి సినిమాలో ఈ యాంగిల్ ఉంటుందని ఎవ్వరూ ఊహించలేదు. ఇదొక ట్విస్ట్ అనుకుంటే, అనుపమ పరమేశ్వరన్ పై తీసిన లిప్ కిస్సులు (2-3 ఉన్నాయి) మరో షాక్. ట్రయిలర్ లో ఓ లిప్ కిస్ సీన్ చూపించారు కాబట్టి సరిపోయింది. అది కూడా చూపించకపోతే, సినిమాలో ఈ లిప్ కిస్సులు మరో పెద్ద సర్ ప్రైజ్ ఎలిమెంట్ అయ్యేది. బహుశా.. ట్రయిలర్ లో లిప్ కిస్ సీన్ చూపించకుండా ఉండాల్సిందేమో అనిపించింది. దిల్ రాజు సినిమాలపై ఫ్యామిలీ ఆడియన్స్ పెట్టుకున్న అంచనాలు దెబ్బతింటాయనే భయంతో ఇలా చేసినట్టున్నారు.

హీరోహీరోయిన్ల మధ్య లవ్-రొమాంటిక్ సీన్లు, విరహవేదనను దర్శకుడు చాలా బాగా ప్రజెంట్ చేశాడు. మరీ ముఖ్యంగా కావ్య-అక్షయ్ విడిపోయే టైమ్ లో చూపించిన ట్విస్టులు అందర్నీ ఆకట్టుకుంటాయి. అయితే సెకండాఫ్ లో హీరో మ్యూజికల్ జర్నీకి సంబంధించిన సన్నివేశాలు పూర్తిస్థాయిలో మెప్పించవు. సెకెండాఫ్ లో మరో చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే.. ఫస్టాఫ్ మొత్తాన్ని ట్రెండిగా చూపించిన దర్శకుడు.. సెకెండాఫ్ కు వచ్చేసరికి రెగ్యులర్ రైటింగ్ లోకి, మెలొడ్రామాలోకి వచ్చేశాడు. ఒకే సినిమాలో అటు యూత్ ఫుల్ గా చూపించి, మరోవైపు మెలొడ్రామా చూపించడం అంతగా కనెక్ట్ అవ్వదు.

కొత్త కుర్రాడు ఆశిష్ మాత్రం చాలా బాగా చేశాడు. అతడి బాడీ లాంగ్వేజ్, యాక్టింగ్, మరీ ముఖ్యంగా డాన్స్ చాలా బాగున్నాయి. మొదటి సినిమా కోసం ఆశిష్ ఎంతగా ప్రిపేర్ అయ్యాడో ఈ సినిమా చూస్తే ఈజీగా అర్థమౌతుంది. ఇక అనుపమ పరమేశ్వరన్ యాక్టింగ్, ఆమె లుక్స్ సినిమాకు ప్రధాన బలం. సహదేవ్ కూడా బాగా మెచ్యూర్డ్ గా నటించాడు. టెక్నికల్ గా రౌడీ బాయ్స్ సినిమా హై-లెవెల్ లో ఉంది. సినిమాటోగ్రఫీ, సంగీతం బాగున్నాయి. దిల్ రాజు ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నతంగా ఉన్నాయి.

ఓవరాల్ గా రౌడీ బాయ్స్ సినిమా యూత్ కు ఫుల్ గా కనెక్ట్ అవుతుంది. మధ్యమధ్యలో వచ్చే స్లో-నెరేషన్ ను మినహాయిస్తే.. ఈ సినిమా ప్రతి ఒక్కరికి తమ కాలేజ్ డేస్ గుర్తుకుతెస్తుంది. ఆశిష్ కు అద్భుతమైన లాంఛింగ్ ఇది.

రేటింగ్ : 2.75/5