Movie Review – Raja Vikramarka

Friday,November 12,2021 - 03:33 by Z_CLU

నటీనటులు: కార్తికేయ, తాన్యా రవిచంద్రన్, సుధాకర్ కోమాకుల, సాయికుమార్, తనికెళ్ళ భరణి, పశుపతి, హర్షవర్ధన్ తదితరులు సినిమాటోగ్రఫీ : పి.సి.మౌళి సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి ఎడిటింగ్: జస్విన్ ప్రభు ఆర్ట్: నరేష్ తిమ్మిరి బ్యానర్ : శ్రీ చిత్ర మూవీ మేకర్స్ నిర్మాత: '88' రామారెడ్డి దర్శకత్వం: శ్రీ సరిపల్లి రన్ టైమ్: 2 గంటల 19 నిమిషాలు సెన్సార్: U/A రిలీజ్ డేట్: నవంబర్ 12, 2021

మెగాస్టార్ టైటిల్ తో వచ్చిన రాజా విక్రమార్కపై భారీ హోప్స్ పెట్టుకున్నాడు హీరో కార్తికేయ. హీరోయిన్ తాన్యా రవిచంద్రన్, సుధాకర్ కోమాకుల, దర్శకుడు సిరిపల్లి కూడా దీనిపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. మరి వీళ్ల ఆశల్ని రాజా విక్రమార్క నెరవేర్చాడా? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ

Kartikeya raja vikramarka

కథ

విక్రమ్ అలియాస్ రాజా విక్రమార్క (కార్తికేయ) ఎన్ఐఏలో కొత్తగా చేరతాడు. ఐదేళ్లయినా సరైన అసైన్ మెంట్ దొరకదు. తన బాస్ మహేంద్ర (తనికెళ్ల భరణి)ను బాబాయ్ అంటూ చనువుగా పిలుస్తుంటాడు. హైదరాబాద్ లో అక్రమంగా ఆయుధాలు సరఫరా చేసే ఓ విదేశీయుడ్ని విక్రమ్ పట్టుకుంటాడు. ఎంక్వయిరీలో అతడి నోటి నుంచి గురునారాయణ (పశుపతి) పేరు వినిపిస్తుంది. ఇతడో నకిలీ నక్సలైట్. అతడి వల్ల హోమ్ మినిస్టర్ చక్రవర్తి (సాయికుమార్)కి ప్రాణాపాయం ఉంటుంది. గతంలో పశుపతి, చక్రవర్తి మధ్య ఏం జరిగింది? పశుపతి ప్లాన్ ను విక్రమ్ ఎలా అడ్డుకున్నాడు? చక్రవర్తి కూతురు కాంతి (తాన్యా రవిచంద్రన్)ని ఎలా కాపాడుకున్నాడు అనేది బ్యాలెన్స్ కథ.

నటీనటుల పనితీరు

రాజా విక్రమార్కగా కార్తికేయ కరెక్ట్ గా సూటయ్యాడు. కామెడీ టైమింగ్ పెద్దగా లేకపోయినప్పటికీ నవ్వించడానికి కష్టపడ్డాడు. ఫిజిక్ పరంగా, యాక్షన్ సన్నివేశాల పరంగా హీరోకు వంద మార్కులు వేసేయొచ్చు. కార్తికేయ తర్వాత చెప్పుకోదగ్గ పాత్ర సుధాకర్ కోమాకులది. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా కనిపిస్తూనే, కథను మలుపుతిప్పే కీలకమైన సందర్భంలో సుధాకర్ నటన మెప్పిస్తుంది. ఇక హీరోయిన్ తాన్యా రవిచంద్రన్ హోమ్లీగా కనిపించింది. 2-3 సన్నివేశాల్లో మాత్రమే నటించడానికి స్కోప్ దొరికింది. ఎన్ఐఏ బాస్ గా భరణి, హోమ్ మినిస్టర్ గా సాయికుమార్, విలన్ గా పశుపతి, ఇన్సూరెన్స్ ఏజెంట్ గా హర్షవర్షన్ ఆకట్టుకున్నారు.

టెక్నీషియన్స్ పనితీరు

పీసీ మౌళి సినిమాటోగ్రఫీ మూవీకి హైలెట్ గా నిలిచింది. పాటలతో ఆకట్టుకోలేకపోయిన ప్రశాంత్ విహారి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగా ఇచ్చాడు. మూవీలో ఆర్ట్ వర్క్, ఎడిటింగ్ బాగుంది. తొలిసారి ప్రొడక్షన్ లోకి దిగిన నిర్మాత రామారెడ్డి, ఈ సినిమాకు బాగానే ఖర్చుచేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. దర్శకుడిగా శ్రీ సరిపల్లి రొటీన్ కథనే ఎంచుకున్నప్పటికీ దాన్ని కొత్తగా చెప్పడానికి ట్రై చేశాడు. సీరియస్ కథకు కామెడీ మిక్స్ చేయడంలో అక్కడక్కడ తడబడ్డాడు. అయితే దర్శకుడిగా సరిపల్లికి ఈ సినిమా మంచి ఫ్లాట్ ఫామ్ అవుతుంది. అతడి దర్శకత్వ ప్రతిభ చాలా సన్నివేశాల్లో కనిపించింది.

Kartikeya Tanya Ravichandran raja vikramarka movie

జీ సినిమాలు రివ్యూ

"అంతా బాగుంది కానీ.. నువ్వు ఎన్ఐఏ ఏజెంట్ అంటేనే నమ్ముబుద్ధి కావడం లేదు" అంటుంది హీరోయిన్. నువ్వు "తెలివైనవాడివి అనుకునేలోపే ఎంత ఎదవ్వో గుర్తుచేస్తావ్" అంటాడు బాస్. రాజా విక్రమార్క సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకుడికి కూడా మనసులో ఈ రెండు డైలాగ్సే మారుమోగుతుంటాయి. ఇన్నాళ్లూ వెండితెరపై సీరియస్ గా మాత్రమే కనిపించిన ఏజెంట్.. అల్లరిచిల్లరగా కామెడీ చేస్తుంటే కొత్తగా అనిపిస్తుంది. అయితే ఆ కామెడీ బాగా పండితేనే క్యారెక్టర్ తో సంబంధం లేకుండా ఎంజాయ్ చేస్తాం. రాజా విక్రమార్కలో అదే మిస్సయింది.

టోటల్ సీరియస్ గా కనిపించే సెటప్ ను సింపుల్ గా మార్చేసి, సరదాగా చూపిస్తే ఎలా ఉంటుందనేది దర్శకుడి ప్రయత్నం. మరీ ముఖ్యంగా సీక్రెట్ ఏజెంట్లు ఆకాశం నుంచి ఊడిపడరని, మన మధ్యే ఉంటూ సాదాసీదాగా కనిపిస్తారని చెప్పడం డైరక్టర్ లక్ష్యం. పాయింట్ బాగానే ఉంది కానీ ఎగ్జిక్యూషన్ లోనే తేడా కొట్టింది. ఏజెంట్ తో కూడా కామెడీ చేయించాలనుకున్నప్పుడు కాస్త ఎక్స్ ట్రా ఎఫర్ట్ పెట్టాలి. జబర్దస్త్ పంచ్ లు, రెగ్యులర్ కామెడీ స్కిట్లు ఇలాంటి జానర్ కు సెట్ అవ్వవు. అదే టైమ్ లో కామెడీ కోసం సీరియస్ గా సాగే ఇలాంటి థ్రిల్లర్ కథలో లాజిక్కులు ఎగ్గొట్టడం కూడా మంచి పద్ధతి కాదు.

ఫస్ట్ టైమ్ మెగాఫోన్ పట్టుకున్న శ్రీ సరిపల్లి ఉద్దేశం ఏంటనేది క్లియర్ గా కనిపిస్తూనే ఉంది. ఫస్టాఫ్ లో ఫుల్ గా వినోదం వడ్డించేసి, సెకండాఫ్ లో పుష్కలంగా థ్రిల్ అందించేద్దాం అనుకున్నాడు. ఇతగాడి గురువు వీవీ వినాయక్ ఫాలో అయ్యే మోస్ట్ సక్సెస్ ఫుల్ ఫార్ములా ఇది. దీన్ని సరిపల్లి కూడా ఫాలో అయ్యాడు. కానీ నెరేషన్ లో గ్రిప్పింగ్ లేకపోవడం, కామెడీ సరిగ్గా పండకపోవడం, లవ్ ట్రాక్ రొటీన్ గా ఉండడం రాజావిక్రమార్కను పూర్తిస్థాయిలో ఆస్వాదించే సినిమాగా మార్చలేకపోయాయి.

సినిమా స్టార్ట్ అవ్వడమే సరదాగా స్టార్ట్ అవుతుంది. ఓ విదేశీ క్రిమినల్ ను చాలా సిల్లీగా ఇంటరాగేట్ చేస్తారు. మా సినిమా ఇదే కోవలో నడుస్తుందని చెప్పడానికి ఆ ఒక్క సీన్ చాలు. ఇక అక్కడ్నుంచి కథ హోం మినిస్టర్ వరకు వస్తుంది. ఆయన్ను ఓ నకిలీ మావోయిస్టు చంపాలనుకుంటాడు. ఇది తెలుసుకున్న మన ఫన్నీ ఏజెంట్ హోం మినిస్టర్ ను సక్సెస్ ఫుల్ గా కాపాడానని అనుకుంటాడు. సరిగ్గా అక్కకే ఊహించని ట్విస్ట్ ఇచ్చి దర్శకుడు తన టాలెంట్ చూపించాడు. మంచి బ్యాంగ్ తో ఇంటర్వెల్ కార్డ్ వేశాడు.

సెకెండాఫ్ పై భారీగా అంచనాలు పెంచిన దర్శకుడు, మరోసారి సీరియస్ కథలో కామెడీ మిక్స్ చేయడానికి ట్రై చేశాడు. అయితే ఈసారి మాత్రం అంతోఇంతో సక్సెస్ అయ్యాడు. కిడ్నాపర్స్ గ్యాంగ్, కిడ్నాపర్స్ కు రౌడీల్ని సప్లయ్ చేసే విలన్ గ్యాంగ్ చేసిన కామెడీ అక్కడక్కడ ఆకట్టుకుంటుంది. కీలకమైన యాక్షన్ ఎపిసోడ్స్ కూడా సెకెండాఫ్ లోనే పెట్టడం సినిమాకు ప్లస్ అయింది. క్లైమాక్స్ ఊహించినట్టే ఉన్నప్పటికీ ఎంగేజ్ చేస్తుంది.

ఎన్ఐఏ ఏజెంట్ గా కార్తికేయ పూర్తిగా మెప్పించాడు. అతడి యాక్టింగ్, లుక్, ఫిజిక్ అన్నీ సెట్టయ్యాయి. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా సుధాకర్ కోమాకుల చాలా బాగా చేశాడు. అతడి కెరీర్ కు ఈ క్యారెక్టర్ టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చు. సాయికుమార్, తనికెళ్ల భరణి, పశుపతి తమ పాత్రలకు న్యాయంచేశారు. టెక్నికల్ గా సినిమాకు మంచి సపోర్ట్ దక్కింది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఆర్ట్ వర్క్ బాగున్నాయి.

ఓవరాల్ గా రాజా విక్రమార్క సినిమాను 2 ట్విస్టుల కోసం, మరికొన్ని నవ్వుల కోసం చూడొచ్చు.

రేటింగ్: 2.5/5