Movie Review: Matti Kusthi

Friday,December 02,2022 - 01:31 by Z_CLU

నటీనటులు : విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి, మనీష్ కాంత్, కరుణాస్, శత్రు రచన, దర్శకత్వం: చెల్లా అయ్యావు నిర్మాతలు: రవితేజ, విష్ణు విశాల్ బ్యానర్లు: ఆర్ టి టీమ్‌వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ఎం నాథన్ సంగీతం: జస్టిన్ ప్రభాకరన్ ఎడిటర్: ప్రసన్న జికె ఆర్ట్ డైరెక్టర్: ఉమేష్ జే కుమార్ రన్ టైమ్: 2 గంటల 26 నిమిషాలు సెన్సార్: U రిలీజ్ డేట్: డిసెంబర్ 2, 2022

తమిళ్ లో లాంచ్ అయి ప్రస్తుతం తెలుగు సినిమాపై కూడా దృష్టి పెట్టాడు విష్ణు విశాల్. అందుకే మట్టి కుస్తీ సినిమాను ఒకేసారి తెలుగు-తమిళ భాషల్లో రిలీజ్ చేశాడు. ఈరోజు రిలీజైన ఈ సినిమా విష్ణు విశాల్ ఆశించిన రిజల్ట్ ఇచ్చిందా..? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ..

 

matti kusthi movie review

కథ

ఆంధ్రాకు చెందిన వీర (విష్ణు విశాల్), కేరళకు చెందిన కీర్తి (ఐశ్వర్య లక్ష్మి) కథ ఇది. తల్లిదండ్రులు లేని వీర చిన్నప్పట్నుంచి మామ (కరుణాస్) పెంపకంలో పెరుగుతాడు. ఊరిలో పంచాయితీలు పెట్టడం, జులాయిగా తిరగడం మనోడి హాబీ. అయితే పెళ్లిపై మాత్రం మనోడికి కొన్ని ఫిక్స్ డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. పొగవాటి జుట్టు ఉండాలని, పెద్దగా చదువు ఉండకూడదని కండిషన్స్ పెడతాడు.

వీర అభిప్రాయాలకు పూర్తి విరుద్ధంగా ఉంటుంది కీర్తి. కేరళలోని పాలక్కాడ్ కు చెందిన ఈ అమ్మాయి, బాబాయ్ (మనీష్ కాంత్) ప్రోత్సాహంతో రెజ్లింగ్ లో ఆరితేరుతుంది. ఈమె ఫైటింగ్స్, గెటప్, దూకుడు చూసి ఎవ్వరూ పెళ్లి చేసుకోడానికి ముందుకురారు. ఇలాంటి విరుద్ధ స్వభాలున్న ఈ ఇద్దరికీ కొన్ని అబద్ధాలు చెప్పి పెళ్లి చేస్తారు. మరి నిజం తెలుసుకున్న తర్వాత వీర-కీర్తి సంసారంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? వాటిని వాళ్లు ఎలా అధిగమించారు? అసలు వీర తన భార్యకు పోటీ మట్టి కుస్తీలో పాల్గొనాలని ఎందుకు నిర్ణయించుకున్నాడు? అనేది మిగతా స్టోరీ.

 

నటీనటుల పనితీరు:

వీరగా విష్ణు విశాల్ వందశాతం అవుట్ పుట్ ఇచ్చాడు. అతడి గెటప్, మేనరిజమ్ అన్నీ పాత్రకు తగ్గట్టు ఉన్నాయి. ఈ సినిమాలో కొత్తగా కామెడీ ట్రై చేసి క్లిక్ అయ్యాడు. ఇక ఎప్పట్లానే యాక్షన్ ఇరగదీశాడు. కీర్తి పాత్రలో ఐశ్వర్య లక్ష్మి పెర్ ఫెక్ట్ గా సూట్ అయింది. ఆమె తప్ప ఈ పాత్రలో మరో హీరోయిన్ ను ఊహించుకోలేం. అంత ఇంపాక్ట్ చూపించింది. ఇక ఇంటర్వెల్ లో ఆమె పెర్ఫార్మెన్స్, టోటల్ సినిమాకై హైలెట్ గా నిలిచింది. ఇతర పాత్రలన్నీ తమ పరిథి మేరకు నటించడంతో పాటు, కామెడీని పండించడంలో సక్సెస్ అయ్యాయి.

 

టెక్నీషియన్స్ పనితీరు:

టెక్నికల్ గా సినిమా యావరేజ్ గా ఉంది. జస్టిన్ ప్రభాకరన్ కంపోజ్ చేసిన పాటలేవీ పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ సినిమాకు పాటలే మైనస్. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అక్కడక్కడ మాత్రమే మెప్పించాడు ఈ సంగీత దర్శకుడు. ఆర్ట్ వర్క్, సినిమాటోగ్రఫీ మాత్రం బాగున్నాయి. ఎడిటింగ్ లో అక్కడక్కడ లోపాలు కనిపిస్తాయి. ఆర్టీ టీమ్ వర్క్స్, విష్ణు విశాల్ స్టుడియోస్ బ్యానర్ల నిర్మాణ విలువలు కథకు తగ్గట్టు ఉన్నాయి. ఎక్కడా గ్రాండియర్ కు వెళ్లలేదు, అలా అని ప్రొడక్షన్ వాల్యూస్ తగ్గించలేదు. చాలా జాగ్రత్తగా లెక్కలేసుకొని మరీ ఉన్న బడ్జెట్ తో సినిమా తీశారనే విషయం అడుగడుగునా కనిపిస్తుంది.

Matti-kusthi

జీ సినిమాలు రివ్యూ

మట్టి కుస్తీ అనేది స్పోర్ట్స్ డ్రామా కాదు. ఈ విషయంపై రిలీజ్ కు ముందే మేకర్స్ క్లారిటీ ఇవ్వడం పనికొచ్చింది. లేదంటే ఫలితం మరోలా ఉండేది. ఇదేదో సీరియస్ స్పోర్ట్స్ డ్రామా అనుకొని థియేటర్లలో అడుగుపెడితే మాత్రం షాక్ తప్పదు. అవును.. ఇది స్పోర్ట్స్ డ్రామాకు తక్కువ, ఫ్యామిలీ డ్రామాకు ఎక్కువగా ఉన్న సినిమా. మొత్తమ్మీద జానర్ ఏదైనప్పటికీ, టైటిల్ తో కాస్త కన్ఫ్యూజ్ చేసినప్పటికీ హీరో విష్ణు విశాల్ మాత్రం తను ఆశించిన సక్సెస్ ను ఈ సినిమాతో అందుకున్నాడు.

అంతా అనుకుంటున్నట్టు ఈ సినిమా ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో ఆకట్టుకోలేదు. అలా అని పూర్తిస్థాయి 'కుస్తీ'  తో కూడా మెప్పించలేదు. ఊహించని విధంగా సినిమాలో కామెడీ వర్కవుట్ అయింది. దర్శకుడు చెల్లా అయ్యావు రాసుకున్న సునిశితమైన కామెడీ ఈ సినిమాకు మెయిన్ ఎస్సెట్. స్టార్టింగ్ నుంచి మినిమం గ్యాప్స్ లో నవ్వులు పంచుతూ కామెడీ కుస్తీ అనిపించుకుంది.

సినిమాని నిలబెట్టిన ప్రధాన అంశం ఈ కామెడీ కాగా, మెయిన్ ప్లాట్ సెకెండ్ హైలెట్ గా నిలిచింది. వంద అబద్ధాలాడైనా ఓ పెళ్లి చేయమన్నారు. ఈ సినిమాలో హీరోతో కేవలం 2 అబద్ధాలాడి పిల్లనిచ్చి పెళ్లి చేస్తారు. ఆ అబద్ధాల వల్ల హీరోహీరోయిన్లు ఎలా ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బందుల నుంచి బయటపడి, ఆదర్శవంతమైన జంటగా ఎలా నిలిచారనే పాయింట్ కు, మంచి కామెడీ అద్ది రెండున్నర గంటల సినిమాగా మలిచాడు దర్శకుడు.

నిజానికి ఇలాంటి స్టోరీలైన్స్ తెలుగు ఆడియన్స్ కు కొత్త కాదు. మిస్టర్ పెళ్లాం నుంచి చూస్తున్నవే. ఆ పాయింట్ కే కాస్త రెజ్లింగ్ ను, ఇంకాస్త మాస్ అప్పీల్ ను, మరికాస్త కామెడీని అద్ది మట్టి కుస్తీని పక్కా ఎంటర్ టైనర్ గా రూపొందించాడు దర్శకుడు. జులాయిగా తిరిగే హీరో, తనకు కాబోయే భార్యలో ఎలాంటి లక్షణాలు ఆశించాడనే అంశం నుంచి స్టార్ట్ చేసిన దర్శకుడు.. మరోవైపు హీరోయిన్ ను అందుకు పూర్తి విరుద్ధంగా ప్రజెంట్ చేశాడు. అలా రెండు విరుద్ధమైన మనస్తత్వాలున్న ఇద్దర్ని కలిపి, ఇంటర్వెల్ కు వచ్చేసరికి మంచి ట్విస్ట్ ఇచ్చి సినిమాపై ఆసక్తి పెంచాడు.

ఇంటర్వెల్ కే అసలు మేటర్ రివీల్ చేసిన తర్వాత రెండో భాగంలో ఇంకేముంటుందనే ఆలోచనలకు తనదైన స్క్రీన్ ప్లేతో చెక్ పెట్టాడు దర్శకుడు. సెకెండాఫ్ లో కూడా ప్రేక్షకుల్ని కట్టిపడేశాడు. హీరోహీరోయిన్ల మధ్య మనస్పర్థల్ని కూడా సున్నితంగా చూపించి మార్కులు కొట్టేశాడు. తను నమ్ముకున్న కామెడీని అందిస్తూ, అక్కడక్కడ ఎమోషనల్ టచ్ ఇచ్చాడు. క్లైమాక్స్ లో విలన్ ను హీరో చితక్కొట్టడంతో మంచి ఎండింగ్ ఇచ్చి పైసా వసూల్ అనిపించాడు.

వీర పాత్రలో విష్ణు విశాల్ బాగా నటించాడు. సహజంగానే ఇతడి మొహంలో మాస్ అప్పీల్ ఉండడం ప్లస్ అయింది. ఇక ఐశ్వర్య లక్ష్మి పాత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. భార్యగా, రెజ్లర్ గా, భర్త ప్రేమ కోసం ఆరాటపడే మహిళగా ఇలా విభిన్న షేడ్స్ లో కనిపించి మెప్పించింది. చాన్నాళ్ల తర్వాత కరుణాస్ కామెడీ పండించగా.. ఇతర నటీనటులంతా తమ పాత్రల మేరకు మెప్పించారు.

ఇలా సినిమాలో చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నప్పటికీ కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ప్రధానమైంది ఏంటంటే.. సినిమా మొత్తం తమిళ వాసన కొడుతుంది. ఎక్కడా తెలుగు నేటివిటీ కనిపించదు. ఓ దశలో, అసలు ఈ సినిమాను తెలుగు-తమిళ భాషల్లోనే తీశారా లేక తమిళ్ లో తీసి తెలుగులో డబ్ చేశారా అనిపిస్తుంది. నిర్మాత రవితేజ, ఓ తమిళ సినిమాను ప్రొడ్యూస్ చేశాడేమో అనిపిస్తుంది. ఇక హీరోహీరోయిన్ మట్టి కుస్తీ చేయాలనుకోవడం, దీని కోసం హీరో ట్రయినింగ్ తీసుకోవాలనుకోవడం, దాంట్లో భాగంగా వచ్చే కామెడీ పెద్దగా పండలేదు. వీటికితోడు కామెడీ కనెక్ట్ అయినంతగా, ఎమోషనల్ సీన్స్ కనెక్ట్ కాలేదు. ఇంతకుముందు చెప్పుకున్నట్టు తమిళ వాసనల వల్ల ఈ ఫీలింగ్ వచ్చి ఉండొచ్చు.

టెక్నికల్ గా కూడా సినిమా రిచ్ గా ఉంది. జస్టిన్ ప్రభాకరన్ తన సంగీతంతో పెద్దగా ఆకట్టుకోనప్పటికీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. రిచర్డ్ నాథన్ సినిమాటోగ్రఫీ, ఉమేష్ ఆర్ట్ వర్క్ చాలా బాగున్నాయి. ఆర్టీ టీమ్ వర్క్స్, విష్ణు విశాల్ స్టుడియోస్ బ్యానర్ల నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఓవరాల్ గా.. మట్టి కుస్తీ సినిమాను కామెడీ కోసం ఓసారి చూడొచ్చు. ఫ్యామిలీ మొత్తం వెళ్లి కలిసి చూసే సినిమాలు ఈమధ్య రావడం లేదనే కామెంట్ కు మట్టి కుస్తీ సమాధానంగా నిలుస్తుంది. కాకపోతే తమిళ వాసనలు, అక్కడక్కడ కనెక్ట్ అవ్వని ఎమోషనల్ సీన్స్ ఈ సినిమాకు స్పీడ్ బ్రేకర్స్.

రేటింగ్ - 2.75/5